3, అక్టోబర్ 2020, శనివారం

ఆదిపర్వము-38

 

ద్రౌపది జన్మవృత్తాంతం


భీముడు బకాసురుని చంపిన తరువాత, పాండవులు కుంతీదేవి ఏకచక్రపురంలో కొంత కాలం నివసించారు.

ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వారి ఇంటికి వచ్చాడు. ధర్మరాజు ఆ బ్రాహ్మణుడికి అతిథి సత్కారాలు చేసాడు.

“బ్రాహ్మణోత్తమా, తమరు ఏ ఏ దేశాలు తిరిగారు? అక్కడ విశేషాలు ఏమిటి? అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పసాగాడు.

“నేను ఎన్నో దేశాలు చూసాను, కాని ద్రుపదరాజు పాలించే పాంచాల దేశాన్ని మించిన దేశం లేదు. ద్రుపద మహారాజుకు అగ్ని గుండం నుండి ఉద్భవించిన కుమార్తె ఉన్నది. ఆమె పేరు ద్రౌపది. ఆమెకు వివాహం చేయ సంకల్పించాడు ద్రుపదుడు.”

అది విని ధర్మరాజు ఆశ్చర్యపడి “బ్రాహ్మణోత్తమా! ఆమె ఎందుకు మానవులకు జన్మించలేదు? ఆమెను ద్రుపదుడు ఏ విధంగా పొందాడు? సవిస్తరంగా చెప్పండి” అని అడిగాడు.

ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగాడు. “ద్రోణుడు, ద్రుపదుడు మంచి స్నేహితులు. వారిరువురు ఒకే గురువు గారి దగ్గర వేదాలు చదువుకున్నారు. అగ్నివేశుని వద్ద ధనుర్విద్యను నేర్చుకున్నారు. తరువాత వారికి విరోధం వచ్చింది. ద్రోణుడు హస్తినాపురం వెళ్ళాడు. అక్కడ కురు కుమారులకు అస్త్ర విద్య నేర్పించాడు.

గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తెమ్మని కోరాడు. ఆ విధంగానే అర్జునుడు ద్రుపదుని బంధించి తెచ్చి గురువుగారి కాళ్ల ముందు పడవేసాడు. ద్రోణుడు ద్రుపదుని హేళన చేసి విడిచి పెట్టాడు.

ఆ అవమానాన్ని భరించలేకపోయాడు ద్రుపదుడు. ఎలాగైనా ద్రోణుని చంపే కొడుకును, అర్జునుని వివాహమాడే కూతురిని పొందాలని నిశ్చయించుకున్నాడు.

యాజుడు అనే బ్రాహ్మణోత్తముని, యాజ్ఞీకూడిగా చేసుకొని యజ్ఞం మొదలుపెట్టాడు. ద్రుపదుని, ఆయన భార్య కోకిలాదేవిని కూర్చోపెట్టి యాజుడు వారి చేత యజ్ఞం చేయించాడు.

అప్పుడు యజ్ఞ కుండం లోనుండి భయంకరమైన శరీరం కలవాడు, పెద్ద ధనుస్సు కలవాడు ఐన ఒక మహాపురుషుడు ఉద్భవించాడు. తరువాత ఒక అద్బుత సౌందర్య రాశి బయటకు వచ్చింది.

అప్పుడు ఆకాశవాణి వారికి ధృష్టద్యుమ్నుడు, కృష్ణ(నల్లని శరీరము కలది) అని నామకరణం చేసింది.

ఇప్పుడు ఆ కన్యకు వివాహ వయసు వచ్చింది. ద్రుపదుడు ఆమెకు వివాహం చేయ నిశ్చయించాడు. కాని ద్రుపదుడు తన కుమార్తెను అర్జునుడికి ఇచ్చి వివాహం చేయ సంకల్పించాడు. అర్జునుడు, తన సోదరులతో సహా లక్క ఇంటిలో మృతిచెందాడని తెలిసి చాలా దుఃఖించాడు.

కాని ద్రుపదుని పురోహితుడు మాత్రం “పాండవులకు అన్నీ శుభ శకునములు గోచరించు చున్నవి. వారు తప్పక బతికే ఉన్నారు” అని చెప్పాడు.

దానికి ఒక ఉపాయం ఆలోచించాడు ద్రుపదుడు. ఒక బలిష్టమైన ధనుస్సును తయారు చేయించాడు. ఒక మత్స్య యంత్రాన్ని నిర్మించాడు. ఆ బలిష్టమైన ధనుస్సును ఎక్కుబెట్టి ఆ మత్స్యయంత్రమును కొట్టిన వారికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని స్వయంవరం ప్రకటించాడు. అందుకని రాజులంతా వెళుతున్నారు” అని ఆ బ్రాహ్మణుడు ధర్మరాజుకు చెప్పాడు.

ఇది అంతా విని కుంతీదేవి ధర్మరాజుతో “ధర్మజా, మనం చాలా కాలంగా ఈ బ్రాహ్మణుని ఇంటిలో ఉంటున్నాము. ఇతరుల ఇండ్లలో ఎక్కువ కలం ఉండటం ఉచితం కాదు. అందువలన మనం కూడా పాంచాల దేశం పోదాము” అని చెప్పింది.

దానికి ధర్మజుడు సరే అన్నాడు. అందరూ పాంచాల దేశం ప్రయాణం అయ్యారు. వారు పాంచాల దేశం వెళుతూ మార్గ మధ్యంలో వ్యాస మహాముని ఆశ్రమం దర్శించారు. వ్యాస మహాముని వారిని ఆశీర్వదించి “మీరు పాంచాలపురానికి వెళ్ళండి. మీకు మేలు జరుగుతుంది” అని చెప్పాడు. వ్యాస మహాముని ఆశీర్వాదం తీసుకొని వారు పాంచాలపురానికి ప్రయాణం అయ్యారు.

కామెంట్‌లు లేవు: