మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...
*పులిచర్మం..స్వామివారి లీల..ఆఖరిభాగం..*
*(యాభై వ రోజు)*
శ్రీధరరావు దంపతులు తాము కందుకూరు నుంచి తెచ్చిన పులిచర్మాన్ని తీసుకొని తమ ఇంటికి తిరిగివచ్చారు.. ఆసరికే ఇంటి దగ్గర శ్రీ చెక్కా కేశవులు గారి కుమారుడు కృష్ణ ఒక పెద్ద చెక్క పెట్టెను తన ముందు పెట్టుకొని కూర్చునివున్నాడు..
"ఏం నాయనా?..ఎప్పుడొచ్చావు?.." అని అడిగారు శ్రీధరరావు గారు..
"ఒక అరగంట అయిందండీ..నాన్నగారు పంపించారండీ..ఈ "పులిచర్మాన్ని" శ్రీ స్వామివారికి మీ ద్వారా చేర్పించమన్నారండీ.." అన్నాడు..
శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఆ పిల్లవాడు చెపుతున్న మాట ఒక్కసారిగా నిర్ఘాంతపోయేలా చేసింది..
పులిచర్మం..శ్రీ స్వామివారు తన తపోసాధన కొరకు కోరుకున్న పులిచర్మం.."నా కంతగా కావాలని అనుకుంటే..నా వద్దకు రాదా తల్లీ!.." అని శ్రీ స్వామివారు కొద్దిసేపటి క్రితం చెప్పిన మాట చెవుల్లో ఖంగున మ్రోగింది.."ఈ పాటికి వస్తూ ఉండాలని" కూడా ఆయన చెప్పారు..మహానుభావుల మాటలు పొల్లుపోవు..
వచ్చిన కుర్రవాడు కొద్దిగా సర్దుకున్నతరువాత.. శ్రీధరరావు ప్రభావతి గార్లు, ఆ చెక్క పెట్టెను తీసి చూసారు..
సుమారు ఏడడుగుల పొడవు..నాలుగు అడుగుల వెడల్పుతో..పెద్ద పులి ముఖంతో సహా ఉన్న చర్మం అది..అలాంటిది లభ్యం కావడం చాలా అరుదు..దాని ముందు తాము కందుకూరు నుంచి తెచ్చింది చాలా చిన్నదిగా ఉంది..
"నాన్నగారు ఈ మధ్య భద్రాచలం వైపు వెళ్లారండీ..తిరిగి వస్తుంటే..దారిలో ఎవరో ఈ పులిచర్మాన్ని అమ్మకానికి పెట్టి ఉన్నారట..ఎవరూ కొనడానికి ముందుకు రాలేదని అమ్ముకునే అతను వాపోతుంటే..నాన్నగారికి శ్రీ స్వామివారి తపస్సుకు ఉపయోగపడుతుందని అనిపించిందట.. ఖరీదు అడిగితే రెండువేల రూపాయలు ఇప్పించండి చాలు అన్నాడట ఆ అమ్మే వ్యక్తి..మారు మాట్లాడకుండా ఆ డబ్బు చెల్లించి ఇంటికి పట్టుకొచ్చేసారండీ..విజయవాడ లో ఈ పెట్టె కూడా చేయించారండీ..తాను స్వయంగా తీసుకొద్దామనుకుంటే..అత్యవసర పనుల వత్తిడీతో రాలేక..నన్ను మీకు అప్పచెప్పి రమ్మన్నారండీ..మీరు శ్రీ స్వామివారికి చేర్పించండి..మరి నేను వెళ్ళొస్తానండీ.." అన్నాడు కృష్ణ..
"అందరం కలిసి వెళ్లి స్వామివారికి అప్పజెప్పుదాము ..నువ్వు కూడా మాతో రా నాయనా..నాన్నగారి తరఫున నువ్వే అందజేద్దువు.." అన్నారు శ్రీధరరావు గారు..
"లేదండీ..నేను వెళ్ళాలి..ఏమీ అనుకోకండి.." అంటూ నమస్కారం చేసి..ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు..
ప్రభావతి గారికి ఇదంతా కలలా ఉంది..పులిచర్మం కోరుకోవడమేమిటి?..అది ఈరకంగా రావడమేమిటి?..అదికూడా తమ చేతుల మీదుగానే శ్రీ స్వామివారు స్వీకరించడమేమిటి?..తాను ప్రలోభపడితే..ఎంత సున్నితంగా వారించారో..మళ్లీ అంతే గౌరవంగా తమ ద్వారా తీసుకుంటున్నారు..నిజంగా తమ జన్మ ధన్యం!..అడుగడుగునా నిదర్శనాలు చూపుతున్న ఈ మహానుభావుడి సేవ తమ పూర్వజన్మ సుకృతం..ప్రభావతి గారి కళ్ళల్లో నీళ్ళు ధారాపాతంగా కారిపోయాయి..
"ప్రభావతీ..నేను ముందే చెప్పలేదా?..ఆయన గురించి మనం తాపత్రయ పడకూడదు..మనం కేవలం ఒక సాధనంగా తోడ్పాటు ఇద్దాము..మన బాధ్యత అంతవరకే..ఒక అవధూత సాధన కొరకు మనం సహకారం పరిమితులతో కూడి ఉంటుంది..అది మనకు లభించిన వరం అనుకోవాలి..పద..ఇప్పుడే వెళ్లి ఆయనకు ఈ పులిచర్మాన్ని అందజేసి వద్దాము.." అన్నారు..
పనివాడు అప్పుడే ఎద్దులను బండి నుంచి విప్పాడు..మళ్లీ ఆ గూడు బండి సిద్ధం చేయించి..అందులో ఆ పెట్టె పెట్టుకొని తిరిగి ఆశ్రమానికి చేరారు..అప్పుడు కూడా శ్రీ స్వామివారు వరండా లోనే వున్నారు..వీళ్ళను చూడగానే సంతోషంగా నవ్వారు..
"నాయనా..ఇదిగో పులిచర్మం!..కేశవులు గారు శ్రమపడి పంపించారు..ఆయన స్వయంగా రాలేక, వాళ్ళ అబ్బాయి ఇచ్చి పంపారు..మా ద్వారా మీకు ఇవ్వమని చెప్పి పంపారు.." అన్నారు ప్రభావతి గారు..
"అమ్మా..ఇది ఆ దేవీ ప్రసాదం..సాధన లో చివరి మెట్టుగా వ్యాఘ్ర చర్మం మీద తపస్సు చేస్తారమ్మా..కేశవులు గారు మీరు కూడా బాగా సహకరించారు.."
"నాయనా..ఉదయం నేను పడిన కలత అంతా తీరిపోయింది.. ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది మా ఇద్దరికీ..ఇక ఎప్పుడూ ప్రలోభ పడను.." అన్నారు మనస్ఫూర్తిగా ప్రభావతి గారు..
"దైవేెచ్చ తల్లీ!..శుభం జరుగుతుంది..!" అన్నారు శ్రీ స్వామివారు నవ్వుతూ..
శ్రీధరరావు దంపతులు కొండంత తృప్తి తో ఇంటికి వచ్చేసారు..ప్రక్కరోజే ప్రభావతి గారు తాము తెచ్చిన పులిచర్మాన్ని ఒక మనిషి ద్వారా కందుకూరులోని బాబాయి గారింటికి చేర్పించారు..వాళ్ళూ సంతోషించారు..
ఒక ముఖ్య ఘట్టం..శ్రీ స్వామివారి నిర్ణయం..తరువాతి భాగంలో..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).