**దశిక రాము**
**శ్రీమద్భాగవతము**
పంచమస్కంధం యొక్క ప్రధామాశ్వాసం. -5
భరతుని జన్మంబు
ఋషభ మహారాజు తన రాజ్యాన్ని కర్మభూమిగా భావించి, కర్మతంత్రాన్ని జనులందరికీ ఇష్టమయ్యే విధంగా తెలియజేయా లనుకున్నాడు. అందుచేత కర్మలు ఆచరించడానికి తానే స్వయంగా గురువుల వద్దకు చేరాడు. వారి ఆజ్ఞను శిరసావహించి దేవేంద్రుడు ఇచ్చిన జయంతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఆ జయంతి వల్ల భరతుడు మొదలైన వందమంది కొడుకులను కన్నాడు. పట్టణాలతో, ఆశ్రమాలతో, కొండలతో, చెట్టు చేమలతో నిండిన భూమండలం భరతుని పేరు మీదుగా భరతవర్షం అనే ప్రశస్తిని పొందింది. ఆ భరతవర్షంలోని ఆయా భాగాలకు భరతుడు తన తొంబది తొమ్మిది మంది సోదరులలో కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృశుడు, విదర్భుడు, కీకటుడు అనే తొమ్మిది మందిని ప్రధానులుగా నియమించాడు. వారి కప్పగించిన భూభాగాలు వారి వారి పేర్లతో ప్రసిద్ధి పొందాయి. కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు అనే తొమ్మిది మంది భాగవత ధర్మాన్ని ప్రకాశింపజేశారు. దేవుని మహిమలను వ్యాప్తి చేసే వారి చరిత్రలను నీకు తరువాత చెపుతాను. తక్కిన ఎనభైయొక్క మంది కుమారులు తమ తండ్రి ఋషభుని మాటను జవదాటనివాళ్ళు. వారంతా మహావినయ సంపన్నులు. వేదధర్మాలను అనుష్ఠించేవాళ్ళు. యాగాలన్నా కర్మలన్నా శ్రద్ధ కలవాళ్ళు. అందుచేత వాళ్ళు బ్రాహ్మణోత్తములుగా పేరు గడించారు. ఋషభుడు సాంసారిక బంధాలలో చిక్కుకొనలేదు. స్వతంత్రుడై మెలిగాడు. తాను ఆనందానుభూతి కలిగిన ఈశ్వరుడైనా సామాన్యుడిగా ప్రవర్తించాడు. ఆయా కాలాలలో చేయదగిన ధర్మాలను ఆచరించేవాడు. ధర్మ ప్రవర్తకుల పట్ల సమబుద్ధి కలిగి ఉండేవాడు. శాంతస్వభావంతో జీవుల పట్ల దయ కలిగి మైత్రీభావంతో ఉండేవాడు. ధర్మం, అర్థం, కీర్తి, సంతతి, ఆనందం. అమృతత్వం చక్కగా సాగడం కోసం గృహస్థాశ్రమాన్ని పాటించవలసిందిగా ప్రజలను అనుశాసించేవాడు. ఈ విధంగా ఋషభుడు నీతిమార్గం తప్పకుండా ప్రజాపాలనం చేసాడు. వేదాలలోని ధర్మరహస్యాలను తనకు అవగతమైనా బ్రాహ్మణులు బోధించినట్లు, ఋత్విక్కులు ఉపదేశించినట్లు వస్తు సంభారాలతో దేశకాలానుగుణంగా శ్రద్ధాపూర్వకంగా తన వయస్సుకు తగినట్లు ఒక్కొక్క యాగాన్ని వంద పర్యాయాలు యథావిధిగా చేసి సుఖజీవనం గడిపాడు. అప్పుడు…రాజా! ఆ ఋషభుని రాజ్యంలో పారలౌకిక ఫలమే తప్ప ఇహలోకఫలం కోరేవాడు ఒక్కడు కూడా కనిపించడు. అతడు సూర్యుని వంటి తేజస్సు కలవాడు. అతని మహిమలను ఏమని వర్ణించాలి?
ఋషభునిదపంబు
ఆ ఋషభుడు రాజ్యపాలన చేస్తూ ఒకనాడు ఇహలోక ఫలాన్ని అపేక్షించక, మోహాన్ని వదలిపెట్టి, కొడుకులకు రాజ్యమంతా అప్పగించాడు. తరువాత కొడుకులు, మంత్రులు తనను అనుసరించగా బ్రహ్మావర్త దేశానికి బయలుదేరాడు. అక్కడ మహాత్ములైన మునిజనుల సమక్షంలో కుమారుల నందరినీ దగ్గరకు పిలిచి మహాపుణ్యాత్ముడైన ఋషభుడు సంతోషంతో ఇలా అన్నాడు.“కుమారులారా! ఈ భూమిమీద పుట్టిన మనుష్యులు కామానికి లొంగిపోతే కుక్కలకు కూడా రాని కష్టాలు వారికి ఎదురవుతాయి. అందువల్ల కోరికలకు మీరు దూరంగా ఉండాలి. ఏ తపస్సు వల్ల మానవులకు తరగని సుఖం లభిస్తుందో అలాంటి తపస్సును అవలంబిస్తే బ్రహ్మానందం తప్పక సిద్ధిస్తుంది. వృద్ధులను, దీనులను దయతో కాపాడండి. చెడు మార్గాలలో నడిచే కాముకుల సహవాసాన్ని పూర్తిగా వదలిపెట్టండి. మీకు శుభం కలుగుతుంది.ఇంకా స్త్రీ వ్యామోహంలో ఉండే కాముకులతో సంబంధం వల్ల సంసారం నరకమే అవుతుంది. మహాత్ముల సహవాసం మోక్షానికి దారి తీస్తుంది. అటువంటి మహాత్ములు ఎవరని అంటారా? శత్రు మిత్ర భేదభావం లేకుండా అందరిపై సమదృష్టి కలవారు, శాంతస్వభావులు, కోపం లేనివారు, సమస్త జీవుల పట్ల దయాస్వభావం కలవారు, సాధు స్వభావులు మహాత్ములని పిలువబడతారు. అలాంటి మహానుభావులకు నాయందే పరిపూర్ణ భక్తి ఉండడం వల్ల విషయ లంపటులైన దుర్మార్గుల పట్ల ప్రీతి, తమ దేహమన్నా, ఇల్లన్నా, మిత్రులన్నా, భార్యాపుత్రులన్నా వ్యామోహం ఏమాత్రం ఉండదు. ఇంద్రియ సుఖాలకు లోనైనవాడు పనికిరాని పనులు చేస్తూ ఉంటాడు. చెడ్డపనులు చేసేవాడు పాపం కొనితెచ్చుకుంటాడు. దుఃఖకారణమైన దేహాన్ని మోస్తూ ఉంటాడు. అందువల్ల మీరు పాపాలకు మూలాలైన కోరికలను కోరకండి. యథార్థ జ్ఞానం ప్రాప్తించనంత వరకు మీకు ఆత్మతత్త్వం బోధపడదు. ఆ తత్త్వం తెలియని కారణాన దేహికి దుఃఖం ఎక్కువవుతుంది. లింగదేహ మెంతకాలం ఉంటుందో అంతకాలం మనస్సు కర్మవశమై ఉంటుంది. జ్ఞానం లభించదు. అవిద్య వదలదు. శరీరం కర్మమూలం. అందుచేత కర్మలు చేయడం తగదు. వాసుదేవుడినైన నామీద ఆసక్తి కుదరనంత వరకు మిమ్మల్ని దేహధర్మాలు బాధిస్తాయి. ఎంత చదువుకున్న వాడైనా దేహేంద్రియ సుఖాలపట్ల ఆసక్తుడై సంభోగ సుఖ ప్రధానమైన గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. మూఢుడై సంసార క్లేశాలకు లోనౌతాడు. సంసారికి ఇల్లన్నా, పొలాలన్నా, కొడుకులన్నా, ఆప్తులన్నా, ధనమన్నా నేను నాది అనే వ్యామోహం పెరుగుతుంది. స్త్రీ పురుషుల కలయిక వల్ల సంతానం కలుగుతుంది. ఆ సంతానం కోసం ఇల్లు కట్టడమో, పొలాలు కొనడమో, ధనం సంపాదించడమో జరుగుతుంది. వాటిపట్ల మోహం పెంచుకొనడంతో వానికి మోక్షమార్గం దూరమౌతుంది. సంసారంలో మునిగి ఉన్నవానికి ఎపుడయితే మోక్షాసక్తి కలుగుతుందో అపుడే అతడు సంసారాన్ని వదలి పెడతాడు. మోక్షోపాయం చెప్తాను. పరమేశ్వరుడనైన నా మీద భక్తి ఉండడం, కోరికలు లేకపోవడం, సుఖ దుఃఖాలలో సహనం, సమస్త జీవుల కష్టాలపట్ల సానుభూతి కలిగి ఉండడం, భగవద్విషయమైన జ్ఞానంపట్ల ఆసక్తి, తపస్సు, నా కథలను, లీలలను ఆలకించడం, నన్నే దైవంగా భావించడం, నా గుణాలను కీర్తించడం, ఎవరితోను విరోధభావం లేకుండడం, సర్వత్ర సమబుద్ధి కలిగి ఉండడం, శాంతితో జీవించడం, ‘నా గేహం, నా దేహం’ అనే బుద్ధిని వదలిపట్టడం, ఆధ్యాత్మయోగం అవలంబించడం, ఏకాంత భక్తిభావం, ఇంద్రియాలను జయించడం, కర్తవ్య పరాయణత్వం, సత్కార్యాలందు శ్రద్ధ, బ్రహ్మచర్యం, జాగరూకత, వాక్కులను సంయమనంతో వాడడం, అన్నిటిలో నన్నే చూడడం… ఇవి ముక్తి మార్గాలు. జ్ఞానంతో విజ్ఞాన విజృంభితమైన యోగంతో, గుండె దిటవుతో, సాత్త్వికమైన ప్రవృత్తితో లింగదేహాన్ని జయించి మానవుడు క్షేమాన్ని పొందాలి.
అజ్ఞానం నుండి పుట్టిన హృదయ బంధనమనే తీగను యోగం అనే చురకత్తితో ధైర్యంగా తెంపివేయాలి. ఇటువంటి యోగాన్ని అనుష్ఠించే వ్యక్తి గురువైతే శిష్యులను, తండ్రి అయితే బిడ్డలను, రాజు అయితే ప్రజలను తాను నేర్చిన యోగమార్గంలో పెట్టాలి కాని కర్మఫలాలపై ఆసక్తులను చేయకూడదు. ప్రజలంతా ఏవో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మూర్ఖులై ఎల్లప్పుడూ మనసులో ఐహిక ఫలాలను కోరుతూ ఉంటారు. అల్పసుఖం కోసం ఒకరిపై మరొకకు వైరం పెంచుకుంటారు. అంతులేని దుఃఖంలో మునిగిపోతారు. అందుచేత గురువయినవాడు తానే ముందు నడిచి మాయా మోహాలకు లోబడిన మూర్ఖులైన జీవుల పట్ల సానుభూతి చూపాలి. కళ్ళున్నవాడు గ్రుడ్డివానికి దారి చూపిన విధంగా అజ్ఞానులకు బోధించి సహాయపడాలి. సాటి లేనిది, దివ్యమైనది అయిన మోక్షానికి మార్గం చూపాలి. ఇంకా తండ్రి, గురువు, తల్లి, బంధువు ఎవరైనా సరే అక్షయమైన మోక్షమార్గం చూపలేక పోతే వారెవరూ హితులు కారు. నా శరీరం ఎలా ఏర్పడించో మీరు ఏమాత్రం ఊహించలేరు. నా మనస్సు సత్త్వగుణంతోను, ధర్మంతోను కూడి పాపరహితమైనట్టిది. అందువల్లనే ఆర్యులు నన్ను ఋషభుడు అన్నారు. శుద్ధ సాత్త్వికమైన నా శరీరంనుండి కుమారులై పుట్టిన మీరందరూ తోడబుట్టినవాడు, మీకు పెద్దవాడు, మహాత్ముడు అయిన భరతుణ్ణి నాలాగే భావించి సద్బుద్ధితో సేవించండి. అదే మీరు నాకు చేసే శుశ్రూష. ప్రజలను పరిపాలించడమే మీకు పరమధర్మం” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. సమస్త జీవరాసులలో వృక్షాలు శ్రేష్ఠమైనవి. వృక్షాలకంటె సర్పాలు శ్రేష్ఠాలు. సర్పాలకంటె మేధావులు ఉత్తములు. వారికంటె రాజులు గొప్పవారు. రాజులకంటె సిద్ధులు, కింపురుషులు, గంధర్వులు శ్రేష్ఠులు. వారికంటె దేవతలు గొప్పవారు. దేవతలకంటె ఇంద్రాది దిక్పాలకులు గొప్పవారు. వారికంటె దక్షుడు మొదలైన మునులు గొప్పవారు. వారికంటె రుద్రుడు, రుద్రునికంటె బ్రహ్మ, బ్రహ్మకంటె విష్ణువు అధికులు. విష్ణువు బ్రాహ్మణులను ఆదరిస్తాడు. అందుచేత మానవులకు బ్రాహ్మణుడే దైవం. ఈ చరాచర ప్రపంచంలో బ్రాహ్మణులకు సాటి అయిన దైవాన్ని నేనెరుగను. బ్రాహ్మణులు భోజనం చేస్తుంటే నాకు కలిగే సంతోషం విధి విహితంగా అగ్నులలో వేల్చే హవిస్సు వల్ల కలుగదు. నా దేహం శుభప్రదమైన పరబ్రహ్మ స్వరూపం, వేదమయం. దీనికి ఆది లేదు. అలాంటి వేదమయమైన నా దేహాన్ని బ్రాహ్మణోత్తములు ధరిస్తారు. సత్త్వగుణం కలిగినవాడు, జితేంద్రియుడు, దయాళువు, సత్యసంధుడు, తపస్వి, సహనశీలి అయిన బ్రాహ్మణుడే మంచి గురువు. అందుచేత నేను పరమభక్తులు, మహానుభావులు అయిన బ్రాహ్మణుల దేహంతో కనిపిస్తూ ఉంటాను. పైన చెప్పిన గుణాలు కలిగిన బ్రాహ్మణులను నా రూపంగా భావించుకొని పూజ చేయడం నన్ను పూజ చేయడమే అవుతుంది” అని మళ్ళీ ఇలా అన్నాడు. ఈ రహస్యం తెలుసుకొని బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులను పూజించే మానవుడు మాయాతీతుడై భూలోకంలోనే మోక్షానికి మార్గాన్ని తెలుసుకుంటాడు.
భరతుని పట్టాభిషేకంబు
ఈ విధంగా సదాచార సంపన్నులైన కుమారులకు లోకాన్ని పాలించడానికి అవసరమైన ఆచారాలను ఋషభుడు ఉపదేశించాడు. మహానుభావుడు, లోకబాంధవుడు అయిన భగవంతుడు ఋషభుని రూపంలో కర్మపరిత్యాగం చేసి శాంత స్వభావులైన మునులకు భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణాలతో పరమహంస ధర్మాలను ఉపదేశించాలని ఉద్దేశించాడు. ఆయన తన నూరుమంది కొడుకులలో పెద్దవాడు, పరమ భాగవతుడు, భాగవతుల పట్ల ఆసక్తి కలవాడు అయిన భరతునికి పట్టంగట్టి రాజ్యభారాన్ని అప్పగించాడు. అనంతరం శరీరమాత్ర సహాయుడై, దిగంబరుడై, చింపిరి జుట్టుతో పిచ్చివానిలాగా ప్రవర్తిస్తూ అగ్నుల్ని తనలో ఆరోపించుకొని బ్రహ్మావర్త దేశాన్ని వదలిపెట్టి వెళ్ళిపోయాడు. జడునిలాగా, చెవిటివానిలాగా, మూగవానిలాగా, పిశాచం ఆవహించిన పిచ్చివానిలాగా అవధూత వేషం ధరించాడు. ఎవరైనా పలకరించినా బదులు చెప్పకుండా మౌనవ్రతం చేపట్టాడు. నగరాలు, గ్రామాలు, పల్లెలు, తోటలు, శిబిరాలు, బిడారాలు, గొల్లపల్లెలు, గొడ్లపాకలు, కొండలు, తపోవనాలు, ఋష్యాశ్రమాలు దాటి పోసాగాడు. వెంటపడే దుండగులు కొడుతున్నా, తిడుతున్నా, రాళ్ళు విసురుతున్నా, దుమ్ము చల్లుతున్నా, తనపై మూత్ర విసర్జన చేసినా, ఉమ్మి వేసినా, కుళ్ళిన వస్తువులను తనపైకి విసరి వేసినా, బూతు కూతలు కూస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా జోరీగలను లెక్కపెట్టని ఏనుగులాగా ముందుకు నడచిపోతున్నాడు. ఏమాత్రం దేహాభిమానం లేకుండా నిశ్చలమైన చిత్తంతో ఏకాకిగా సంచరిస్తున్నాడు. అతని చేతులు, కాళ్ళు, ఉరోభాగం చాలా సుకుమారంగా ఉన్నాయి. భుజాలు, కంఠసీమ, ముఖం మొదలైన అవయవాలు విశాలంగా తీర్చినట్లున్నాయి. అతని రూపం సహజ సుందరంగా ఉంది. పద్మంవంటి ముఖంలో స్వతస్సిద్ధమైన చిరునవ్వులు చిందుతున్నాయి. కొంగ్రొత్త తామ రేకులలాగా చల్లని కనుపాపలు కనిపిస్తున్నాయి. విప్పారిన కళ్ళల్లో ఎఱ్ఱదనం ప్రకాశిస్తున్నది. చెక్కిళ్ళు గాని, చెవులు గాని, మెడభాగం కాని, ముకుపుటాలు గాని ఏమాత్రం లోపం లేకుండా దిద్ది తీర్చినట్లున్నాయి. అతని పెదవుల లోపలి చిరునవ్వు ఇతరులను భ్రమింపజేసేట్లు ఉంది. అటువంటి అతని దివ్య మంగళ విగ్రహం ముద్దుగుమ్మలను మోహంలో ముంచెత్తుతున్నది. ఋషభుని జుట్టు దుమ్ము కొట్టుకొని ధూసరవర్ణం ధరించింది. వెంట్రుకలు జడలు కట్టి గోరోచనం రంగుతో మెరిసి పోతున్నాయి. అటువంటి వేషంలో అతడు ఎవరూ గుర్తుపట్టకుండా తిరుగుతున్నాడు. ఆ ఋషభుడు పిశాచాక్రాంతుడైన వానిలాగా మురికిపట్టిన అవయవాలతో అవధూత వేషంలో సంచరింప సాగాడు. తన యోగవిధానం లోకవిరుద్ధంగా ఉంటుందని ఋషభుడు గ్రహించి ఒకచోట అజగరం లాగా భూమిపై అసహ్యంగా పొరలసాగాడు. ఈ విధంగా జుగుప్స కలిగించే తీరున నేలమీద పడి ఉండి, అన్నం తింటూ, నీళ్ళూ త్రాగుతూ, మల మూత్రాలలో పొరలుతుండేవాడు. అతని మల సుగంధంతో కూడిన వాయువు పది దిక్కులలోను పది ఆమడల దూరం పరిమళిస్తుండేది. భగవదంశ సంభూతుడైన ఋషభుడు వృషభం వలె, మృగం వలె, వాయసం వలె ప్రవర్తిస్తూ మహదానందాన్ని పొందేవాడు. సర్వాంతర్యామి అయిన వాసుదేవుణ్ణి తనలో ప్రత్యక్షంగా దర్శించుకుంటూ యోగసిద్ధుడైనాడు. అపుడు ఆకాశగమనం, మనోవేగం, పరకాయ ప్రవేశం, అంతర్ధానం, దూర దర్శనం, దూర శ్రవణం మొదలైన సిద్ధులు తమంత తాముగా ఋషణుణ్ణి ఆశ్రయించాయి. అయినా ఋషభుడు ఆ సిద్ధులను స్వీకరించలేదు” అని శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు. మునివర్యా! యోగాభ్యాసం వల్ల జ్ఞానం కలుగుతుంది. కర్మలు నశిస్తాయి. అలాంటి మహనీయులకు మహాసిద్ధులు ప్రాప్తిస్తాయి. అయినా తమంత తాము వచ్చిన ఐశ్వర్యాలను ఋషభుడు ఎందుకు స్వీకరించలేదు?” అని (పరీక్షిత్తు) ప్రశ్నించగా శుకుడు ఇలా అన్నాడు. రాజా! నీ వన్నది నిజమే. అడవిలోని మృగాలు వేటగానికి పట్టుబడతాయి. అయినా ఏదో విధంగా వాణ్ణి వంచించి తప్పించికొని బయటపడతాయి. ఇది లోక సహజం. అలాగే ఇంద్రియాలను లొంగదీసుకున్నా మనస్సు మళ్ళీ ఏదో విధంగా విజృంభించి కోరికలకు అవకాశ మిస్తుంది. చాలాకాలం శ్రమపడి సాధించుకున్న తపస్సునైనా మనస్సు హరిస్తుంది. అందుచేత పెద్దలు మనస్సును నమ్మరు. విటులను ఆకర్షించే జారిణిలాగా మనస్సు నిలకడ కోల్పోయి కామక్రోధాదులను ఆహ్వానిస్తుంది. రాజా! కామక్రోధాది అరిషడ్వర్గాలకు, కర్మబంధాలకు మనస్సే కారణం. అందుచేత ఆర్యులు మనస్సును ఎప్పుడూ విశ్వసించరు. రాజా! మనస్సు గతులు తెలిసినవాడు కావడం వల్లనే తమంత తాముగా వచ్చినా సిద్ధులను ఋషభుడు చేపట్టలేదు. లోకాలకు శుభం కోరే వారి అభివందనాలను ఆ మహాత్ముడు అందుకున్నాడు. వేషంలో గాని, మాటల్లో గాని ఋషభుడని గుర్తు పట్టడానికి వీలులేనట్టుగా భగవత్స్వరూపంతో ఋషభుడు వెలిగి పోతున్నాడు. పరమయోగాన్ని ధ్యానించేవారి కందరికీ దేహత్యాగం చేయదగ్గ సమయాన్ని ఋషభుడు సూచిస్తున్నాడు. మహాయోగులలో శ్రేష్ఠుడైనవాడు, మహాత్ములలో అగ్రేసరుడు, సాటిలేని దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు, దేవతలకు గురువైనవాడు, పరమ పురుషుడు అయిన ఋషభుడు శరీరం విడవడానికి నిశ్చయించాడు.
ఆ తరువాత పరమహంస, భగవంతుడు అయిన ఋషభుడు మనసులో దేహాభిమానాన్ని వదలుకొని, కుమ్మరిసారె కుమ్మరివానిచే త్రిప్పబడి విడువబడ్డ తర్వాత కూడా అది కొంతసేపు తిరుగుతున్నట్లే పూర్వ సంస్కార విశేషం వల్ల ఆయన దేహ సంచలనం పూర్తిగా ఆగిపోదు. ఋషభుడు లింగ శరీరాన్ని వదలిపెట్టినా యోగమాయా వాసనల కారణంగా లౌకికంగా దేహధారిగా చరించాడు. అతడు ఒకరోజు కోంకణ, వంగ, పట, కుటకాలు అనే దక్షిణ కర్ణాట దేశానికి అప్రయత్నంగా వెళ్ళి కుటక పర్వత సమీపంలోని ఉపవనం చేరుకున్నాడు. అక్కడ శిలాఖండాలను నోటిలో పెట్టుకొంటూ పిచ్చివానిలాగా చెదరిన జుట్టుతో దిగంబరుడై సంచరించాడు. అప్పుడు వీచిన సుడిగాలి విసురుకు వెదురుకఱ్ఱలు రాపిడి చెంది భయంకరమైన కార్చిచ్చు రేగింది. ఆ మంటలలో ఋషభుడు కాలిపోయాడు. ఋషభుని చేతలను ఆ ప్రాంతంవారు చెప్పుకోగా అర్హతుడు అనే పేరుగల ఆ రాష్ట్రాధికారి విని, స్వధర్మం వదలిపెట్టి స్వదేశస్థులతో ఆ ఆచారానికి ఆమోదం తెలిపాడు. అధర్మ బహుళమైన కలియుగంలో భవిష్యత్తుకు లోబడిపోయి తన రాష్ట్రంలోని మానవులను అయోగ్యమైన వేద బాహ్యమతం పట్ల మొగ్గేటట్లు చేసాడు. కలియుగంలో అధములైన మానవులు దేవమాయవల్ల మోహితులై శాస్త్రాలలో చెప్పబడ్డ శౌచాలను, ఆచారాలను వదలిపెట్టి తమకు ఇష్టం వచ్చినట్లు దేవతలను పరిహసిస్తారు. స్నానం, ఆచమనం చేయకపోవడం, జుట్టు కొరిగించుకొంటారు. అపవిత్ర వ్రతాలను చేస్తారు. అధర్మాలు పెచ్చు పెరిగిన కలియుగంలో బుద్ధి, ధర్మం చెడిపోగా వేదాలను, బ్రహ్మణులను, యజ్ఞపురుషులను నిందిస్తూ, తమతమ మతాలకు తామే సంతోషిస్తూ, వేదవిరుద్ధంగా ఇష్టానుసారం ప్రవర్తిస్తూ, అంద విశ్వాసాలకు లొంగి తమంత తామే గుడ్డి చీకటిలో పడుతూ ఉంటారు. రజోగుణంతో నిండిన మానవులకు మోక్షమార్గాన్ని ఉపదేశించడం కోసమే ఋషభుని అవతారం. సప్త సముద్రాలచేత చుట్టుముట్టబడిన ద్వీపాలలోని, వర్షాలలోని జనులు ఎవని దివ్యమైన అవతార లీలలను కీర్తిస్తారో, ఎవడు ఎంతో కీర్తి గడించిన ప్రియవ్ఱ్ఱతుని వంశంలో జన్మించాడో, ఎవడు లోకాలకు ఆది అయిన పురాణపురుషుడో అటువంటి ఋషభ దేవుడు భూలోకంలో అవతరించి కర్మ సంబంధం లేని మోక్ష ధర్మాన్ని ప్రబోధించాడు. యోగమాయవల్ల తమకు తామై లభించిన అసత్యాలైన సిద్ధులను తిరస్కరించాడు. అటువంటి ఋషభునికి సిద్ధులకోసం ప్రయత్నించే యోగీశ్వరులు ఏ విధంగా సాటి అవుతారు? అన్ని వేదాలకు, అన్ని లోకాలకు, సమస్త దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పరమ గురువు, భగవంతుడు అయినవాడు ఋషభుడు. ఆయన చరిత్రం వింటే దుశ్చరిత్రుల పాపం తొలగిపోతుంది. శుభాలు చేకూరుతాయి. ఎవరయితే ఋషభుని చరిత్రను మిక్కిలి శ్రద్ధతో వింటారో, ఎవరు ఇతరులకు వినిపిస్తారో వారికి సుదృఢమైన భక్తి లభిస్తుంది. అటువంటి హరిభక్తి పట్ల తత్పరత కలిగిన పెద్దలైన భాగవతులు హరి కృపవల్ల ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలను సాధించుకుంటారు. నానావిధ పాపకారణమైన సంసార తాపాన్ని పోగొట్టుకుంటారు. హరిభక్తి యోగమనే అమృతస్నానం చేసి పునీతులౌతారు. పరమ పురుషార్థమైన మోక్షాన్ని సిద్ధింపజేసుకుంటారు. ఈ విధంగా సప్తద్వీపాలలోని జనులు నేడుకూడా ఋషభుని మహిమను పొగడుతుంటారు. యాదవులకు, మీకు కులగురువైన శ్రీకృష్ణుడు అన్నిచోట్ల ఉన్నాడు. కొలిచేవారికి అతడు సులభుడై తప్పక మోక్షం ప్రసాదిస్తాడు. నీకెందుకు చింత? ఋషభుడు నిత్యానుభూత అయిన స్వస్వరూప లాభంవల్ల తృష్ణను నివారింపజేశాడు. యోగమాయా ప్రాప్తాలైన మహాసిద్ధుల చేత ఆయన బుద్ధి ఆకర్షింపబడలేదు. ఆ మహానుభావుడు లోకులందరినీ కనికరించి అభయ మిచ్చాడు. నిత్యమైనది, దివ్యమైనది, ఆనంద ప్రదమైనది, సేవింప దగినది, సాటిలేనిది అయిన వైకుంఠ లోకాన్ని అందింపగల మోక్షమార్గాన్ని అందరికీ ఉపదేశించాడు. ఆ తరువాత దేహాన్ని వదలి జనులంతా ఆశ్చర్యపడేటట్లు విష్ణువులో తాదాత్మ్యం పొందాడు. ఋషభుడు సామాన్యుడు కాడు. ఆయన సాక్షాత్తుగా విష్ణువు. రాజా! భరతుడు భూమండలాన్ని దీక్షతో పరిపాలించసాగాడు. రాజులలో చంద్రుని వంటివాడైన విశ్వరూపుడనే రాజుకు పంచజని అనే కుమార్తె ఉంది. గొప్పకాంతితో విలసిల్లే ఆ పంచజనిని భరతుడు కోరి శుభలగ్నంలో పెళ్ళి చేసుకున్నాడు. అహంకారానికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనబడే పంచతన్మాత్రలు పుట్టినట్లు భరతునికి పంచజని వలన సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రకేతువు అనే అయిదుగురు కొడుకులు పుట్టారు. అంతకుముందు అజనాభం అనే పేరుతో పిలువబడిన భూభాగం భరతుడు పాలించడం వల్ల భరతవర్షం అనే పేరును పొందింది. రాజా! భరతుడు తన పూర్వులు పాలించిన విధంగానే శ్రీహరి అనుగ్రహంతో బ్రాహ్మణోత్తములు పొగిడే విధంగా సత్కర్మలు ఆచరిస్తూ ప్రజలను పరిపాలించాడు. భరతుడు లోకాలను భరించే భగవంతుణ్ణి చిన్నవి, పెద్దవి అయిన యజ్ఞాలతో ఆరాధించాడు. అమావాస్య పూర్ణిమలలో చేసే సత్కర్మలను, చాతుర్మాస్యల కాలంలో చేసే అగ్నిహోత్రాదులను ఆచరించాడు. ఇంకా పశుయాగాలను, సోమయాగాలను నిర్వర్తించాడు. వేదోక్తంగా నిర్వహించిన ఆ సత్కర్మల ఫలాన్ని పరమేశ్వరార్పణం చేసాడు. యాగాలలోను, మంత్రాలలోను పలికే దేవతలను వాసుదేవుని అవయవాలుగా భావించాడు. ఆ మహారాజు భగవంతుని గొప్పతనాన్ని తలచుకుంటూ భక్తిమయమైన హృదయంతో శ్రద్ధతో సమస్త రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ విధంగా పరిశుద్ధమైన చిత్తంతో, ధర్మదీక్షతో, తాను చేస్తున్న కర్మలు ఫలించే విధంగా రాకుమారుడైన భరతుడు భూమిని పాలించాడు.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏