4, నవంబర్ 2024, సోమవారం

పాండురంగ మాహాత్మ్యం

 


శ్రీభారత్ వీక్షకులకు కార్తిక మాస శుభాకాంక్షలు 🌹 తెలుగు సాహిత్యం ఎంత గొప్పదో తెలిపే మరో గొప్ప కావ్యం పాండురంగ మాహాత్మ్యం. తెనాలి రామకృష్ణుని వికటకవి అంటారు కానీ ఆయన గొప్ప విలక్షణ కవి అంటారు ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వేణు గారు. వెయ్యేళ్ల తెలుగు సాహిత్యాన్ని అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు మనకు సీరియల్ గా అందిస్తూ ఈ ఎపిసోడ్ లో తెనాలి రామకృష్ణ గురించి రసరమ్యంగా వివరించారు. నిగమ శర్మ, అతడి అక్క గురించిన అధ్యాయం ఎంత చక్కగా వేణు గారు విరించారో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

పంచ మహా యజ్ఞాలంటే

 *`పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?`*


ఇవి ఋత్విక్కులు చేసేయజ్ఞాలు కాదండీ. శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తీ అను నిత్యం పాటించ వలసిన విధులు. అవి ఏమిటి?


*`1. దేవ యజ్ఞం`*


పూర్వం నిత్యాగ్నిహోత్రులు వుండేవారు.

వారు తాము భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు. దీనికి ఆహుతం అని పేరు. అలాకాక ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించినా ఆహుతం చేసినట్లే. సృష్టికి మూలకారకుడైన దేవదేవుని నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దీని ముఖ్యోద్దేశ్యం.


*`2. పితృ యజ్ఞం`*


మనల్ని కని పెంచి ఇంత వారిని చేసిన తల్లితండ్రలను ప్రేమగా చూడాలి. చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, మన అవసరాలెలా తీర్చారో, అలాగే వారి పెద్ద వయసులో వారిని కనిపెట్టుకుని వుండాలి. ఇలా వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలం. ఇది పితృ యజ్ఞం.


*`3. భూత యజ్ఞం`*


గృహస్తు సర్వప్రాణికోటిమీద దయ కలిగి పుండాలి. పశు పక్షులు, క్రిమి, కీటకాదులు మానవుడి మీద ఆధార పడి వున్నాయి. అందుకే మనిషికి భూతదయ వుండాలి. అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్షుల కోసం బయట (పక్షులు వచ్చే ప్రదేశంలోపెట్టాలి. ఇంటి ముందు కుక్కకి, ఇంట్లో పిల్లికి అన్నం పెట్టాలి. ఇంట్లో పశువులు వుంటే వాటికి పెట్టాలి. క్రిమి కీటకాల కోసం కొంచెం అన్నం (తినక ముందు) పక్కన పెట్టాలి. (మన పెద్దలు వీటిని పాటించటం మీలో కొందరయినా చూసే వుంటారు). జలాశయాలలో జలచరాలకు కూడా ఆహారం వెయ్యాలి. సర్వ ప్రాణులయందూ దయ కలిగి వుండి ప్రతి నిత్యం కనీసం ఏదో ఒక దానికన్నా ఆహారం ఇవ్వాలి.


*`4. మనుష్య యజ్ఞం`*


మన పెద్దలు అతిధి దేవో భవ అన్నారు.


అప్పటివారు ఆతిధ్యం కోరి వచ్చినవారు తమకు తెలియనివారయినా వారిని ఆదరించి సత్కరించేవారు. రోజులు మారినాయి. అయినా ఇంటికొచ్చినవారిని మన కులం వారా, మన మతం వారా మన కేవిషయంలో నైనా పనికి వస్తారా లేదా వగైరాలాలోచించకుండా వారు వచ్చిన సమయాన్నిబట్టి తగు విధంగా గౌరవించాలి. తోటి వారి పట్ల దయ కలిగి వుండాలి. అందరితో సఖ్యంగా వుండాలి. ఎవరైనా సహాయం కోరితే, మనం చెయ్యగలిగితే నిస్వార్ధంగా చెయ్యాలి.


*`5. బ్రహ్మ యజ్ఞం`*


ప్రతి వారూ, ప్రతి రోజూ వేద మంత్రాలు కానీ శాస్త్రిలని కానీ చదవాలి. ఇప్పుడు వేద మంత్రాలు చదివే వారి సంఖ్య తక్కువగానీ ప్రతి వారూ ఎవరికి వీలయిన, ఎవరికి ఆసక్తి వున్న, ఎవరికి అనుకూలంగా వున్న శాస్త్రాలను చదవాలి. ప్రతి రోజూ కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి

చూపించాలి. అంతేకాదు. తను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి. ప్రతి మనిషికీ భగవంతుని పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భూత దయ, తోటి మనిషులతో కలిసి వుండే మనస్తత్వం,

శాస్త్రం తెలుసుకుని నలుగురితో పంచుకునే జిజ్ఞాస వున్నాయనుకోండి. ఈ ప్రపంచం ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.


మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచ యజ్ఞాలను నిర్దేసించారు మన పెద్దలు.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - కార్తీక మాసం - శుక్ల పక్షం  - ప్రతిపత్ - విశాఖ -‌‌ స్థిర వాసరే* (02.11.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మహిమాన్వితమైన మాసం "కార్తికమాసం

 కార్తిక మాసం.                          స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం "కార్తికమాసం'. చాంద్రమానం ప్రకారం కార్తికమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి "కార్తికమాసం" అని పేరు వచ్చింది.



కార్తికమాసంలో ఆచరించాల్సిన విధులు.


కార్తిక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను. నెలంతా కార్తిక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను. శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను. ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను. ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను. ఈ మాసంలో కార్తిక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.

కార్తీక మాసంలో పండుగలు

శుక్లపక్ష విదియ : భాతృ ద్వితీయ

దీనికే యమద్వితీయ, భగినీహస్త భోజనం అని పేర్లు, ఈ దినం పురుషులు సొంత ఇంటిలో భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలోగాని, లేదంటే సోదరితో సమానమైనవారి ఇంట భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరకలోకభయం తొలగిపోతాయి. అంతే కాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటూందని శాస్త్రవచనం.

శుక్లపక్ష చవితి " నాగుల చవితి

కార్తిక శుక్లపక్ష చవితినాడు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నాగులచవితి పర్వదినం జరుపుకుంటారు.

శుక్లపక్ష ఏకాదశి : ప్రబోధన ఏకాదశి

ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషశయ్యపై శయనించి, యోగనిద్రలో గడిపిన శ్రీమహావిష్ణువు ఈ దినం నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి 'ఉత్థాన ఏకాదశీ లేదా 'ప్రబోధన ఏకాదశి ' అని పేర్లు. ఈ దినం ఉపవాస వ్రతం పాటించి శ్రీమహావిష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరిరోజు.


శుక్లపక్ష ద్వాదశి: క్షీరాబ్ది ద్వాదశి

పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసింది ఈ రోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి ,చిలుకుద్వాదశి అని పేర్లు. శ్రీమహాలక్ష్మిని శ్రిమహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే ఈ రోజు ఇంటి యందున్న తులసికోట వద్ద శ్రీమహావిష్ణువును లక్ష్మీసమానురాలైన తులసిని పూజించవలెను.


శుక్లపక్ష చతుర్దశి : వైకుంఠ చతుర్ధశి

వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు ఈ దినం వైకుంఠంను వదిలి వారణాసి వెళ్ళి పరమశివుడిని పూజించినట్లు కథనం. ఈ నాడు శైవాలయాలకు వెళ్ళి దీపం వెలిగించవలెను


శుక్లపక్ష పూర్ణిమ :

ఈ దినం శివాలయాల్లో నిర్వహించే 'జ్వాలాతోరణం ' ను దర్శించడం మంచిది. సాయంత్రం సమయంలో శివాలయంలోగానీ, వైష్ణవాలయంలోగానీ దీపాలను వెలిగించవలెను. ఈ దినం శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం, మార్కండేయ పురాణం దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది.


కృష్ణపక్ష చవితి : కరక చతుర్ధి

ఇది వినాయకుడుకి సంబంధించినది. ఈ వ్రతం మహిళలు చేయడం మంచిది.

వృశ్చిక సంక్రమణం

ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు ఈరోజు తులారాశి నుండి ఎనిమిదవ రాశి అయిన వృశ్చికరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా సంక్రమణ స్నానాలు, పూజలు, జపాలు, దానాలు , దేవాలయ సందర్శనలు చేయడం వల్ల సర్వవిధాలా శుభఫలితాలను ఇస్తుంది. 


కార్తికమాసంలో విధులను పాటించడం ద్వారా ఆధ్యాత్మిక పరమైన ఫలాలను పొందడమే కాకుండా మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల కొత్తగా తలెత్తుతూ ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందవచ్చు..

కార్తీక పురాణం 1

 *కార్తీక పురాణం ప్రారంభం*


*కార్తీకపురాణం 1 అధ్యాయం*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*కార్తీక మాసం విశేషం*


 ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… ”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను, వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..” అని కోరారు.


శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… ”ఓ పునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి” అని చెప్పసాగాడు.


పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో ”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి, మానవులంతా కులమత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి” అని కోరింది.


అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు ”దేవీ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….” అని ఆ దిశగా చూపించాడు.


మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి, ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు ”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి?” అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు ”జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన, సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను” అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.


దీనికి జనకుడు ”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ, ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనమేమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా?” అని ప్రార్థించారు.


వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి ”రాజ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….” అని చెప్పసాగాడు.


*కార్తీక వ్రతవిధానం*


”ఓ జనక మహారాజా! ఎవరైనా, ఏ వయసువారైనా పేద-ధనిక, తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మాలు, దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి” అని వివరించారు.


వ్రతవిధానం గురించి చెబుతూ… ”ఓ రాజా! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, నదికిపోయి, స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారయణ, పరమేశ్వరులకు, బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి, సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి, పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరీ, తుంగభద్ర, యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని, శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి, నిత్యధూప, దీప, నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి, భగవంతునికి సమర్పించి, తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి, వారికి ప్రసాదం పెట్టి, తన ఇంటివద్దగానీ, దేవాలయంలోగానీ, రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి.


ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి, విశాలయంలోగానీ, విష్ణు ఆలయంలోగానీ, తులసికోట వద్దగానీ, దీపారాధన చేసి, శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి, స్వామికి నివేదించాలి. అందరికీ పంచి, తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గతంలో, గతజన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.


ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం. మొదటిరోజు పారాయణం సమాప్తం.

సంస్కృతి

 🔔 *మన సంస్కృతి* 🔔


★ *ఉగాది:-* కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.


★ *శ్రీరామ నవమి:-* భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.


★ *అక్షయ తృతీయ:-* విలువైన వాటిని  కూడబెట్టుకోమని.


★ *వ్యాస (గురు) పౌర్ణమి:-* జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.


★ *నాగుల చవితి:-* ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.


★ *వరలక్ష్మి వ్రతం:-*  నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.


★ *రాఖీ పౌర్ణమి:-* తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.


★ *వినాయక చవితి (నవరాత్రులు):-* ఊరంతా ఒక్కటిగా కలవడానికి.


★ *పితృ అమావాస్య:-* చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.


★ *దసరా (ఆయుధ పూజ):-* ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.


★ *దీపావళి:-* పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.


★ *కార్తీక పౌర్ణమి:-* చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.


★ *సంక్రాంతి:-*  మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం,  అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.


★ *మహాశివరాత్రి:-* కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.


★ *హోలీ:-* వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.


ఆధ్యాత్మికం 🙏🏻: https://www.youtube.com/playlist?list=PLop7xw7dpnht5jX2Vs0WknVTBfO6w98yz


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻