🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
1) శరీరం సురూపం తథా వా కలత్రం, యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యమ్ |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
2) కళత్రమ్ ధనమ్ పుత్రపౌత్రాధి సర్వమ్ | గృహమ్ బాంధవా సర్వమేతాధి జాతమ్ |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
3) షడఙ్గాదివేదో ముఖే శాస్త్రవిద్యా | కవిత్వాది గద్యం సుపద్యం కరోతి |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
4) విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః | సదాచారవృత్తేషు మత్తో న చాన్యః |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
5) క్షమా మండలే భూపభూపాలబృన్దైః | సదాసేవితం యస్య పాదారవిన్దమ్ |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
6) యశో మే గతం దిక్షు దానప్రతాపాత్ | జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్ |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
7) న భోగే న యోగే న వా వాజిరాజౌ | న కాన్తాముఖే నైవ విత్తేషు చిత్తమ్ |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
8) అరణ్యే న వాస్వస్య గేహే న కార్యే | న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
ఫలశ్రుతి:--
గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ | యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ |
లభేద్వాఞ్చితార్థం పదం బ్రహ్మసంఙ్ఞం | గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్ ||
🕉🌞🌏🌙🌟🚩
గురు అష్టకము/అర్థ తాత్పర్య సహితం
ॐॐॐॐॐॐॐॐॐ
1) శరీరం సురూపం తథా వా కలత్రం, యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యమ్ |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
అర్ధము:- చక్కని శరీర రూపం, ఎంతో అందమైన భార్య, గొప్ప కీర్తిప్రతిష్ఠలు, మేరుపర్వతమంత ధనం వున్నప్పటికీ, గురుని పాదపద్మములపై మనస్సు లగ్నం కాకపోతే, వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
అందం, చందం, భార్య, సంసారం, ధనం, కీర్తి వుండటం నిజంగా అదృష్టమే, మన పూర్వ జన్మల సుకృతమే, కానీ ఇవన్నీ ఎదో ఒక రోజు మన నుండి దూరమైపోతాయి! అన్నింటినీ వదులుకుని మనకు తెలియని చోటుకి వెళ్లిపోక తప్పదు!
వెళ్ళేలోపు మన రాకకు కారణమేంటో, మన గమ్యమేంటో, అసలు ఈ జననమరణ మాయ ఏంటో, జీవాత్మ ఏంటో, పరమాత్మ ఏంటో ఇత్యాది సంశయాలపై కాస్త అవగాహన వుంటే, వున్నన్నాళ్లు శాంతిగా బ్రతకొచ్చు, ఆనందంగా జీవించొచ్చు, అవునా మరి!
ఈ మహత్తర తత్వాన్ని అవగాహన చేసుకోవడం సులభంకాదు. అందుకు ఒక మార్గదర్శి అవసరము. ఆ మార్గదర్శియే మన అర్హతను బట్టీ గురురూపంలో దర్శనమిస్తుంటాడు.
అతడు మాత్రమే, ఈ చిక్కుముడిని విప్పి మనకు అసలు సత్యాన్ని చూపగలడు. అటువంటి మార్గదర్శిని పొందలేని జీవితము నిజంగా వ్యర్ధమే!
2) కళత్రమ్ ధనమ్ పుత్రపౌత్రాధి సర్వమ్ | గృహమ్ బాంధవా సర్వమేతాధి జాతమ్ |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
అర్ధము:- భార్య, సంపద, పుత్రులు, మనుమలు, మంచి గృహం, ఎంతోమంది బంధువులు వున్న గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ, గురుని పాదపద్మములపై మనస్సు లగ్నం కాకపోతే, వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
సాధారణంగా జీవులు కష్టాల్లో వున్నప్పుడు ఆధ్యాత్మికం, సుఖాల్లో వున్నప్పుడు అహంకారాన్ని ఆశ్రయిస్తారు! ఇది మానవ నైజం! అదే మాయ!
అన్నీ వున్నప్పుడు దైవాన్ని పొగుడుతాడు, కల్పించుకొని మరీ ఎన్నో దైవకార్యాలు చేస్తాడు. పరిస్థితి కాస్త తారుమారు అయ్యేసరికి, దైవం మీద కోపం కలుగుతుంది, కొన్నాళ్ళకు అసలు దైవం వున్నాడా? లేడా? అన్న సంశయం కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో తనవారినుండి ప్రేమానురాగాలు కొరవయితే, వారిని ఏమీ అనలేకా దైవాన్ని నిందించడం ప్రారంభిస్తాడు. ఇది మానవులందరికీ ఎదో ఒక సమయంలో కలిగే అనుభవమే!
ఆత్మపరిశీలన చేసుకుంటే, ఇన్నాళ్లు తనకి దైవభక్తి కన్నా దేవునియందు తెలియని భయమే ఎక్కువుగా వున్నట్లు అనిపిస్తుంది. కారణం ఇన్నాళ్లు దేవుణ్ణి తన నుండీ వేరుగా, బయటెక్కడో చూస్తున్నాడు కాబట్టీ!
దానికి కారణం, ఎక్కువుగా బయట ప్రపంచంతో బంధాన్ని పెంచుకోవడం! నిజమైన “అహం” మరచి “అహంకారాన్ని” ఆశ్రయించడం, ఆత్మజ్ఞానం లోపించడం!!
ఎంతోకాలంగా ఎంతో అనురక్తితో ఎన్నో సుకర్మలు చేస్తున్నా కూడా ఆత్మజ్ఞానం కలగలేదంటే, సద్గురు ఆశ్రయానికి సమయం ఆసన్నమైందని అర్ధం! అహంకారాన్ని వదిలి గురువు కోసం తపిస్తే, గురువే ఆ వ్యక్తికి తన దర్శనభాగ్యం కలుగజేసి, తగు మార్గాన్ని సూచిస్తాడు!
అతడు మాత్రమే అసలైన “నేను”ని చూపగలడు! ఆత్మజ్ఞానం ప్రసాదించగలడు! అసలు సత్యాన్ని బోధించగలడు! జీవిత పరమార్ధాన్ని తెలియజెయ్యగలడు!
అటువంటి సద్గురుని పాదపద్మముల ఆశ్రయం పొందలేని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!
3) షడఙ్గాదివేదో ముఖే శాస్త్రవిద్యా | కవిత్వాది గద్యం సుపద్యం కరోతి |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
అర్ధము:- ఆరు అంగముల యందు, నాలుగు వేదముల యందు, సకల శాస్త్రవిద్యల యందు ఎంతో ప్రావీణ్యత వున్నప్పటికీ, ఒక కవిగా గద్య, పద్య రచనలో ఎంతో ప్రతిభ వున్నప్పటికీ, గురుని పాదపద్మములపై మనస్సు లగ్నం కాకపోతే, వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
ఆచరణకు నోచుకోని పాండిత్యము వలన, శాస్త్రజ్ఞానం వలన ప్రయోజనం సూన్యం. అది అజ్ఞానాన్ని సూచిస్తుంది.
ఈ కనబడే ప్రపంచంలో నిన్న వుంది, నేడు లేదు అన్న ప్రసక్తి ఉండదు. ఈ సృష్టిలో అన్ని జడ, జీవ పదార్ధాలు మార్పు చెంది కొత్తవాటిగా రూపుదిద్దుకుంటాయి. దేనికీ నాశనము వుండదు కేవలం మార్పు వుంటుంది. అలాగే మనం, మన బంధువులు ఆత్మస్వరూపంతో ఎల్లప్పుడూ ఉన్నవారమే. ఆత్మకి మార్పు లేదు. ఆత్మ నిత్యము, శాశ్వతము.
అలాగే లేనిదానికి ఉనికిలేదు, వున్నది లేకుండా పోదు. ప్రతి కార్యమునకు ఒక కారణము వుంటుంది. కారణము మూలము, కార్యము దాని వికారము. కారణము నిత్యమైనది, దానినే "సత్" అంటారు. కార్యము అనిత్యమైనది, దానినే "అసత్" అంటారు.
అంటే ఈ సృష్టికి మూలకారణం "సత్యము". దాని వికారమైన ఈ ప్రపంచము "అసత్యము". ఆత్మ సత్యము. శరీరము అసత్యము. దీనిని సమగ్రంగా తెలుసుకున్నవాడే గురువు!
అతడు మాత్రమే ఆత్మజ్ఞానం ప్రసాదించగలడు! జీవిత పరమార్ధాన్ని తెలియజెయ్యగలడు!
అటువంటి సద్గురుని పాదపద్మముల ఆశ్రయం పొందలేని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!
4) విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః | సదాచారవృత్తేషు మత్తో న చాన్యః |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
అర్ధము:- విదేశాలలో ఎంతో గొప్పవానిగా, స్వదేశములో ఎంతో ధనవంతునిగా కీర్తింపబడుతున్నప్పటికీ, సంఘంలో ఎంతో సదాచార సంపన్నునిగా గుర్తింపు వున్నప్పటికీ, గురుని పాదపద్మములపై మనస్సు లగ్నం కాకపోతే, వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
ధరణిలో పరమాత్ముని ప్రతిరూపంగా జన్మించిన ప్రతిజీవికి, మనుగడకోసం అవసరమయ్యే శక్తిసామర్ధ్యాలను, తగిన జ్ఞానాన్ని ఆ పరమాత్మ ప్రసాదించేడు.
జీవులన్నింటిలో అత్యంత జ్ఞానసంపన్నుడిగా, తన సంపూర్ణ ప్రతిరూపంగా, పూర్తి మేధస్సుతో మానవుణ్ణి సృష్టించేడు పరమాత్మ. తనలాగే మానవుడు కూడా ఈ సృష్టిని, అందున్న ప్రతి జడజీవాన్ని జాగ్రత్తగా కాపాడుతూ, ఈ సృష్టి నిర్వాహణలో తనకు ఎంతో చేదోడువాదోడుగా వుంటాడని భావించేడు పరమాత్మ.
మానవుడు కూడా తన అపరిమిత జ్ఞానంతో కొన్ని ప్రత్యేక శక్తులను తన స్వంతం చేసుకొని, సృష్టిలో వున్న అన్ని జడజీవాలపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, అపర పరమాత్మగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మిగతా జీవాలతో పోలిస్తే, మానవుడు అన్ని రంగాలలో తన శక్తియుక్తులను ప్రదర్శిస్తూ అభివృద్ధి చెందుతున్నాడు.
కానీ మానవుడు మాయకులోబడి అహంకారవశుడై తన నిజస్వరూపాన్ని విస్మరిస్తున్నాడు. తనలో వున్న ఇంద్రియాలు, మనస్సు ఈ మాయకు దోహదపడుతున్నాయి. వీటికి లోబడి, అమోఘమైన ప్రజ్ఞ వున్నప్పటికీ ఆనందంగా, ప్రశాంతంగా జీవించలేకపోతున్నాడు.
ఈ మాయనుండి బయటపడే మార్గాన్ని “గురువు” మాత్రమే చూపగలడు! అతడు మాత్రమే జీవిత పరమార్ధాన్ని తెలియజెయ్యగలడు!
అటువంటి సద్గురుని పాదపద్మములను ఆశ్రయించని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!
5) క్షమా మండలే భూపభూపాలబృన్దైః | సదాసేవితం యస్య పాదారవిన్దమ్ |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
అర్ధము:- ఒక దేశానికి మహారాజు అయినప్పటికీ, ఎందఱో రారాజులు పాదాక్రాంతులై సేవిస్తున్నప్పటికీ, గురుని పాదపద్మములపై లగ్నంకాని మనస్సు వుంటే వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
మహారాజులతో పాటు సామాన్య వ్యక్తులు కూడా భావించేది ఏంటంటే, ఈ విషయభోగాలతో మేము ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాం, ఎంతోమంది నుండి గౌరవమర్యాదలను నిత్యం పొందుతున్నాం, వీటితో ఆనందము కలగదని చెప్పడం శుద్ధఅబద్దం, జ్ఞానగురువులు చెప్పే ఆత్మానందము అంటే ఏమిటో మాకు తెలియదు! అది లభిస్తుందన్న నమ్మకం కూడా లేదు! అందుచేత ఈ ఇంద్రియసుఖమును వదలుకొని, అస్సలు తెలియని ఆత్మసుఖము కోసము ప్రయత్నించడం తెలివితక్కువ పని అవుతుంది కదా??
మంచి భావనే, కానీ కొంచెము ఆలోచిస్తే, ఇక్కడ సుఖమన్నది బయట పదార్ధములలో లేదు, మనలోనే వుంది, మనమే అనుభవిస్తున్నామని అర్ధమవుతుంది. ఎందుచేతనంటే కొందరికి సుఖమును కలిగించిన వస్తువు, వేరొకరికి కలిగించపోవచ్చు. ఆ పదార్ధముద్వారా పొందిన ఆనందం దానిని అనుభవించిన కొన్నాళ్ళకు పోయి విసుగు కలగవచ్చు, అప్పుడు ఆనందము కోసము ఇంకో కొత్తవస్తువును వెతుక్కుంటాము. అది దొరక్కపొతే అసహనం, కోపము కలిగి అశాంతికి లోనౌతాము.
అంటే మునుజులు పొందుతున్న ఆనందము, అసహనం, కోపము వారిలోనే వున్నాయి కానీ వస్తువులలో లేదన్న విషయము బోధపడుతుంది. ఒకవేళ ఆ సుఖము వస్తువులోనే ఉంటే, అది అందరికి అన్నివేలయందు ఆనందాన్ని కలిగించాలి కదా! అందుకే “కడుపునిండితే గారెలు చేదు" అన్నారు పెద్దలు. మనుజులలో నున్న అజ్ఞానమే, బాహ్య వస్తువులందు సుఖభ్రాంతికి కారణము.
మానవుడు గాఢనిద్రలో నున్నప్పుడు, బాహ్యవస్తువులను మరచి, వాటియందు ఆసక్తిని విడచి, తన దుఃఖములను కూడా మరచి, తనయందే అమితసుఖమును పొందుతున్నాడు కదా! ఈ తాత్కాలిక ఉపశమనము(సుషుప్తి) యందే ఇంత సుఖమును అనుభవిస్తే, ఇక జ్ఞానముతో కూడిన శాశ్వత ఉపశమనరూపమగు సమాధిస్థితియందు ఎంత ఆనందమును పొందగలడు? కావునా శాశ్వతానందం పొందుటకు, తాత్కాలిక వస్తుసుఖమును పరిత్యజించాలి.
ఎవడు రాగద్వేషములకు వసుడుకాడో, ఎవడు వేషభాషలకు ప్రాధాన్యత ఇవ్వకా ద్వందాలను అతిక్రమిస్తాడో అతడే గురువు! అతడు మాత్రమే జీవిత పరమార్ధాన్ని తెలియజెయ్యగలడు!
అటువంటి సద్గురుని పాద పద్మములను ఆశ్రయించని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!
6) యశో మే గతం దిక్షు దానప్రతాపాత్ | జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్ |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
అర్ధము:- మహాదానగుణ సంపన్నుడవన్న కీర్తి దశదిశలా వ్యాపించినప్పటికీ, ఈ ప్రపంచం మొత్తం నీ పక్షాన వున్నప్పటికీ, గురుని పాదపద్మములపై నిలపలేని మనస్సు వుంటే వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
ప్రపంచమంతా మూడు గుణములతో నిండివుంటుంది. అవి సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ త్రిగుణముల మాయచే ఆవరింపబడిన జీవుడు, గుణాలకు అతీతుడైన పరమాత్మ స్వరూపమును గ్రహించలేకున్నాడు.
వీటి ప్రభావము చేత జీవుడు, అశాశ్వతమైన తన శరీరమునే తానుగా భావించి క్షణికమైన దృశ్యవస్తువుల వెంట పరిగెట్టి వాటిని పరమప్రీతితో అనుభవిస్తున్నాడు. మంచి మనస్సు, దయా మఱియు దానగుణం పుష్కలంగా వున్నప్పటికీ ఈ మాయనుండి బయటపడలేక పోతున్నాడు. అహంకారంతో వున్న పరమాత్మను లేడని వాదించి, లేని జగత్తును వున్నదిగా భావిస్తూ కాలప్రవాహములో కొట్టుకొని పోవుచు జననమరణములను పొందుతున్నాడు.
అనేక జన్మల సాధనాఫలితంగా, ఎదో ఒక జన్మలో జ్ఞానము ఉదయిస్తుంది. అప్పుడు జీవుడు ఈ జగత్తంతయూ బ్రహ్మమే (సర్వం ఖల్విదం బ్రహ్మ), జీవుడు కూడా బ్రహ్మమే (జీవో బ్రహ్యైవ నాపరః) అనే పరమసత్యాన్ని గ్రహిస్తాడు. అదే జీవుని ఆఖరి జన్మ అవుతుంది. ఈ స్థితిని సాధించిన మహాత్ములు చాల అరుదు.
ఇట్టి మహత్తరమైన శక్తిని పొందియుండి కూడా జీవుడు, మాయలోపడి, సత్యమును మఱచి, రాగద్వేషములకు వశుడై, మోహలాలసుడై, సుఖదుఃఖములను అనుభవిస్తూ, కలుషిత మనస్కుడై, సంసారచట్రములో ఇరుక్కుపోతున్నాడు.
ఈ మాయనుండి బయటపడే మార్గాన్ని “గురువు” మాత్రమే చూపగలడు! అతడు మాత్రమే జీవిత పరమార్ధాన్ని తెలియజెయ్యగలడు!
అటువంటి సద్గురుని పాదపద్మములను ఆశ్రయించని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!
7) న భోగే న యోగే న వా వాజిరాజౌ | న కాన్తాముఖే నైవ విత్తేషు చిత్తమ్ |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
అర్ధము:- భోగము, యోగము, అగ్నిహోమము, స్త్రీసుఖము, ధనము ఇత్యాది వాటియందు అనురక్తి మనస్సులో లేకపోయినప్పటికీ, గురుని పాదపద్మములపై నిలపలేని మనస్సు వుండీ, ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
కొంతమంది తీవ్రసాధన చేసి ఇంద్రియాలను, మనస్సును తమ ఆధీనంలోకి తెచ్చుకొని విషయవిరక్తిని సాధిస్తారు. బాహ్యవస్తువుల ప్రభావానికి లొంగని గొప్ప మనోనిబ్బరాన్ని తమ స్వంతం చేసుకుంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితిలో వున్నట్టే కనబడతారు కానీ అసలు సత్యాన్ని గ్రహింపరు. జీవులయెడ బేధభావాన్ని, తారతమ్యాన్ని చూపుతారు.
కారణం సరైన గురుసాంగత్యాన్ని వారు పొంది యుండక పోవచ్చు, ఒకవేళపొందినా గురువుని సరిగ్గా అర్ధంచేసుకోవడంలో లేదా వారినుండి ఆత్మజ్ఞానం పొందడంలో విఫలమైయుండచ్చు.
జ్ఞానంలేని కర్మాచరణ, ఆచరణలేని జ్ఞానం వలన ఉపయోగం లేదు! ఇంద్రియాలు, మనస్సు జయించినంతమాత్రాన ఆత్మానుభూతి కలుగదు. జ్ఞానంతో సత్యాన్ని తెలుసుకోవాలి.
సద్గురువు కర్మలకు విలువిస్తూనే జ్ఞానానికి పెద్దపీట వేస్తాడు. “అహం” యొక్క మూలస్థానాన్ని తెలియజేస్తూనే “అహంకారాన్ని” దూరంచేస్తాడు. శిక్షణలో “సర్వం ఖల్విదం బ్రహ్మ” అర్ధాన్ని చెప్తూనే, “అహం బ్రహ్మాస్మి” అంతరార్ధాన్ని కూడా తెలియజేస్తాడు! శిష్యుణ్ణి “తత్వమసి” నుండి “అయమాత్మా బ్రహ్మ” స్థితికి తీసుకు వెళతాడు!
అంటే - ప్రకృతి, పరమాత్మ వేరువేరు అనే భావన నుండి, అంతా పరమాత్మే - పరమాత్మ నాలోనే వున్నాడు - నేనే పరమాత్మ అనే అద్వైతస్థితికి గొనిపోయోవాడు గురువు.
అటువంటి సద్గురుని పాదపద్మములను ఆశ్రయించని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!
8) అరణ్యే న వాస్వస్య గేహే న కార్యే | న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
అర్ధము:- ఇటు అడవిలో గాని అటు ఇంటిలో గాని వుండాలన్న కోరిక ఏమాత్రం లేకపోయినప్పటికీ, ఏదైనా గొప్ప కార్యం సాధించాలన్న ఆలోచన లేకపోయినప్పటికీ, దేహం మీద శ్రద్ధ కాస్తైనా లేకపోయినప్పటికీ, గురుని పాదపద్మములపై నిలపలేని మనస్సు వుండీ, ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
జీవుని ముందు రెండు మార్గాలుంటాయి. ఒకటి శ్రేయస్సు, రెండవది ప్రేయస్సు. శ్రేయస్సు అంటే మోక్షము లేక శాశ్యతానందము. ప్రేయస్సు అంటే బంధము లేక అనిత్యమైన ఇంద్రియానందము. వీటినే విద్య, అవిద్య అంటారు జ్ఞానులు.
జ్ఞానులు శ్రేయస్సును అవలంబించి శాశ్వతసుఖాన్ని పొందుతారు. అజ్ఞానులు ప్రేయస్సును కోరుకొని క్షణికమైన సుఖాలను అనుభవిస్తూ మొహలాలసులై జననమరణ చట్రంలో ఇరుక్కుంటారు.
సంకల్ప, వికల్పాలను చేసేది జీవుని మనస్సు. అలాగే ఉపాసించేది కూడా మనస్సే. కాబట్టీ ముందుగా మనస్సును శుద్ధిచేసుకొని పరబ్రహ్మమును ఉపాసించాలని అన్ని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఏ జీవుడు బ్రహ్మమును ఇలా సాధనచేస్తాడో అతనిని సర్వభూతములు కీర్తిస్తాయి.
దేని దగ్గరకు జీవుని మనస్సు పదేపదే పరిగెడుతుందో, మనస్సు ద్వారా ఏదయితే పదేపదే స్మరించబడుతుందో అదే "ఆత్మ".
ఆత్మవస్తువు గురించి వినడమే ఆశ్చర్యము. విన్నవారు దానిని తెలుసుకోవడం ఇంకా కష్టం. దానిగురించి చెప్పే గురువు దొరకటం చాలా కష్టం. ఒకవేళ దొరికిన అతడు చెప్పింది అర్ధం చేసుకోవడం బహుకష్టం. ఆత్మజ్ఞానం తర్కంద్వారా అర్ధంకాదు. అనుభూతి పొందిన గురుని ఉపదేశం వల్లనే అది సిద్ధిస్తుంది.
అటువంటి సద్గురుని పాదపద్మములను ఆశ్రయించని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!
ఫలశ్రుతి:--
గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ | యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ |
లభేద్వాఞ్చితార్థం పదం బ్రహ్మసంఙ్ఞం | గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్ ||
ఈ గురు అష్టకమును ఎవరు పారాయణం చేస్తారో, గురువు మాటను ఎవరు సావధానులై వింటారో, ఎవరు గురువును శ్రద్ధతో సేవిస్తారో, వారు పవిత్రులైనా, సన్యాసులైన, రాజులైనా, సజ్జనులైనా, బ్రహ్మచారులైనా, ఎటువంటివారైనా సరే వారు కోరుకున్నవన్నీ వారికి లభించి తుదకు పరబ్రహ్మమును చేరుకుంటారు!!
“గురు అష్టకం” సర్వం సంపూర్ణం.
॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥