16, జులై 2022, శనివారం

జేబులో డబ్బు

 జేబులో డబ్బు 

మనం ఇల్లు వదిలి వీధిలోకి వెళ్లినా కూడా జేబులో డబ్బులు వుంటటం అవసరం. డబ్బులు జేబులో లేకపోతె మనం ఏ కార్యం చేయలేము అనేది సత్యం.  పూర్వం ఒక సామెత చెప్పేవారు __రగ పోయిన యాగాని ఉండాలి.  నిజానికి అప్పట్లో కాల కృత్యాలను తీర్చుకోవటానికి ధనంతో పనిలేకుండుండేది. అయినా అప్పుడు ఆ సామెత పుట్టింది.  అదే ఇప్పుడు సులభాకాంప్లెక్స్ లో కాలు మడవటానికి కూడా డబ్బులు వసులు చేస్తున్నారు. 

మనం గ్రామాంతరానికి (వేరే ఊరికి) వెళితే జేబులో కొంచం ఎక్కువ డబ్బులు తీసుకొని వెళతాము.  దూరంగా వుండేవానికి తోడుగా ఉండేది ఏమిటి అంటే అతని వద్ద వున్న డబ్బులు మాత్రమే. అదే వేరే రాష్ట్రానికి వెళితే ఇంకా ఎక్కువ డబ్బులు జేబులో వేసుకొని వెళతాము. అదే విధంగా మనం వేరే దేశానికి వెళ్లాలంటే చాలా డబ్బులు తీసుకొని వెళతాము.  అంతే కాదు మన దేశపు ద్రవ్యం ఆ దేశంలో చెల్లుబాటు కావు కాబట్టి మనం వెళ్లే దేశపు ద్రవ్యంగా మన డబ్బులు మారకం చేసుకొని ఆ దేశపు ద్రవ్యమును తీసుకొని వెళతాము. ఇక వేరే లోకానికి వెళితే ఏమిటి భార్గవ శర్మకు పిచ్చి పట్టిందా వేరే దేశం వరకు మాకు తెలుసు వేరే లోకానికి నేను ఎందుకు వెళతాను అని నీవు అనవచ్చు.  కానీ మిత్రమా నీవు వేరే దేశం వెళతావో లేదో తెలియదు కానీ వేరే లోకానికి మాత్రం మనమంతా ఏదో ఒకరోజు వెళ్ళవలసిందే అందులో ఇసుమంతయు అనుమానం లేదు.  కాబట్టి మన వేరే లోక ప్రయాణానికి వలసినంత ద్రవ్యాన్ని ఇప్పుడే, ఇక్కడే సముపార్జన చేసుకోవాలి. ఇప్పడికే నీకు నేను చెప్పదలచినది అర్ధం అయ్యిందని అనుకుంటాను.

"జాతస్య మరణం ధ్రువం"

జన్మించటం యెంత నిజమో మరణించటం అంత సత్యం.  మనం ఎంతసేపు ఇక్కడ నేను శాశ్వితంగా వుంటాను అనే భ్రాంతిలో ఉంటాము.  ఆలా ఉండకపోతే నిజానికి మనం బ్రతికి ఉండలేము.  కానీ జ్ఞ్యాని అయినవాడు మాత్రమే తాను చూసే ప్రపంచం శాశ్వితం కాదని బ్రహ్మమొక్కటే సత్యం అని తెలుసుకుంటాడు. మనం ఏ కర్మలు చేస్తామో ఆ ఫలితం  పొందుతాము. మనం ఇడ్లి పాత్రలో పిండి వేసి ఉడికిన తారువాట్ దోశలు రావాలంటే రావు.  అదే విధాంగే పెనం మీద పిండి వేసి ఇడ్లి కావాలంటే రాదు.  కాబట్టి నీకు పుణ్య ఫలం కావాలంటే పుణ్య కార్యాలు,  పాప ఫలం కావాలంటే పాపకార్యాలు చేయవలసిందే అందులో సందేహం లేదు. 

పూర్వం ఒక పుణ్యాత్ముడు జీవితంలో పూర్తిగా ధర్మకార్యాలు చేసి సంపూర్ణంగా పుణ్యాన్ని సముపార్జించాడట కానీ ఒక పర్యాయం తన భార్యతో కటువుగా ప్రవర్తించాడట దాని కారణంగా అతనికి పాపం కలిగింది.  మరణానంతరం దేవదూతలు, యమ దూతాలు అతని వద్దకు వచ్చారట ఇతను పుణ్యాత్ముడు కాబట్టి ఇతనిని మేము స్వర్గానికి తీసుకొని వెళతాము అని దేవదూతలు అన్నారట దానికి యమదూతలు మీరు చెప్పింది నిజమే కానీ ఇతను తన భార్యను కఠిన మాటలాడి ఒకసారి మనోవేదనకు గురిచేశాడు కాబట్టి ఆ పాప ఫలంగా ఇతను ఒక్కసారి యమలోక దర్శనం చేసుకొని (అదే అతని శిక్ష) తరువాత స్వర్గానికి వెళ్లవచ్చని యమధర్మరాజు ఆజ్ఞాపించారని చెప్పి యమలోకం చూపించటానికి యమదూతలు ఆతనిని తీసుకొని  వెళ్లారు. ఆ పుణ్యప్తుడు యమలోకంలో విధించే చిత్ర విచిత్ర శిక్షలను చూసి బాధపడ్డాడు.  కాగా అతను అక్కడ వున్నందుకు శిక్షలు అనుభవించే పాపులకు కొంత ఊరట  కలిగిందట. అంత వారు మహానుభావా తమరెవరోకాని మీరు ఇక్కడ ఉన్నందువల్ల మాకు ఊరట  కలుగుతున్నది. కాబట్టి దయచేసి ఇక్కడ వుండవలసిందిగా ప్రార్ధించారట.  వారి మాటలు విన్న ఆ మహానుభావుడు వారి అవస్థలు నేను చూడలేక పోవుచున్నాను అని యమదూతలతో  వారికి ఉపశమనం కలిగించటానికి నేను ఏమి చేయగలను  అని ప్రశ్నించగా దానికి ఆ దూతలు మహానుభావా నీ వద్ద అపారమైన పుణ్యఫలం వున్నది నీవు ఆ పుణ్యఫలాన్ని వారికి దానం చేస్తే దానివల్ల వారు వారి శిక్షలనుండి విముక్తులు  అవుతారు. కానీ మీ పుణ్యఫలం శున్యం కావటం వలన మీరు ఇక్కడ శిక్షలను అనుభవించవలసి ఉంటుంది అని పేర్కొన్నారు. దానికి ఆయన ఇంతమందికి మేలు జరుగుతుందంటే నేను ఎలాంటి శిక్షలు ఐనా అనుభవించటానికి సిద్ధం అని చెప్పి ఆ క్షణమే తన పూర్తి పుణ్య ఫలాన్ని అక్కడి పాపులకు ధారపోసాడు. ఇంతలో ఒక పెద్ద భటుడు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడి భటులను మీరు ఈయనను ఇంకా ఎందుకు ఉంచారు తక్షణం ఈయనను స్వర్గ లోకానికి పంపాలి అని తొందర పెట్టాడు.  దానికి అక్కడ వున్న యమదూతలు జరిగిన వృత్తాంతం అంతా ఆయనకు వివరించి ఇప్పుడు ఈయన పూర్తీ పుణ్య ఫలాన్ని దానం చేయటం వలన ఇక్కడ వుండవలసి వచ్చింది అని తెలిపారు.  ఆ విషయం ఏమధర్మరాజుగారికి కూడా తెసులుసును కాబట్టే పాప పుణ్య గణన చేసి యముడు గారు ఇతనిని వెంటనే స్వర్గ లోకానికి ఆదేశించారు అని చెప్పారు.  అదెలా సాధ్యం ఇప్పుడు ఇతని వద్ద పుణ్య ఫలం లేదుకదా అని వారు అడుగగా దానికి ఆ భటుడు అయన తన పుణ్యఫలాన్ని పూర్తిగా దానం చేయటం వలన ఆ దానఫలంగా ఇతనికి తన పుణ్యఫలాన్ని రెట్టింపు పుణ్యఫలం లభించింది అని చెప్పి ఆ పుణ్యాత్ముని స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు. 

కాబట్టి మిత్రమా మనం నిస్వార్ధంగా చేసే ప్రతి కర్మ ఏంటో పుణ్యాన్ని చేకూరుస్తుంది.  ఇంక ఆలస్యం ఎందుకు ఇప్పుడే వేరే లోకంలోకి పనికి వచ్చే ద్రవ్యాన్ని (పుణ్యాన్ని) సంపాదించుకో నీ జన్మ ధన్యం చేసుకో.  ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి.  ఏదీకూడా ఆచరించటం చెప్పినంత సులువు కానీ  కాదు. కాకపొతే మన శక్తి సామర్ధ్యాలను పట్టి మనం పుణ్యకార్యాలు చేయటం సదా మనకు శ్రేయోదార్యం. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

కామెంట్‌లు లేవు: