16, జులై 2022, శనివారం

పులిచర్మము

 పులిచర్మము వంద, చిఱుత చర్మము అరవై ఐదురూపాయలే.

...............................................................


ప్రకృతిలో ఎన్నో జీవరాసులున్ననాయి. ఈ జీవులన్నింటిలోను ప్రకృతిశక్తులను అనగా నింగి, నీరు, నిప్పు, గాలి, భూమి మొ॥ వాటిని వుపయోగించు కోవడములో మానవుడే అగ్రగణ్యుడు. అడవిలో బ్రతికే జంతుజాలము  కేవలము ఉదరపోషణకే కష్టపడతాయి. కాని మానవుడు రేపటి తరానికి కూడా తన సంపదలు దక్కాలని చూస్తాడు. మానవుడు చేస్తున్న హననము వలన జీవసమతౌల్యము దెబ్బతిని పర్యావరణము క్షిణించిపోతోంది. 


మానవుడు అడవులను ఆక్రమించడము వలన అందులో జీవించే సాధు క్రూర జంతువులు ఆవాసము ఆహారము కరువై ఊరిబాట పట్టాయి. 


సాధుజంతువులు ఊర్లోపడితే ప్రమాదమేమి లేదు కాని, క్రూర జంతువులు గ్రామాలపై పడితే ప్రమాదమేగా, అందుకే వాటిని మొన్నటి మనిషి చాటుగా నక్కి తుపాకితో కాల్చడము, ఉరులు పన్నడము, ఇనుపక్లిప్పులు అమర్చడము, ఆహారములో విషము పెట్టడము, రహస్యంగా గోతులు తీయడము మొదలైన పద్ధతుల ద్వారా వాటిని చంపేవాడు. కాని నేటి మనిషి చర్మము, గోర్లు, దంతాలు, ఎముకలు మొదలైనవాటి కోసము అడవి జంతువులను చంపేస్తున్నాడు.


ఇక సప్తవ్యసనాలలో వేట ఒక్కటి. బ్రిటిష్ దొరలు వేటనెపముతో బారు తుపాకులతో పులులను సింహాలను చంపి, చచ్చిన వాటిపై కాలుపెట్టి ఫోటోలు దిగేవారు, పాశ్చాత్య సంస్కృతిని వంటబట్టించుకొన్న జమీందారులు తక్కువేమి కాదు, వారి వేట విలాసానికి వందలకొద్ది మూగ (క్రూర) జీవాలు బలైపోయాయి.


విశాఖపట్నం జిల్లాలో దట్టమైన అడవులుండేవి, అందులో పెద్దపులులు,చిఱుతలు, ఎలుగుబంట్లు, దమ్ములగొండ్లు (హైనాలు)  ఎక్కువగా వుండేవి. (హైనాలను అనంతపురం జిల్లాలో కత్తెగోరకలంటారు).


 ఇవి అప్పుడప్పుడు పశువులపై గ్రామాలపై దాడి చేసేవి. దాంతో ప్రజలు బ్రిటిష్ అధికారులను రక్షించమని వేడుకొన్నారు. బ్రిటిష్ సిపాయిలు పులుల వేట సాగించారు కాని సరైన ఫలితాలు ఇవ్వలేదు. విశాఖ మన్యములో వున్న కొండ దొరలు మాంచి వేటగాండ్లు, దాంతో బ్రిటిష్ అధికారులు పులులను ఇతర మృగాలను చంపే పనినివారికి అప్పగించి, ఒకపులిని చంపి దాని తోలును అప్పచెప్పితే 30రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అయితే అడవినమ్ముకొన్న కొండదొరలు పులులను చంపటానికి ముగపడలేదు. బ్రిటిష్ అధికారుల దోరణి ఒకదెబ్బకు రెండు పిట్టల సామెతలాంటిది కదా ! 


మృగాలనుండి మనుషులను పంటపొలాలను రక్షిస్తున్నామన్న సాకు ఒకటైతే అంతర్గతంగా మృగాల చర్మాలను ఎగుమతి చేసిడబ్బు సంపాదించడం మరో ఉద్దేశ్యము. 


రెండో ఉద్దేశ్యముతో పులి,చిఱుత, నల్లపులులు (పాంథర్), ఎలుగుబంటి, దమ్ములగొండి, నక్క,తోడేళ్ళను చంపి వాటి తోలును అప్పచెప్పినవారికి భారీ నజరానా ప్రకటించారు. ఎంతగానంటే పులికి 100 రూపాయలు,చిఱుతకు 65 రూపాయలు, ఎలుగుబంటికి 40 రూపాయలు, నక్కతోడేళ్ళకు 25 రూపాయలు ప్రకటించారు.


ఆ రోజుల్లో రూపాయి విలువ చాలా ఎక్కువ. వంద రుపాయలకే 10 ఎకరాల మాగాణి వచ్చేది. కనుక బ్రిటిష్ వాడు పన్నిన మాయలో కొండదొరలు చిక్కుకున్నారు.


1863 సంవత్సరము మొదటి ఆరునెలలలోనే  185 పులులను, 360 చిరుతలను, పాంథర్స్ లను, 72 ఎలుగుబంట్లను, 361 హైనాలను చంపేశారు. ఇక నక్కలతోడేళ్ళు వేలసంఖ్యలో హతమయ్యాయి. తాము దైవసమానంగా చూచుకొంటున్న జంతుజాలము ఇలా చంపడము సహించలేక, కొండదొరల కులపెద్దలు ఈ మారణకాండను ఆపాల్సిందిగా కట్టుబాటు చేశారు. దాంతో మృగాల వేట ఆగిపోయింది.


డెహ్రాడూన్‌ లోని ఫొరెన్సిక్ ల్యాబ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్స్ స్టిట్యూట్ అఫ్ ఇండియా వారు జరిపిన టిష్యూ & DNA, ఇతర పరిశోధనల వలన తేలిందేమంటే 1987 నుండి దేశములో 65 శాతము జంతుజాలము ఆహారము & అక్రమరవాణకు  బలైపోయింది. 5 లక్షల జంతువులు 2010 నుండి 2020 వరకు జరిగిన హింసలో అంటే చంపడము, హింసించడము, జంతువులతో సంభోగము, కాల్లునరకడము వంటి కారణాల వలన విపరీతంగా బాధలు అనుభవించాయి.


ఆటవిక జంతువులను రక్షించటానికి కేంద్రప్రభుత్వము  ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనే పటిష్టమైన చట్టాన్ని తెచ్చింది. కాని తీర్పురావడము ఒక జీవితకాలము లేట్ కదా ! 


ఉదా॥ 1998 లో సల్మాన్ ఖాన్ జింకలను చంపాడని కేసుపెడితే 2018 లో జోధ్‌ పూర్ కోర్టు అతనిని నిందితుడిగా నిర్ణయము చేస్తూ 5 సంవత్సరాల శిక్ష విధించింది. అతనేమో హైకోర్టులో బెయిల్‌ తెచ్చుకొన్నాడు. ఈ కేసు తెగేదెప్పుడు తెల్లారెదెప్పుడు, కేసులు పెట్టడము ఎంత ముఖ్యమో వాటిని పరిష్కరించడము అంతే ముఖ్యం, అప్పుడే మృగవేటగాళ్ళు భయపడతారు.


ఇంకోటుంది, దాని పేరు PETA (People for the Ethical Treatment of Animals), ఉద్దేశ్యము మంచిదే, కాని చర్యలే శూన్యం, అపుడపుడు ఏవో ఒకట్రెండు పేపరులో వార్తలు తప్ప, అడవి జంతువులకు వీరు చేసింది - O.


జంతురక్షణకు ప్రభుత్వకృషి ఎంతగా వున్నా, విరివిగా చెట్లను పెంచితే చాలు 50% జంతుమనుగడ ప్రగతిపథము వైపు వెళుతుంది.


ప్రకృతి ధర్మపీటము వారు అపారంగా చెట్లను పెంచటానికి  నిస్వార్థ, నిర్విరామ కృషి చేస్తున్నారు, వారికి అభినందనలు.


(సేకరణ)

.......................................................... జి.బి.విశ్వనాథ.9441245857, అనంతపురము.

కామెంట్‌లు లేవు: