22, నవంబర్ 2020, ఆదివారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఇద్దరు మిత్రులు..*


"ప్రతి పది పదిహేను రోజులకొకసారన్నా ఇక్కడకు వచ్చి, శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకోకపోతే ఏదోలా ఉంటుంది.." అనేవారు శ్రీ రమణయ్య గారు మాతో..వారిది నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామం..ప్రతి నెలలో రెండుసార్లు మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి  ఖచ్చితంగా వచ్చేవారు..ఎప్పుడూ ముఖం లో చెదరని చిరునవ్వు తో వుండేవారు..అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు..


రమణయ్య గారు చిన్నప్పుడు ఐదవ తరగతి దాకా.. శ్రీ స్వామివారితో కలిసి చదువుకున్నారు.. శ్రీ స్వామివారు చదువు ఆపేసి, మోక్షగామి గా మారి సాధన చేయడం మొదలుపెట్టారు..ఆనాటి నుంచే, రమణయ్య గారు, శ్రీ స్వామివారిని ఆరాధించడం ప్రారంభించారు..శ్రీ స్వామివారు ఆశ్రమం నిర్మించుకొని..కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన తరువాత..రమణయ్య గారు మొగలిచెర్ల కు వచ్చి, శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్ళసాగారు..అన్నదానానికి బియ్యం తీసుకొచ్చి ఇచ్చి వెళ్లేవారు..శ్రీ స్వామివారి సమాధి వద్ద నిశ్చలంగా నిలబడి..భక్తి పూర్వకంగా నమస్కారం చేసుకునేవారు..


"మొదటినుంచీ స్వామిది ఒక విలక్షణ జీవనం..నిరంతరమూ తనలో తాను ఏదో ఆలోచిస్తూ వుండేవాడు..లేదా ఒక ప్రక్కకు వెళ్ళిపోయి, ప్రపంచంతో సంబంధం లేకుండా ధ్యానం చేసుకునేవాడు..మాతోటి కూడా ఆటలాడటం లాంటివి కూడా చేసేవాడు కాదు..అతని లోకం అతనిది..ఆ మహానుభావుడి తో కలిసి కొన్నాళ్ళు గడిపాను..ఈ జీవితానికి అది చాలు..నాకు ఏ కోరికలూ లేవు..నడుస్తూ ఉన్నప్పుడే..మంచాన పడకుండా..ఈ బొందిలోని ప్రాణం పోతే చాలు.." అని రమణయ్య గారు చెపుతూ ఉండేవారు..శ్రీ స్వామివారిని మనసా వాచా కర్మణా ఆరాధించారు..రమణయ్య గారు కోరుకున్న విధంగానే ఎటువంటి ఇబ్బందీ పడకుండా కన్నుమూశారు..


శ్రీ స్వామివారికి ఆశ్రమాన్ని నిర్మించి ఇచ్చిన శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారి బావమరిది శ్రీ గోనుగుంట రామయ్య శ్రేష్టి గారు కూడా శ్రీ స్వామివారిని భక్తి గా కొలిచేవారు.. రామయ్య శ్రేష్టి గారి అల్లుడు వీరాస్వామి..వీరాస్వామి నెల్లూరు జిల్లా వింజమూరు లో వుండేవారు..వీరాస్వామి గారు కూడా శ్రీ స్వామివారి తో కలిసి, చిన్నతనంలో కొన్నాళ్ళు చదుకున్నవారే..ఎప్పుడూ చిరాకుగా..కోపంతో ధుమ ధుమ లాడుతూ..ఎవరో ఒకరిని తిట్టుకుంటూ వుండేవారు..వీరాస్వామి నవ్వుతూ మాట్లాడటం చూసిన వాళ్ళు బహు అరుదు..


"మీరు వెఱ్ఱివాళ్ళు కనుక..ఆయన్ను స్వామీ స్వామీ అంటూ కొలుస్తున్నారు..అంత ఆస్తి పెట్టుకొని అనుభవించకుండా దేవుడు, మోక్షం అంటూ గాలికి తిరగడం..కట్టుకున్న బట్టలు కూడా విప్పేసి..సాధన చేయడం..ఏమిటీ తలతిక్క పనులు?..అందుకే నేను ఏనాడూ  మొగలిచెర్ల లోని ఆశ్రమానికి  రాలేదు..చిన్నప్పుడు రెండు మూడు సార్లు "ఇవన్నీ మానుకోరా..హాయిగా మాలాగా వుండు!" అని చెప్పి చూసాను..వినలేదు..వాడి ఖర్మ!..అంతే.." అని శ్రీ స్వామివారి గురించి చెప్పేవారు..


"ఆధ్యాత్మికంగా ఎందరికో శ్రీ స్వామివారు మార్గం చూపారు..ఎందరో వారి వారి సమస్యలు తీరిపోయాయని..సంతానం లేని వారికి శ్రీ స్వామివారికి మ్రొక్కుకుంటే సంతానం కలిగిందనీ..తమకున్న గ్రహబాధలు తొలగిపోయాయనీ..చెప్పుకుంటున్నారు.. ఇంతమంది నమ్ముతున్న ఆ అవధూతను..మీరు పిచ్చివాడిగా భావిస్తున్నారా?.." అని అడిగితే.."మీకూ పిచ్చి కనుక..అతనికి మొక్కుతున్నారు.." అనేవారు వీరాస్వామి..


వీరాస్వామి ఏనాడూ శ్రీ స్వామివారిని అవధూతగా పరిగణించలేదు..పైగా తీవ్రంగా విమర్శించేవారు....శ్రీ స్వామివారిని నిరంతరమూ ద్వేషిస్తూనే తలచుకుంటూ ఉండటం వీరాస్వామికి అలవాటుగా మారిపోయింది..వీరాస్వామి కి నలభై ఐదు ఏళ్ల వయసు వచ్చేసరికి మధుమేహ వ్యాధి ముదిరిపోయి కళ్ళు కనబడటం మానేసాయి..ఎందరో కంటి వైద్యులకు చూపారు..ఫలితం లేదు..మరో ఆరు నెలల కల్లా..పూర్తి అంధుడి గా మారిపోయారు..


"కనీసం ఇప్పుడన్నా శ్రీ స్వామివారిని ద్వేషించడం మానుకోమని" నాతో సహా అతని బంధువర్గమంతా చెప్పిచూసాము..వీరాస్వామి మారలేదు.. తరువాత కొన్నాళ్ళకు..అంధత్వం తో పాటు అనారోగ్యం తో తీవ్రంగా  ఇబ్బంది పడి మరణించారు..


రమణయ్య గారు, వీరాస్వామి..ఇద్దరూ శ్రీ స్వామివారి మిత్రులే..కానీ..శ్రీ స్వామివారి పట్ల  ఒక్కొక్కరిదీ ఒక్కో దృక్పథం.. వారి వారి ఆలోచనల ప్రకారమే వారి జీవనయానం సాగింది..ఎవరికి ఏది ప్రాప్తమో దానినే దైవం అనుగ్రహిస్తాడు..


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: