రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు - వివరణ .
మనలో చాలామందికి మనం తీసుకునే ఆహారం మీద సరైన అవగాహన ఉండదు. సమయానికి ఏది పడితే అది తినేయడం ఆ తరువాత వ్యాధులను మన చేజేతులా మనమే కొనితెచ్చుకుంటున్నాం . మానవులకు రోగాలు రావడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే. అతిగా తినటం కూడా రోగకారణమే . ఆయుర్వేదం నందు ఒక సూక్తి ఉంది. " త్రికాల భోజనే మహారోగి , ద్వికాల భోజనే మహాభోగి , ఏకకాల భోజనే మహాయోగి " అని చెప్తారు . ఏది పడితే అది కడుపు నిండా తిని జబ్బులను కొనితెచ్చుకోవద్దు. మీరు తినే ఆహారం మీ ఉదరము నందు సగభాగం పట్టునట్టు తిని పావుభాగం నీటికొరకు , మిగిలిన పావుభాగం వాయుప్రసారానికి అనుగుణంగా వదలవలెను. మనం తీసుకునే ఆహారం తక్కువ మోతాదులో ఉన్నను మనశరీరానికి మంచి బలాన్ని , రోగనిరోధకశక్తి ఇచ్చే ఆహారం అయ్యి ఉండవలెను .
ఇప్పుడు మీకు శరీరము నందు రోగనిరోధక శక్తి మరియు బలాన్ని ఇచ్చే ఆహారాల గురించి వివరిస్తాను.
* వరి,గోధుమ , ఇతర ధాన్యాలు -
మన ప్రధాన ఆహారాలు ఐన వరి, గోధుమ వంటి ఆహారధాన్యాలు పైన పొట్టు తీయకుండా ( పాలిష్ ) తీసుకొనుచున్న ఇవి చాలా బలమైన ఆహారపదార్దాలు. పొట్టులో విటమిన్లు ఉంటాయి. పొట్టులో ఉండే ఒక ముఖ్యమైన విటమిన్ ధాన్యాన్ని పాక్షికంగా ఉడికించడం వల్ల ( ఉప్పుడు బియ్యం ) గింజలోపలి భాగానికి వెళ్తుంది . దంపిన బియ్యం , ఉప్పుడు బియ్యం పొట్టు తీసిన ( పాలిష్ ) బియ్యం కంటే చాలా మంచివి.
* ఎండబెట్టిన మొక్కజొన్నలు -
ఎండబెట్టిన మొక్కజొన్నలు వండే ముందు పలచటి సున్నపుతేటలో నానబెడితే వాటిలో ఉన్న " నియాసిన్ " అనే విటమిన్ , మాంసకృత్తుల్ని శరీరం బాగా ఉపయోగించుకోగలుగుతుంది.
* రాగులు , సజ్జలు , చోళ్లు -
వీటిలో ఖనిజ లవణాలు ఎక్కువుగా ఉంటాయి. ముఖ్యంగా క్యాల్షియం , ఇనుము ఎక్కువుగా ఉంటాయి. ఇవి వరి , గోధుమ కంటే చౌకైనవి , ఎక్కువ బలవర్థకమైన ఆహారాలు . వరి , గోధుమలకు బదులు వీటిని తీసుకోవచ్చు .
* పప్పులు -
ఏదో ఒక పప్పు కంటే అనేక పప్పుల మిశ్రమం మంచిది . ఒక్కో రకమైన పప్పులో ఒక్కో రకమైన మాంసకృత్తులు ఉంటాయి. పప్పుల మిశ్రమం శరీరానికి కావలసిన అన్నిరకాల మాంసకృత్తులను అందిస్తుంది.
* చిక్కుళ్ళు , బటానీలు , సోయాబీన్స్ -
ఇవి చౌకగా దొరికే మాంసకృత్తులు . పొలాల్లో వీటిని పెంచడం వల్ల భూమిసారం పెరిగి తరువాత వేరే పంట వేస్తే బాగా పెరుగుతుంది . అందువల్ల పంటను మార్చుతూ ఉండాలి.
* ఆకుకూరలు -
ఎక్కువుగా పచ్చగా ఉన్న ఆకుకూరల్లో కొంచం మాంసకృత్తులు , కొంచం ఇనుము , విటమిన్ A ఎక్కువుగా ఉంటుంది. చిలగడదుంప , చిక్కుడు , బటాణీ , గుమ్మడికాయల ఆకులు చాలా బలవర్ధకమైనవి . వీటిని ఎండబెట్టి పొడిచేసి బిడ్డలకు అన్నంలో కలిపి పెట్టుచున్న మాంసకృత్తులు , విటమిన్లు లభిస్తాయి.
క్యాబేజి లాంటి లేతాకు పచ్చ ఆకుకూరలలో మాంసకృత్తులు , విటమిన్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం కాదు కాబట్టి పెద్దగా తీసుకోవలసిన అవసరం లేదు .
* దుంపకూరల ఆకులు -
ముల్లంగి , కర్రపెండలం మొదలైన మొక్కల్లో వాటి దుంపల కంటే ఆకులలో ఎక్కువ పోషకపదార్ధాలు ఉంటాయి. కర్రపెండలం ఆకుల్లో , దుంపల కంటే 7 రెట్లు అధికంగా మాంసకృత్తులు , విటమిన్లు ఉంటాయి. దుంపతో కలిపి తింటే ఇంకా ఎక్కువ బలం . లేత ఆకులు చాలా బలం ఇస్తాయి.
కాయగూరల్ని , బియ్యాన్ని , ఇతర పదార్ధాలని కొంచం నీటిలో ఉడకబెట్టాలి . ఉడకబెట్టటానికి ముందు కాయగూరలను కోయవలెను . అతిగా ఉడకపెట్టకూడదు . అలా ఉడకపెట్టడం వలన కొంత విటమిన్లు , లవణాలు పోతాయి. ఉడకపెట్టాక మిగిలిన నీటిని పారబోయకూడదు . ఆ నీటిని తాగడమో లేక సూప్ లా చేసుకుని తాగిన చాలా మంచిది .
కాయగూరలని వండేప్పుడు కొంచం చింతపండు కలిపిన విటమిన్లు పోవు . ఎండి , వాడిపోయిన కూరగాయలకంటే తాజాగా ఉన్నవి ప్రశస్తమైనవి. బలమైనవి. అడవుల్లో దొరికే చాలా పండ్లలో విటమిన్ "C " సహజమైనది ఉండును. పంచదార కూడా అధికంగా ఉండును. విటమిన్ల కొరకు ఈ పండ్లను తీసుకోవచ్చు . తినడానికి ముందు అవి విషపూరితమైనవా ? కావా? అన్నది చూసుకోవడం ఉత్తమం.
ఇనప పాత్రలలో వండడం వలన లేదా చిక్కుళ్లు లాంటివి ఉడకపెట్టేప్పుడు పాత్రలో తుప్పుపట్టిన ఇనుప ముక్క వేసి ఉడకపెట్టిన ఆ ఆహారము నందు ఇనుము శాతం పెరిగి రక్తహీనత రాకుండా చూస్తుంది. బెల్లాన్ని ఇనుపపాత్రలో తయారుచేయడం వలన ఆ బెల్లము నందు ఇనుము శాతం ఎక్కువుగా ఉండును. పంచదారకు బదులు బెల్లం వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది .
పైన చెప్పిన ఆహారాలు మాత్రమే కాకుండా , గుడ్లు , మాంసాహారం కూడా శరీరానికి బలం ఇచ్చును . ఇవి అలవాటు లేనివారు పప్పు , తాజా కూరగాయలు , పండ్లు తీసుకొని శరీరం నందు రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఎంత ఎక్కువ తింటున్నాం అన్నది కాదు , ఎంత బలమైన ఆహారం తీసుకుంటున్నాం అన్నది ముఖ్యం .
* సమాప్తం *