15, జూన్ 2024, శనివారం

సమస్య పూరణ.

 *అతివలc గాంచినన్ విముఖుcడై చనువాcడనగా రసజ్ఞుడౌ*

ఈ సమస్యకు నాపూరణ. 



సతతము ధ్యాన యోగములు సాధన చేసెడి పుత్రుడున్ యథో


చితముగ తల్లి దండ్రులకు సేవలు చేసెడి శ్రావణాఖ్యుడున్


అతివలc గాంచినన్ విముఖుcడై చనువాcడనగా - రసజ్ఞుడౌ


హితుడును కావ్యకన్యకకు హేమవిభూషణ లిచ్చు మెచ్చుచున్.


అల్వాల లక్ష్మణ మూర్తి

దశ పాప హర దశమి

 గంగా జయంతి  సందర్భంగా తెలియజేయుచున్న విషయము,రేపు అనగా 16-6-24, న గంగా జయంతి కావున,ఈరోజు ను దశ పాప హర దశమి అని అంటారు, గంగా గంగా అని  తలుచుకుంటే గంగా స్నాన ఫలితం వస్తుందంటారు. కాబట్టి గంగా జయంతి రోజు న గంగాదేవి 12 నామాలు చెప్పే శ్లోకం పటించి, స్నానం చేస్తే ఆ శ్లోకంలో చెప్పిన విధంగా, మహాపాతక నాశన ఫలితం  కలుగుతుందని ఆశిద్దాం, శ్లోకం : నందినీ నళినీ సీత మాలినీ చ మహాఫగా విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపధగామిని భాగీరధి భోగవతి జాహ్నవీ త్రిదశయేశ్వరీ,ద్వాద శైతాని నామాని యత్ర ,యత్ర జలాశ యే, స్నానకాలే పఠేేనిత్యం, మహాపాతకనాశని.   శుభం భూయాత్. గ౦గ నదీ జలములు కలిగియున్న వారు ఆ జలముల తో స్నానముచేసిన ఇ౦కా మంచిది. 🙏🙏🙏🙏

రామాయణం యుద్ధకాండ 23/37*

 

*రామాయణం యుద్ధకాండ 23/37*


        ‌ రాముడిని చూసిన కుంభకర్ణుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొని పరుగు పరుగున ఆయన వైపు వస్తున్నాడు. అప్పుడు రాముడు వాడి వక్షస్థలంలోకి బాణములతో కొట్టాడు. ఆ బాణములు తగిలి రక్తం బాగా కారింది, కాని ఆ కుంభకర్ణుడు ఇంకా వ్యగ్రతని పొంది రాముడి మీదకి వస్తున్నాడు. ఇంక వీడిని నిగ్రహించకపోతే కష్టమని రాముడు భావించి, తీవ్రమైన ములుకులు కలిగిన బాణములని ప్రయోగించాడు. ఆ బాణములు ఆ కుంభకర్ణుడి వక్షస్థలంలో తగిలి వాడి చేతిలో ఉన్న ఆయుధములు జారిపోయి, కళ్ళు తిరిగినంత పనయ్యింది. తరువాత రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ కుంభకర్ణుడి కుడి చెయ్యి నరికేశాడు. ఆ చెయ్యి కిందపడినప్పుడు దాని కింద కొన్ని వేల వానరాలు పడి చనిపోయాయి. అప్పుడా కుంభకర్ణుడు తన ఎడమ చేతితో ఒక చెట్టుని పట్టుకుని రాముడి మీదకి వచ్చాడు, అప్పుడు రాముడు ఐంద్రాస్త్రంతో వాడి ఎడమ చేతిని భుజం వరకూ నరికేశాడు. 


రెండు చేతులు పోయినా ఆ కుంభకర్ణుడు తన పాదాలతో వానరాలని తొక్కడం ప్రారంభించాడు. అప్పుడు రాముడు రెండు అర్ధచంద్రాకార బాణములతో వాడి రెండు తొడలని నరికేశాడు. తరువాత వాడి శిరస్సుని ఖండించారు. అప్పుడు వాడి శరీరంలో సగభాగం సముద్రంలో పడిపోయింది, మిగిలిన సగభాగం లంకా ద్వారం వరకూ పడిపోయింది. 


కుంభకర్ణుడు చనిపోయాడన్న వార్త విన్న రావణుడు ఏడుస్తూ " అయ్యయ్యో, నిద్రపోతున్నవాడిని లేపి నిష్కారణంగా యుద్ధానికి పంపాను. ఎవడు యముడిని, ఇంద్రుడిని ఓడించాడో అటువంటి నా తమ్ముడు ఇవ్వాళ రాముడి చేతిలో నిహతుడయిపోయాడు. నేను కుంభకర్ణుడిని పంపకపోయినా బాగుండేది. రాముడి ముందు నువ్వు కాదు, కుంభకర్ణుడు కాదు, మహోదర, మహాపార్ష, ప్రహస్తులు ఎవ్వరూ నిలబడలేరని నా తమ్ముడు విభీషణుడు చెప్పాడు. ధర్మాత్ముడైన విభీషణుడిని అవమానించి వెళ్ళగొట్టాను. ఇప్పుడు కుంభకర్ణుడు మరణించాడు, నా కుడి భుజం ఇవ్వాళ విరిగిపోయింది " అని కిందపడి ఏడుస్తుంటే, రావణుడి యొక్క కుమారులు, కుంభకర్ణుడి యొక్క కుమారులు అక్కడికి వచ్చారు. 


వాళ్ళన్నారు " నాన్నగారు! మీరు అంత బాధ పడకండి. మేము యుద్ధంలోకి వెళ్ళి మీరు కోరుకున్నట్టుగా రామలక్ష్మణులని నిగ్రహించి వస్తాము " అన్నారు.


అప్పుడు రావణుడు " ఇప్పటికయినా నా కోరిక తీర్చండి " అన్నాడు.


అప్పుడు యుద్ధరంగంలోకి రావణుడి కుమారుడైన నరాంతకుడు వచ్చి చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. అంగదుడు తన పిడికిలిని బిగించి ఆ నరాంతకుడి తల మీద ఒక దెబ్బ కొట్టేసరికి, వాడు తల పగిలి చనిపోయాడు. తదనంతరం మహోదరుడిని నీలుడు సంహరించాడు. దేవాంతకుడిని, త్రిశిరుడిని (మూడు తలకాయలతో ఉంటాడు) హనుమంతుడు సంహరించాడు. ఉన్మత్తుడిని గవాక్షుడు సంహరించాడు.   


ఆ తరువాత అతికాయుడు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు రాముడు " విభీషణ! అంత పెద్ద శరీరంతో ఉన్నాడు, అసలు వాడెవడు " అని అడిగాడు. 


అప్పుడు విభీషణుడు " ఆయన సామాన్యుడు కాదు. ఆయన వేదం చదువుకున్నాడు, బ్రహ్మగారి దెగ్గర వరాలు పొందాడు. ఆయన కవచాన్ని ఎటువంటి బాణం పెట్టి కొట్టినా అది పగలదు. అందుచేత అతనిని నిహతుడిని చెయ్యడం చాలా కష్టం " అన్నాడు.


ఆ అతికాయుడు యుద్ధంలో చాలా మందిని నెత్తురు కారేటట్టు కొట్టాడు, ఎందరినో నిగ్రహించాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ అతికాయుడితో యుద్ధం చెయ్యబోతుంటే వాడన్నాడు " లక్ష్మణా! నువ్వు పిల్లవాడివి, నీతో నాకు యుద్ధం ఏమిటి. నేను అతికాయుడిని, చిన్న చిన్న వాళ్ళతో నేను యుద్ధం చెయ్యను, అలా చెయ్యడం నాకు అసహ్యం. నన్ను ఎదిరించి నిలబడగలిగిన నా స్థాయివాడు ఎవడన్నా ఉన్నాడా వానర సైన్యంలో " అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు " ఈ డాబులెందుకురా, నాతో యుద్ధం చెయ్యి " అన్నాడు. 


అతికాయుడన్నాడు " పిల్లవాడివి, అగ్నిహోత్రాన్ని ఎందుకు పైకి లేపుతావు, నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు లేపుతావు. ఆ తరువాత నీ శరీరం పడిపోయాక బాధ పడతావు. వెళ్ళి రాముడిని పిలువు " అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు " నీ బతుక్కి రాముడు కావాలేంటి, నీకు నేను సమాధానం చెబుతాను " అని అర్ధచంద్రాకార బాణాలని అతికాయుడి మీదకి ప్రయోగించాడు. ఆ బాణాలు తగిలాక వాడన్నాడు " అబ్బో నీతో యుద్ధం చెయ్యవలసిందే " అని ఐంద్రాస్త్రం, వాయువ్యాస్త్రం మొదలైన ఎన్నో అస్త్రాలని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. ఆ అస్త్రములన్నిటికి లక్ష్మణుడు ప్రతిక్రియ చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములను ప్రయోగించినా, ఎన్ని అస్త్రములను ప్రయోగించినా, అన్నీ వాడి యొక్క కవచానికి తగిలి పడిపోతున్నాయి. 


ఆ సమయంలో వాయుదేవుడు వచ్చి లక్ష్మణుడితో " వాడికి బ్రహ్మగారు ఇచ్చిన వరం ఆ కవచం. వాడు ఆ కవచం పెట్టుకుని ఉన్నంతసేపు ఎవరు ఏది పెట్టి కొట్టినా ఆ కవచం పగలదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే వాడి కవచం పగులుతుంది " అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ అతికాయుడిని సంహరించాడు. 


అతికాయుడు మరణించాడన్న వార్త విని రావణుడు క్రుద్ధుడై, సామాన్యమైన వారిని పంపిస్తే వీలులేదని మళ్ళి ఇంద్రజిత్ ని పిలిచి " నువ్వు యుద్ధానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమయ్యింది " అన్నాడు.


అప్పుడా ఇంద్రజిత్ 4 గుర్రములు పూన్చిన రథం ఎక్కి అనేకమంది సైన్యంతో యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు. ఆయన చుట్టూ సైన్యం మొహరించి ఉంది, కాని ఇంద్రజిత్ మాత్రం కొంతసేపు ఎవరికీ కనపడలేదు.(ఆ సమయంలో చుట్టూ మోహరించిన సైన్యం మధ్యలో ఉన్న ఇంద్రజిత్ సమిధలు, పుష్ప మాలికలు, ఎర్రటి వస్త్రాలతో అగ్నిహోత్రంలో హోమం చేస్తాడు. ఆ హోమం చేశాక ఆ హోమాగ్ని సుడులు తిరుగుతూ పైకిలేస్తుంది, అప్పుడు ఒక నల్ల మేకని పట్టుకొచ్చి తన పళ్ళతో దాని కంఠాన్ని కొరికి, మెడ చీల్చి, ఆ మేక మాంసాన్ని ఆ హోమాగ్నిలో వేస్తాడు {వీటిని ఆభిచారిక హోమాలు అంటారు, ఇవి చాలా ప్రమాదకరమైనవి}. అప్పుడా పుష్పాలని, అక్షతలని తన ఆయుధముల మీద వేసి, ఎర్రటి వస్త్రాలు కట్టుకొని, రథం ఎక్కి మాయమయిపోతాడు, ఇంక ఎవరికీ కనపడడు. ఆ ఇంద్రజిత్ గుర్రాల చప్పుడు కాని, వాడి ధనుస్సు యొక్క శబ్దము కాని, వాడి బాణ ప్రయోగం కాని ఎవరికీ వినపడదు, అర్ధం కాదు. ఆయనకి అందరూ కనపడతారు, కాని ఆయన ఎవరికీ కనపడడు. ఒక్క విభీషణుడు మాత్రమే ఆయనని మాయా బలంతో చూడగలడు)


హోమాన్ని పూర్తి చేసిన ఇంద్రజిత్ రథం ఎక్కేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేసి, బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆవాహన చేసుకున్నాడు. ఆయన రథం ఎక్కగానే ఆ రథం ఎవ్వరికీ కనపడలేదు, అప్పుడాయన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. మేఘాల మధ్యకి వెళ్ళిన ఇంద్రజిత్ దిక్కులని, విదిక్కులని మంచుతొ కప్పేసి, ధనుష్టంకారం కూడా వినపడకుండా కొన్ని వేల బాణాలను ప్రయోగం చేసి హనుమంతుడిని, సుగ్రీవుడిని, ద్వివిదుడిని, మైందుడిని, అంగదుడిని, గంధమాదనుడిని, జాంబవంతుడిని, సుషేణుడిని, వేగదర్సిని, నీలుడిని, గావాక్షుడిని, కేసరిని మొదలైన అనేకమంది వానర వీరులని తన బాణములతో కొట్టి భూమి మీద పడేశాడు. అన్ని కోట్ల వానర సైన్యాన్ని బ్రహ్మాస్త్రం చేత కట్టి పడేశాడు. 


అప్పుడు వాడు పైనుంచి ఒక పెద్ద నవ్వు నవ్వి రామలక్ష్మణులతో అన్నాడు " ఒకసారి నాగ పాశాలతో మిమ్మల్ని కట్టాను, కాని మీరు విడిపించుకున్నారు. ఇవ్వాళ బ్రహ్మాస్త్రంతో మిమ్మల్ని కట్టేస్తాను, ఇవ్వాల్టితో యుద్ధం అయిపోతుంది " అన్నాడు.


అప్పుడు రాముడు లక్ష్మణుడితో " లక్ష్మణా! ఇవ్వాళ మనకి వేరొక దారిలేదు. వాడు బ్రహ్మగారికి చెందిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కొడుతున్నాడు, ఆ బ్రహ్మాస్త్ర బంధనం చేత మొత్తం వానర సైన్యం పడిపోయింది. ఎదురుగా ఉన్న వీరుడైతే మనం కొట్టచ్చు, కాని వాడు మాయా యుద్ధం చేస్తున్నాడు, కనుక మనం వాడిని కొట్టలేము. అందుచేత వాడు కొడుతున్న బాణ పరంపరకి ఓర్చుకున్నంతసేపు ఓర్చుకో, తరువాత స్పృహతప్పినవాడు పడిపోయినట్టు రణభూమిలో పడిపో. అప్పుడు వాడు ఎన్ని బాణములు కొట్టాలో అన్ని బాణములతో మన శరీరాలని కొడతాడు. అలా కొట్టేశాక శత్రువు మరణించాడనుకొని, జయలక్ష్మిని పొందాననుకొని వాడు అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. ఆ తరువాత బతికుంటే చూద్దాము. ముందు వాడిని కొట్టెయ్యని " అన్నాడు.


 ....మిగతా రేపు.....

    సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు. 

శైలజావాస్తుజ్యోతిషాలయము. 9059743812