22, నవంబర్ 2020, ఆదివారం

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


136 - ఉద్యోగపర్వం.


శ్రీకృష్ణుడు భగవంతుడు అని తెలిసికూడా ' కేవలం అతడు అర్జునునికి సఖుడైన కారణంగా అతనిని శరణువేడను, ' అని చెప్పిన దుర్యోధనునితో గాంధారి యీవిధంగా అంటున్నది. :


' ఓరీ బాలకా !  దుష్టబుద్దితో, ఐశ్వర్యమనే మోహంలోపడి, అదే జీవితంగా అనుకుంటూ, పెద్దలమాటను పెడచెవిని పెడుతున్నావు.   నీబాల్యం నుండీ నీవు నీ మిత్రులకు ఆనందాన్ని, మాకు దుఃఖాన్ని కలిగిస్తూనే వున్నావు.  నీ సోదరుడైన భీమసేనుని చేతిలో నీవు చావుదెబ్బలు తిని చనిపోయేటప్పుడు, నీ తండ్రి వచనాలు నీకు గుర్తుకువస్తాయి.  '  అని యెంతో  శోకతప్త హృదయంతో ఆ మాతృమూర్తి ఘోషించింది.


ఆసమయంలో యిదంతా చూస్తున్న వ్యాసభగవానుడు, ధృతరాష్ట్రునితో, ' నాయనా !  నీకు యీ జరుగుతున్న విషయాలు అనవసరం.  ముందుగా, నీవు శ్రీకృష్ణునికి ఆప్తుడవు.  అది దృష్టిలో పెట్టుకుని, సంజయుని సహాయంతో, ఉత్తమమార్గంలో నడువు.  సంజయుడు శ్రీకృష్ణుని వైశిష్యము గురించి బాగా తెలిసినవాడు.  అతని మాటలను ఏకాగ్రచిత్తంతో విను.    క్రోధము, సంతోషము అనే విషయాలతో చుట్టుముట్టిన ఆలోచనలతో వున్న జీవులు, తమకు వున్నదానితో, తృప్తిచెందక, ఐహికసుఖాలనే కోరుకుంటూ వుంటారు.  ఆవిధంగాచేసిన తప్పులని మళ్లీమళ్ళీచేస్తూ, భూమికీ, యమపురికి మధ్య తిరుగుతూనే వుంటారు.  (అనగా పునరపి జననం,పునరపి మరణం అని. )  మరికొందరు,  జ్ఞానమార్గంలో, పరమాత్మను అన్నింటా దర్శించి, మహాత్ముల మార్గంలో, ముముక్షత్వం పొందుతారు.  ఐహికసుఖాలకొరకై వెంపర్లాడరు.  మృత్యుపాశం వారినేమీ చేయజాలదు. '  అని చెప్పాడు.


వెంటనే ధృతరాష్ట్రుడు, ' సంజయా !  ఆ హృషీకేశుని చేరడానికి, భయంలేని మార్గం నాకు తెలియజేయి.' అని కోరాడు.   సంజయుడు ఆమార్గం గురించి సవిస్తరంగా తెలియజేస్తున్నాడు : '  రాజా ! ఆత్మతత్వము గ్రహించాలంటే,  మనసును నిగ్రహించే ఓర్పు వుండాలి.  ఇంద్రియనిగ్రహం లేనివాడు, జ్ఞానమార్గంలో సంచరించలేడు. తదుపరి అహింసామార్గం.  కోరికలు త్యజించి,  మనసులో కూడా యెవరికీ హాని తలబెట్టకుండా వుండడం.  కాబట్టి మహారాజా !  ఈక్షణం నుండే, ఇంద్రియాలను నిగ్రహించుకుని,యేకోరికలూ లేకుండా,  తత్వజ్ఞానం పొందే ప్రయత్నం చెయ్యి. నీకు శుభమగుగాక ! '   అని చెప్పాడు.     


భగవద్భావన,  ముముక్షత్వ  సాధనాలను గురించి తెలుసుకున్న ధృతరాష్ట్రుడు, ' సంజయా ! శ్రీకృష్ణుని దివ్యనామాలను గురించికూడా చెప్పు. వానిని మననం చేసుకుంటూ,  ఆపురుషోత్తముని సన్నిధికే చేరుకుంటాను. ' అన్నాడు.   ' రాజా !  నాకు తెలిసినంతలోచెబుతాను.   అని ఈ విధంగా చెప్పసాగాడు, సంజయుడు : 


1 . సర్వప్రాణులలో వసించేవాడు కాబట్టి ' వసు ' అనీ,  దేవతలకు మూలస్థానం కాబట్టి దేవుడనీ ప్రార్ధింపబడుతూ, ' వాసుదేవ ' నామంతో ప్రసిద్దుడయ్యాడు.  

2 . అంతటా వ్యాపించివున్నాడు కనుక ' విష్ణువు. '

3 .  మౌనము, ధ్యానము, యోగము, ద్వారా శ్రీకృష్ణ  అనుగ్రహం ప్రాప్తిస్తుంది గనుక 

' మాధవుడు ' అయ్యాడు.

4 . అన్ని తత్వాలను తనలో యిముడ్చుకున్నవాడు కాబట్టి ' మధుహుడు' ,

 ' మధుసూదనుడు ' అని పిలుస్తారు.

5 . కృషి అనగా స్థిరంగా ణ అనగా ఆనందంగా వుండేవాడు, వుంచేవాడూ కనుక ' కృష్ణుడు ' అయ్యాడు.

6 .  పుండరీకమనే నాశంలేని ఉతృష్టమైన స్థానంలో స్థిరంగా వుండేవాడు, కాబట్టి

' పుండరీకాక్షుడు '  అయినాడు.   

7. దుష్టులను దండించేవాడు కనుక ' జనార్ధనుడు ' గ  పిలవబడ్డాడు.

8 .  సత్యమును వీడని వాడు కనుక సాత్వతుడు.

9 . ఆర్శజ్ఞానం వలన శోభించేవాడు గనుక ' వృషభేక్షణుడు'.

10 . పుట్టుకలేని వాడు గనుక ' అజుడు ' అని పిలవబడ్డాడు. 

11 .  స్వప్రకాశకుడు గనుక అనేకజిత్తు.

12 . దమము తో  వుండేవాడు గనుక  దామోదరుడు.

13 . హర్షము, సుఖము, ఐశ్వర్యము వున్నవాడు గనుక ' హృషీకేశుడు '. 

14 . భూమ్యాకాశాలను ఒడిసిపట్టగల బాహువులు కలవాడు గనుక ' మహాబాహుడు '

15 .  క్రిందవైపు యెన్నడూ పడడు గనుక, ' అధోక్షజుడు ' . 

16 . నరులకు, జీవులకు ఆశ్రయమైనవాడు గనుక  ' నారాయణుడు '

17 .  అన్నింటిలో వుండి, పూర్ణభావం కలిగించేవాడు, సత్యాసత్యముల యొక్క స్థితికి మూలమైనవాడు,  గనుక ' పురుషోత్తముడు '.

18 .  అందరకూ జ్ఞానం ప్రసాదించేవాడు కావున, ' సర్వుడు '.


    సత్యే ప్రతిష్ఠత: కృష్ణ సత్యమాత్ర ప్రతిష్ఠితం 

    సత్యాత్ సత్యం తు గోవింద స్తస్మా త్సతయో>పి నామత :

19 .  శ్రీకృష్ణుడు సత్యము నందు వున్నాడు.  అతనితోనే సత్యము వున్నది. అతడు సత్యమనే దానికన్నా మించినవాడు. అందుచేత ' సత్య ' నామంతో కూడా పిలుస్తారు.


    విష్ణుర్విక్రమణా ద్దేవో జయనా జిష్ణు రుచ్యతే 

    శాశ్వతత్వా దనన్తశ్చ గోవిందో వేదనాద్గవాం.


20 .  అన్నింటిని ఆక్రమించినవాడు ' విష్ణువు.' 21 .  అన్నింటినీ జయించినవాడు ' జిష్ణువు '   22 .  శాశ్వతుడు కాబట్టి ' అనంతుడు '.  23 .  గోవులను కాపాడేవాడు గనుక  ' గోవిందుడు '.


' మహారాజా !  ఆవిధంగా శ్రీకృష్ణుడు ధర్మానికి ప్రతి రూపంగా శోభిస్తున్నాడు.  పై నామాలలో అంతా అయన స్వరూపమే.  త్వరలో శ్రీకృష్ణుడు మనలను అనుగ్రహించ డానికి యిక్కడకు వస్తున్నాడు ' అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. 


' సంజయా ! అట్టి ప్రకాశవంతమైన స్వరూపుడు శ్రీకృష్ణుని చూసే భాగ్యం కన్నులున్నవారికే కదా లభిస్తుంది.  నాకు కూడా ఆ భాగ్యం కలిగితే బాగుండు. '  అని మనసులోని మాట సంజయునితో అన్నాడు.   సంజయుడు చిరునవ్వు నవ్వి '  ఎవరి భాగ్యమెట్లున్నదో ! ' అని వూరుకున్నాడు.


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏


**ధర్మము-సంస్కృతి**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: