**దశిక రాము**
15 వ శ్లోకం
" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"
అవతారిక:”
ఈశ్వరుడు తనను ఉపేక్షిస్తున్నాడేమో అని భావించి శంకరులు చెప్పిన
మాటలివి . ఈశ్వరుడు తలచుకుంటే , తననుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతను
సైతమూ మార్చగలడని, శంకరులు చెప్పారు. ఈశ్వరుడు సర్వకార్య
సమర్థుడని , ఆయన తన్ను ఉపేక్షింౘ రాదననీ ప్రార్థన.
శ్లో" 15
**ఉపేక్షా నోచేత్కిం**
**న హరసి భవద్ధ్యాన విముఖాం**
**దురాశా భూయిష్టాం**
**విధిలిపి మశక్తో యది భవాన్**
**శిరస్త ద్వైధాత్రం**
**ననఖలు సువృత్తం పశుపతే !**
**కథం వా నిర్యత్నం**
**కరనఖముఖేనైవ లులితమ్**
పదవిభాగం:
ఉపేక్షా, నోచేత్ _ కిమ్ _ న _ హరసి _ భవద్ధ్యాన విముఖాం _
దురాశా భూయిష్టాం _ విధిలిపిమ్ _ అశక్తః _ యది _ భవాన్ _
శిరః _ తత్ _ వైధాత్రం _ న _ నఖలు _ సువృత్తం _ పశుపతే _ కథం _
వా _ నిర్యత్నం _ కరనఖముఖేన _ ఏవ _ లులితమ్.
తాత్పర్యము:
ఓ పశుపతీ ! నీకు నాయందు ఉపేక్షాభావము లేనట్లయితే నీ
ధ్యానము నందు వైముఖ్యము గలిగి యుండేటట్లునూ, దురాశతో
కూడి యుండేటట్లునూ బ్రహ్మ నా నొసటిపై వ్రాసిన వ్రాతను ఎందుకు
నీవు తుడిచి వేయడం లేదు. అలా తుడిచి వేయడానికి నీవు అసమర్థుడ
వన్నది నిజం కానేకాదు. ఎందుకంటే, నీవు నిజంగా శక్తి లేనివాడవయితే
నాల్గు తలల మధ్య మిక్కిలి దృఢంగా నిబద్ధమైన బ్రహ్మ యొక్క ఐదవతల
అప్రయత్నంగా అవలీలగా నీ చేతి గోటి కొనతో ఎలా త్రుంచి వేయబడింది ?
బ్రహ్మ తలనే త్రుంచివేసిన నీకు , అతని వ్రాతను తుడిచి వేయడం కష్టం కాదు
అందు చేత , భవద్ధ్యాన వైముఖ్యమూ, దురాశా పరత్వమూ , అని వ్రాయబడిన నా నుదుటి వ్రాతను తొలగింౘుమని ప్రార్థన.
వివరణ:
భగవంతుని యందు భక్తి వుంటే ,విధిరాతలు కూడా దూరమౌతాయనడానికి
మనపురాణాలలో సైతం ఎన్నో ఉదాహరణలున్నాయి.
మార్కండేయుడు అల్పాయుష్కుడైనా , శివుని కరుణచే చిరంజీవిఅయ్యాడు.
సతీ సావిత్రి యముని అనుగ్రహముతో తన భర్త ప్రాణాలను నిలబెట్టింది.
ఇక గ్రంథకర్త. శంకరులవారికి బ్రహ్మ లిఖితప్రకారం , ఎనిమిదే ఏళ్ళు ఆయుర్దాయం అయినా , సన్యాసం స్వీకరించి మరో ఎనిమిది సంవత్సరాలూ, వ్యాస భగవానుని అనుగ్రహంతో మరో పదహారు సంవత్సరాలూ మొత్తం 32 ఏళ్ళు జీవించారు కదా !
ఈశ్వరానుగ్రహం గూర్చి ధూర్జటి మహా కవి ఇలా చెప్పాడు .
పవి పుష్పంబగు, నగ్ని మంౘగు, నకూపారంబు భూమీస్థలం
బవు, శత్రుండతి మిత్రుడౌ, విషము దివ్యాహారమౌ, నెన్నగా
నవనీ మండలి లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసికిన్
శివ ! నీ నామము సర్వ వశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా !!
వివరణ:
ఈశ్వరా ! లోకంలో శివనామోచ్చారణము చేసే పుణ్యాత్ముడికి వజ్రము
పువ్వు అవుతుంది , అగ్ని మంౘు అవుతుంది. సముద్రము నేల అవుతుంది. శత్రువు మిత్రుడు అవుతాడు. విషము అమృతాన్నము అవుతుంది. నీనామము అన్నిటినీ వశము చేయగల్గిన శక్తిగలది .
" మూకం కరోతి వాచాలం, పంగుం లంఘయతే గిరిమ్ "
మూగవానిని వాచాలుడిగా , కుంటివాణ్ణి పర్వతాలను దాటేవానిగా
ఈశ్వరానుగ్రహం చేయగలదని బ్రహ్మ రాత ప్రక్కకు తొలగుతుందని భావం
🙏🙏🙏.
*ధర్మము-సంస్కృతి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి