30, మార్చి 2021, మంగళవారం

మొగలిచెర్ల

 *సిద్దాంతి గారి సలహా..*


"నమస్కారమండీ..నా పేరు మంగళగౌరీ..మేము రాబోయే శని ఆదివారాల్లో మొగిలిచెర్ల వచ్చి..అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించుకోవాలని అనుకుంటున్నాము..శనివారం ఉదయానికి అక్కడికి వస్తామండీ..మంగళవారం ఉదయం తిరిగి వెళ్లిపోతాము..ఆ క్షేత్రం లో మొత్తం మూడు రోజులు నిద్ర చేయాలని అనుకున్నాము..మాతోపాటు ఇద్దరు పెద్దవాళ్ళు వస్తున్నారు..వాళ్ళకొఱకు ఏదైనా బస ఏర్పాటు చేయగలరా?..నేనూ మావారూ మా పిల్లలిద్దరూ అందరమూ స్వామివారి సన్నిధిలో పడుకుంటాము.." అని ఆవిడ నన్ను అడిగారు..మా సిబ్బందిని విచారిస్తే..ఒక గది ఖాళీ ఉందని చెప్పారు..ఆ మాటే ఆవిడతో చెప్పి..గదిని వారి కొఱకు అట్టి పెట్టాము..


ఆ ప్రక్క శనివారం ఉదయం తొమ్మిది గంటల వేళ..ఒక కారు లో మంగళగౌరి గారి తన సంసారం తో సహా మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..తనను తాను పరిచయం చేసుకొని..తమ కొఱకు కేటాయించిన గది వద్దకు వెళ్లిపోయారు..మరో గంట తరువాత..మంగళగౌరి గారు తన భర్త, పిల్లలు తో కలిసి మందిరం లోపల నేను కూర్చున్న చోటుకి వచ్చి.."ప్రసాద్ గారూ..స్వామివారి పల్లకీసేవ సాయంత్రం అని చెప్పారు..ఈలోపల మేము మాలకొండకు వెళ్లి..శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని వస్తాము..మధ్యాహ్నం మీతో మాట్లాడాలి..మీకు వీలవుతుందా?.." అని అడిగారు.."మీరు ముందు మాలకొండకు వెళ్ళిరండి..ఇక్కడికి వచ్చిన భక్తుల తో మాట్లాడటానికి కూడా తీరిక లేనంతగా నేను లేను..నేను ఇక్కడ ఉన్నదే మీలాంటి వారి సందేహాలు తీర్చడానికి.." అన్నాను..మంగళగౌరి గారు మాలకొండకు వెళ్లి, మధ్యాహ్నం మూడు, నాలుగు గంటలకు తిరిగి వచ్చారు..


ఆరోజు సాయంత్రం జరిగే పల్లకీసేవ కు తమ పేర్లు నమోదు చేయించుకొని..తన భర్త, పిల్లలతో కలిసి నావద్దకు వచ్చారు.."ప్రసాద్ గారూ..ఒక సమస్యతో ఇక్కడికి వచ్చామండీ..మా వారు పెద్ద కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నారండీ..ఉద్యోగరీత్యా తరచూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి..నెలలో కనీసం ఇరవై రోజులు అలా తిరుగుతూనే వుంటారు..ఇంటిని, పిల్లలనూ నేనే చూసుకోవాలి..పిల్లలిద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు..ఇప్పుడు సమస్య ఏమిటంటే..మా అబ్బాయి తరచూ అనారోగ్యం పాలవుతున్నాడు..నెలలో పది పదిహేను రోజులు నీరసంగా ఉంటున్నాడు..డాక్టర్ల కు చూపించాము..ఏవేవో పరీక్షలు చేశారు..లోపల జబ్బేమీ లేదు..బలానికి మందులు వాడండి..అని చెప్పారు..వీడేమో మనిషి తగ్గిపోతున్నాడు..నాకు బెంగ పట్టుకున్నది..మా వారితో చర్చించాను..మా సిద్దాంతి గారిని సలహా ఆడిగాము..ఆయన వీడి జాతక చక్రం చూసి..గ్రహదోషం ఉన్నది..నివారణ కొఱకు ఇక్కడికి వెళ్ళమని చెప్పారు..ఆయనే మమ్మల్ని ఈ క్షేత్రం లో  మూడు రాత్రులు నిద్రలు చేయమని చెప్పారు..వారు మాతో చెప్పేదాకా ఇక్కడ ఇలాంటి అవధూత మందిరం వున్నదని మాకు తెలీదు..ఆ తరువాత మీతో ఫోన్ లో మాట్లాడాము.." అన్నారు.."సరేనమ్మా..మీ సిద్దాంతి గారు చెప్పిన విధంగా నే ఇక్కడ వుండండి.." అన్నాను..


ఆరోజు పల్లకీసేవ లో ఆ కుటుంబం పాల్గొన్నారు..ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం స్వామివారి సమాధి దర్శించుకున్నారు..శనివారం రాత్రి, ఆదివారం రాత్రి కూడా ఆ దంపతులు తమ పిల్లలతో సహా స్వామివారి మంటపం లోనే నిద్ర చేశారు..సోమవారం ఉదయం స్వామివారికి ప్రభాత సేవ అనంతరం అర్చకస్వాములు భక్తులకు తీర్ధం ఇవ్వసాగారు..ఈ కుటుంబం కూడా స్వామివారి తీర్ధాన్ని స్వీకరించారు..ఆ తరువాత పది పదిహేను నిమిషాల కు ఆ పిల్లవాడు స్వామివారి మంటపం లోనే ఒక ప్రక్కగా పడుకున్నాడు..కొద్దిసేపటి తరువాత..ఉన్నట్టుండిఆ అబ్బాయి మెలికలు తిరిగిపోతూ..ఆ మంటపం అంతా పొర్లాసాగాడు..ఇదంతా చూస్తున్న మంగళ గౌరి గారు బాగా భయపడి పోయారు..ఆ అబ్బాయి తండ్రి మాత్రం ..పిల్లవాడిని పట్టుకొని వున్నారు..దాదాపుగా రెండు గంటల సేపు అలా జరిగిన తరువాత..ఆ పిల్లవాడు సొమ్మసిల్లి పడుకొని నిద్ర పోయాడు..


"అమ్మా ఇక మీరు భయపడకండి..అబ్బాయి తెప్పరిల్లుతాడు..కోలుకుంటాడు.."అని మా అర్చకస్వామి ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి..స్వామివారి తీర్ధాన్ని అబ్బాయి నోట్లో పోశారు..మరో అరగంట తరువాత..ఆ అబ్బాయి కళ్ళు తెరచి చూసాడు..ఆరోజు మధ్యాహ్నం నాటికి ఆ పిల్లవాడి ముఖం లో నైరాశ్యం పోయింది..ఉషారుగా వున్నాడు..మంగళగౌరి గారి భర్తగారు తమ సిద్దాంతి గారితో ఫోన్ లో ఇక్కడ జరిగిన విషయాన్ని పూర్తిగా చెప్పారు..మరో రెండు రోజుల పాటు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడి సన్నిధిలోనే వుండమని ఆయన సలహా ఇచ్చారు..బుధవారం వరకూ మంగళగౌరి గారి కుటుంబం స్వామివారి మందిరం వద్దే వున్నారు..రోజూ రెండుపూటలా స్వామివారి సమాధి దర్శించుకున్నారు..గురువారం ఉదయం స్వామివారి సమాధి దర్శించుకొని తిరిగి వాళ్ళ ఊరు వెళ్లారు..


మరో నెలరోజుల తరువాత మంగళగౌరి గారు నాకు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ..మా వాడు పూర్తిగా కోలుకున్నాదండీ..కాలేజీకి వెళుతున్నాడు..చక్కగా చదువుకుంటూ వున్నాడు..త్వరలో మళ్లీ వచ్చి స్వామివారి సమాధి దర్శించుకొని వెళతాము..మా సిద్దాంతి గారు కూడా మాతో వస్తామంటున్నారు..వారినీ తీసుకొని వస్తాము.." అన్నారు..


గత నెలలో మంగళగౌరి గారి కుమారుడు ఒక్కడే మొగిలిచెర్ల కు శ్రీ స్వామివారి దర్శనం కోసం వచ్చాడు.."నాకు జీవితాన్ని ఈ స్వామివారే ప్రసాదించారు అంకుల్..ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకుంటూ..నా కాళ్ళమీద నేను నిలబడటానికి ఈ స్వామివారే కారణం..వీలున్నప్పుడల్లా ఇక్కడకు వచ్చి ఒకరోజు నిద్ర చేసి వెళుతుంటాను..మా సిద్దాంతి గారి సలహా..స్వామివారి తీర్ధం..ఈరెండూ నేను మర్చిపోలేను.." అని భక్తి గా చెప్పాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: