24, జులై 2021, శనివారం

గురు పరంపర ..*

 .        *గురు పరంపర ..*


🔮🔮🔮🌸🌸🌸🔮🔮🔮


ఒక రాశిగా ఉన్న వేదములను సంకలనం చేసి విభాగించడం వల్ల వ్యాసుల వారిని వేదవ్యాస మహర్షి అని అంటారు. వారు వేదములను ఋగ్, యజ్, సామ, అథర్వణ మని నాలుగుగా విభాగం చేశారు. ఆ నాలుగింటిని సుమంతుడు, వైశంపాయనుడు, జైమిని, పైలుడు అను నలుగురు శిష్యులకు బోధించారు. మంత్రములు శబ్ధతంరంగములై మన చుట్టూ ఆవహించి ఉంటాయి. వాటికి ఆది అంతములనేవి లేవు. ఎలాగైతే రేడియో సెట్టు లభ్యమయ్యే తరంగాలను లాక్కొని ప్రసారం చేస్తుందో అలాగే ఋషులు వారి యోగశక్తిచేత ప్రకృతిలో ఉన్న ఈ శబ్ధ తరంగాలను గ్రహించి వాటి గొప్పదనాన్ని తెలుసుకున్నారు.


మంత్రాన్ని దర్శించివాడు అని ఋషి అను పదానికి అర్థం కూడా (రిషయోః మంత్రద్రష్టారః). ఎలాగైతే అర్జునుడు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించాడో, అలాగే ఋషులు యోగశక్తి వల్ల జ్ఞాననేత్రంతో ఆ మంత్ర స్వరూపాలను దర్శించారు. ఆ వేదములు లిఖిత రూపంలో కాకుండా గురు శిష్య పరంపరగా మౌఖిక రూపంలో మనకు అందివచ్చాయి.


వ్యాసులు పదునెనిమిది పురాణాలను కూడా రచించి, జ్ఞానము భగవద్భక్తి కలిగిన సూతునకు ఇచ్చి వాటిని ప్రచారం చెయ్యమని చెప్పారు. తరువాత అనంతములైన వేదములను సంగ్రహంగా బ్రహ్మసూత్రాలుగా వ్రాశారు. ఆ బ్రహ్మ సూత్రాలకు గొప్ప గొప్ప ఆచార్యులు వ్యాఖ్యానాలు లేదా భాష్యాలు వ్రాసారు. అందులో శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజులు, శ్రీ మధ్వాచార్యులు రాసిన బ్రహ్మసూత్ర భాష్యాలు బహుళ ప్రాచుర్యం పొందాయి.


తరువాతి కాలంలో సిద్ధాంతాల పరంగా విభేదాలు వచ్చినప్పటికి వీటీకి మూలమైన బ్రహ్మసూత్రాలు వేదవ్యాస ప్రణీతమని మరువరాదు. మన ఆధ్యాత్మిక సంస్కృతి, ఆదిభౌతిక ఆలోచనా విధానం వల్లే మన దేశం ప్రపంచ దేశాల వందనములు స్వీకరిస్తోంది. మనకు వేదములను ప్రసాదించిన వేదవ్యాస మహర్షులను పరంపరాగతంగా వీటిని మనకు అందిచిన ఋషులను గుర్తుపెట్టుకుని కృతజ్ఞతా భావంతో ప్రణమిల్లడం మన అందరి కర్తవ్యం.


మనకు వేదములతో పాటు ధర్మసూత్రములు కూడా ఉన్నాయి. అవి మనము వేదములు చదివే అర్హతను పొందడానికి చెయ్యవలసిన చెయ్యకూడని విధులగురించి, మన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చెబుతాయి. వాటినే స్మృతులు అని కూడా అంటారు. అవి ఒక్కొక్క ఋషిపేరు మీద పరాశర స్మృతి, యాజ్ఞ్యవల్క్య స్మృతి, మనుస్మృతి మొదలుగునవిగా చెప్పబడ్డాయి.


ఈ స్మృతులను సంగ్రహంగా ధర్మ-శాస్త్ర-నిబంధనం అని తరువాతి రచయితలు వ్రాశారు. ఉత్తరాదిన కాశినాథ ఉపాధ్యాయ రచించినది, దక్షిణాన వైద్యనాథ దీక్షితర్ వ్రాసిన నిబంధనములు అత్యంత ప్రాచుర్యములు. వైద్యనాథ దీక్షితీయం వైష్ణవులకు శైవులకు ఇరువురికీ ఒక్కటే. అటువంటి వేదములు, ధర్మశాస్త్రాలు మన మతానికి పునాదులు.


మనధర్మానికి మూలపురుషులైన వేదవ్యాసుల వారిని స్మరించుకోవడానికి వచ్చినదే ఈ వ్యాస పౌర్ణమి. ఆయన గురువుగా వేదాలను ధర్మసూత్రాలను శిష్యులద్వారా వ్యాప్తి చేశారు కాబట్టి దీనికి గురుపౌర్ణమి అని కూడా పేరు. ఈ జ్ఞాన భాండాగారాన్ని తరవాతి తరాలకు అందిస్తున్న గురువులు అందరు వ్యాస మహర్షి పరంపర లోని వారే..


వందే గురు పరంపరాం ...🙏


🙏🏻🙏🏻🙏🏻🌸🌸🌸🙏🏻🙏🏻

గురు అక్షరమాల స్తుతి*

 *గురు అక్షరమాల స్తుతి*


*అ - అద్వైతమూర్తి - గురువు*

*ఆ - ఆనందస్ఫూర్తి - గురువు*

*ఇ - ఇలదైవం - గురువు*

*ఈ - ఈశ్వరరూపము - గురువు*

*ఉ - ఉద్ధరించువాడు - గురువు*

*ఊ - ఊర్ధ్వముఖుడు - గురువు*

*ఋ - ఋజువర్తనుడు - గురువు*

*ౠ - ఋణము లేనివాడు - గురువు*

*ఎ - ఏమిలేదని చెప్పువాడు - గురువు*

*ఏ - ఏకమేవాద్వితీయం బ్రహ్మ - గురువు*

*ఐ - ఐశ్వర్య ప్రదాత - గురువు*

*ఒ - ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు - గురువు*

*ఓ - ఓంకార రూపము - గురువు*

*ఔ - ఔదార్య మేరువు - గురువు*

*అం - అందరూ సేవించేది - గురువు*

*అః - అహంకార రహితుడు - గురువు*

*క - కళంకము లేనివాడు - గురువు*

*ఖ - ఖండరహితుడు - గురువు*

*గ - గుణాతీతుడు - గురువు*

*ఘ - ఘనస్వరూపము - గురువు*

*ఙ - జిజ్ఞాసులకు జ్ఞానప్రదాత - గురువు*

*చ - చక్రవర్తి - గురువు*

*ఛ - ఛత్రము వంటి వాడు - గురువు*

*జ - జనన మరణములు లేని వాడు - గురువు*

*ఝ - ఝరులవలె బోధించువాడు - గురువు*

*ఞ - జ్ఞానస్వరూపము - గురువు*

*ట - నిష్కపటుడు - గురువు*

*ఠ - నిష్ఠకలవాడు - గురువు*

*డ - డంబము లేనివాడు - గురువు*

*ఢ - ఢంకా మ్రోగించి చెప్పువాడు - గురువు*

*ణ -  తూష్ణీభావము కలవాడు - గురువు*

*త - తత్త్వోపదేశికుడు - గురువు*

*థ - తత్త్వమసి నిర్దేశకుడు - గురువు*

*ద - దయాస్వరూపము - గురువు*

*ధ - దండించి బోధించువాడు - గురువు*

*న - నవికారుడు - గురువు*

*ప - పంచేంద్రియాతీతుడు - గురువు*

*ఫ - ఫలాకాంక్షా రహితుడు - గురువు*

*బ - బంధము లేనివాడు - గురువు*

*భ - భయరహితుడు - గురువు*

*మ - మహావాక్యబోధకుడు - గురువు*

*య - యమము కలవాడు - గురువు*

*ర - రాగద్వేష రహితుడు - గురువు*

*ల - లవలేశము ద్వేషము లేనివాడు - గురువు*

*వ - వశీకరణశక్తి కలవాడు - గురువు*

*శ - శమము కలవాడు - గురువు*

*ష - షడ్భావ వికారములు లేనివాడు - గురువు*

*స - సహనశీలి - గురువు*

*హ - హరిహర రూపుడు - గురువు*

*ళ - నిష్కళంకుడు - గురువు*

*క్ష - క్షరాక్షర విలక్షణుడు - గురువు*

*ఱ-ఎఱుకతో ఉన్నవాడు - గురువు* లందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🙏

అహం నాశనమే★

 అహం అనర్ధం అని తెలిపే ఆకులు చెప్పే పరమార్థం

,💐💐💐💐💐💐💐

★"నేను అన్నిటికన్నా శుభప్రదం. మంగళానికి నేనే చిహ్నం. మిగతా ఆకులన్నీ అమంగళం" అంది మామిడాకు. అప్పట్నుంచీ మామిడాకులు తలకిందులుగా వేలాడుతున్నాయి. 🍀

★"నేను సువాసనలకు, పరిమళాలకూ మారుపేరు. మీకు వాసనలేదు. మీరెందుకూ పనికిరారు" అంది కరివేపాకు. కరివేపాకులు కూరలో తప్పనిసరి. కానీ వంట పూర్తయ్యాక పక్కన తీసి పారేస్తారు. అప్పట్నుంచీ అవి కూరలో కరివేపాకులయ్యాయి.☘

★"అన్నం తినేందుకు నేనే పనికొస్తాను. మీరంతా వేస్టు" అంటూ నీలిగింది అరిటాకు. అప్పట్నుంచీ అరటాకు అన్నం తినేశాక చెత్త కుండీలోకి చేరింది. చెత్తకుండీలో దుర్భరమైన కంపు మధ్య బతకాల్సి వచ్చింది.. 🍀

★"అసలు గొప్పంతా నాదే. అన్నం తిన్నాక ముఖశుద్ధికోసం అంతా నన్నే తింటారు" అని హొయలు పోయింది తమలపాకు. అప్పట్నుంచీ మొత్తం నమిలేశాక మనిషి దాన్ని బయటకు ఉమ్మేయడం మొదలుపెట్టాడు.🍀

★పాపం... తులసి ఆకు🍃 ఏమీ అనలేదు. తన గొప్ప చెప్పుకోలేదు. అందుకే దాన్ని 🌳👏పూజిస్తారు. తులసమ్మ అని పిలుస్తారు.🍀

★గోవర్ధనమంత పర్వతాన్ని ఎత్తిన వాడిని ⚖తులాభారంలో తేలిపోయేలా చేసేందుకు ఒక్క తులసిదళం చాలు.🍀

★అంతెందుకు...? -అంత్య ఘడియల్లో తులసి తీర్థం నోట్లో పోస్తే వైకుంఠమే సంప్రాప్తిస్తుంది. అంతేకాదు తులసి లక్ష్మీ స్వరూపం....తులసికోటలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడే నివాసముంటాడన్నది పురాణ సమ్మతం. తులసి ఆరాధన జరిగే గృహములో మనశ్శాంతికి లోటుండదంటారు. 🍀☘🌿🌱🍃                         

★ కాబట్టి ఎప్పటికైనా అహం నాశనమే★

😊💐

*గీతా రహస్యం_బాలగంగాధర తిలక్*

 *నాకు నచ్చిన పుస్తకం*

*గీతా రహస్యం_బాలగంగాధర తిలక్*


శ్రీమద్ భగవద్గీతా రహస్యం గీతారహస్యం అనే పేర్లతో ప్రసిద్ధమైన గ్రంథం గీతారహస్యం.

కర్మయోగ శాస్త్రం అని కూడా ప్రసిద్ధి పొందిన అద్భుత గ్రంథం. 


‌ భారత సామాజిక సంస్కర్త మరియు స్వాతంత్ర్యోద్యమాన్ని ఉర్రూతలూగించిన గొప్ప దేశభక్తులు బాల్ గంగాధర్ తిలక్ గారు బర్మాలోని 1915 లోమాండలే జైలులో ఉన్నప్పుడు మరాఠీ భాషలో రాసిన గ్రంథమిది. 

 కర్మ యోగాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే తిలక్ మహాశయుని గీతారహస్యాన్ని చదవాల్సిందే. 

 వారేమంటారంటే భగవద్గీత అందించే నిజమైన సందేశం కర్మ సన్యాసం  (చర్యలను త్యజించడం) కాదు.  నిష్కామ కర్మయోగాన్ని (నిస్వార్థ కర్మ) అర్థం చేసుకోవాలంటారు.  


 ఆది శంకరాచార్యుల తరువాత అంత గొప్పగా భగవద్గీత ను వ్యాఖ్యానించింది తిలక్ మహాశయులే. మీమాంసా శాస్త్రాన్ని ఆధారం చేసుకుని వారి విశ్లేషణ సాగుతుంది.


ఈ గ్రంథంలో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి.  మొదటి భాగం తాత్వికత తో నిండి మన ఆలోచనలను లోలోతుల్లోకి  ప్రయాణింపజేస్తుంది.

 ఇక రెండవ భాగం గీతయొక్క అనువాదంతో పాటు అద్భుతమైన వ్యాఖ్యానాన్ని కలిగి ఉంటుంది. 


1908 నుండి 1914 వరకు మాండలే జైలులో ఖైదు చేయబడినప్పుడు తిలక్ తన చేతివ్రాతతో పెన్సిల్‌తో ఈ పుస్తకాన్ని వ్రాసాడు. 400 కంటే ఎక్కువ పేజీల స్క్రిప్ట్ నాలుగు నెలల కన్నా తక్కువ వ్యవధిలో వ్రాయబడింది మరియు అందువల్ల దీనిని "గొప్ప సాధన" గ్రంథంగా భావిస్తారు ". 


ఆ తరువాత ఆయన పూనాకు తిరిగి వచ్చినప్పుడు 1915 లో  ఈ పుస్తకం ప్రచురించారు. 


క్రియాశీల జీవనసూత్రం,  క్రియాత్మక నైతిక బాధ్యతను ఆయన సమర్థించారు.

కర్మ నిస్వార్థంగా ,  వ్యక్తిగత ఆసక్తి లేకుండా ఉండాలంటారు. 


వారి గీతారహస్యాన్ని చదివిన తరువాత వేలాదిమంది స్వాతంత్ర్యోద్యమంలో క్రియాత్మక భాగస్వామ్యాన్ని అందించారు. అతివాదులకు, మితవాదులకు సమానమైన స్ఫూర్తినిచ్చిన అద్భుతమైన గ్రంథం గీతారహస్యం.


గీతారహస్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత

ఒక రైతు గొప్ప వ్యవసాయదారుడౌతాడు. ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడవుతాడు. వ్యాపారి సమాజ హిత వాణిజ్యం చేస్తాడు. ఉద్యమకారుల ఉత్సాహాన్ని ఉపిరిపోస్తుంది ఈ గ్రంథం. 

మానవ సంబంధాలు మహనీయంగా మారుతాయి.


ఇంగ్లీషు తో పాటు భారతీయ భాషలన్నింటిలో అనువదించబడ్డ గీతారహస్యం తెలుగు అనువాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు. 

నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనువాదం గ్రాంథికమైనా తిలక్ గారి ఆత్మను ప్రకటిస్తుంది.

భగవాన్ శ్రీకృష్ణుడు చూపిన మార్గంలో నడిపిస్తుంది. 


*నంది శ్రీనివాస్*

గురువారం

• తెలుసుకుందాం.

• హిందూ పురాణాల ప్రకారం గురువారం అంటే *గురు* గ్రహం లేదా బృహస్పతి గ్రహానికి సంబంధించినది.

• గురువారాన్ని లక్ష్మీ వారం లేదా బేస్త వారం అంటారు.

• గురువారం శ్రీ మహావిష్ణువుకు సంబంధించినది.

• గురువారంను బృహస్పతి వారంగా కూడా పిలుస్తారు.

• గురువారం శ్రీ మహావిష్ణువుకు మరియు దేవతల గురువైన బృహస్పతికి అంకితం చేయబడింది. 

• గురుగ్రహాన్ని ఇంగ్లీషులో జుపిటర్ అని పిలుస్తారు.

• శ్రీరాముడు గురువారం నాడు జన్మించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది.

• గు అనగా అంధకారం.,అజ్ఞానం.

• రు అనగా తొలగించేది.

• గురు అంటే అజ్ఞానమనే అంధకారం తొలగించేవాడు.! 

• హిందువులకు దేనికైనా *వేదము* ప్రమాణము.

• మహాభారతం.,రామాయణం.,భాగవతం.,భగవద్గీత.,స్మృతులు.,పురాణాలు.,ఉపనిషత్తులు....ఇలా ఏ హిందూ గ్రంథాలలో

• మన హిందూ గురువులు ఎందరో ఎన్నో గ్రంథాలు రాశారు

• గురువంటే కనీసం ఉపదేశం ఇచ్చి ఇవ్వాలి.

• 

• మన హిందూ *గురు పరంపర* ను చూసినచో.....

• జగద్గురువు శ్రీకృష్ణుడు 

• శ్రీరాముని గురువులు వశిష్ఠ్.,విశ్వామిత్రులు.

• కృష్ణుని గురువు సాందీపని.

• గురు రాఘవేంద్రుడు.

• గురు దత్తాత్రేయుడు.

• ఆది గురువులు వ్యాసుడు పరంపర.

• జగద్గురువు శంకరాచార్య పరంపర.

• ఇలా మనకు అద్భుతమైన గురు పరంపర ఉంది.

• ఇంకా చెప్పాలంటే...

• శివాజీ గురువులు దాదాజీ కొండదేవ్.,సమర్థ రామదాసులు.

• వివేకానంద గురువు రామకృష్ణ పరమహంస.

• చంద్రగుప్తుని గురువు చాణక్యుడు.

• ఇలా గురు పరంపర ను చూడవచ్చు.

• ఈ ఆధునిక యుగంలో కూడా...

• అనేక మంది జగద్గురువులు.,శంకరాచార్యలు.,శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ కానివ్వండి.,జగ్గీ వాసుదేవ్ కానివ్వండి.,స్వామి చిన్మయానంద.,భక్తి శీల ప్రభుపాద.,పాండురంగ శాస్త్రి ఆఠవళే.,జీయర్లు....ఇంకా ఎందరో మరెందరో....


• కాబట్టి గురువారం అయితే గియితే పైన తెలిపిన గురు పరంపరకు చెందినదై ఉండాలి గానీ.! 

• 

• ఇక *గురుపౌర్ణమి* విషయం చూద్దాం.

• *గురుపౌర్ణమి* అంటే వాస్తవానికి చతుర్వేదాలను రచించిన ఆది గురువు *వేద వ్యాసుని* జయంతి.! 

• ఆ మహాపురుషుని జయంతినే *గురుపౌర్ణమి* గా జరుపుకుంటాం.

• కానీ

• ఏమిటో అర్థం కాదు.!.

• 

• ఒకటే పూజలు.

• ఒకటే అన్నసత్రాలు.

• ఓ చెప్పరాదు.

• హతవిదీ.!ఏం చెప్పాలి.?ఎలా చెప్పాలి? 

• హిందువుల అజ్ఞానానికి.,మూర్ఖత్వానికీ అంతులేకుండా పోయింది.


• ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా విషయాలు చెప్పగలను.

• కానీ ఇంతటితో ముగిస్తున్నా.

• ఎప్పటినుంచో అనుకుంటున్నా.

• ఈ విషయాన్ని సమస్త హిందూ బందువులతో పంచుకోవాలని.

ఆలోచించండి హిందూ బందువులారా....!!!!!!???

శ్రీ వ్యాసమునీంద్ర

 వ్యాసం వశిష్ఠ నప్తారం 

శక్తేః పౌత్ర మకల్మషం

పరాశరాత్మజం వందే 

శుకతాతం తపోనిధం

వ్యాసాయ విష్ణురూపాయ 

వ్యాస రూపాయ విష్ణవే

నమోవై బ్రహ్మనిధయే 

వాసిష్టాయ నమోనమః


మమ జన్మదినే సమ్యక్ 

పూజనీయః ప్రయత్నతః 

ఆషాఢ శుక్ల పక్షేతు 

పూర్ణిమాయాం గురౌతథా

పూజనీయే విశేషణ 

వస్త్రాభరణ ధేనుభిః

దక్షిణాభిః మత్స్యరూప

 ప్రపూజయేత్

ఏపం కృతే త్వయా 

విప్రః మత్స్య రూపస్య దర్శనం

భవిష్యతి నసందేహొమ 

యైవోక్తం ద్విజోత్తమ."


నేను జన్మించిన ఆషాఢ శుద్ద

పౌర్ణమినాడు ఈ గురుపూజను

శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు

కనుక గురువారము అయితే, 

అది మరింతగా శ్రేష్టమైనది. 

వస్త్ర, అభరణ గోదానములతో

అర్ఘ్య పాద్యాలతోటి నా రూపాన్ని

పూజించువారికి నా స్వరూప

సాక్షాత్కారం లభిస్తుంది అని

సాక్షాత్తు వ్యాస మహర్షి చెప్పారు.


అద్వైతతత్త్వసుఖాంబోధివిహరమహిమాన్వితతపోతేజసం

చతుర్వేదవిభజనకారణసనాతనధర్మసుప్రతిష్టితజ్ఞానపీఠం

భారతభాగవతాదిగ్రంధరచనాచాతుర్యజ్ఞానమయప్రదీపం

శ్రీ వ్యాసమునీంద్ర మమ దేహి కరావలంబం ||


🔯

గురువు

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

గురువు🙏🏼🕉️

---భోగయగారి. చన్ద్రఉశేఖర శర్మ.✍️

~~~~~~~~~~

కందం:-

********

మార్గమ్మిదియని చూపును,

స్వర్గ సుఖమ్ములనొసగెడి చదువును నేర్పున్,

దుర్గతి పాల్పడనీయడు,

దుర్గుణముల బాపు, దురితదూరుడు గురువే!.🙏🏼

౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿

గురుర్బ్రహ్మ

 గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం


*"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః*

*గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"*


అయితే ఈ శ్లోకం ఎందులోది? 


ఏ సందర్భంలోది? 

ఎవరు వ్రాశారు? వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా వచ్చాయా? 


ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది.

కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు.


ఇదిలా ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు. గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు.


కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు "ప్రారబ్ధం భోగతో నస్యేత్" అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు. మిట్టమధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తినని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి పంపుతారో వారే మనలో గొప్పవారు" అని.


ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు, కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే, అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి విష్ణువు వెను తిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా!! వీలయితే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు.


అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు.

🙏💐🙏💐🙏💐🙏


ఇటువంటి కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం, అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం తెలియటం. అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన శ్రద్ధ, క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు. ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు. మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని, గురువులని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ  అంకితం 🌷🙏🌷


వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే

నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః


వ్యాస మునీంద్రుడు సాక్షాత్‌ విష్ణు స్వరూపుడు. గురువులకే గురువు. ‘మునీనాం అహం వ్యాసః’ అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని విభూతి యోగంలో చెప్పాడు🌹🙏🌹


🙏💐🙏💐🙏💐🙏


సేకరణ:-

వ్యాసుని పూజిస్తే

 🌹 *శనివారం  24 జూలై, 2021*🌹


_*🚩 గురు పూర్ణిమ: వ్యాసుని పూజిస్తే అనుగ్రహిస్తాడు.. ఈ కథే ఉదాహరణ!🚩*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. పూర్వ కాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యా బుద్ధులు నేర్చుకునేవారు. ఆశ్రమంలోనే ఆయనతోపాటు నివశించేవారు.



ఆషాఢ శుద్ధపౌర్ణమిని *‘గురుపూర్ణిమ’* *‘వ్యాసపూర్ణిమ’* అని అంటారు. ఈ రోజున గురువులను పూజించి , గౌరవిస్తారు. గురు పూర్ణిమ రోజునే వ్యాసమహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ రోజున గురు భగవానుడిని , వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. *‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః  గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’* గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. యతులు ఎక్కడకీ వెళ్లకుండా ఒకచోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం. ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురుపౌర్ణమి. అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి , పూజించి , జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురుపౌర్ణమి భూమికగా నిలుస్తుంది. గురుపూజ శ్రేష్ఠమైంది. దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది.



*పురాణాల కథనం ప్రకారం*



పూర్వం వారణాసిలో బీద బ్రాహ్మణ దంపతులు నివాసం ఉండేవారు. ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి. ఆయన సతీమణి పేరు వేదవతి. ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన , భక్తి జ్ఞానం కలిగి జీవించే ఈ దంపతులకు సంతానం లేదు. ఎన్ని నోములు నోచి , వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాసభగవానుడు రోజూ మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా ఆయన దర్శించుకోవాలని భావించాడు. ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం వేయికళ్లతో వెతకడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం , కమండలం ధరించిన వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు. ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా *‘మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను. కాబట్టి మిమ్మల్ని శరణు పొందగోరు చున్నాను’* అని అంటాడు. 


ఆ మాటలకు ఖంగుతిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నలుదిశలా చూస్తూ , ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు. వెంటనే వేదనిధిని ఆప్యాయంగా పైకిలేపి ఏమి కావాలో కోరుకోమంటారు. రేపు నా తండ్రి పితృకార్యం , దానికి తమరు బ్రాహ్మణార్థమై అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటాడు. వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి మహర్షి దీనికి అంగీకరిస్తాడు. దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. 


ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాసభగవానుడిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు , పువ్వులను సిద్ధం చేసి , శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహించి , అనంతరం వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆతిథ్యానికి సంతుష్ఠుడైన ఆయన వారికి ఏ వరం కావాలో కోరుకోమన్మారు.


స్వామి ఎన్ని నోములు , వ్రతాలు చేసినా సంతానభాగ్యం మాత్రం లేదని , ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతులు , ఐశ్వర్యవంతులైన పది మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు. వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి , వేదవతి సంతానయోగం లభించింది. సుఖసంతోషాలతో జీవిత చరమాంకంలో విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున మహామునిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు.


          🌹 *సేకరణ*🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

స్పాండిలైటిస్

 స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ - 


          ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును. 


       ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును . 


          సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును . 


              నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య . 


       అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు. 


      ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నవారు నన్ను సంప్రదించగలరు. ముఖ్యముగా ఆయుర్వేద చికిత్స యందు పథ్యం  ప్రధానపాత్ర పోషిస్తుంది . ఇక్కడ పాటించవలసిన ఆహార పథ్యాలు మీకు వచ్చిన ఆనారోగ్య సమస్యకు మాత్రమే తప్ప ఔషధాలుకు కావు . నేను తయారుచేసి ఇచ్చు ఔషధాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  


                కాళహస్తి వేంకటేశ్వరరావు 


            అనువంశిక ఆయుర్వేద వైద్యం 


                      9885030034

గురు పూర్ణిమ విశిష్టత

 గురు పూర్ణిమ విశిష్టత


వ్యాసుడు పుట్టిన పుణ్యతిథి ఆషాడ శుద్ద పౌర్ణమి. ఈ పూర్ణిమ నాడు వ్యాసభగవానుడిని పూజిస్తే, ద్యానించిన వారికి తన స్వరూప దర్శనంకలుగుతుందని వ్యాసుడే చెప్పినట్లుగా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. అందుకే యావద్భారతదేశం పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భం గావ్యాసమహర్షిని పూజించి తరిస్తోంది. 


అపూర్వ, అద్భుత వేదవాజ్జ్గ్మయాన్ని అందించిన బ్రహ్మదేవుడు ఆయన, కాని ఆయనకు నాలుగు ముఖాలు ఉండవు. స్థిరచరాలన్నింటా వ్యాపించినవిష్ణుదేవుడు ఆయన, కాని ఆయనకు రెండు చేతులే ఉంటాయి. శిష్యుల అజ్ఞానాన్ని హరించే హరభగవానుడు ఆయన, కాని ఆయనకు నొసట నేత్రంలేదు. ఎవరైతే సత్యవతీ-పరాశరుల పంటగా, నది మధ్య ఉన్న దీవిలో నల్లటిరంగుతో జన్మించి క్రిష్ణ ద్వైపాయనుడుగా పేరు గడించాడో , ఎవరైతేపుడుతూనే వేదాలను వల్లించి, ఆ తరువాత చిక్కుముడులతో ఎకాకృతిగా ఉన్న వేదరాశిని సంస్కరించి, విభజించి, భోధించి, వ్యాప్తి చేసి వేదాంగభాస్కరుడుగా కీర్తి పొందాడో, ఎవరైతె పురానేతిహాసాల్లో సులభతరం చేసిన వేదసారాన్ని జొప్పించి పంచమ వేదమైన మహాభారతాన్ని,భక్తిరసప్రధానమైన భాగవతం మొదలైన పద్దెనిమిది పురాణాలనూ రచించి, అమూల్యమైన ఆర్ష సాహిత్యాన్ని లోకానికి అనుగ్రహించిన జ్ఞానమయప్రదీపుడుగా విశ్వవిఖ్యాతి చెందాడో, ఎవరైతే సనక సనందాదుల చెంత బ్రహ్మవిద్యను అభ్యసించి, న్యాయ ప్రస్థానమైన బ్రహ్మ సూత్రాలను రచించించి,బదరికావనం లో తపస్సు చేసినందు చేత బాదరాయణుడు అనిపించుకొని జగద్గురువైన శ్రీకృష్ణ స్వరూపిడిగా ప్రకటితమయ్యాడో ఆ మహానుభావుడేవ్యాస భగవానుడు…..


విష్ణు పాదాల నుండి జనించి, ఉదృతం గా కిందకు దుమికిన గంగా ప్రవాహం, శివుడి జటాజూటం నుంచి జాలువారి భూలోకాన్ని పవిత్రం చేసింది. పరమాత్మ నుంచి జనించిన జ్ఞాన గంగ కూడా వ్యాసుడి ముఖకమలం నుండి జాలువారి, గురుపరంపర ద్వారా ప్రవహించి లోకుల్ని లోకుల్ని పూనితంచేసింది, చేస్తోంది. గురువు తన జ్ఞాన భోధద్వారా శిష్యుడిలోని అజ్ఞానాన్ని పోగొట్టి, పూర్ణ స్వరూపుడిగా తీర్చిదిద్దే త్రిమూర్తి స్వరూపుడు. అజ్ఞానంనుంచి మేల్కొలిపే దేవుడే గురు దేవుడు. పాంచ భౌతికమైన శరీరం లో తెలియవచ్చే భగవానుడే గురుదేవుడు. ఇటువంటి గురుశిష్య సంప్రదాయాన్నిఏర్పరిచిన గురువులకు గురువే వ్యాస భగవానుడు. ఈయన వల్లనే ఆధ్యాత్మిక గురువుకు ఆర్ష సంస్కృతి లో ఎనలేని గౌరవస్థానం దక్కింది. అందుకేగురు పరంపరలో నిలిచినా గురు మహాత్ములందరినీ జ్ఞాన ప్రదాతలుగా సంస్మరించుకొని , తమతమ గురువుల్లో వ్యాసాదులను దర్శించి, ఏటేటా వారినికృతజ్ఞతతో ప్రత్యేకంగా పూజించే పండుగే గురు పూర్ణిమ లేక వ్యాస పూర్ణిమ.

గురుపూర్ణిమ

 *గురుపూర్ణిమ*

(గురుపూర్ణిమ/వ్యాసపూర్ణిమ సందర్భంగా)

🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐


*వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తైః పౌత్రమకల్మషమ్ |*

*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||*


*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |*

*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ll*


మహాభారత గ్రంధకర్త అయిన *"వేదవ్యాస మహర్షి"* జన్మించినది... *ఆషాడ పౌర్ణమి* నాడు. 


ఈ వ్యాసుడు, పరాశరముని వలన, సత్యవతీ దేవికి జన్మించాడు. అందుకనే ఈ రోజును *"వ్యాసపౌర్ణమి"* మరియు *"గురుపౌర్ణమి"* అని కూడా అంటారు.


మానవ కళ్యాణం కోసం ఏకరూపమైన వేదాన్ని విభజించి 4 శాఖలుగా ఏర్పరచాడు. ( *ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం* ).


నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగం లోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. 


ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో *ధర్మం*... 


కృతయుగంలో 4 పాదాలతో, 

త్రేతాయుగంలో 3 పాదాలతో, 

ద్వాపరయుగంలో2 పాదాలతో, 

ఈ కలియుగంలో 1 పాదంతో, నడుస్తుంది.


కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా... అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు.


వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. స్వయం భగవానుని ముఖతః వెలువడినదే వేదము. అందుకే అతనిని వేదపురుషుడు అని అంటారు. 


వేదములో విషయాలు ఉన్నాయి. వేదములో లేనివి--- మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏకరూపంలో ఉంటాయి. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని, భగవానుడే ప్రతీ ద్వాపరయుగం లోనూ, వ్యాసుడుగా అవతరించి, వేదాలను విభజిస్తాడు. మందబుద్దుల కోసం, వేదాధ్యాయానికి అవకాశం లేని వారి కోసం వేదంలోని విశేషాలను, ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందిస్తాడు.


శ్రీమద్భాగవతం భగవానుని 21 అవతారాలని తెలుపుతూ, వేదవ్యాసుని 17 వ అవతారంగా చెబుతుంది.


వ్యాసుడు నల్లగా ఉండేవాడట... అందుకని ఈయనను కృష్ణుడు అని అన్నారు. క్రిష్ణుడు అని అనేవారు. ఈయన నివాసస్థానము హిమాలయములలో, సరస్వతి నది మధ్య గల ఒక ద్వీపం... కనుక, *కృష్ణ ద్వైపాయనుడు* అని అంటారు.


వేదాలను విభజించి, వేదాధ్యయనాన్ని తరతరాలుగా నిలిచేలాగా చేసినవాడు గనుక -- *వేదవ్యాసుడు* అని, పరాశర మహర్షి కుమారుడు గనుక -- *పరాశరాత్మజుడు* అని, బదరీక్షేత్రంలో నివసించేవాడు కనుక -- *బాదరాయణుడు* అని అంటారు.


సర్వభూతములయందు దయకలిగియుండుట, సత్యమార్గములో నడుచుట, శాంతగుణాన్ని కలిగియుండుట - ఈ మూడు గుణాలని అందరూ అలవరచుకోవాలి అని వ్యాసులవారు తెలియచేసారు.


మనందరికీ *దేవరుణము, ఋషిరుణము, పితృఋణము* - అని మూడు ఋణాలు ఉంటాయి. వీటితోపాటు వేదవ్యాసుడు *మనుష్య ఋణము* కూడా ఉంటుందని తెలియచెప్పాడు. సర్వప్రాణుల యందు దయతో ఉండటం, ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్యఋణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు.


*మహాభారత రచన*


మహాభారత రచనకు తన మనసులో ఒక ప్రణాళికను తయారుచేసుకొన్నాడు వేదవ్యాసుడు. 


తాను చెబుతుంటే..... అంత వేగంగా వ్రాసే వారు ఎవరు ఉన్నారా!! అని విచారంలో ఉండగా..... బ్రహ్మ, వ్యాసుని కోరికను గుర్తించి, అతని ఎదుట ప్రత్యక్షమై, "వ్యాసా ! నీ కావ్యరచనకి, తగినవాడైన గణపతిని స్మరించు." అని తెలిపి అదృశ్యమయ్యాడు. 


అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా.... గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ మహాభారతానికి నువ్వు లేఖకుడివి కావాలి.... అని తెలుపగా..... గణేశుడు అనుమతించాడు. వేదవ్యాసుడు చెబుతూఉంటే.... గణాధీశుడు రచన సాగించాడు.


*గురుశిష్య సాంప్రదాయం*


ఏనాటిదో ఐనా, వేదవ్యాసుడినే మొదటి గురువుగా చెబుతారు. వేదాలను నాల్గింటిని తన నలుగురి శిష్యులకు బోధించి, భాగవతాన్ని శుకునకు బోధించాడు. శిష్యులకు పరంపరగా బోధించమని కోరాడు.


మంచి బ్రహ్మవేత్తల పరంపరలో జన్మించి, లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించటం వలన భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన వారిలో మహోన్నత స్థానాన్ని పొందాడు. 


ఆయన జన్మదినంగా పెద్దలు ఆచరిస్తూ వచ్చిన *ఆషాఢశుద్ధ పౌర్ణమి (గురు పౌర్ణమి)* నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో మనకు జ్ఞానాన్ని అందించిన గురువును వ్యాసునిగా భావించి... పూజించాలి. ఆ గురువుకు పాదపూజ చేసి, కానుకలు సమర్పించి, అతని నుండి ఆశీస్సులు పొందాలి. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం.


*"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః*

*గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః* అనే శ్లోకంతో గురువుని ప్రార్థించాలి.


*"గు"* శబ్దం అంధకారాన్ని తెలుపుతుంది. *"రు"* శబ్దం అంధకారాన్ని తొలగిస్తుంది. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, మనకు జ్ఞాన్నాన్ని ప్రసాదించేది గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి.


ఇంతటి ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తరవాత తరాలకి అందించుట మన ధర్మం.


మన పిల్లలకు ఇతిహాస, పురాణాల పట్ల, ప్రాచీన సంస్కృతీసాంప్రదాయాల పట్ల, అభిరుచి కలిగించుట మన కర్తవ్యం. వీటిలో కొన్నయినా సాధించగలిగితే వ్యాసులవారి ఋణం కొంతయినా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. ఆ వ్యాసభగవానుని కృపకు మనము పాత్రులము కాగలము అని ఆశిద్దాం. అందుకే గురుపూజను చేసుకుందాం. సాటి గురువులో భగవంతుని దర్శిద్దాం.


*"గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా"* అంటాడు భక్తకబీర్ దాస్. 


అదీ మన భరతీయసంస్కృతి. ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.


*గురు సందేశము*


వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే - 


*'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.'* 


పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామం అవుతుంది.


*అస్మత్ గురుభ్యో నమః*


*సేకరణ:*

🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అవధూతల దర్శనం..*


నెల్లూరు నుంచి శ్రీ చంద్రశేఖర్ గారు అదే మొదటిసారి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి రావడం..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుని..మందిరం లోని ప్రధాన మంటపం చుట్టూరా ప్రదక్షిణం చేసి..శ్రీ స్వామివారి విగ్రహం వద్ద పూజ చేయించుకొని..కొద్దిసేపు మంటపంలో కూర్చున్నారు..చంద్రశేఖర్ గారి మనసులో ఒక కోరిక కలిగింది..అడగాలా?..వద్దా?..అనే సందేహం లో కొంచెం సేపు మథనపడి.. చివరకు..


"ప్రసాద్ గారూ..మిమ్మల్ని ఒకటి అడగొచ్చా?.."అన్నారు..


"మందిరానికి సంబంధించినది ఏదైనా సరే..నిరభ్యంతరంగా అడగండి.." అన్నాను..


"శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి వారి పటాన్ని తీసుకొచ్చి..ఇక్కడ..ఈ మందిరం వద్ద ఒక ప్రక్కన పెట్టాలని కోరిక కలిగిందండీ..మీరు అనుమతి ఇస్తే..శ్రీ వెంకయ్య స్వామి వారి పటాన్ని తీసుకొస్తాను.." అన్నారు..


"ఎటువంటి ఇబ్బందీ లేదు..మీరు చూస్తున్నారు కదా..నైరుతి మూలలో శ్రీ సాయిబాబా మందిరం ఉన్నది..శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన తరువాత..శ్రీ సాయిబాబా ను కూడా దర్శించుకుంటున్నారు..అలాగే శ్రీ వెంకయ్య స్వామి వారి పటం వుంటే..ఆ స్వామికి నమస్కరించుకుంటారు..గొలగమూడి లో ఉన్న వెంకయ్య స్వామి వారిని కూడా అవధూత పరంపర లోనే పరిగణిస్తున్నారు కదా..నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదండీ.." అన్నాను..


చంద్రశేఖర్ గారు ఎంతో సంతోషం తో .."ఈసారి వచ్చేటప్పుడు శ్రీ వెంకయ్య స్వామి వారి పటాన్ని తీసుకొస్తానండీ..ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు.." అని చెప్పి..నెల్లూరు వెళ్లిపోయారు..


రెండు నెలలు గడిచాయి..ఒకరోజు చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ..శ్రీ వెంకయ్య స్వామి వారి చిత్రం ఒక్కటే కాకుండా..ఇతర అవధూతల చిత్రాలు కూడా తీసుకురావాలని నాకు స్వప్నంలో ఆదేశం వచ్చిందండీ..శ్రీ దత్తాత్రేయస్వామి వారి గర్భ గుడి వెలుపల గోడ మీద నాలుగు వైపులా కొలతలు తీసుకొని..అందుకు తగ్గట్టుగా అవధూతల పటాలు చేయించి..తీసుకొస్తాను..రేపుదయం వస్తున్నాను..నాతో పాటు నెల్లూరు లోని సత్యం స్థూడియో యజమాని గారు కూడా వస్తున్నారు.." అన్నారు..తీరా చూస్తే..ఆ సత్యం గారు మాకు దూరపు బంధువు..దత్త భక్తుడూ..


అనుకున్న విధంగానే ప్రక్కరోజు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..ప్రధాన మంటపం చుట్టూరా కొలతలు తీసుకొని వెళ్లిపోయారు..మళ్లీ రెండు నెలల పాటు ఎటువంటి కబురూ లేదు..


ఆ తరువాత ఒక ఆదివారం నాడు..

శ్రీ దత్తాత్రేయ (త్రిమూర్తి స్వరూపుడు)

శ్రీ పాద శ్రీ వల్లభులు..

శ్రీ నృసింహ సరస్వతి..

శ్రీ స్వామీ సమర్ధ..

శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్

శ్రీ సాయిబాబా..

శ్రీ వెంకయ్య స్వామి..


వీటన్నింటి తో పాటు..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు..


మొత్తం ఎనిమిది చిత్రపటాలు.. పెద్ద సైజువి తీసుకొని వచ్చి..మంటపం చుట్టూ ఒక పద్ధతి ప్రకారం అమర్చారు..


"చిత్రమేమిటంటే..అందరు అవధూతల చిత్రపటాలు తయారయ్యేదాకా..శ్రీ వెంకయ్య స్వామి వారి చిత్రపటం పూర్తి కాకపోవడం..అందరి తో కలిసే శ్రీ వెంకయ్య స్వామి వారు మొగలిచెర్ల స్వామివారి దగ్గరకు రావడం.."


మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చిన భక్తులు ప్రధాన ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేటప్పుడు..పై అవధూతలందరి దర్శనము అవుతుంది..


ఒక్క వెంకయ్య స్వామి వారి పటాన్ని మాత్రం పెట్టుకోవడానికి అనుమతి కోరిన చంద్రశేఖర్ గారు..శ్రీ స్వామివారి ఆదేశం తో అందరు అవధూతల చిత్రపటాలూ తీసుకొచ్చారు..తనకూ ఇతర అవధూతలకూ బేధమే లేదని శ్రీ స్వామివారు పరోక్షంగా సూచించారు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).