24, జనవరి 2025, శుక్రవారం

సంపూర్ణ మహాభారతము*

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము తృతీయాశ్వాసము*


*267 వ రోజు*


*మధ్యాహ్నానంతర సమరం*


మధ్యాహ్నం అయింది విరిగిన రథములు, చచ్చిన హయములు, రక్తపుటేరులతో రణభూమి భయానకంగా ఉంది. ఉభయ సైన్యములు పోరు సల్పుతున్నా మన సన్యంలో నైతిక బలంతగ్గుతుంది. వారిలో వారు " అయ్యో సుయోధనుని లోభత్వం, మూర్ఖత్వం వల్లనే ఇంతటి మారణహోమం జనక్షయం దాపురించింది. అసలు పాండవులను జయించగల వారు ఎక్కడినా ఉన్నారా ? " అని తమలో తాము తర్కించుకున్నారు. వారి మాటలను సావధానంగా వింటున్న సుయోధనుడు " వారి పనికి మాలిన మాటలు విననేల అనేకులు అనేక విధముల అనుకుంటారు. మనం యుద్ధం చేస్తాము రండి " అని అందరిని రణముకు ప్రోత్సహించాడు. ఆ సమయంలో భీమసేనుడు రణరంగంలో వీరవిహారం చేస్తూ శత్రువులను ఊచకోత కోస్తున్నాడు. ఇంతలో భీమసేనుని రథం తెచ్చి సారథి నిలవగానే దానిని అధిరోహించి అత్యంత నిశిత శరములతో బాహ్లికుని రథము విరుగకొట్టాడు. చిత్రరధుడు చిత్ర విచిత్రమైన తన నిశిత శరములు ఉపయోగించి అభిమన్యుని చికాకు పెడుతున్నాడు. అభిమన్యుడు చిత్రరధుని రథము విరుగకొట్టి, సారథిని చంపి, రథాశ్వములను చంపాడు చిత్రరధుడు దుర్ముఖుని రథం ఎక్కి అక్కడి నుండి వెళ్ళారు. ద్రుపదుడు ద్రోణునిపై శస్త్రప్రయోగం చేసాడు. ఆగ్రహించిన ద్రోణుడు పదునైన బాణములు ప్రయోగించి ద్రుపదుని కవచము చీల్చాడు. ద్రోణుని ధాటికి తాళ లేక ద్రుపదుడు అక్కడి నుండి వెళ్ళాడు. సుశర్మ అర్జునితో యుద్ధం చేస్తూ అర్జునిని మీద కృష్ణుని మీద శరవర్షం కురిపించాడు. వాటిని మధ్యలో త్రుంచి అర్జునుడు క్రూరబాణములతో సుశర్మను తరిమి తరిమి కొట్టాడు. అతడి సైన్యం చెదిరి పోగా అర్జునిని ధాటికి ఆగ లేక సుశర్మ ససైన్యంగా వైదొలిగాడు. అది చూసిన భీష్ముడు అర్జునుని ఎదుర్కొని విజృంభించాడు. మధలో సాత్యకి భీష్ముని ఎదుర్కొని అతడిపై శరవర్షం కురిపించాడు. భీష్ముడు కోపించి శక్తి ఆయుధమును సాత్యకిపై విసిరాడు. శరీరం వంచి దానిని వడిసి పట్టి తిరిగి భీష్మునిపై విసిరి సింహనాదం చేసాడు. భీష్ముడు తన ఆయుధమును తానే త్రుంచి సాత్యకిపై పది పదునైన బాణములు వేసాడు. పాండవ సైన్యం ఒక్కుమ్మడిగా భీష్మునిపై పడింది. సుయోధనుడు దుశ్శాసనుడిని పిలిచి " దుశ్శాసనా ! తాత ఒంటరిగా పోరుతున్నాడు. శకునిని తీసుకుని సాయంగా వెళ్ళు " అన్నాడు. దుశ్శాసనుడు అలాగే వెళ్ళి శకునితో చేరి భీష్మునికి సాయంగా పాండవ సైన్యాలను కకావికలు చేస్తున్నారు. ఇది గమనించిన ధర్మరాజు నకులసహదేవులను అక్కడకు వెళ్ళమని చేయి ఊపాడు. నకుల సహదేవులు భీష్ముని ఎదుర్కొన్నారు. సుయోధనుడు పది వేల అశ్విక దళమును పాండవ సైన్యాలను ఎదుర్కొనమని పంపాడు. వారు పాండవ సేనలో చొరబడి విచక్షణ లేకుండా చంపసాగారు. అది చూసిన నకులసహదేవులు, ధర్మరాజు తమ వాడి శిలీకంతో గుర్రములను కొట్ట సాగారు. కాళ్ళు తెగి గుర్రములు పడి పోతూ రణరంమును బీభత్సం చేసింది. అశ్వసైన్యం అంతకంతకూ తరిగి పోయి సైనికులను లక్ష్యపెట్టక దిక్కు తోచక పరుగెట్టాయి. వాటి కింద పడి సైనికులు చనిపోసాగారు. అనేక హయములు రౌతులనుక్రింద వేసి చంపసాగాయి. అనేకులు తమ గుర్రాల క్రింద పడి మరణించారు. అశ్వదళము నశించగానే పాండవులు భేరి తూర్యనాదాలు చేసారు. ఇది చూసిన సుయోధనుడు " మద్రనరేంద్రా ! పాండవ సేనలు చెలియలి కట్ట దాటిన సముద్రంలా విరుచుకు పడి మనసైన్యాలను ఊచ కోత కోస్తున్నాయి. వాటిని నీవే ఆపాలి. శల్యుడు తన సేనలతో నకులసహదేవ, ధర్మనందనులను ముట్టడించి పెక్కు బాణములు వేసి వారిని నొప్పించాడు. అది చూసిన భీమార్జునులు శల్యునిపై విరుచుకు పడి శల్యునిపై బాణవర్షం కురిపించారు. ఇది చూసిన భీష్మద్రోణులు భీమార్జునులను ఎదుర్కొని వివిధ అస్త్రములను వేసి వారిని నొప్పించారు. సాయం కాలం అయింది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: