వైద్యో నారాయణో హరిః
1981లో పదకొండు సంవత్సరాల వయస్సులో మొదటి సారిగా పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకున్నాను. మా అమ్మమ్మ తాతయ్యలు స్వామివారికి పెద్ద భక్తులు. ఇంటిలో జరిగే ప్రతీ పెళ్ళికి స్వామివారి ఆశీస్సులు అందుకోవడం పరిపాటి. నా చిన్న చిన్నమ్మ పెళ్లికి ముందు మహారాష్ట్రలోని పండరీపురానికి ప్రయాణమయ్యాము. మాధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారి గది తలుపులు తెరవడంతో మొదటిసారి స్వామివారిని దర్శించుకున్నాను. ఆ గది తలుపులు తెరచినది కూడా ఇప్పటి స్వామినాథేంద్ర సరస్వతి అయిన బాలు మామే. ఇరవై భక్తుల మధ్యలో దాదాపు రెండు గంటల దర్శనానంతరం మరలా మరుసటిరోజు ఉదయం, సాయంత్రం కూడా స్వామివారిని దర్శించుకున్నాము. ఈ మూడు సందర్భాలే స్వామివారిని నేను మొదట దర్శించుకున్నది. భక్తులందరూ స్వామివారిని ఏవేవో ఎందుకు కోరుతున్నారో నాకు అర్థమయ్యేదికాదు. కొంతమంది తమ పిల్లలకు పెళ్లి అవ్వాలని వేడుకున్నారు. ఒకామె తనకు పుత్రభాగ్యం కావాలని కోరుకుంది. మరొకతను ఉద్యోగంలో ఉన్నత స్థానం కావాలన్నాడు. వీటన్నిటికీ సమాధానం స్వామివారి మౌన ఆశీస్సులు మాత్రమే! అమ్మమ్మ తాతయ్యలు పెళ్లిపత్రికను స్వామివారి ముందుంచి ఆశీస్సులను అర్థించారు. రెండురోజుల పండరీపుర యాత్ర పూర్తిచేసుకుని, మంత్రాలయానికి అటునుంచి మద్రాసుకు చేరుకున్నాము. అప్పటిదాకా మా నాన్నగారు స్వామివారిని కలవలేదు. అంతేకాదు వారు ఏ ఆధ్యాత్మిక గురువును కలవడం కూడా నేను చూడలేదు. కానీ నాకు తెలిసింది ఏమిటంటే ఇక్కడితో ఏదో మొదలవ్వబోతోంది అని.
రెండవసారి 1984లో కాంచీపురలో పరమాచార్య స్వామివారి దర్శనం. అంతకు సంవత్సరం క్రితమే చిన్నస్వామివారు కూడా కంచిమఠానికి రావడంతో ముగ్గురిని దర్శించుకోవడానికి వెళ్లాము. అమ్మమ్మ తాతయ్యలకు అది ఎప్పటిలాగానే అధి సాధారణ సందర్శనం. మా అమ్మ రాలేకపోయారు. మా నాన్న మఠానికి సంబంధించిన విషయాల్లో అంతా ఆసక్తిగా ఉండేవారు కాదు. వారు వృత్తినే దైవంగా భావించేవారు. స్వామివారు మా తాతగారి బంధువుల గురించి మా అమ్మానాన్నల గురించి అందరి గురించి అడిగారు. జయేంద్ర సరస్వతీ స్వామివారిని, శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారిని అప్పుడే నేను మొదటిసారి చూడడం. మద్రాసుకు వచ్చి మా పనుల్లో మేము ఉండిపోయాము. అప్పుడే మఠం నుండి ఒక వ్యక్తి మానసిక వైద్యుడైన మా నాన్నగారికి ఫోను చేసి ఒక రోగి గురించి మాట్లాడారు. ఆ రోగి వివరాలు ఏవీ నాకు తెలియవు. కానీ అతను మఠం వ్యక్తులకు సంబంధించిన వ్యక్తి అని అర్థమైంది. మా నాన్నగారు ఆ రోగిని కూడా అందరి రోగుల్లానే వైద్యం చేశారు. అయితే, ఒకరోజు స్వామివారు మఠంలో నాన్నని కలవమన్నారని మఠం నుండి ఫోను వచ్చింది. తీరికలేకపోవడంతో దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. ఒక ఆదివారం నాటి ఉదయం డ్రైవరుని ఇంటికి రమ్మని చెప్పి కంచికి వెళ్లాలని బయలుదేరారు. రెండు గంటల తరువాత మఠంలో ఉన్నారు. అప్పుడు జరిగిన విషయం ఇదే.
ఒక వ్యక్తి : సార్, మీరేనా డాక్టర్ మాతృభూతం?
నాన్న : అవును.
ఒక వ్యక్తి : టీవీ కార్యక్రమాలు ఇచ్చేది మీరేకదా?
నాన్న : అవును.
ఒక వ్యక్తి : నమస్కారం సార్, నేను కంచి మఠం వాడిని. మేరు ఈరోజు వస్తున్నారని స్వామివారు చెప్పారు. మెకోసమే వేచి చూస్తున్నాము.
ఈ క్షణమే మా జీవితాలను మలుపు తిప్పింది. జీవితాంతం గుర్తుంచుకోతగ్గ పరిణామాలకు ఇది నాంది. ప్రవేశద్వారం వద్ద ఆ వ్యక్తి చెప్పిన మాటలను విని మా తల్లితండ్రులు ఆశ్చర్యపోయారు. మఠంలోనికి వెళ్ళి, వెంటనే సాంప్రదాయ దుస్తుల్లోకి మారి, స్వామివారి వద్దకు వెళ్లారు.
పరమాచార్య : నీ పేరెంటి?
నాన్న : మాతృభూతం
పరమాచార్య : స్వస్థలం?
నాన్న : పెరాళం దగ్గర్లోని కూట్టనూర్. తాతగారు, కుట్టకరై రామసామి అయ్యర్.
పరమాచార్య : ఓహ్! అన్నదానం రామసామి అయ్యరా! అతనికి దీక్షను ఇచ్చింది నేనే. రమణానంద స్వామి.
మా ముత్తాతగారు 1952లో స్వర్గస్తులయ్యారు. ఈ సంభాషణ జరిగింది 1985లో. ఎవరైనా అంతపాత విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు. మా నాన్న అసలు నమ్మలేకపోతున్నారు. అప్పుడు వారికి అనిపించింది తను ఒక అసాధారణమైన వ్యక్తితో మాట్లాడుతున్నానని. తరువాత రోగుల గురించి, నాన్నగారి వృత్తి గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ రోగి త్వరగా కోలుకుంటున్నాడని తెలుసుకుని సంతోషంతో ఇద్దరినీ ఆశీర్వదించారు స్వామివారు. ఈ సంఘటన తరువాత నాన్న పూర్తిగా మారిపోయారు. మఠంలోని ఎందరో వారికి స్నేహితులయ్యారు. వారి వైద్యం చేస్తున్న ఆ రోగి వద్ద నుండి డబ్బులు తీసుకోరాదని నిశ్చయించుకున్నారు. తరువాత ఆల్ ఇండియా రేడియోలో ఒక కార్యక్రమానికి వెళ్లారు. అందులో “మనకు పేరు, ఖ్యాతి, ఆరోగ్యం, డబ్బు ఏదైనా దొరకొచ్చు. కానీ మహాత్ముల ఆశీస్సులకు అవి ఏమాత్రం సరితూగవు. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి” అని చెప్పారు.
మొదటి దర్శనం తరువాత నుండి ఇద్దరూ తరచూ స్వామివారి దర్శనానికి వెళ్ళేవారు. స్వామీజీలు అన్న పద్ధతినే తిరస్కరించేవారి జీవితాల్లో ఇదొక పెద్ద విషయం. చాలా సంవత్సరాలు మేము తిరుమల వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించాము. కానీ ఒక్కసారి కూడా మా నాన్నగారు సన్యాసులను దర్శించలేదు. కానీ పరిస్థితి మారిపోయింది. అప్పుడప్పుడు నేనూ, నా సహోదరుడు కూడా వారితోపాటు కంచికి వెళ్ళేవాళ్లం. కొన్నిసార్లు మా నాన్నమ్మ తాతయ్యలు కూడా వచ్చేవారు.
అలా వెళ్లినప్పుడు, మా నాన్నగారు వచ్చారని స్వామివారితో చెప్పేవారు మఠం అధికారులు. స్వామివారు వెంటనే “నువ్వు కాసేపు ఇక్కడ కూర్చో” అనేవారు. అప్పుడు నాన్నగారు స్వామివారితో ఎన్నో విషయాలు మాట్లాడేవారు. కూత్తనూరు దగ్గరలోని దేవాలయాల విషయాలను అడిగేవారు. మా తాతగారు కూడా తంజావూరు ప్రాంతం వారే కాక మాజీ రాష్ట్రపతి ఆర్. వేంకటామన్ కు బంధువు. రాష్ట్రపతి గారి గురించి కూడా అడిగేవారు స్వామి. సంభాషణ మరలా ఏదో ఒక రోగి వద్దకు వచ్చేది. ఆరోగ్య పురోగతిని విని స్వామివారు, “నువ్వు మఠానికి ఇంత చేస్తున్నావు! క్షేమంగా ఉండు! ఈ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునిరా” అని చెప్పేవారు. మేము ఆ దేవాలయాలను దర్శించుకుని తిరిగి వచ్చేవారం. మేము వచ్చిన తరువాత ఆ దేవాలయంలో కొందరు వ్యక్తుల గురించి అడిగేవారు. వారు స్వామివారికి చాలా దగ్గరివారేమో, అందుకే అడుగుతున్నారు అని అనుకునేవాణ్ణి.
కొన్ని నెలల తరువాత, ఆ రోగి మఠానికి వెళ్లిపోయాడు. నాకు తెలిసి ఇది జరిగింది 1986లో అనుకుంటా. ఆ రోగి తిరిగి రాగానే, “ఇతడు కోలుకున్నాడా! క్షేమంగా ఉండు! అంతా నీ చలవే” అన్నారు స్వామివారు. మా నాన్నగారికి ఒక శాలువా ఇచ్చి ఆశీర్వదించారు. అప్పుడు స్వామివారు పెద్దగా నవ్వడం నేను గమనించాను. “ఆ సమయంలో నడిచే పరమేశ్వరుడు మమ్మల్ని చూసి మందహాసం చేశాడు అని నేను గ్రహించలేదు!”
అది 1986. తరచూ మఠానికి వెళ్తుండేవారం. స్వామివారితో మా నాన్నగారు సంభాషించేవారు. అద్భుతాలు ఎప్పుడూ ఆగలేదు. మద్రాసు యు.యస్. కాన్సులేట్ అధికారిణి స్వామివారిని దర్శించుకోవడానికి మా నాన్నగారు సహాయం చేశారు. ఆమెకు ఒక విచిత్రమైన ప్రశ్న ఉండేది. తను నాల్గవసారి వివాహం చేసుకోవచ్చా అని. అప్పటికే మూడు సార్లు విడాకులు తీసుకుంది. కారు ప్రయాణించేటప్పుడు పొగ త్రాగుతూనే ఉంది. మఠంలోనికి అడుగుపెట్టగానే ఆపేసింది. స్వామివారిని దర్శించుకున్న తరువాత వారి ఎదురుగా కూర్చుంది. ఇరువురూ ఏమీ మాటాడుకోలేదు. పదిహేను నిముషాల తరువాత ఆమె పైకి లేచి, స్వామివారికి నమస్కరించి, బయటకు వెళ్లిపోయింది. తరువత మా నాన్నగారికి ధన్యవాదాలు తెలిపింది. నాల్గవసారి వివాహం చేసుకోవద్దని స్వామివారు తనను ఆజ్ఞాపించారని తరువాత తెలిపింది. 1994లో స్వామివారు సిద్ధి పొందిన తరువాత ఒక తమిళ పత్రికలో మా నాన్నగారు ఈ విషయాన్ని వ్రాశారు. అందులో చివర్లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. వీరి అవసరం స్వామివారికి ఎలా తెలిసింది? ఇది ఒక చిక్కుముడి. ఇది ఒక రహస్యం. దైవమే ఒక చిక్కుముడి కదా!
1985-86లో అయిదారు సార్లు మఠానికి వెళ్ళిన తరువాత, మఠం కార్యాలయం నుండి నాన్నగారికి కబురు వచ్చింది. “శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు” అన్నది దాని సారాంశం. నేను కూడా వారితోనే ఉన్నాను. నిజానికి మొత్తం కుటుంబం, అత్తలు, మావయ్యలు, పిన్ని, బాబాయిలు, వారి పిల్లలు మొత్తం అందరూ ఉన్నారు. రెండు కార్లను కూడా అద్దెకు తీసుకున్నాము. మఠంలో మేము స్వామివారిని కలిసాము. మమ్మల్ని ఆశీర్వదించిన తరువాత నాన్నగారిని తమ గదిలోకి పిలిచి దాదాపు గంటసేపు మాట్లాడారు. మేము ఆతృతగా ఎదురుచూస్తున్నాము. తరువాత నాన్నగారు బయటకు వచ్చారు.
వారి సంభాషణ క్లుప్తంగా ఇది.
జయేంద్ర స్వామి : నీ గురించి మఠంలో చాలా మందికి తెలిసినట్టుందే! నీవు ఏ డాక్టరువి?
నాన్న : మానసిక వైద్యుణ్ణి. మద్రాసులో పనిచేస్తున్నాను.
జయేంద్ర స్వామి : నీకు ఒక పని ఉంది. కలవై అని ఒక ప్రదేశం కంచి నుండి 40 కి.మీ. దూరం. అక్కడ ఒక వృద్ధాశ్రమం, శిశుకేంద్రం ఉన్నాయి. మీ కుటుంబంతో సహా వెళ్లి అక్కడ ఉన్నవారికి వైద్య సేవ చేయండి.
నాన్న : సరే, నేను చేస్తాను.
జయేంద్ర స్వామి : నెలకు ఒక్కసారి లేదంటే రెండు నెలలకు ఒకసారి వెళ్లి వారిని చూడండి.
కలవై స్వామివారు సన్యసించిన స్థలం అని అప్పటిదాకా మాకు తెలియదు. అది స్వామివారి భక్తులకు పరమపవిత్రమైన క్షేత్రం. ఆ శిశుగృహం ప్రత్యేక అవసరం ఉన్న పిల్లలకోసం. స్వామివారితో సంభాషించిన తరువాత సెలవు తీసుకుని పరమాచార్య స్వామివారిని దర్శించుకున్నాము. ఈ కొత్త ప్రణాళిక గురించి చెప్పగానే స్వామివారు చాలా సంతోషించి మమ్మల్నందరినీ ఆశీర్వదించారు. కంచిలో కొన్ని దేవాలయాలను సందర్శించి ఇంటికి తిరిగొచ్చాము. ఇప్పటికీ నడుస్తూ మాకు సకల సౌభాగ్యాలను ఇస్తున్న ఆ కార్యక్రమానికి నాంది ఇదే.
కలవైలో ఉన్న వృద్ధాశ్రమము మరియు శిశుగృహంలో ఉన్నవారికి వైద్య సహాయం అందించాల్సిన పనిని నాన్నగారికి అప్పగించారు. జయేంద్ర స్వామివారిని కలిసిన తరువాత, స్వామివారు కొన్ని వారాలపాటు మఠానికి దూరంగా తలకావేరీకి వెళ్ళిపోయారు. స్వామివారు అప్పగించిన పని గురించి ఏం చెయ్యాలో నాన్నగారికి పాలుపోలేదు. మా మేనత్త, మావయ్య మరియు వైద్యులైన మరికొందరికి తరువాతి అడుగు ఎలా వెయ్యాలో అర్థంకాలేదు. ఆ సమయంలోనే ఎస్‌బిఐలో పనిచేసే మా పెదనాన్న తిరుమలకు వెళ్లారు. అక్కడ జయేంద్ర సరస్వతీ స్వామివారు వేంకటాచలపతి గురించి తపస్సు చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవాలని పెదనాన్న నిర్ణయించుకున్నారు. డా. మాతృభూతం పెద్దన్నగా పరిచయం చేసుకుని ఆశీస్సులను కోరారు. తరువాత స్వామివారు నాన్నగారి గురించి మాట్లాడుతూ, “నేనతనికి అప్పగించిన పని మొదలుపెట్టారా?” అని అడిగారు. మా పెదనాన్న నాన్నగారితో ఈ విషయం చెప్పగానే స్వామివారి ఆదేశాన్ని పాలించడానికి సంసిద్ధులయ్యారు.
కంచికి వెళ్ళి పరమాచార్య స్వామివారిని కలిసి తను మొదలుపెట్టబోయే కార్యక్రమం గురించి తెలిపారు.
“అవునా ఇప్పుడే ప్రారంబించాలా?” అని స్వామివారు అన్నారు.
మొత్తం వైద్యుల బృందాన్ని, కుటుంబ సభ్యుల గురించి అడిగారు స్వామివారు. మరలా స్వామివారే, “కలవైకి వెళ్ళేముందు ఈ ఊరికి(గుడికి) వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రా” అని చెప్పారు.
మా నాన్నగారు స్వామివారు చెప్పినట్టే మఠానికి తిరిగొచ్చారు. వెళ్ళగానే “అక్కడ వర్షం పడిందా?” అని అడిగారు స్వామివారు.
స్వామివారు పక్కన కూర్చున్న వ్యక్తి ద్వారా, “అవును స్వామి వర్షం పడింది, అంతా మీ అనుగ్రహం” అని బదులిచ్చారు.
“అలాగా, అయితే ఇన్ని రోజులూ అక్కడ వర్షం పడకపోవడం కూడా నా అనుగ్రహమేనా?” అన్నారు స్వామివారు.
స్వామివారి హాస్య చతురతకు, బుద్ధి కుశలతకు ఆశ్చర్యపోయారు మా నాన్నగారు.
మా నాన్నగారి పర్యవేక్షణలో కలవై కార్యక్రమం మొదలుపెట్టబడింది. ఆశ్రమం వారికి వైద్య సహాయం ఇవ్వడానికి అక్కడకు వెళ్ళడం ఒక సరదా ప్రయాణంలా మొదలుపెట్టాము. పెద్దవారితో కలిపి ఒక నలభై మంది దాకా ఉన్న ఒక చిన్న ఆశ్రమం అది. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, వారి వారి ఆరోగ్యస్థితిని బట్టి మందుల చీటీలు తయారుచేసేవాళ్లం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పట్నంలో ఉండే యువకుల కంటే అక్కడ ఉన్న డెబ్బై సంవత్ర్సరాల పైబడ్డ ముసలివారే ఎక్కువ ఆరోగ్యంగా ఉండడం. యథాప్రకారం స్వామివారు సన్యసించిన స్థలాన్ని దర్శించుకుని అందరూ కంచికి బయలుదేరారు. అక్కడ జరిగిన విషయాలన్నిటిని స్వామివారికి విన్నవించారు మా నాన్నగారు. కొంతమంది వైద్యులు ఆసుపత్రిలో మా నానగారి విద్యార్థులే. ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములవ్వడం వారికి చాలా సంతోషంగా ఉంది. అప్పుడే స్వామివారి వద్దకు ఒక పేదవాడు వచ్చి బంగారం అడగడం గమనించారు మా నాన్నగారు.
పేదవాడు : నేను నా కుమార్తె వివాహం చెయ్యాలి, దానికి కావాల్సిన బంగారం నావద్ద లేదు. నాకు పదకొండు సవర్ల బంగారం కావాలి.
స్వామివారు : కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మను వేడుకో. తిరిగి రా, అమ్మ నీకు ఇస్తుంది.
స్వామివారు చెప్పినట్టుగానే చేసాడావ్యక్తి. కొన్ని నిముషాల తరువాత ఒక ధనవంతుడు వచ్చి పన్నెండు సవర్ల బంగారం సమర్పించాడు. కొద్దిసేపటి తరువాత ఆ పేదవాడు వచ్చి వెళ్లిపోవడానికి అనుమతి కోరాడు.
స్వామివారు : అమ్మను వేడుకున్నావా?
పేదవాడు : వేడుకున్నాను స్వామి.
స్వామివారు : బంగారం దొరికిందా?
పేదవాడు : లేదు.
స్వామివారు : ఎంత అడిగావు?
పేదవాడు : పదకొండు సవర్లు.
స్వామివారు : నాకు తెలుసు నీకు అత్యాశ లేదు అని. పేదవాడివైనా నిజాయితీపరుడివి. ఈ పన్నెండు తీసుకుని నీ కుమార్తె పెళ్లి జరిపించు.
పన్నెండు సవర్ల బంగారాన్ని ఇచ్చి ఆశీర్వదించారు స్వామివారు. ఆ పేదవాడు మఠం నుండి వెళ్లిపోయాడు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన మా అమ్మనాన్న ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ ఈ సంఘటనను తలచుకుంటే కేవలం స్వామివారి కరుణ తప్ప మరేమీ కనబడదు.
స్వామివారితో మా తల్లితండ్రుల ప్రయాణం ప్రారంభం అయ్యింది. ఈ సేవాకార్యక్రమం మొదలు పెట్టిన కొన్ని నెలల్లోనే, చిన్నతనం నుండి నాకు తెలిసిన ఎందరో మా నాన్నగారి మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని సేవలందించారు. కుటుంబ వైద్యులు మాత్రమే ఉన్న చిన్న సమూహం ఇప్పుడు పది మంది వైద్యులతో పెద్ద కుటుంబం అయ్యింది. ప్రతి నెలా ఆదివారం ఈ కార్యక్రమం జరిగేది. అందరూ మాయింట్లో సమావేశం అయ్యి, కావాల్సిన మందులు, పరీక్ష సామాగ్రి అన్నీ ఎక్కించుకుని కంచికి ప్రయాణమయ్యేవారు. స్వామివారిని దర్శించాలని మఠం అధికారులకు సమాచారం ఇచ్చేవారు. మఠం అధికారులు స్వామివారితో, “కలవై వైద్యులు వచ్చారు” అని చెప్పేవారు.
పరమాచార్య : నా వద్దకు రమ్మని చెప్పండి. కొద్దిసేపు నా వద్ద కూర్చుని తరువాత కలవై వెళ్ళమని చెప్పు.
దాదాపు ఇరవై నిముషాలపాటు స్వామివారి సన్నిధిలో గడిపేవారం. ఎందరో భక్తులు కేవలం స్వామివారి క్షణవీక్షణం కోసం పరితపించేవారు. “స్వామీ దయచేసి నన్ను ఈ కష్టం నుండి బయటపడవేయండి, భరించడం నావల్ల కావట్లేదు” అని ఎందరో స్వామివారిని వేడుకోవడం నా కళ్ళారా చూశాను.
చాలాసార్లు నన్ను ఆలోచింపజేసిన ఏమిటంటే, నమ్మకానికి మించి ఇలా ఎలా వేడుకోగలరు? ఎందుకు స్వామివారు వారికి నేరుగా సమాధానం ఇవ్వలేదు? కేవలం ఒకసారి వారిని చూసి, ఆశీర్వదించి మౌనంగా ఉండిపోయేవారు. “అసలు ఇలా కష్టాలు చెప్పుకోవడానికి మనకు హక్కు ఉందా?” అని వారిని చూసినప్పుడల్లా నాకు అనిపించేది.
వైద్యుల బృందంతో మాట్లాడి కలవై ఆశ్రమం గురించి వివరాలు అడిగేవారు. ఒక్కోసారి మా నాన్నగారు ఆశ్రమానికి దానం చేసే ఎవరైనా పెద్ద దాతను పిలుచుకునివెళ్ళేవారు. స్వామివారు వారిని చూసి, “ఇంతగా మఠానికి సేవ చేస్తున్నది నువ్వేనా? సంతోషంగా ఉండు” అని దీవించేవారు.
మేము సెలవు తీసుకుని కలవై ఆశ్రమానికి వెళ్ళేవాళ్లం. ఆశ్రమవాసులకు వైద్యం, సేవ కొన్ని గంటలపాటు జరిగేది. మా నాన్నగారు ముఖ్యంగా వీటన్నిటినీ నిర్వహిస్తూ ఎప్పుడైనా ఎవరికైనా మానసిక సమస్యలు వస్తే చూసేవారు. మాతోపాటుగా వచ్చే కొంతమంది వైద్య కళాశాల విద్యార్థులు వుండేవారు. వైద్యం చెయ్యడంలో సలహాలు, సూచనలు తీసుకునేవారు. అది చెన్నైలోని పెద్ద వైద్యుల చిన్న వైద్యశాల అయిపోయింది. “నా జీవితంలో ఎన్నో వేల మందికి వైద్యం చేశాను కానీ, సేవ చెయ్యడంలో ఉన్న ఈ సంతోషాన్ని ఎప్పుడూ పొందలేదు” అని చెప్పేవారు. ఈ కార్యక్రమం మొత్తం మా నిధులతోనే జరిగేది. ఇది మా కుటుంబసభ్యులకు, స్నేహితులకు మాత్రమే తెలుసు. అంతేకాదు, “నువ్వు ధర్మం చెయ్యకపోయినా పరవాలేదు కానీ, చేశానని మాత్రం ఎప్పుడూ చెప్పుకోకు. ఇదే హిందూ ధర్మం” అని మా నాన్నగారు ఎప్పుడూ చెబుతుండేవారు. ఎంత నిజం ఇది!!
వైద్యసేవ కార్యక్రమం పూర్తయిన తరువాత కంచికి తిరిగొచ్చి మొత్తం విషయాలను స్వామివారికి తెలిపేవాళ్లం. స్వామివారు ఎప్పుడూ అడిగే విషయాలు అక్కడి ఆశ్రమ అధికారులు ఏం చేశారు? మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి? అని. కార్యక్రమం తరువాత మమ్మల్ని చూడడం స్వామివారు ఎప్పుడూ మానలేదు. ఆరోగ్యం బాగోలేక, శరీరం సహకరించకపోయినా, పడుకున్న వారు పైకిలేచి ఆశీస్సులు అందించేవారు. అంతా మా నాన్నగారే చేస్తున్నారు కాబట్టి నేను వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తరువాత తెలిసింది మేము అలా చెయ్యడానికి కూడా స్వామివారే కారణం అని.
మా బృందం చేసిన గొప్ప పనులన్నీ స్వామివారి అనంతమైన కృప వల్ల మాత్రమే అని చాలా రోజులు నేను విస్మరించాను!
కార్యక్రమాల కోసం కలవై వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు కొన్నిసార్లు నేను కూడా వారితోపాటు వెళ్ళేవాణ్ణి. కొన్నిసార్లు వెళ్లలేకపోయేవాణ్ణి. నేను అప్పుడే కళాశాలకు చేరడం వల్ల, వారాంతాల్లో నేను చెన్నైలో వుంటే తప్పక వెళ్ళేవాడిని. చదువుల కోసం చిదంబరంలో వుండడం వల్ల వెళ్ళడం తగ్గించాను. అలా ఒకసారి వెళ్ళినప్పుడే ఈ సంఘటన జరిగింది.
మా నాన్నగారి అన్నగారు (అయిదుగురిలో మా నాన్న చిన్నవారు) వచ్చి స్వామివారిని దర్శించి తనను తాను బ్యాంకు రీజనల్ మేనేజరుగా పరిచయం చేసుకుని స్వామివారితో మాట్లాడారు. తిరుపతిలో జయేంద్ర స్వామివారితో జరిగిన సంభాషణను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి మేము వుండగానే స్వామివారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. తన వ్యాపార వ్యవహారం గురించి తన స్థితి గురించి స్వామివారికి చెబుతున్నాడు. తనతోపాటుగా కలిసి వుంటున్న తన బంధువుల గురించి, వారి ఆరోగ్యస్థితి గురించి చెప్పాడు. హఠాత్తుగా స్వామివారు ఒక విషయం అడిగారు.
స్వామివారు : చెన్నైలోని అభిరామపురంలో నీకు రెండు ఇళ్ళు వున్నాయి కదూ?
వచ్చిన వ్యక్తి : అవును, రెండు ఇళ్ళు వున్నాయి.
స్వామివారు : మరి మఠం కోసం ఏం చేయాలని అనుకుంటున్నావు?
వచ్చిన వ్యక్తి : మఠం కోసం తీసుకున్న వీటన్నిటినీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను.
అలా కొద్దిసేపు వారి సంభాషణ సాగింది. కొద్దిసేపటి తరువాత స్వామివారు మాతో, “ఓ, కలవై వైద్యులందరూ ఇంకా ఇక్కడే వున్నారా? నేను ఇంకా వీళ్ళకు అనుమతి ఇవ్వలేదా? సరే అందరూ వెళ్లిరండి” అని చెప్పారు.
అది చాలా చిన్న సంఘటనే కావచ్చు. ఆ వచ్చిన వ్యక్తికి అభిరామపురంలో రెండు ఇళ్ళు ఉన్నాయని స్వామివారికి ఎలా తెలుసు?
కేవలం కలవై ఆశ్రమవాసుల వైద్య సహాయం కోసం మా నాన్నగారు ‘శ్రీ కంచి పరమగురు మెడికల్ ట్రస్ట్’ ను స్థాపించారు. కాళహస్తి ఆశ్రమంలో కూడా ఈ కార్యక్రమాన్ని జరపడానికి స్వామివారిని అడిగారు. కానీ అందుకు స్వామివారి అనుమతి లభించలేదు. మా నాన్నగారు తలపెట్టిన కార్యక్రమం అలా కొనసాగుతోంది.
నేను చిదంబరంలో చదువుతున్నప్పుడు మాటల మధ్యలో నా స్నేహితునికి నాకు కంచి స్వామివారికి వున్న పరిచయాన్ని చెప్పాను. దాంతో అతను మరొక విషయం చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం స్వామివారు పాండిచ్చేరిలో ఉన్నప్పుడు నా స్నేహితుని తాతగారు స్వామివారికి త్రాగడానికి నీళ్ళిచ్చారు. 1980లలో స్వామివారు మరలా వచ్చినప్పుడు నా స్నేహితుడు, అతని తాతగారు స్వామివారి దర్శనానికి వెళ్లారు. కానీ భక్తుల తాకిడి ఎక్కువ ఉండడం వల్ల లోపలకు వెళ్లలేకపోయారు.
తాత : కొన్ని సంవత్సరాల క్రితం స్వామివారు ఇక్కడకు వచ్చినప్పుడు నేను వారికి నీళ్ళు ఇచ్చాను. బహుశా స్వామివారు మరచిపోయారు అనుకుంటాను.
కొద్ది నిముషాల తరువాత.
ఒక వ్యక్తి : ఇక్కడ పళనిపిళ్ళై ఎవరు?
తాత : నేనే పళనిపిళ్ళైని.
ఆ వ్యక్తి : స్వామివారు మిమ్మల్ని లోపలకు రమ్మంటున్నారు.
ఇప్పటికీ నాకు ఈ సంఘటన గుర్తుకువస్తే నమ్మబుద్ధి కాదు. స్వామివారికి అంతా తెలుసు.
మరొకసారి కంచికి వెళ్లినప్పుడు మా తాతగారి చిన్న తమ్ముడు జయేంద్ర స్వామివారిని కలవడానికి వచ్చారు. ఇరవై అయిదు సంవత్సరాల తరువాత వారిని దర్శనం చేసుకుంటున్నారు. అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. అప్పుడు మా తాతగారు నాతో చెప్పిన విషయం.
తాత : ఒరేయ్! సరస్వతీ అమ్మవారికి ఒక ప్రత్యేక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని ఈ స్వామివారే నాకు చెప్పారు. నేను రోజూ చెప్పుకుంటాను. ఇది చాలామందికి దొరకని గొప్ప అవకాశం, తెలుసా?
నేను : ఓహ్, అలాగా!
కొద్దిసేపటి తరువాత.
జయేంద్ర స్వామి : కాశీ, నీవు ఆ మంత్రాన్ని జపిస్తున్నావు కదూ?
ఇన్ని సంవత్సరాల తరువాత మా తాతగారి పేరును స్వామివారు ఎలా గుర్తుపెట్టుకున్నారు? అద్భుతాలు ఎప్పటికీ ఆగిపోవు.
--- శ్రీ భాస్కర్ మాతృభూతం. vandeguruparamparaam.blogspot.in నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం