ముక్కు తిమ్మనగారి ముద్దు పలుకులు !
.
రాయలనాట విజయ నగరంలో పెద్దన తరువాత స్థానం తిమ్మనదే! ఆయన అరణపుకవి. చిన్నాదేవివెంట విజయనగరానికి వచ్చాడట. తెనాలి వారు భువన విజయంలో వారిని పరిచయం చేసికొన్న సందర్భంలో చెప్పిన పద్యం తిమ్మన గారి ప్రసిధ్ధికి నిదర్శనం!
.
కం: మాకొలది జానపదులకు
నీకవితా ఠీవి యబ్బునే? కూపనట ద్భే
కములకు నాకధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా!
.
తిమ్మనగారి కవిత్వం చల్లని కవిత్వమట!యెంతచల్లనిది? ఆకాశగంగాప్రవాహమందలి నీటితుంపురలను బోలిన చల్లదనమది. సురగంగ చల్లదనం కిందికురికి తిమ్మనగారి కవితలో ప్రవేసించినదట! ఆహా! పొగడ్తకు ఆకాశమే హద్దుగదా!
తిమ్మనగారు పారిజాతాపహరణ మనే ప్రబంధం వ్రాశారు. రాయలవారికి- చిన్నాదేవికి నడుమ నేర్పడిన వియోగమును తప్పించుటకే ఈప్ర్బంధమును తిమ్మన రచించెనని ప్రవాదము. యేదియేమైనను యిది రసవత్తరమైన ప్రబంధమే!
.
శ్రీకృష్ణుని యంతవాని శిరమును సత్యచే తన్నించి , ప్రణంలో యిది తప్పుకాదు పొమ్మన్నాడు.తిమ్మన.
పారిజాతపుష్పాన్ని రుక్మిణి కిచ్చినది విని యలిగిన సత్యాదేవి మానసిక, శారీరక ,పరిస్థితులను వర్ణించుచు తిమ్మన గారు ఒకపద్యం చెప్పారు. కవితా కళకు కాణాచియైన ఆపద్యం మన మిప్పుడు తెలిసికొందాం!
.
చ: తుడువదు కన్నులన్వెడలు తోయకణంబులు, కొప్పుఁజక్కగా
ముడువదు, నెచ్చెలింగదిసి ముచ్చటకుంజన, దన్నమేనియున్
గుడువదు , నీరముంగొనదు, కూరిమిఁ గీరముఁ జేరి పద్యమున్
నుడువదు, వల్లకీగుణవినోదము సేయదు, డాయదన్యులన్;
.
సవతిమీద మత్సరం కోపానికి కారణమైనది. మనస్సు ఉద్వేలమైపోయింది. దుఃఖం పొంగిపొరలుతోంది. కన్నులవెంటనీరు కారిపోతోంది. అయినా కన్నీరు తుడవటంలేదట. జుట్టుముడి ఊడింది. కేశపాశము విశీర్ణమైనది. దానిని కూడా సవరించటం లేదట. ప్రియ సఖులఁజేరి మాటా మంతీ యాడటంలేదట. భోజనంమాటసరేసరి, మెతుకుగూడా ముట్టుటలేదట. చివరకు నీరుగూడా త్రాగటంలేదట. పంజరంలో చిలుకలను గూడా పలకరించటం లేదట. వీణియ తీగెలను మీటుట లేదట. యితరులెవ్వరు వచ్చినా వారిని సమీపించటం లేదట.
ఇదీ పాపం సత్య మానసిక స్థితి.
మనస్సు బాగోక పోతే రోజూ చేసేపనులుగూడా చెయ్యం . నైరాస్యంగా ఉంటాంకదా! అదిగో ఆనైరాస్యం ఆమెచేతలలో కనిపించేలా చేశాడుకవిగారు. నైరాస్యం యెందుకంటారా? కాదామరి. అసలే కృష్ణుని కాపురం "సవతుల కుంపటి". యెప్పుడెవరివల్ల యేబాధకల్గుతుందో? చెప్పరానిది. యెవరాతనిని తమ చెంగుకు ముడివేసుకుంటారో యెరుగలేము. అనుకోని యాపద వచ్చిపడింది. నారదుడు తెచ్చిన పారిజాతపుష్పం రుక్మిణి తలకెక్కింది. యెంతప్రమాదం! కృష్ణుడింక తన చేజారిపోతాడేమో నని బాధ.అలాగే జరిగితే యిక మిగిలే దేమిటి? నలుగురి నవ్వులు తలవంపులు. అయిపోయింది సత్యావైభవం: అందుకే యీనైరాస్యం. ఆస్థితిని తిమ్మన యీపద్యంలో అద్భుతంగా చిత్రించాడు.
తుడువదు, ముడువదు, కుడువదు, నుడువదు, అను నాల్గు క్రియాపదాలను, ఛేకానుప్రాసంగా ప్రయోగించి , తనయసమానమైన పాత్ర చిత్రణా పటిమను వ్యక్త పరచాడు. కావ్యకళాపరిశీలనా దృష్టితో పరిశీలిస్తే యీపద్యం యెంత అద్భుత మైనదో బోధపడుతుంది. ఇది మనః పరిశీలనకు చక్కనిపరీక్ష!
స్వస్తి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి