ॐ ఉత్తరాయణ పుణ్యకాల సంక్రాంతి శుభాకాంక్షలు.
దేవతలకు పగలు ప్రారంభమైన సమయం.
I. మన సంవత్సరం - దేవతల రోజు
మనకి సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజు.
సూర్యుడు
- మకరరాశిలోకి ప్రవేశించే "మకర సంక్రాంతి" ఉత్తరాయణ పుణ్యకాలంతో దేవతల పగలు ప్రారంభం.
- కర్కాటకరాశిలోకి ప్రవేశించే "కర్కాటక సంక్రాంతి" దక్షిణాయన పుణ్యకాలంతో దేవతల రాత్రి ప్రారంభం.
- మకరరాశిలోకి ప్రవేశించేముందు ధనస్సులోకి ప్రవేశించే ధనుర్మాసం దేవతలకు తెల్లవారు ఝాము.
నాలుగు ఏకాదశులు
1. దేవతల రాత్రి అయిన దక్షిణాయనం ప్రారంభమైయ్యాక వెంటనే వచ్చే ఆషాఢమాస శుక్లఏకాదశి శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడు. దానిని "శయన ఏకాదశీ" అంటారు.
స్వామి జీవులను తనతో కలుపుకునే "యోగం" ద్వారా మరింతగా అనుగ్రహించడానికి ఆలోచిస్తూంటాడు.
(12 నెలల మన సంవత్సరం అయిన దేవతల ఒకరోజులో, మూడవవంతు అయిన నాలుగు నెలలు వారి నిద్రాకాలం. ఆ పద్ధతిలోనే, మన 24 గంటల్లో మూడోవంతు నిద్రకి కేటాయిస్తాము)
2. మన రెండు నెలల కాలం అయ్యాక, భాద్రపద శుక్ల ఏకాదశీనాడు ఆయన అటువాడు ఇటు తిరిగి పడుకుంటాడు. దాన్ని "పరివర్తన ఏకాదశీ" అంటారు.
3. మరొక రెండు నెలల తరువాత కార్తీక శుక్ల ఏకాదశీ నాడు యోగనిద్రనుండీ లేస్తాడు. దానిని "ఉత్థాన ఏకాదశీ" అంటారు.
4. సౌరమానంతో చూసే ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశీ నాడు, స్వామి వైకుంఠంలోని ఉత్తర ద్వారం నుండీ దేవతలకి దర్శనమిస్తాడు.
దానిని "వైకుంఠ ఏకాదశీ" అని, "ముక్కోటి ఏకాదశీ" అనీ పిలుస్తారు.
ఆ ఉత్తరద్వారంలో స్వామిని అందరమూ దర్శనం చేసుకుంటాం.
మన సంవత్సరం దేవతలకి రోజు అని చెప్పుకున్నాం కదా! ఆవిధంగా, వారు ప్రతీరోజూ వారి తెల్లవారుఝామున వైకుంఠద్వారం నుండీ స్వామిని దర్శించుకుంటారు.
అన్వయం
II. సూర్యుడు
సూర్యుడు రెండు రకాల వెలుగులను ప్రసాదిస్తాడు. అందులో
- మొదటిది, కాంతి రూపంలో భౌతికంగా చూడగలిగేది, వేడిరూపంలో పొందగలిగేది. దీనిని దీపాలరూపంలోనూ, సౌరశక్తితో నడిచే కుక్కర్ల వంటివాటి రూపాలలోనూ చూస్తాం.
ఈ విషయాలు సూర్యునికి భూమి దగ్గరవుతూండడం మొదలై, ఉష్ణాంశం పెరిగే కాలం ప్రారంభం అనే దాన్ని ఉత్తరాయణంగా సూచిస్తుంది.
- రెండవది, ఆలోచనకి సంబంధించి జ్ఞానరూప వెలుగు. సౌరశక్తితో పనిచేసే Solar Calculators వంటి యంత్రాలే దీనికి నిదర్శనం.
III. దైవ సంపద
మనలోని దైవశక్తులను చైతన్యవంతం చేసికొనే కాలంగా సాధనా పరంగా మరొక కోణంలో దేవతల పగలు ప్రారంభం అని చూపిస్తుంది.
ఈ విషయాలలో భగవద్గీతలో తెలిపిన "దివ్యగుణ సంపద" అనేదాన్ని పరిశీలిద్దాం.
దివ్యగుణ సంపద:
1. భయము లేకుండుట - అభయమ్,
2. తనలోని అన్వయ వ్యతిరేక శక్తుల (positive & negative) నడుమ సామ్యము చెడిపోకుండుట - సత్త్వ సంశుద్ధి,
3. క్రమ పద్ధతిలో జ్ఞానమాచరించి, అది తనయందు యోగము చెందునట్లు చూచుకొనుట - జ్ఞానయోగవ్యవస్థితి,
4. ఉన్నంతలో ప్రేమపూర్వకంగా సమర్పించ గలుగుట - దానము,
5. తనపై బాహ్యవిషయ ప్రభావం లేకుండా చూచుట - దమము,
6. ఫలితం నశించకుండా చేసే మంచి పని - యజ్ఞము,
7. శాస్త్రగ్రంథాల మననం, వాటి వెలుగులో జీవనం మలచుకొనుట - స్వాధ్యాయము,
8. తనలోని జ్ఞాన, ప్రాణ, దక్షిణాగ్నులు మూడిటిని ప్రజ్వలింపజేసి, వానిని సద్వినియోగం చేయుట - తపస్సు,
9. కపటం లేకుండడం - ఋజుత్వం,
10. మనోవాక్కాయ కర్మలచే ఏ జీవిని బాధింపకుండటం - అహింస,
11. సత్యము అవసరము కొఱకుగాక, తన స్వభావంగా ఉండుట - సత్యము,
12. కోపము తనలో నిలువకయుండడం - అక్రోధము,
13. తనది తనకావశ్యకమైనా, మంచి పనికి సమర్పణ చేయగలుగుట - త్యాగము,
14. ఏ పరిస్థితిలోనూ చికాకు పడకుండడం - శాంతి,
15. ఎవరియెడల దుర్బుద్ధి లేకుండడం, కొండెములు చెప్పకుండడం - అపైశునమ్,
16. సర్వజీవులయందు దయ కలిగియుండడం - దయ,
17. ఏ విషయమందైనా ఆవశ్యకతను మించి ఆసక్తి లేకుండుట - అలోలత్వం,
18. మృదువుగా ప్రవర్తించుట - మార్దవము,
19. తనయందెంత స్వల్పదోషమున్నా సిగ్గపడకుండడం, ఒదిగి ప్రవర్తించడం - ఉచిత లజ్జ - హ్రీః,
20. అనవసరమైన కుతూహలం లేకుండడం - అచాపలం,
21. తన చుట్టు ఉన్నవారిని ఆకర్షించి, వారికి సుఖశాంతులను ప్రసాదించే తన తేజస్సు,
22. ఓరిమి కలిగియుండడం, సహనం - క్షమ,
23. తనయందు తాను నిలబడుట - ధైర్యము - ధృతి,
24. మానసిక శుభ్రత - శౌచము,
25. మేలు జరిగినచోట కీడు తలపెట్టకుండడం - అద్రోహము,
26. దురభిమానం లేకుండడం - నాతిమానితా.
- భగవద్గీత 16 - 1,2,3
IV. భగవంతుడు - దేవుడు
ఇప్పుడు "భగవంతుడు" అంటే నిర్వచనం చూద్దాం.
భగవంతుడు
మొదటి నిర్వచనం
భగములు ఆరు. అవి
1. ఐశ్వర్యము,
2. వీర్యము,
3. యశస్సు,
4. సంపద,
5. జ్ఞానము,
6. వైరాగ్యము.
"ఐశ్వర్యస్యసమగ్రస్య వీర్యస్య యశస శ్శ్రియః I
వైరాగ్యస్యాథమోక్షస్య షణ్ణాం భగ ఇతీ రణా ॥"
ఈ ఆరు గుణాలు కలవాడు "భగవంతుడు".
రెండవ నిర్వచనం
1. భూతముల పుట్టుకను,
2. నాశమును,
3. రాబోయెడి సంపత్తును,
4. రాబోయెడి ఆపత్తును,
5. అజ్ఞానమును,
6. జ్ఞానమును ఎఱుంగువాడు.
"ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం గతిం I
వేత్తి విద్యా మవిద్యాం చ సవాచ్యో భగవానితి॥"
ఈ ఆరూ ఎవ్వరెరుగురో, ఆయన "భగవంతుడు" అనబడతాడు.
ఇప్పుడు "దేవుడు" అనే దానికి నిర్వచనం చూద్దాం.
దేవుడు
"దేవుడు" అనే శబ్దం పది అర్థాల సమూహం గా నిర్వచింపబడింది.
1.శుధ్ధమగు జగత్తును క్రీడింప చేయువాడు.
అ)తన స్వరూపమందు తానే ఆనందంతో క్రీడించువాడు,లేక,
ఆ)పర సహాయంలేకుండా,సహజ స్వభావంతో క్రీడలాగా సమస్త జగత్తునూ చేసేవాడు,లేక,
ఇ)సమస్త క్రీడలకు ఆధారమైనవాడు.
"యో దీవ్యతి క్రీడతి స దేవః"
2.ధార్మికులు జయించాలి అనే కోరిక కలవాడు.
అందరినీ జయించేవాడు, అనగా అతనిని ఎవరూ జయించలేరు.
"విజగీషతే స దేవః"
3.అన్ని ప్రయత్నములకు సాధనోప సాధనములను ఇచ్చువాడు
న్యాయాన్యాయ రూప వ్యవహారమూలను తెలియువాడు.
"వ్యవహారయతి స దేవః"
4.స్వయం ప్రకాశ స్వరూపుడు,
అన్నిటికి చరాచర జగత్తు అంతటికి ప్రకాశకుడు.
"యశ్చరాచరం జగద్ద్యోతయతి సదేవః"
5.ఎల్లర ప్రశంసకు యోగ్యుడు.
.నిందింప దగనివాడు.
"య స్త్యూయతే స దేవః"
6.తాను స్వయమానంద స్వరూపుడు.
ఇతరులకానందము కలుగజేయువాడు,దుఃఖము లేశమూ లేనివాడు.
"యో మోదయతి స దేవః"
7.మదోన్మత్తులను తాడించేవాడు.
సదాహర్షితుడు.శోకరహితుడు.ఇతరులను హర్షింపజేయువాడు,దుఃఖమునుండి దూరము చేసేవాడు.
"యో మాద్యతి స దేవః"
8.అందరి శయనార్థము రాత్రిని,ప్రలయాన్ని చేసేవాడు.
.ప్రలయసమయమున అవ్యక్తమందు సమస్తజీవులను నిద్రింపజేయువాడు.
"యః స్వాపయతి స దేవః"
9.కామించుటకు యోగ్యుడు.
సత్యకాముడు.శిష్టులకామమునకు లక్ష్యమగువాడు.
"యః కామయతే కామ్యతే వా స దేవః"
10.జ్ఞాన స్వరూపుడు.
అన్నిటియందు వ్వాప్తుడై, తెలియుటకు యోగ్యుడు.
"యో గఛ్ఛతి గమ్యతే వా స దేవః"
దేవః - అనే శబ్దం "దివు క్రీడా విజగీషా వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు" అనే ధాతువునుండి సిధ్ధమవుతోంది.దాని నుంచీ వచ్చినవే పైన పేర్కొన్న పది అర్థాలు.
VI. ముగింపు
మకర సంక్రాంతి - ఉత్తరాయణ పుణ్యకాలం
ఈ సమయంలో, దేవతల పగలుగా - మనలోని దైవీ శక్తులను గుర్తించి, వాటిని చైతన్యపరచుకుంటూ, దైవానుభూతి కలిగి, మనం "దైవమే" అనే అద్వైతసిద్ధి పొందుదాం.
సాధనలో పూర్ణత్వానికి చేరుకొని,దక్షిణాయనం అనే దేవతల "విశ్రాంతి" కాలానికి పునాది వేసుకుందాం.
విశేష అనుబంధం
దీనితోపాటు ఇతర మతస్థుడైన ఒక మిత్రుడు ఈ పండగ మతాతీతమైనదనీ, విజ్ఞాన శాస్త్ర పరంగా గొప్పదనీ, ఆంగ్లంలో నాకు పంపిన విషయం కూడా దీనితో జతపరుచబడింది.
Makara Sankranti is not only a Hindu festival but actually a universal phenomenon because it is purely based on the science of astronomy & crop cycle which is not limited to any particular religion.
Basically, it is a celebration of the “revival” of sunlight (solar energy & positivity) into our lives and it coincides with the harvest season as well.
The zodiac phases of the Sun from July to December witness decreasing sunlight, and after that, the subsequent zodiac phases witness increase in sunlight.
It looks like the Sun is on a downward journey between July to December and this downward journey suddenly changes to upward journey or northward movement in late December & early January.
Since "Uttara" means "Northward" & "Aayana" means "Movement" in Sanskrit, this phenomenon of phase reversal from Southward movement to Northward movement of the Sun is called “Uttara Ayana” or “Uttarayan” in short.
We have 12 Zodiacs in an year, there will be 12 Sankrantis each year.
But as we saw how Makara is significant due to the revival of sunlight, the “Sankranti of Makara” (or transmigration of Sun into Makara) is celebrated as “Makara Sankranti”.
Wish you and your family happy Makara Sankranti.🌹💐🌺
=x=x=x=
-- రామాయణం శర్మ
భద్రాచలం