*నా రమణాశ్రమ జీవితం*
*శ్రీమతి సూరి నాగమ్మగారు*
*Chapter - 15*
*ఓం నమో భగవతే శ్రీరమణాయ* 🙏
**విచిత్ర సంఘటనలు - 2*
రెండు రోజులు సినిమా చూసేసరికి ఆశ్రమమంతా అల్లకల్లోలమయింది. టౌనులోని అల్లరిమూకను లోపలికి రానీయలేదని వాళ్ళు డైనింగు (భోజన)హాలు పైకి రాళ్ళు రువ్వారు. అంతటితో ఆశ్రమ నిర్వాహకులతో కొందరు ఈ సినిమాలు మాన్పించక తప్పదని సర్వాధికారితో చెప్పారు. వారు ఫిల్మువారితో ఇక ఆపవలసిందే, 15 ఫిల్ములు మోసి తెచ్చామే. మీ సమ్మతితోనే తెచ్చాము గదా? చూపుతామంటారు వారు; కూడదంటారు వీరు. ఉభయులకూ వివాదం బయలుదేరింది. నాల్గవనాటి మధ్యాహ్నం 3 గంటల వేళ భగవాన్ హాలుకు ఉత్తర వైపునవున్న మైదానంలో ఈ వివాదం జరుగుతుంటే రాజగోపాలయ్యరు అదంతా విని వచ్చి భగవాన్‌తో మనవి చేస్తూ వుండగా మురగన్ అందుకొని ''అవును. ఋష్యాశ్రమంలో సినిమాలంటె హాస్యాస్పదంగా వుండదా? భగవాన్ కి ఏది చూచినా బాధాకరంగా లేదు గాని సాధకుల కిది బాధాకరంగా గాదా? ఆపకుంటె వీలులేదు'' అన్నారు.
భగవాన్ అందుకొని ''ఆ-అదే-అదే. అసలు ముందే ఈ సినిమా లెందుకర్రా. వద్దు. అన్నా నేను. 'కాదు, భగవానుకు చూపాలి' అని తెచ్చారు. సరే, పోనీ, ఏదో సరదా పడుతున్నారు గదా అని చూస్తే మళ్ళీ 15 రోజులకు అవి తెస్తామన్నారు. వద్దయ్యా! ఎందుకీ గొడవంతాను అన్నాను. 'మా కందరికీ చూడాలని వున్నది. సర్వాధికారితో చెప్పాము. వారు సమ్మతించారు. తెస్తాం' అన్నారు. అయితే మీ యిష్టం అన్నాను. ఒకసారి చెపితే వింటే గదూ? చూడండి ఇప్పుడు ఎంత గొడవవుతోందో?'' అన్నారు భగవాన్.
నా కదె సందయింది. మురగనారు నుద్దేశించి ''అన్నా! చూచారా? ఇందుకే స్వర్ణోత్సవ వైభవం లేఖల్లో సినిమాల విషయం వ్రాయుమంటె నా కలం నడవనే లేదు.'' అన్నాను. వెంటనే భగవా నందుకొని మురగనారుతో ''అవునవును. అప్పుడు దాన్ని వ్రాయుమని వీరంతా తొందరచేశారు. 'ఇది సద్విషయంగా సమర్థించి వ్రాయాలే? ఎల్లాగో తెలియటం లేదే?' అని నన్నడిగింది. నీ కిష్టమైతే వ్రాయి, లేకుంటే మానేసెయ్యి అన్నా నేను. ఇది యేమి ఘనతరకార్యమని కడకది వ్రాయనే లేదు'' అన్నారు. ఆ భగవద్వాణివల్ల అన్ని రహస్యాలు భేదింపబడ్డవి గదా! రహస్యభేదనమయిందని నా కెంతో సంతోషం కలిగింది. సర్వాధికారికి ఈ సమాచారమంతా తెలిసి వెంటనే సినిమాలు ఆపుచేయవలసిందని గట్టిగా శాసించారు.
మర్నాడే ఆశ్రమమంతా ప్రశాంతమయింది. ఇంచుమించు ఆ రోజుల్లోనే ఆంధ్రదేశం నుంచి ఒక యువతి వచ్చి కొన్నాళ్ళున్నదిక్కడ. హిందీ బాగా మాట్లాడేది. చక్కని కంఠం. మధురంగా పాడేది. అందరూ భగవాన్ మీద పాటలూ, పద్యాలూ పాడుతూ వుంటే ఆమెకూ సరదా కలిగి, అంధ్రదేశంలో ఆరితేరిన పెద్దలూ, పండితులూ వ్రాసిన తత్త్వాలూ, యడ్ల రామదాసుగారి కీర్తనలూ, ఇంకా ఏవో అవీ, యివీ రామ అన్న చోట రమణ అని పెట్టి భగవాన్ సన్నిధిలో పాడుతూ వచ్చింది. మంచి అర్థపుష్టిగల కీర్తనలగుటవల్లనూ, కంఠమాధుర్యంవల్లనూ అందరికీ ఆనందంగా వుండేది. రామ అన్న చోట రమణ అని పాడుతున్నట్లు భగవాన్ గమనిస్తునే వున్నారు.
నాకూ తెలిసినా ఏదో భక్తిగా పాడుతున్నది మంచిదే గదా అని వింటూ వూరుకున్నాను. సయ్యదు మొదలైన మహమ్మదీయ భక్తులూ పార్శీవారు పాటలు విని భగవాన్ మీద వ్రాసినవే అనుకొని ''ఎవరు వ్రాసినవమ్మా ఈ పాటలు?'' అని ఆమెను అడిగితే ''నేనే వ్రాశా'' అని అన్నదట. వారంతా చాలా సంతోషించి అవి ఇంగ్లీషులో తర్జుమా చేయించుకుటాం. వ్రాసి యివ్వమంటె ఆమె వ్రాసి యిచ్చిందట. వారు ఆ కాగితం శ్రీవారికి చూపి ''ఇవి ఆమె వ్రాసిన పాటలు. ఇంగ్లీషులోకి తర్జుమా చేయించగోర్తాము'' అని విజ్ఞాపన చేసుకున్నారు. భగవాన్ ఏమీ విమర్శించక మునగాల వెంకట్రామయ్యగారు రాగానేవారికి చూపి ''అదుగో, వారు తర్జుమా చేయగలరు. వారి నడగండి'' అని చెప్పి, వెంకట్రామయ్యగారితో ''వీ రేదో తర్జుమా కావాలంటున్నారు. చూడండి'' అని చెప్పి కాగితాలిచ్చి పలక్కుండా వూరుకున్నారు.
ఆ వెంకట్రామయ్యగారికి రెండు మూడు తరానుండీ తమిళ దేశంలోనే నివాసం కావటంవల్ల తెలుగులో పాండిత్యం అంతగా లేదు. శ్లేష పదాలతో నిండివున్న ఈ పాటలు ఇంగ్లీషులో అనువదించాలంటె సామాన్యమా? అందువల్ల కొన్ని పదాలకు భగవాన్నే అర్థం అడుగుతూ వారు తికమిక పడుతూ వుండటం చూచి భగవాన్ సేవకులలో ఒకరు వెంకట్రామయ్యగారి అనుయాయులలో ఒకరిని చూచి ''ఇవన్నీ భగవానునే అడిగి శ్రమ కలిగించకపోతే, నాగమ్మ నడగరాదా?'' అన్నారు. భగవాన్ బయటికి వెళ్ళిన సమయంలో వారు నన్ను సమీపించి ఆ పాటల అర్థం కొంచెం తేలికగా చెప్పగలవా? అన్నారు. ''దానికేమి చెప్ప వచ్చును గాని అసలవి భగవానుని గుఱించి వ్రాసినవని తర్జుమా చేస్తున్నారా? లేక ఏవైనా సరే అనా?'' అన్నాను.
*ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః* 🙏
https://t.me/c/1421928578/4308.
24