8, ఫిబ్రవరి 2022, మంగళవారం

సంపూర్ణభ్రమకార్యాగీతికందము

 ♦♦♦♦♦♦♦♦♦

*ఆంధ్రసంస్కృత*

*సంపూర్ణభ్రమకార్యాగీతికందము* 

ఏల్చూరి మురళీధరరావు

           🌷🌷🌷

తెలుగు కవులలో చిత్రకవిత్వాన్ని భాషాపరంగా శిఖరాగ్రస్థాయికి తీసికొని వెళ్ళిన మహాకవులలో పింగళి సూరన కనిష్ఠికాధిష్ఠితుడు. కళాపూర్ణోదయములో షష్ఠాశ్వాసంలో ఆయన వ్రాసిన 164-వ పద్యం తెలుగు భాషకు అత్యపూర్వమైనది. ఒకే పద్యాన్ని తెలుగు పద్యంగానూ, సంస్కృతశ్లోకంగానూ అన్వయించేందుకు వీలుగా ఆయన ఒక ‘ఉభయభాషా కందము’ను ప్రవేశపెట్టాడు. సంస్కృతంలో బహుభాషాచిత్రపద్యాలను వ్రాసిన కవులు పెక్కుమంది ఉన్నారు కాని, తెలుగులో దానిని ప్రవేశపెట్టిన సృష్టికర్త ఆయనే. ఆయన తర్వాత అటువంటి ఉభయభాషాకందాలను రచించినవారు ఉన్నా ముమ్మొదటివాడు మాత్రం ఆయనే. ఆయన అంతకంటె కఠినమైన ఇంకొక భాషాచిత్రాన్ని కూడా తెలుగులో ప్రవేశపెట్టాడు. అది ‘ఆంధ్రసంస్కృతభాషా భ్రమకచిత్రం’. కళాపూర్ణోదయం (6-172) లో ఉన్నది. పద్యాన్ని మొదటి అక్షరం నుంచి చివరికి చదివితే అది తెలుగు, పద్యం చివరి అక్షరం నుంచి మొదటికి చదివితే అది సంస్కృతశ్లోకం అన్నమాట. అటువంటి ఆలోచన ఒకటి రావటమూ, దానిని ఆచరణలో నిరాక్షేపణీయంగా నిర్వహింపగలగటమూ – రెండూ ఆయనకే చెల్లాయి. ఆయన తర్వాత అటువంటి ఉభయభాషాచిత్రరచనకు సాహసించిన మరొక కవి అల్లమరాజు రంగశాయి గారు. 


అల్లమరాజు రంగశాయి గారు సుగృహీత నామధేయులైన అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి గారి ద్వితీయ పుత్త్రులు. వీరి వైమాత్రేయులైన అన్నగారు అల్లమరాజు రామకృష్ణకవి గారు కూడా అనేక చిత్రకవిత్వ చిత్రబంధ రచనలు చేశారు. రంగశాయి గారు కాకినాడలో ఆంధ్ర సాహిత్య పరిషత్తుకు వెన్నెముకగా నిలిచినవారు. మహావిద్వాంసులు. తండ్రిగారి వలె కవిత్వయోగావిష్టులై అష్టావధాన శతావధానములను నిరాఘాటంగా నిర్వహించారు. 1860 లో జన్మించి 1936 లో పరమపదించారు. వీరి రచనలు ‘శ్రీమదాంధ్ర చంపూ భారతము’, ‘శ్రీమదాంధ్ర చంపూ రామాయణము’, ‘కుక్కుటలింగ శతకము’, ‘గంగా లహరి’, ‘గోపాలస్వామి శతకము’, ‘గోవింద శతకము’, ‘పరమాత్మ శతకము’, ‘మల్లికార్జున శతకము’, ‘మాధవ శతకము’, ‘రఘురామ శతకము’, ‘లక్ష్మీ శతకము’, ‘సర్వేశ్వర శతకము’ మొదలుగా అనేకం ఉన్నాయి. సంస్కృతంలో ‘కవిమానసరంజని’, ‘దైవస్తోత్రరత్నావళి’, ‘నారాయణానంద లహరి’ మొదలైన కృతులను రచించారు. వీరి ‘శ్రీమదాంధ్ర చంపూ భారతము’లో ఒక అపురూపమైన ‘ఆంధ్రసంస్కృతభాషా భ్రమకచిత్రం’ ఉన్నది. తెలుగు భాష ఎన్ని సొంపులు సోయగాలతో చిత్రచిత్రమైన నడకలతో దిగ్భ్రమను కలిగింపగలదో చెప్పేందుకు ప్రథమోదాహరణలివి. వ్యాఖ్యానసహితంగానైనా వీటిని అర్థం చేసుకోవటమే ఒక యజ్ఞమై ఉండగా, ఇక రచనచేయటం ఎంత దుష్కరమైన విద్యో వేరే చెప్పనక్కరలేదు. మన అదృష్టవశాత్తు కవిగారే దీనికి అర్థాలను వ్రాశారు. 

రంగశాయి గారి పద్యం ఇది: 


ఆంధ్రసంస్కృత సంపూర్ణభ్రమకార్యాగీతికందము


వే విభుహవ గన వమరవ, నా వజ సాహసపరక జనవనదవ సదా

మా వరరద తతతనురమ, రా వధిపా మాయ లని పరాకా రామా!  (శ్రీమదాంధ్ర చంపూ భారతము: 12-57)


అర్థములు: వే = శీఘ్రముగా, విభుహవ -- విభు = అంతటను వ్యాపించినటువంటి, హవ = ఆజ్ఞగలవాఁడా, కనవు = చూడవు, అమరవు = అనుకూలపడవు, అనా = అన్నా, వజ -- వ = సాత్త్వికమైనటువంటి, జ = జన్మముగలవాఁడా, సాహసపరక జనవనదవ -- సాహస = సాహసముతోఁ గూడిన, పరకజన = శత్రువులనెడి, వన = అడవికి, దవ = దవానలమువంటివాఁడా, సదామా = పుష్పమాలికలతోఁ గూడియున్నవాఁడా, వరరద - వర = శ్రేష్ఠమైన, రద = దంతములుగలవాఁడా, తతతనురమ -- తత = విస్తారమైనటువంటి, తనురమ = శరీరశోభగలవాఁడా, అధిపా = ప్రభుఁడవైనటువంటి, రామ = ఓ శ్రీరామా, మాయలని = మా యందు మాయలు గలవని, రావు = దర్శనమీకున్నావు, పరాకా = మఱచియున్నావా అని భగవత్ప్రార్థనము.   


నిఘంటువు: "ప్రభూశక్తాధిపౌ, నిత్యే పత్యౌ సర్వగతే విభుః" అని నానార్థరత్నమాల. "హవా ఆజ్ఞాహ్వానయజ్ఞాః" అనియు, "వః పుమాన్ సాత్త్వికే వాయౌ, సంయమే వరుణే స్మరే" అనియు నానార్థరత్నమాల యందుఁ జెప్పఁబడినది.


కందపద్యమందు విలోమముగా నున్న ఆర్యాగీతి


మారాకారాపనిలయ, మాపాధిపరామరనుతతతదరరవమా 

దాసవదవనజకరప, సహసాజవనావరమవనగవహభువివే.


(పదచ్ఛేదము: మారాకర, ఆపనిలయ, మాప, అధివర, అమరనుత, తతదరరవ, మా, దాసవదనవనజకరప, సహసా, అజవనావరం, అవ, నగవహ, భువి, వే) 


అర్థములు: మారాకర -- మార = మన్మథుని వంటి, ఆకార = రూపము గలవాఁడా, ఆప = ఉదకసమూహము, నిలయ = స్థానముగా కలవాఁడా, మాప -- మా = లక్ష్మికి, ప = అధిపతి వైనవాఁడా, అధివర = మిక్కిలి శ్రేష్ఠుడవైనవాఁడా, అమరనుత -- అమర = దేవతలచేత, నుత = స్తోత్రముచేయబడినవాఁడా, తతదరరవ -- తత = విస్తరింపఁబడిన, దర = శంఖముయొక్క, రవ = నాదముగలవాఁడా, దాసవదనవనజకరప -- దాస = భక్తులయొక్క, వదన = ముఖములనెడి, వనజ = పద్మములకు, కరప = సూర్యుని వంటివాఁడా, నగవహ -- నగ = గోవర్ధన పర్వతమును, వహ = వహించినవాఁడా, వే = పరమాత్ముఁడవైన ఓ దేవా, భువి = భూమియందు, అజవనావరం -- అజవన = మందుఁడనైనట్టియు, అవరం = అల్పుఁడనైనట్టియు, మా = నన్ను, సహసా = శీఘ్రముగా, అవ = రక్షింపుమా! అని భగవత్ప్రార్థనము.  


నిఘంటువు: “వి శ్చక్షుషి వ్యోమ్ని వాతే, పరమాత్మని పక్షిణి” – అని నానార్థరత్నమాల యందు జెప్పబడినది. “అపాం సమూహః ఆపం” అని వ్యుత్పత్తి. “కరాన్ కిరణాన్ పాతిరక్షతీతి కరపః. యద్వా కరైః కిరణైః పిబతీతి కరపః” అనియుఁ జెప్పవచ్చును. 


ఇటువంటి రచనలను రసవిహీనములైన కృతులు అని కొట్టిపారవేయటం తేలిక. అందుకు పెద్ద తెలివితేటలు అక్కరలేదు. వ్రాయటం కష్టం. అతివిశేషమైన శబ్దసంపద, కావ్యానుభవం, కల్పనాచాతురి, ప్రయోగనైపుణ్యం ఉంటేనే కాని సాధ్యం కాని హృద్యమైన పద్యవిద్య అది. విశ్వసాహిత్యంలో తెలుగు భాషయొక్క Elasticity ని, Flexibility ని, మహాకవుల సృజనశీలితావైభవాన్ని, శీలితనిఘంటుతను, చైత్యచోదనను, ప్రతిభాసర్వస్వాన్ని సోదాహరణంగా నిరూపించేందుకు ముఖ్యమైన ఆధారాలివి.

కామెంట్‌లు లేవు: