17, జులై 2022, ఆదివారం

పరమాత్మ

 *భగవంతుణ్ణి గుర్తించడం ఎలా* 

🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫


🌈 సాకేత రాజ్యాన్ని సురథుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి ఆత్మవివేకి అనే కుమారుడు. యుక్తవయస్సు వచ్చేనాటికి రాకుమారుడు. గురుకులంలో సమస్త శాస్త్రాలనూ అధ్యయనం చేశాడు. అతడు విద్యాభ్యాసం ముగించుకుని రాజ్యానికి తిరిగి వెళ్లే సమయం ఆసన్నమైంది. 


🌈 ఆ సమయంలో అతడు ఒకరోజు రాత్రి...... *‘‘ఒక పక్క పురుష ప్రయత్నాన్ని నమ్మమంటున్నారు. మరొకపక్క దైవానుగ్రహాన్ని పొందమంటున్నారు. కాని దైవం ఎలా ఉంటాడు? లేక ఎలా ఉంటుంది? దైవాన్ని చూసిన వాళ్లున్నారా? దైవం రూపం ఎలా ఉంటుంది?’’*  అని మౌనంగా ఆలోచిస్తూ గడుపుతుండగా తెలియకుండానే నిద్ర పట్టింది. 


🌈 తెల్లవారుఝామున బ్రహ్మముహూర్తానికి ముందు ఎవరో అదృశ్యంగా ఉండి తనను తట్టి లేపి తన చేయి పట్టుకుని ఆకాశంలోకి తీసుకుని వెళ్లారు. అక్కడ అతడు.. అనంత దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న ఎన్నో లోకాలను దాటుకుంటూ వెళ్లాడు. సామాన్యంగా మానవ నేత్రాలతో చూడశక్యం కాని ఎన్నో సౌరకుటుంబాలు, ఎన్నో బ్రహ్మాండాలు అతడికి కనబడ్డాయి. 


🌈 సూర్యోదయ సమయానికి ఉదయగిరికి చేరుకున్నారు. ఉదయగిరిపై తను మునుపెన్నడూ చూడనంతగా అతి పెద్ద సూర్యబింబం ఎర్రని వర్ణంలో ప్రకాశిస్తున్నది.


🌈 సూర్య దర్శనం అయ్యాకా.. భూలోకమంతటినీ చుట్టి ఉన్న, భూమిలోనూ మధ్య మధ్యలో ఆయా భూభాగాలను వేరు చేస్తున్న సముద్రాన్ని కూడా అన్ని వైపులనుండి వ్యాపించిన దాన్ని తను చూశాడు. 


🌈 కళ్లు తెరచి చూసేసరికి గురువు పాదాల దగ్గర ఉన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వుతూ, *‘‘నీ అనుభవం ఎలా ఉంది?’’* అని అడిగాడు. 


🌈 ‘‘అనిర్వచనీయమైన అనుభూతి గురువర్యా! మానవమాత్రులెవరూ వేల సంవత్సరాలకైనా చేరలేని పాలపుంతలకు అవతలి భాగాలను చూసి వచ్చాను. ఇది మీ అనుగ్రహమే’’ అన్నాడు.  


🌈 ‘‘మరి, ఏ మానవులు - ఈ భూమికి చుట్టూ ఉన్న సముద్రాన్ని భూమిని కబళించనీయకుండా సృష్టి చేశారంటావు? ఏ మానవులు ఈ సౌరకుటుంబానికి అవతల ఉన్న వేలాది సౌరకుటుంబాలను, అంత కన్నా వేలాది రెట్లు పెద్దవైన బ్రహ్మాండాలను సృష్టించారంటావు?’’ అని అడిగాడు గురువు. 


దానికి అతడు.. 


🌈 ‘‘ఒక అనిర్వచనీయమైన, సర్వత్రా వ్యాపించిన శక్తి అని అనిపిస్తున్నది గురువర్యా! మరి శివుడు, విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవతలు?’’ అని వినయంగా మోకరిల్లుతూ అడిగాడు. ‘‘నీవు చూసిన బ్రహ్మాండాలతో పోలిస్తే ఈ భూమి అణువంత. దీన్ని సరిగ్గా చూడడానికే నీ శక్తి సరిపోవట్లేదు. ఇక ఆ త్రిమూర్తులను చూడాలంటే ఎంత ప్రయత్నం కావాలి? యోగదృష్టిని అలవరచుకో! సాధన సాగించు. అన్నీ అర్థమౌతాయి.  భగవంతుణ్ని, ఇతర దివ్యతత్త్వాలను తెలుసుకో గలుగుతావు.’’ అన్నాడు గురువు. 


🌈 ‘‘ఈ కనబడే జగత్తు మన పంచజ్ఞానేంద్రియాలకు అనుభవంలోకి వస్తున్నది కదా? అది భ్రాంతి ఎలా అవుతుంది? దాన్ని మిథ్య అని ఎందుకు అంటున్నారు? అది అబద్ధం ఎలా అవుతుంది?’’ అని మళ్ళీ ప్రశ్నించాడు రాకుమారుడు.


🌈 *‘‘యన్నిత్యం తత్‌ సత్యం’’* అని నియమం. ఏది నిత్యమో (శాశ్వతమో) అదే సత్యం అని దీని అర్థం. అది (సత్యం).. సర్వవ్యాప్తమై ఈ జగత్తు ఉత్పత్తి, స్థితి, లయలకు కారణభూతమైన పరమాత్మ మాత్రమే. 


🌈 *నిన్న పుట్టి, నేడు ఉండి రేపు గతించే ఈ ప్రపంచం నిత్యం కాదు. అందుకని అది సత్యం కాదు. అలాంటి దానిని అసత్యం లేక మిథ్య అంటారు.*


🌈 అంతే కానీ మనం వ్యవహారంలో అనుకునే అబద్ధం వేరు. మిథ్య వేరు. జ్ఞానేంద్రియాలకు లోబడి కనపడేది జగత్తు. వాటికి అతీతంగా ఉండేది పరమాత్మ.’’ అని గురువు ఉపదేశించాక సాకేతపురానికి బయల్దేరాడు రాజకుమారుడు. 



*Courtesy: ఆంధ్రజ్యోతి*

కామెంట్‌లు లేవు: