6, జూన్ 2021, ఆదివారం

శ్లోకాలకు సంభందించిన కథ*

 *జాగ్రత జాగ్రత..  ఈ శ్లోకాలకు సంభందించిన కథ*   


 ఒక యోగి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఎవరితో నూ మాటాడేవాడు కాదు. ఎవరు ఏమి ఇచ్చినా పుచ్చుకునే వాడు కాదు.. ఆయన  కొండ మీద వున్న తన గుహ లోంచి రోజుకు ఒకసారి పక్కనే  వున్న నదిలో  స్నానం చెయ్యడానికి బయటకు వచ్చేవాడు.ఆ  ఊరి దగ్గర చెప్పులు కుట్టేవాడు ఒకడు సంతానము లేక ఈ యోగిని సేవించి ఆ కోరిక తీర్చుకుందామని ఎదురు చూసేవాడు.  కానీ వాడికి అవకాశం చాలాకాలం దొరకలేదు. ఎండా కాలము నది ఎండిపోయి ఇసుక బయటపడి సన్న పాయగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది.  రోజూ మధ్యాహ్నం ఆ యోగి ఎండలో నదికి వచ్చేటప్పటికీ  ఎండకు ఇసుక వేడెక్కి కాళ్ళు కాలుతూ ఉండేవి. 


ఒక రోజు చెప్పులు కుట్టేవాడు కొత్త చెప్పుల జత తెచ్చి యోగి నడిచి వచ్చే దారిలో ఉంచి, తాను కనపడకుండా ఉంటాడు. యోగి ఎండలో నడుస్తూ వచ్చి కాళ్ళ వేడి భరించలేక అనుకోకుండా ఆ చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుంటాడు.  కానీ వెంటనే తన తప్పు తను తెలుసుకుంటాడు. ఈ చెప్పులు ఎవరిని అని చుట్టు పక్కల పరిశీలిస్తాడు. చెప్పులు కుట్టే వాడిని చూసి అతనిని అడిగి విషయం గ్రహిస్తాడు. వేరే వాళ్ల చెప్పుల్లో కాళ్ళు పెట్టుకున్నందు వల్ల తాను వాళ్లకు ఋణ పడ్డానని తెలుసుకుంటాడు. ఆ రుణం తీర్చుకో కపోతే తనకు ముక్తి రాదు అని కూడా గ్రహిస్తాడు. ఆ రుణం తీర్చుకోవడానికి ఆ చెప్పుల వాడికి కొడుకు గా పుట్టడానికి నిశ్చ యించు కుంటాడు. 


యోగం ద్వారా తన ప్రాణాలు విడిచి చెప్పు వాడికి కొడుకు గా పుడతాడు. పుట్టినప్పటినుంచి ఆ పిల్లవాడు స్తబ్దు గా ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. కొడుకంటూ ఒకడు పుట్టాడు కాబట్టి ఎలా ఉన్నా చెప్పుల వాడు ఆ పిల్లవాడిని పోషించు కుంటూ ఉంటాడు. ప్రతిరోజూ రాత్రిపూట నాలుగు జాముల లోనూ నాలుగు వీధుల్లో తిరుగుతూ జాగ్రత్త జాగ్రత్త అని డప్పు కొట్టుకుంటూ అరవడం ఆ చెప్పుల వాడి బాధ్యత. అది వాడి ఉద్యోగం. 


ఒకరోజు  వాడికి  జబ్బు చేస్తుంది. వాడు తన ఉద్యోగం చేయలేక పోతాడు. అప్పుడు ఈ పిల్లవాడు తాను ఆ పని చేస్తానని తండ్రితో చెబుతాడు. ఆరోజు రాత్రి ఈ పిల్లవాడు నాలుగు వీధుల లో నాలుగు జాములలో తిరుగుతూ ఈ నాలుగు శ్లోకాలు పెద్దగా డప్పు కొడుతూ చదువుతాడు.


1. *శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర|| అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత  జాగ్రత||*


తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.


2. *శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|  సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత  జాగ్రత||*


తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.


3. *శ్లో|| కామ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|    జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత  జాగ్రత||*


తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.


4. *శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత  జాగ్రత||*


తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.


ఆ వూరి రాజుగారు అది విని ఆశ్చర్యపోయి ఈ రోజు డప్పు కొట్టిన వాడు మహా జ్ఞాని అని తెలుసుకొని పొద్దున్నే చెప్పులు కుట్టే వాడి ఇంటికి వస్తాడు. ఎన్నో కానుకలు కూడా తీసుకొస్తాడు. ఈ పిల్లవాడు రాజు గారికి తన పూర్వ జన్మ కధ చెప్పి రాజు తెచ్చిన కానుకలను తన తండ్రి కి ఇప్పించి తాను రుణ విముక్తుడై దేహాన్ని వదిలిపెడతాడు...


 *ఋణానుబంధ రూపేణా పసుపత్ని సుతాలయ*  అనేది ఈ కథలో చెప్పిన ముఖ్య విషయం. నాలుగు శ్లోకాల లో ఉన్నది భజగోవింద శ్లోకాల లో శంకరులు ప్రతిపాదించిన విషయమే ఉన్నది... శ్లోకాలు చాలా సరళంగా ను సులభంగా అర్థం అయ్యేటట్లు ఉన్నాయి. ఆధ్యాత్మికంగాను వేదాంత పరంగాను మనిషి జాగ్రత్త పడవలసిన విషయాలన్నీ ఈ శ్లోకాలలో ఉన్నాయి. ఇవి నాలుగూ చాలా ప్రసిద్ధమైన శ్లోకాలు. 


*ఇలాంటివే చాలా శ్లోకాలు  జాగ్రత్త జాగ్రత్త అని వచ్చేవి తర్వాత ఏర్పడ్డాయి..*


*పవని నాగ ప్రదీప్.*

కామెంట్‌లు లేవు: