3, అక్టోబర్ 2020, శనివారం

మహాభాగవతం


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*నవమ స్కంధము - పదియవ అధ్యాయము*


*పరమాత్మూడైన శ్రీరామచంద్రుని లీలావర్ణనము*


*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*10.7 (ఏడవ శ్లోకము)*


*జిత్వానురూపగుణశీలవయోఽఙ్గరూపాం సీతాభిధాం శ్రియమురస్యభిలబ్ధమానామ్|*


*మార్గే వ్రజన్ భృగుపతేర్వ్యనయత్ప్రరూఢం దర్పం మహీమకృత యస్త్రిరరాజబీజామ్॥7637॥*


శ్రీమన్నారాయణుని అంశతో అవతరించినవాడు శ్రీరాముడు. ఆ శ్రీహరి వక్షస్థలమున విరాజిల్లుచుండెడి లక్ష్మీదేవి సీతాదేవిగా అవతరించెను. తరుణవయస్సులో తళతళ మెఱయుచున్న రామచంద్రప్రభువు సద్గుణములచే, ఉత్తమశీల సంపదచే, వయోవైభవముచే, అంగసౌష్ఠవముచే, రూపసౌభాగ్యముచే తనకు అన్నివిధములుగా తగిన సీతాదేవిని (శివధనుర్భంగ మొనర్చుటద్వారా) జయించి, ఆమెను చేపట్టెను. శ్రీరాముడు సీతాదేవితోగూడి సపరివారముగా మిథిలనుండి అయోధ్యకు వెళ్ళుచున్నప్పుడు, మార్గమధ్యమున ఆ ప్రభువునకు పరశురాముడు నిలువరించెను. ఆ భార్గవరాముడు ఇదివరలో ఇరువదియొక్కమారులు క్షత్రియులపై దాడిచేసి భూమిపై వారి వంశములను రూపుమాపియుండెను. అట్టి గర్వముతో ఒప్పుచున్న భార్గవుడు తనను అడ్డగింపగా రఘువీరుడు ఆ మహామహునిలో పాతుకొనియున్న దర్పమును నిర్మూలించెను.


*10.8 (ఎనిమిదవ శ్లోకము)*


*యః సత్యపాశపరివీతపితుర్నిదేశం స్త్రైణస్య చాఽపి శిరసా జగృహే సభార్యః|*


*రాజ్యం శ్రియం ప్రణయినః సుహృదో నివాసం త్యక్త్వా యయౌ వనమసూనివ ముక్తసంగః॥7638॥*


*శ్రీరాముడు తన తండ్రి (దశరథమహారాజు) కైకేయికి ఇచ్చినమాటను* నిలబెట్టుటకై వనములకేగెను. ఆ మహారాజు తన భార్యయగు కైకేయి ప్రభావమునకు లోనైయున్నను, అతడు తన తండ్రిని సత్యసంధుని గావించుటకై తదాదేశమును శిరసావహించెను. సర్వసంగ పరిత్యాగి ప్రాణములను వీడినట్లుగా, అప్పుడు ఆ స్వామి రాజ్యసుఖములను, సకల సంపదలను, తనకు ఆత్మీయులైన బంధుమిత్రులను, భవనములను త్యజించి, భార్యా సహితుడై (సీతా, లక్ష్మణులతో గూడి) వనములకు చేరెను.


*శ్రీరాముడు తన తండ్రి (దశరథమహారాజు) కైకేయికి ఇచ్చినమాట*


పూర్వము ఒకానొకప్పుడు యుద్ధసమయమున కైకేయి దశరథునకు సహాయపడి యుండెను. అందులకు సంతోషించిన దశరథుడు ఆమెకు రెండు వరములను ఇచ్చియుండెను. అప్పుడు ఆరాజు ఇచ్చిన వాగ్దానమును గుర్తుచేయుచు శ్రీరాముని యువరాజు పట్టాభిషేక సమయమున కైకేయి 1) భరతుని పట్టాభిషిక్తుని గావింపవలసినదిగను, 2) శ్రీరాముని వనములకు పంపవలసినదిగను తన భర్తను కైకేయి కోరుకొనెను.


*10.9 (తొమ్మిదవ శ్లోకము)*


*రక్షః స్వసుర్వ్యకృత రూపమశుద్ధబుద్ధేస్తస్యాః ఖరత్రిశిరదూషణముఖ్యబంధూన్|*


*జఘ్నే చతుర్దశసహస్రమపారణీయకోదండపాణిరటమాన ఉవాస కృచ్ఛ్రమ్॥7639॥*


రావణుని చెల్లెలు, కామాతురయైన శూర్పణఖను శ్రీరాముడు వికృతరూపను గావించెను. ఆ రాక్షసి ప్రేరణవలన (శూర్పణఖ గగ్గోలును జూచి ఆవేశపూరితులైన) ఖరుడు, త్రిశిరుడు, దూషణుడు మున్నగు పదునాలుగువేల మంది రాక్షసులు శ్రీరామునిపై దాడికి దిగిరి. అప్పుడు ఆ రఘువీరుడు తిరుగులేని తన కోదండమును చేబూని, ఆ రాక్షసబలములను పూర్తిగా తుడిచిపెట్టెను. పిమ్మట, ఆ రాఘవుడు వనములయందు అంతటను సంచరించుచు అనేకములైన కష్టములను వహించెను.


*10.10 (పదియవ శ్లోకము)*


*సీతాకథాశ్రవణదీపితహృచ్ఛయేన సృష్టం విలోక్య నృపతే దశకంధరేణ|*


*జఘ్నేఽద్భుతైణవపుషాఽఽశ్రమతోఽపకృష్టో మారీచమాశు విశిఖేన యథా కముగ్రః॥7640॥*


పరీక్షిన్మహారాజా! శూర్పణఖ వలన అపూర్వమైన రూప, గుణ, సౌందర్యాదులను వినినప్పటి నుండి ఆమెయెడ రావణుని హృదయములో కామవికారములు చెలరేగెను. అంతట రావణుని ఆదేశముతో మారీచుడు బంగారు లేడి రూపమున శ్రీరాముని పర్ణకుటీర సమీపమునందు తిరుగసాగెను. ఆ బంగారు లేడికై సీతాదేవి ఆపేక్షపడగా శ్రీరాముడు ఆ హరిణమును పట్టుకొనుటకై దానిని వెంబడించెను. అది ఆయనను చాలదూరము తిసికొనిపోయెను. అప్పుడు వీరభద్రుడు దక్షప్రజాపతినివలె శ్రీరామచంద్రుడు తన వాడియైన బాణముచే మారీచుని ప్రాణములను హరించెను.


*10.11 (పదకొండవ శ్లోకము)*


*రక్షోఽధమేన వృకవద్విపినేఽసమక్షం వైదేహరాజదుహితర్యపయాపితాయామ్|*


*భ్రాత్రా వనే కృపణవత్ప్రియయా వియుక్తః స్త్రీసంగినాం గతిమితి ప్రథయంశ్చచార॥7641॥*


బంగారు లేడిని తీసికొనివచ్చుటకై శ్రీరాముడు వెళ్ళిన పిమ్మట ఆందోళనకు గుఱియైన సీతాదేవి ఆయన సమాచారమును తెలిసికొనిరమ్మని లక్ష్మణుని ఒత్తిడి చేసెను. విధిలేని పరిస్థితిలో లక్ష్మణుడు తన అన్నకొరకై కుటీరమును వీడి వెళ్ళెను. ఆ సమయమున రాక్షసాధముడైన రావణుడు తోడేలు మేకనువలె, ఆ వనమునుండి సీతాదేవిని అపహరించుకొని లంకకు వెళ్ళెను. సీతాదేవి (భార్యా) వియోగమునకు గుఱియైన శ్రీరాముడు దీనునివలె సోదరుడగు లక్ష్మణునితోగూడి వనములయందు సంచరింప సాగెను. 'స్త్రీలయెడ ఆసక్తి గలవారికి ఇట్టి దుస్థితులు తప్పవు' అని శ్రీరాముడు ఈ విధముగా లోకమునకు చాటెను.


*10.12 (పండ్రెండవ శ్లోకము)*


*దగ్ధ్వాఽఽత్మకృత్యహతకృత్యమహన్ కబంధం సఖ్యం విధాయ కపిభిర్దయితాగతిం తైః|*


*బుద్ధ్వాథ వాలిని హతే ప్లవగేంద్రసైన్యైః వేలామగాత్స మనుజోఽజభవార్చితాంఘ్రిః॥7642॥*


రావణుని నుండి సీతాదేవిని రక్షించుటద్వారా శ్రీరామునకు సహాయపడుటకై గృధ్రరాజగు జటాయువు ఆ రాక్షసునితో పోరాడి ఆయువులను కోల్పోయెను. తన కొరకై ప్రాణార్పణ చేసిన ఆ పక్షీంద్రునకు శ్రీరాముడు పుత్రునివలె అంత్యక్రియలొనర్చి, అతనికి మోక్షమును ప్రసాదించెను. అచటినుండి కొంత ముందునకు సాగిన పిమ్మట ఆ ప్రభువు తమయెడ అపరాధమొనర్చిన కబంధుని కడతేర్చెను. తదుపరి సుగ్రీవాది వానర ప్రముఖులతో మైత్రిని నెఱపెను. అధర్మమునకు ఒడిగట్టిన వాలిని సంహరించెను. వానరుల ద్వారా తనకు ప్రాణప్రియమైన సీతాదేవి జాడను తెలిసికొనెను. బ్రహ్మరుద్రాదులకును ఆరాధ్యుడైన శ్రీమన్నారాయణుని యొక్క అంశతో మానవుడై అవతరించిన శ్రీరాముడు వానరసైన్యముతోగూడి సముద్రతీరమునకు చేరెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: