*24.1.2022 సాయం కాల సందేశము*
*వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం*
*ప్రథమస్కంధం*
*పదమూడవ అధ్యాయము*
*ధృతరాష్టృని గృహనిష్క్రమణము*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
*13.31 (ముప్పై ఒకటవ శ్లోకము)*
*అజాతశత్రుః కృతమైత్రో హుతాగ్నిర్విప్రాన్ నత్వా తిలగోభూమిరుక్మైః॥513॥*
అజాతశత్రుడైన ధర్మరాజు ప్రతిదిన ప్రార్ధనము, సూర్యదేవునికి హవనము, బ్రాహ్మణులకు గోవులను, ధాన్యమును, భూమిని, బంగారమును దాన మొసగి నమస్సు లర్పించుట వంటి ప్రాతఃకాలకార్యక్రమములను నిర్వహించి పెద్దలకు వందనముల నొసగ వారి మందిరమును ప్రవేశించెను. కాని అతనికి అచ్చట పితరులు గాని, పెదతల్లియైన సుబల తనయ గాని కనిపించలేదు.
*13.32 (ముప్పదిరెండవ శ్లోకము)*
*తత్ర సంజయమాసీనం పప్రచ్ఛోద్విగ్నమానసః|*
*గావల్గణే క్వ నస్తాతో వృద్ధో హీనశ్చ నేత్రయోః॥514॥*
ఉద్విగ్నచిత్తుడైన ధర్మరాజు అంతట అచ్చటనే కూర్చొనియున్న సంజయుని వైపునకు తిరిగి "ఓ సంజయా! వృద్ధుడును, అంధుడును అగు నా పెదతండ్రి ఎచట నున్నాడు?" అని ప్రశ్నించెను.
*13.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*అంబా చ హతపూత్రార్తా పితృవ్యః క్వ గతః సుహృత్|*
*అపి మయ్యకృతప్రజ్ఞే హతబన్ధుః స భార్యయా|*
*ఆశంసమానః శమలం గంగాయం దుఃఖితోఽపతత్॥515॥*
మా శ్రేయోభిలాషియైన విదురుడు ఎక్కడ ఉన్నాడు? పుత్రమరణముతో తీవ్రముగా శోకించు చున్న మా పెదతల్లి గాంధారి యెచ్చట నున్నది? మా పెదతండ్రియైన ధృతరాష్ట్రుడును తన పుత్రపౌత్రమరణముతో మిగుల ఖిన్నుడై యున్నాడు. నిస్సందేహముగా నేను కృతఘ్నునిగా వర్తించితిని. తత్కారణమున నా అపరాధములను తీవ్రముగా భావించి అతడు తన భార్యతో సహా గంగానదిలో పడినాడా యేమి?
*13.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*పితర్యుపరతే పాండౌ సర్వాన్నః సహృదః శిశూన్|*
*అరక్షతాం వ్యసనతః పితృవ్యౌ క్వ గతావితః॥516॥*
మా తండ్రియైన పాండురాజు మరణించినప్పుడు పసివారమైన మమ్ము మా పెదతండ్రి మరియు పినతండ్రులే సర్వవిధములైన ఆపదలనుండి రక్షించిరి. వారు సదా మా శ్రేయోభిలాషులై యుండిరి. అయ్యో! వారిపుడు ఇచట నుండి ఎక్కడ కేగిరి?
*13.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*సూత ఉవాచ*
*కృపయా స్నేహవైక్లవ్యాత్సూతో విరహకర్శితః|*
*ఆత్మేశ్వరమచక్షాణో న ప్రత్యహాతిపీడితః॥517॥*
సూతగోస్వామి పలికెను: తన ప్రభువైన ధృతరాష్ట్రుని గాంచక కరుణ మరియు మనోక్షోభల చేత దుఃఖితుడై సంజయుడు ధర్మరాజునకు సరిగా సమాధానము నొసగలేకపోయెను.
*13.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*విమృజ్యాశ్రూణి పాణిభ్యాం విష్టభ్యాత్మానమాత్మనా|*
*అజాతత్రుం ప్రత్యూచే ప్రభోః పాదవనుస్మరన్॥518॥*
తొలుత అతడు బుద్ధిచే మనస్సును నెమ్మదిగా సమాధానపరచి, కన్నీటిని తుడుచుకొని తన ప్రభువగు ధృతరాష్ట్రుని పాదములనే స్మరించుచు ధర్మరాజునకు సమాధానమొసగ దొడగెను.
*13.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*సంజయ ఉవాచ*
*నాహం వేద వ్యవసితం పిత్రోర్వః కులనన్దన|*
*గాన్ధార్యా వా మహాబాహో ముషితోఽస్మి మహాత్మభిః॥519॥*
సంజయుడు పలికెను: ఓ కురువంశజుడా! గాంధారి మరియు నీ పితరుల నిర్ణయమును గూర్చి నేనేమియు ఎరుగను. ఓ రాజా! ఆ మహాత్ములచే నేను మోసగింపబడితిని.
*13.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*అథాజగామ భగవాన్ నారదః సహతుంబురుహః|*
*ప్రత్యుత్థాయాభివాద్యహ సానుజోఽభ్యర్చయన్మునిమ్॥520॥*
సంజయుడు ఆ విధముగా పలుకుచుండగా శక్తిమంతుడై నారదముని వీణాపాణియై అచటకు అరుదెంచెను. ధర్మరాజు మరియు అతని సోదరులు తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడి వందనముల నర్పించుట ద్వారా ఆ మునిని సగౌరవముగా ఆహ్వానించిరి.
*13.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*యుధిష్థిర ఉవాచ*
*నాహం వేద గతిం పిత్రోర్భగవన్ క్వ గతావితః|*
*అంబా వా హతపుత్రార్తా క్వ గతా చ తపస్వినీ॥521॥*
ధర్మరాజు పలికెను: హే భగవాన్! మా తండ్రులు ఎచటకు వెడలిరో నేను ఎరుగలేకున్నాను. అదేవిధముగా పుత్రులందరి మరణముతో దుఃఖితయై యున్న తపస్విని యగు మా పెదతల్లిని కూడా నేను గాంచకున్నాను.
*13.40 (నలుబదవ శ్లోకం)*
*కర్ణధార ఇవాపారే భగవాన్ పారదర్శకః|*
*అథాబభాషే భగవాన్ నారదో మునిసత్తమః॥522॥*
మహాసముద్రము నందలి నావకు కర్ణధారుని వంటి మీరు గమ్యమును చేరుటలో మాకు మార్గదర్శనము చేయగలరు. ఆ విధముగా సంబోధింపబడి భగవత్స్వరూపుడును, మునిసత్తముడును అగు దేవర్షి నారదుడు ఇట్లు పలుక నారంభించెను.
*13.41 (నలబై ఒకటవ శ్లోకము)*
*నారద ఉవాచ*
*మా కంచన శుచో రాజన్ యదీశ్వరవశం జగత్|*
*లోకాః సపాలా యస్యేమే వహన్తి బలిమీశితుః|*
*స సంయునక్తి భూతాని స ఏవ వియునక్తి చ॥523॥*
శ్రీనారదుడు పలికెను: ఓ రాజా! ప్రతియొక్కరు ఈశ్వరాధీనులై యున్నందున ఎవరిని గూర్చియు శోకింపకుము. కనుకనే జీవులు మరియు వారి పాలకులందరును తమ రక్షణార్థమై పూజాకార్యముల నొనరించుచుందురు. ఆ భగవానుడే జీవులను కలుపుచు విడదయుచున్నాడు.
*13.42 (నలబైరెండవ శ్లోకము)*
*యథా గావో నసి ప్రోతాస్తన్త్యాం బద్ధాశ్చ దామభిః|*
*వాక్తన్త్యాం నామభిర్బద్ధా వహన్తి బలిమీశితుః॥524॥*
దీర్ఘమగు ముక్కుత్రాడు వేయబడి బంధింపబడిన పశువు బద్ధమై యుండునట్లు, మానవులందరును పలువిధములైన వేదనిర్దేశములచే కట్టుబడి భగవాదాజ్ఞలను పాటింప బద్ధులై యున్నారు.
*13.43 (నలబై మూడవ శ్లోకము)*
*యథా క్రీడోపస్కరాణాం సంయోగవిగమావిహ|*
*ఇచ్ఛయా క్రీడితుః స్యాతాం తథైవేశేచ్ఛయా నృణామ్॥525॥*
ఆటగాడు ఆటవస్తువులను తన సంకల్పము ననుసరించి జతగూర్చుచు చిందర వందర చేయు రీతి, భగవానుని దివ్యసంకల్పము మనుజులను జతగూర్చుచు విడదీయుచున్నది.
*13.44 (నలబై నాలుగవ శ్లోకము)*
*యన్మన్యసే ధ్రువం లోకమధృవం వా న చో భయమ్|*
*సర్వథా న హి శోచ్యాస్తే స్నేహదన్యత్ర మోహజాత్॥526॥*
ఓ రాజా! ఆత్మ నిత్యమైనదని భావించినను లేదా భౌతికదేహము నాశవంతమని తలచినను సమస్తము నిరాకార పరతత్త్వము నందే స్థితమై యున్నదని భావించినను లేదా ప్రతిదియు ఆత్మ మరియు భౌతికపదార్థముల అనిర్వచనీయ కలయిక యని తలపోసినను అన్ని పరిస్థితుల యందును విరహభావనకు భ్రాంతిమయమైన అనురాగము తప్ప వేరొక్కటి కారణము కాదు.
*13.45 (నలబై ఐదవ శ్లోకము)*
*తస్మాజ్జహ్యంగ వైక్లవ్యమజ్ఞానకృతమాత్మనః|*
*కథం త్వనాథాః కృపణా వర్తేరంస్తే చ మాం వినా॥527॥*
కనుక ఆత్మజ్ఞానరాహిత్యముచే కలిగిన వ్యాకులతను నీవు శీఘ్రమే త్యజింపుము. అనాథులను, అమాయకులను అగు వారు నేను లేకుండా ఏ విధముగా జీవింపగలరని నీవిపుడు తలంచుచున్నావు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ప్రథమ స్కంధములోని పదమూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235