3, అక్టోబర్ 2020, శనివారం

శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యము



               రచన 

గోపాలుని మధుసూదన రావు 


చతురంబగు నిగమంబుల 

చతురత మీరంగ జూచు సరసిజ జన్మున్ 

చతురానను దర్శించగ 

యతులిత మగు భక్తితోడ నరిగెను పిదపన్ 25



భృగువంతట ముందుకు జని 

నగుమోమున నుండినట్టి నలువను గనియున్ 

నిగమాధిప ! వందనమని 

నగణితమగు భక్తితోడ నంజలి జేసెన్ 26



నలువను గాంచియు భృగుముని 

పలువిధ ప్రార్థనలు జేసి ప్రాంజలి నుండన్ 

తలపున వాణిని గాంచుచు 

పలుకక తానుండె బ్రహ్మ బహు శాంతమునన్ 27


చదువుల వేలుపు శారద 

యెదురుగ గూర్చుండి యుండి వీణియ మీటన్ 

ముదమున నలువదనములతొ 

సదమలముగ గాంచుచుండె శాంతముతోడన్ 28



వచ్చిన తనదెస జూడక 

మచ్చికతో మాటలాడి మన్నించకనూ 

కచ్చతొ నుండిన బ్రహ్మతొ 

రెచ్చిన కోపంబుతోడ ఋషి యిటులనియెన్ 29


“నిగమంబుల కధిపతివని 

జగముల సృజియించుచున్న జనకుడ వనుచున్ 

నగణితముగ నిను గొల్వగ ,

మొగమొకటియు ద్రిప్పకుంట ముదమే నీకున్ 30


నిగమంబుల కర్తవనుచు 

నగణితమగు భక్తి తోడ నర్చన సేయన్ 

మొగమైన జూపనందుకు 

జగమున గుడి యర్చనములు జరుగవు నీకున్ “. 31



జటధారి యివ్విధంబున 

పటుతర కోపంబుతోడ భవు బ్రహ్మలకున్ 

కటువగు శాపము లిచ్చియు 

నటనుండియు కదలిపోయె హరిపదమునకున్ 32


పరమేశుడు పరమేష్టియు 

నరమర లేకుండ తన్ను నవమానించన్ 

నరుణిమ చెందిన కనులతొ 

హరిచెంత కరిగె భృగుముని యాగ్రహమొప్పన్ 33


భృగుమహర్షి విష్ణు వక్షస్థలమును తన్నుట 


మునియంతట ముందుకుజని 

కనియును వైకుంఠమనెడి కైవల్యపురిన్ 

కనె నచ్చట శ్రీకాంతుని 

కనులారగ లక్ష్మితోడ కాంక్షలు దీరన్

కామెంట్‌లు లేవు: