#అఘోరీ_First_Part_1
[ పెద్ద కథ--మొదటి భాగము ]
పక్కనే శంఖనాదం వినపడటంతో తలతిప్పి చూసిందామె. తనకు స్వాగతం చెబుతున్నారా అన్నట్టు ఓ పది మంది యువకులు వరుసలో నించొని శంఖాలు పైకెత్తి, అరమోడ్పుకన్నులతో బలంగా శంఖాన్ని పూరిస్తున్నారు. రంగురంగుల ధ్వజాలు ఆ చీకట్లో కూడా రెపరెపలాడుతూ ముద్దలుగా పడుతున్న కాంతి వెలుగులో తమ రంగుల జిలుగులను వెదజల్లుతున్నాయి
ఎక్కడ చూసినా కాషాయ మయం. అంటే తాను జనస్రవంతిని దాటి వచ్చేసినట్టేనా? కాదు, భక్తకోటిని దాటి మాత్రమే వచ్చింది. జన ప్రవాహము ఇంకా ఉంది. వందలూ, వేలూ కాదు.. లక్షల్లో ఉన్నట్టుంది. అర్ధరాత్రిళ్ళు తిరగటము అలవాటేకానీ, ఇంతమంది జనం మధ్యకు రావడము ఇదే మొదటిసారి. కానీ సంకోచము, అప్రమత్తత అనేవి ఆమె మొహంలో లేవు. ఆమె తలతిప్పి చూసినపుడు కుడి చెవికి పెట్టుకున్న లోలాకు వింతగా కదలి అదొకరకమైన గంభీర భావాన్ని ప్రకటిస్తోంది.
అన్ని లక్షల మందిలో తాను వెతుకుతున్నవారిని కనుక్కోగలదా? కనుక్కున్నా, గుర్తించగలదా? తాను గుర్తించినా, వారు గుర్తిస్తారా? అయినా, తాను వచ్చిన పనేమి? చేస్తున్నదేమి?
ఒక్క క్షణం న్యూనతగా అనిపించినా, తన కర్త వ్యా న్ని సరిగ్గా తెలుసుకొని నిర్వహించాలంటే ఇది కూడా తప్పనిసరి..... అని మళ్ళీ తానే సమాధానం చెప్పుకొని మందగమనముతో ముందుకు వెళుతోంది. ఎటువంటి తొట్రుపాటు, ఆత్రము లేవు. బయలుదేరినప్పుడు ఉన్న జాగ్రత్త, తాను అన్న ఎరుకగానీ, లజ్జ గానీ ఇప్పుడేమీ లేవు.
తాను పూర్తిగా నగ్నంగా లేదు. కానీ, నగ్నంగా ఉందేమో అనుకునేవారికి అవుననిపించేటట్టూ, కాదేమో అనుకునేవారికి కూడా ఔననిపించేటట్టూ దట్టంగా బూడిద పూసుకొని, పుర్రెలు, రుద్రాక్షలు, ఇంకా పూసలతో చేసిన మాలలు , విరబోసుకున్న జడలు కట్టిన జుత్తు ఆమె ఒంటిపై బట్టలు ఉన్నాయో లేవో తెలీకుండా కప్పి ఉన్నాయి.
శవాలు కాలుతున్న వాసన రానురాను దగ్గరైంది. జనాలు పలుచబడుతున్నారు. వారిని జనాలు అనకూడదేమో... సాధకులు, సాధువులు, సన్యాసులు, నాగా సాధువులు, సాధ్వీమణులు, అఘోరాలు, అక్కడక్కడా తనలాంటి అఘోరీలు... అడుగడుగునా ఉన్నారు. ఎవరూ ఎవరినీ పట్టించుకోవటము లేదు. ఎవరి సాధన, అనుష్ఠానములలో వారున్నారు. కాళ్ళ కింద ఇసక ఇప్పుడు తడిగా అనిపిస్తోంది. అంటే వచ్చేశానన్నమాట. ఎక్కడ చూడాలి, ఎవరిని అడగాలి? అసలు ఎవరినైనా అడిగితే ఏమనుకుంటారు? తన మీద అనుమానం రాదూ? తనకు పేరు కూడా తెలియదాయె. చూస్తే కూడా గుర్తుపడతానన్న నమ్మకము లేదు. అసలు తనకు ఎందుకు ఈ ప్రస్థానము? గురూజీ కి చెప్పి వచ్చానన్న ధైర్యం ఒకటే తప్ప, తాను నియమాలు తప్పి ప్రవర్తిస్తోందా ?అన్న అనుమానం అప్పుడప్పుడూ కలుగుతోంది. అలాగైతే గురూజీ వారించేవారు కదా?
మనుషులు బాగా తగ్గిపోయారు. రాత్రి రెండో జాము చివరలో ఉన్నట్టుంది. ఉన్నట్టుండి దూరంగా ఒక సంగీతం లాంటిది వినపడింది. డప్పులు మోగుతున్నాయా? కాదు, ఢమరుకాలు మోగుతున్నాయి. నల్లటి పొగ నదిపై తేలుతూ వెళుతున్నది ఆ అష్టమి వెన్నెల్లో బాగానే తెలుస్తోంది. ఏదో పాట... తెలుగు పాట!! మనసు ఉరకలు వేసింది. ఆ పాట తనకు తెలుసు!! చిన్నప్పుడు అమ్మ పాడేది.
నలుపూ నరుడనీ నగుబాటు గురుడని..
నలుపు నారాయణుడు నగునూ కాదా.
సుక్కలు తెలుపు సూరీడు తెలుపు
సక్కన్ని నా తల్లే తగును కాదా?
శంభుడు, శర్వుడు, సాంబ సదాశివుడు
రుద్ర రూపుడు శివుడు అగును కాదా?
నియత నిరుపమ రేజసు కలది
జిల్లేడు శాఖము తెగును కాదా
ఎవరా పాడేది? దాదాపు అరవై యేళ్ళ కిందట తన తల్లి పాడిన పాట, ఇప్పుడు ఈ త్రివేణీ సంగమములో ఈ అపరాత్రి కాలుతున్న శవం ముందర కూర్చొని ఆ పాడేది ఎవరు? ఆమేనా జేజెమ్మ? జేజెమ్మ ఫోటో తాను చిన్నపుడు చూసి ఉంది. అప్పట్లో ఆ ఫోటోలో ఆమెకు పన్నెండేళ్ళు ఉంటాయి. ఆ ఫోటో ఎప్పటిదో తెలీదు. అంతకు ముందు ఒక వందేళ్ళ వెనుకటిది అని చెప్పుకునేవారు. అంటే వంద కు అరవై కలిపితే నూట అరవై. ఆమె వయసు నూట అరవై ఉంటుందా? ఇన్నేళ్ళు బతికిందా? బతకడము ఆశ్చర్యమేమీ కాదు. మూడు వందల యేళ్ళు బతికినవారినీ తాను చూసింది. అలాగని అందరూ వందల యేళ్ళు బతుకుతారని ఎలా అనగలము? మరి, మరి.... ఆ పాట? చిన్నపుడు తన తల్లికి ఆమె అత్తగారు నేర్పిందట. ఆ అత్తగారికి ఆమె అత్తగారు నేర్పిందట. ఆ పాట ఎప్పటిదో? చిన్నపుడు రేడియోలో కూడా వచ్చేదట. అలా రేడియోలో విన్నవారు ఎందరైనా ఉండచ్చు, ఎవరైనా కావచ్చు.. ఆ పాట నేర్చుకొని ఉండచ్చు.. ఇక్కడ పాడేది జేజెమ్మే అని ఎలా చెప్పగలను? ఒక వేళ జేజెమ్మే అయినా, గుర్తుపట్టడం అసాధ్యం. ఇప్పటి ఆమె పేరు ఇంకేదో ఉంటుంది. చిన్నప్పటి పేరు " కుముద్వతి " అని చెప్పేవారు. ఈమెకు ఆ పేరు గుర్తు ఉండి ఉంటుందా?
కాలుతున్న శవం దగ్గరికి వచ్చింది.
[ సశేషం ]
-- by Vibhatha Mitra