19, ఏప్రిల్ 2023, బుధవారం

సంపూర్ణ సూర్యగ్రహణము

 *సూర్యగ్రహణము:*


20.04.2023 గురువారం రోజున రాహుగ్రస్త *సంపూర్ణ సూర్యగ్రహణము* సంభవించును.

కానీ ఈ గ్రహణం *భారతదేశంలో ఎక్కడా కనిపించదు. కావున ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు.*


ఈ గ్రహణం తూర్పు ఆసియా, దక్షణ ఆసియా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా, ఇండోనేషియాలోని జకార్తా, మకసార, మన్ క్ వాతీ, ఫిలిప్పీన్స్ లోని జనరల్ సాంటీస్, దావో, ఆస్ట్రేలియాలోని డార్విన్ ప్రాంతాల్లో కనిపించును. 


చంద్రశేఖర్ శర్మ (శ్రీనివాస్)

అర్చక

శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం

గాంధీనగర్, హైదరాబాద్

అమ్మ కోరిక*

 *అమ్మ కోరిక* 


        " ఏంటి!  ఎప్పుడూ నాన్న ఈ టైం లో ఫోన్ చేయరే, ఏమయ్యిందో"  అనుకుంటూ కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసాను.


" హలో నాన్నా!  ఏమయ్యింది". "ఒరేయ్ బాలు .. అది..  అదీ …మీ అమ్మకు వంట్లో బాగోలేదురా, మొన్న  హాస్పిటల్ లో జాయిన్ చేసాము. ఇంకా 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేము అంటున్నారు డాక్టర్స్. ఇప్పటికే ఐదు లక్షలు కట్టాము. నువ్ డబ్బులు పంపించి వెంటనే నెక్స్ట్ ఫ్లైట్ కి వచ్చేయ్ రా" అంటూ చెప్పలేక చెప్పలేక చెప్పాడు నాన్న. 


 ఆ మాట విన్న నాకు మెదడు మొద్దుబారిపోయింది.  ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. "నాన్నా! ఒక్క నిమిషం,  ఇపుడే మళ్ళీ కాల్ చేస్తా," అంటూ ఫోన్ కట్ చేసాను. 


కళ్ళ ముందు ఏమి కనిపించడం లేదు. కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. అమ్మా అమ్మా అంటూ మనసు రోదిస్తోంది. వెంటనే వాష్ రూమ్ లోకి వెళ్లి చల్లని నీళ్లతో మొహం కడుక్కుని వచ్చి, మళ్ళీ నాన్నకు కాల్ చేసాను. "నాన్నా!  డాక్టర్ నెంబర్ ఒకసారి నాకు ఇవ్వండి. నేను మాట్లాడుతాను. అలాగే వెంటనే అమ్మని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకెళ్లండి. నేను ఎల్లుండికల్లా వచ్చేస్తా. ఒక నర్స్ ని కూడా అటెండెంట్ గా తీసుకెళ్లండి."  అని చెప్పి, ఫోన్ కట్ చేసి డాక్టర్ కి కాల్ చేసి పరిస్థితి తెలుసుకున్నా. వెంటనే అమ్మని ఇంటికి పంపే ఏర్పాట్లు, మెడికల్ అసిస్టెంట్ని మొత్తం డాక్టర్  గారు ఏర్పాటు చేస్తా అన్నారు. ఇంక నేను అమెరికా నుంచి ఇండియాకి నా ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నా.


    నేను వచ్చేసరికి అమ్మ ని ఇంటికి తీసుకువచ్చారు. ప్రతిక్షణం అమ్మను చూసుకోడానికి నర్స్ కూడా ఉంది. వెంటనే వెళ్లి అమ్మ పక్కన కూర్చుని అమ్మ చెయ్యి పట్టుకుని "అమ్మా! అమ్మా!  నేను వచ్చాను. కళ్ళు తెరువు అమ్మా !. నన్ను చూడు."  అంటూ ఏడుస్తూ ఉన్నా. పక్కనే అన్నయ్య నాన్న చెల్లి నన్ను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.

  

ఇంతలో అమ్మలో మెల్లిగా కదలిక కనబడింది. చేయి కదిలించే ప్రయత్నం చేస్తోంది. కళ్ళు తెరవాలని ఆరాటం అమ్మలో కనబడుతోంది. "అమ్మా ..!అమ్మా..!" అంటూ మేము పిలుస్తున్నామో ఏడుస్తున్నామో తెలియని పరిస్థితిలో ఉన్నాం.  అలా ఆరోజంతా అమ్మ పక్కనే ఉన్నాం అందరం. అమ్మ మంచం పక్కనే అందరం పడుకున్నాము ఆ రాత్రికి. 


   తెల్లారేసరికి అమ్మలో కొంచం కదలిక వచ్చింది. నన్ను చూసి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తోంది. అది చూసి మా చెల్లి, " అమ్మా..! లే అమ్మా..! నీ ముద్దుల కొడుకు వచ్చేసాడు. కనీసం వాడితో అయిన మాట్లాడు" అంటూ ఏడుస్తోంది. నేను అమ్మ చేతిని నా చేతిలోకి తీసుకున్నా. అమ్మ   స్పర్శ ఏదో చెప్తోంది నాకు. ఇంక అమ్మ తన ఆఖరి గడియల్లో ఉందని అర్థం అవుతోంది. 

        

      "నాన్నా..! ఇటు రా" అని పిలిచా. "మంచం మీద కూర్చొని అమ్మ తలని నీ ఒడిలో పెట్టుకో నాన్నా..!" అని చెప్పా. నాన్న అలాగే చేసాడు. అన్నయ్య, చెల్లి అమ్మకు చెరొక వైపు కూర్చున్నారు.అమ్మ చేతుల్ని పట్టుకుని. నేను అమ్మ కాళ్ళ దగ్గర కూర్చున్నా. అమ్మ పాదాలు తాకుతూ. అలా అలా ఐదు నిమిషాల్లో అమ్మ కళ్ళల్లో నుంచి ఒక ఆనందభాష్పాన్ని రాల్చి స్వర్గలోక ప్రయాణం మొదలుపెట్టింది. ఇక్కడ మంచం మీద విగత జీవిగా మిగిలింది. ఒక్కసారిగా మమ్మల్ని అనాధలుగా మార్చేసి, శోక సముద్రంలో ముంచేసి వెళ్ళిపోయింది.


     అందరికి కబురు చేసాము. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. "బాలుని డబ్బులు పంపమంటే, పంపకుండా ట్రీట్మెంట్ ఆపేసి ఇంటికి తెచ్చేశారు పార్వతమ్మని. అందుకే ఇలా కాలం చేసింది ఆవిడ. లేకుంటే ఇంకా బతికి ఉండేది.  కలికాలం కదా.. ఏం పిల్లల్లో ఏమో, డబ్బులకు విలువ నిచ్చి అమ్మను చంపేసుకున్నారు." అనడం నాకు వినిపిస్తూ ఉంది. నాన్న కూడా విన్నాడు. అదే నిజమేమో అనుకునే పరిస్థితిలో నా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని అనిపించింది ఆ క్షణంలో నాకు. "సరేలే ఎవరైనా ఏమైనా అనుకోని," అనుకుని అమ్మకి చివరి సారిగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ సక్రమంగా పూర్తి చేసాము. అమ్మకి ఘనంగా వీడ్కోలు పలికాము.


     కర్మకాండలన్నీ అయ్యాక, నేను ఒక పుస్తకం తెరిచి, "నాన్నా..! ఈ బుక్ గుర్తుందా! నేను అమెరికా వెళ్లే ముందు అమ్మకు గిఫ్ట్ గా ఇచ్చాను, నాతో ఏమి చెప్పాలనిపించినా ఈ బుక్ లో రాయమని చెప్పాను, అదే ఇది"  అంటూ ,  నాన్నకు ఇచ్చా చదవమని. అది అమ్మ రాసిన ఉత్తరం లాంటిది. నాన్న కళ్ళు అందులోని అక్షరాలవెంట పరుగులు తీస్తూ.. కళ్ళల్లో నుంచి కన్నీరు ధారగా రావడం మొదలయ్యింది.

 

     " ఒరేయ్ బాలు, నీకు ఒక విషయం చెప్పాలని ఉందిరా. ఈరోజు మన ఇంటి పక్కన ఉండే రత్నమ్మ గారు చనిపోయారు. ఆ ఆంటీకి నువ్వంటే భలే ఇష్టం కదా. నీ చిన్నప్పుడు నువ్ ఎప్పుడు వాళ్ళింటికి వెళ్లినా నీకోసం హార్లిక్స్ కలిపి ఇచ్చేది. గుర్తుందా. తనకి జ్వరంగా ఉందని వాళ్ళబ్బాయి హాస్పిటల్ లో చేర్చాడు. రెండు రోజులు బాగానే ఉంది, హాస్పిటల్ కి వెళ్లిన వాళ్ళతో కూడా మాట్లాడింది. రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తాలే అంటూ. కానీ ముడవరోజుకు పరిస్థితి బాగాలేదు. చాలా సీరియస్ గా ఉంది కండిషన్ అన్నారు. నాలుగవ రోజుకి చనిపోయింది అంటూ వార్త చెప్పారు. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా బాలు. నాకు అలా హాస్పిటల్ లో చనిపోవడం ఇష్టం లేదురా. నాకేమైనా అయితే, డాక్టర్స్ ఏమి చెప్పలేము అని చేతులు ఎత్తేస్తే .. నన్ను ఆ మెషీన్స్ మద్యలో వదిలేయకండిరా. నాకు మన సొంత ఇంట్లో నాన్న ఒడిలో తల పెట్టుకుని, మీ అందరూ నా చుట్టూ ఉండగా, అందర్నీ తనివితీరా చూసుకుంటూ వెళ్లిపోవాలని ఉంటుంది రా. నువ్ ఈ సారి అమెరికా నుంచి వచ్చినప్పుడు ఈ పుస్తకం చదువుతావుగా. అపుడు తెలుస్తుందిలే నీకు నా కోరిక."


    ఇది చదివి నాన్న కళ్ళ వెంబడి నీళ్లు జల జలా రాలిపోతున్నాయి. "నాన్నా..! ఏడవకండి. నేను కూడా ఇది నిన్న రాత్రే చదివాను. నేను అమౌంట్ పంపించలేదు అని మీరు కూడా అనుకుంటున్నారు కదా. నాకు అమ్మ కన్నా డబ్బే ముఖ్యం అయ్యింది అని బాధ పడ్డారు కదా. ఒక సారి మీ బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. నేను అమెరికాలో బయలుదేరక ముందే ఐదు లక్షలు పంపించాను. నాకు డబ్బు ముఖ్యం కాదు. అమ్మ ప్రాణమే ముఖ్యం. కానీ డాక్టర్ గారితో మాట్లాడక తెలిసింది. హోప్ లేదని. అందుకే అమ్మ అందరితో కలిసి ఉండాలి, హాస్పిటల్ లో ఎవరు దిక్కు లేనిదానిలా ఒంటరిగా చనిపోకూడదని ఆ నిర్ణయం తీసుకున్నా. అది తప్పనిపిస్తే క్షమించండి నాన్నా..!"  అన్నాను. 


    "లేదురా..!  మేమే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నిజంగా నువ్ మీ అమ్మకి ముద్దుల కొడుకువే. మీ అమ్మ మనసు నువ్ అర్థం చేసుకున్నట్లుగా,  కట్టుకున్న భర్తను నేను కూడా అర్థం చేసుకోలేకపోయాను. నువ్వే మమ్మల్ని క్షమించాలిరా నిన్ను అర్థం చేసుకోనందుకు."  అన్నాడు నాన్న. 


"లేదు నాన్నా మీరు అలా అనకండి. అలా చూడండి ఆకాశంలో నుంచి ఆ మెరిసే నక్షత్రం ఎలా చూస్తుందో మనల్ని.  ఆ నక్షత్రం ఎవరో తెలుసా.. "మా అమ్మ"  అంటూ నేను అన్నయ్య చెల్లి ఒకేసారి అన్నాం.


" అవును రా..! మన బాగోగులు చూసుకోవడం మీ అమ్మకి చాలా ఇష్టం. అందుకే ఆకాశంలో తారకలా నిలిచి, అనుక్షణం మనందరిని  గమనిస్తూ ఉంటుంది మీ అమ్మ ప్రేమగా..." అంటూ కళ్ళు తుడుచుకున్నాడు నాన్న. నేను, అన్నయ్య, చెల్లి ముగ్గురం నాన్నను కౌగిలించుకుని అలా ఆకాశంలో మెరిసే నక్షత్రాన్నీ చూస్తూ ఉండిపోయాము.


దేవలపల్లి సునంద

విశ్వాన్ని నడిపేవారు

 *రాజస్థాన్‌ లో రమేష్ చంద్ర అనే దయగల ఒక శ్రీకృష్ణుని భక్తుడు ఉండేవాడు. అతనికి ఒక మందుల దుకాణం ఉండేది. షాపులో ఒక మూలన శ్రీకృష్ణుడి చిన్న చిత్రం ఉంది. ప్రతిరోజూ దుకాణం తెరిచిన తర్వాత, తన చేతులు కడుక్కొని, ఆ దేవుని బొమ్మను శుభ్రం చేసి, దీపం, ధూపం మొదలైన వాటిని చాలా భక్తితో వెలిగించేవాడు.*


*అతనికి రాకేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు, తన చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలో కూర్చునేవాడు. తన తండ్రి రోజూ ఇదంతా చేయడం చూస్తూ ఉంటాడు. నవీన యుగంలో చదువుకున్న యువకుడు అవడంవల్ల తన తండ్రికి , దేవుడు అంటూ ఎవరూ లేరని, ఇదంతా మన మనస్సు యొక్క భ్రమ అని వివరించేవాడు.*


*సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ రుజువు చేసిందని చెప్తూ.. ఇలా ప్రతి రోజూ సైన్స్‌ నుండి కొత్త ఉదాహరణలను ఇస్తూ, దేవుడు లేడని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.*


*తండ్రి అతనిని ఆప్యాయంగా చూసి నవ్వేవాడు తప్ప ఈ అంశంపై వాదించడానికి లేదా చర్చించడానికి ఇష్టపడేవాడుకాదు.*

 

*కాలం గడిచేకొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు. ఇప్పుడు తన అంతం ఆసన్నమైందని బహుశా అతను తెలుసుకుని ఉంటాడు... అలా ఒకరోజు తన కొడుకుతో ఇలా అన్నాడు," నాయనా, నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు కష్టపడి పని చేస్తూ, దయతో, నిజాయితీగా ఉంటే చాలు. అయితే నేను చెప్పే ఈ  ఒక్క మాట విని, పాటిస్తావా?"*

 

*కొడుకు,“అలాగే నాన్నా, తప్పకుండా పాటిస్తాను”, అని అన్నాడు. తండ్రి ఇలా చెప్పాడు, "నాయనా, నా మరణానంతరం, ప్రతిరోజు దుకాణంలో ఉన్న దేవుని బొమ్మను శుభ్రం చెయ్యి; రెండవది, నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే, చేతులు జోడించి, శ్రీకృష్ణునికి నీ సమస్యను చెప్పుకో. నేను చెప్పినట్లు ఈ ఒక్క పని చెయ్యి చాలు." కొడుకు ఒప్పుకున్నాడు.*


*కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు, కాలం అలా గడిచిపోతూ ఉంది... ఒక రోజు జోరున వర్షం కురుస్తోంది. రాకేష్ రోజంతా షాపులో కూర్చునే ఉన్నాడు, కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఆపై కరెంటు కూడా ఇబ్బంది పెడుతోంది. అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఓ కుర్రాడు పరుగు పరుగున వచ్చి "అన్నా... ఈ మందు కావాలి... మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది... వెంటనే ఈ మందు నాలుగు చెంచాలు  వేస్తేనే ... అమ్మ  బతుకుతుందని  డాక్టర్ చెప్పారు... నీ దగ్గర ఈ మందు ఉందా?" అని అడిగాడు.*


*రాకేష్ మందుచీటి చూసి వెంటనే “ఆ... నా దగ్గర ఉంది” అని వెంటనే తీసి ఇచ్చాడు. బాలుడు చాలా సంతోషించి, వెంటనే మందుసీసాతో వెళ్ళిపోయాడు.*


*అయితే ఇది ఏమిటి!!* 

*అబ్బాయి వెళ్లిన కొద్దిసేపటికే రాకేష్ కౌంటర్ వైపు చూడగానే చెమటలు పట్టాయి... కొద్దిసేపటి క్రితం ఓ కస్టమర్ ఎలుకల మందు సీసా తిరిగి ఇచ్చేసి వెళ్ళాడు. లైట్లు వెలగకపోవడంతో  లైట్లు వచ్చింతర్వాత దానిని సరైన స్థలంలో పెడదామని భావించి రాకేష్ కౌంటర్ పై సీసాను అలాగే వదిలేశాడు. అయితే మందు కోసం వచ్చిన ఈ బాలుడు తన మందు సీసాకు బదులు ఎలుకల మందు సీసాను తీసుకెళ్ళాడు... ఆ బాలుడు నిరక్షరాస్యుడు కూడా.*


*" ఓరి భగవంతుడా !!" అని రాకేష్ నోటి నుండి అసంకల్పితంగా ఆ మాటలు వెలువడ్డాయి, "ఏమిటి ఈ విపత్తు!!" అనుకుని, అప్పుడు తన తండ్రి మాటలు గుర్తుకొచ్చి, వెంటనే, ముకుళిత హస్తాలతో, బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని చిత్రపటం ముందు ప్రార్థించడం ప్రారంభించాడు. "ఓ ప్రభూ! మీరు ఉన్నారని తండ్రి ఎప్పుడూ చెబుతుండేవారు. మీరు నిజంగా ఉన్నట్లయితే, దయచేసి ఈ రోజు ఈ అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి. తన కొడుకు చేతిలో నుండి తల్లిని విషం త్రాగనివ్వకండి ... ప్రభూ ఆ విషాన్ని త్రాగనివ్వకండి!!!"*


*"అన్నా!" అని అప్పుడే వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది... "అన్నా, నేను బురదలో  జారిపోయాను, మందు సీసా కూడా పగిలిపోయింది! దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా", అని అడిగాడు.*


*ప్రేమపూరితమైన చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రాన్ని చూస్తూండగా రాకేష్ ముఖంపై కన్నీళ్లు కారడం మొదలయ్యాయి!!!*


*ఆ రోజు, ఈ సమస్త విశ్వాన్ని నడిపేవారు ఎవరో ఉన్నారని అతనిలో ఒక విశ్వాసం మేల్కొంది... కొందరు ఆయన్ని భగవంతుడంటే, మరికొందరు సర్వోన్నతుడు అంటారు, కొందరు సర్వవ్యాపి అని, మరికొందరు దైవిక శక్తి అని అంటారు!*


                            ♾️


*ప్రేమ, భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ ఆలకించబడుతుంది*

🚩👏🚩👏🕉️🕉️👏🚩👏🚩

సుభాషితమ్


           _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝


*మృతంశరీర ముత్సృజ్య*

*కాష్ఠలోష్టసమంక్షితౌ*

*విముఖా బాంధవా యాంతి*

*ధర్మస్త్వేకోనుగఛ్ఛతి*

                        ~మనుస్మృతి


కూర్మ-గరుడ-పురాణాదులలోఅక్కడక్కడ ధర్మ విషయములు ప్రస్తుతి వచ్చినపుడు ధర్మ మహిమను తెలుపుట కొరకు వ్యాసుల వారు పైశ్లోకమును.....పదేపదే ఉటంకించినారు



*చచ్చిన వ్యక్తి శరీరమును ఒక కర్ర ముక్కగాను మట్టిగడ్డగానో భావించి.. అనగా కాల్చివేసి లేదా మట్టిగోతిలో పూడ్చిపెట్టి బంధువులందరు మొగములను నింటి వైపుకు ద్రిప్పుకొని వెళ్ళిపోదురు. ఆ వ్యక్తి వెంట నెవ్వరును రారు. ఒక్క "ధర్మము అనగా పుణ్యం" మాత్రం సంస్కార రూపంలో అతని జీవాత్మకంటుకొని.. వెంట వచ్చి యతనికి స్వర్గాది సుఖములను కలిగించును*.


: *శ్రీ సూక్తము-14*


*ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్౹*

*సూర్యాం హిరణ్యయీం లక్ష్మీం జాతవేదో మమావః౹*


తా॥

ఓ అగ్నీ! తడుపబడిన శరీరము కలదియు, చేతియందు బెత్తము కలదియు, దండస్వరూపమైనదియు, శుభకరవర్ణము కలదియు, సువర్ణమాలికలు ధరించినదియు, సూర్యునివలె ప్రకాశించునదియు, పవిత్రస్వరూపము కలదియు నగు లక్ష్మిని నాకుకొఱకు పిలువుము.

 .          *శ్రీ శంకర ఉవాచ*

         *గురువు ~ శిష్యుడు*

    (నిన్నటి దానికి కొనసాగింపు)



4. ఆర్పరాని ఈ సంసారదవానల పీడితుడను, దౌర్భాగ్యవాత ప్రకంపితుడను, భయభీతుడను, శరణాపన్నుడను ఐన నన్ను రక్షింపుము. నాకు అభయదానము నొసగు వారు మరి లేరు.

కాశీ వెళ్తున్న భక్తులకు ఉపయోగపడే సమాచారం

 కాశీ వెళ్తున్న భక్తులకు ఉపయోగపడే సమాచారం 


కాశీలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు :-


1. కాశీ విశ్వనాధుని దేవాలయం 2. అన్నపూర్ణాలయం 3. విశాలాక్షి ఆలయం 4. కాల భైరవాలయం 5. మృత్యుంజయేశ్వరాలయం 6. సారనాద్ మందిరం 7. వ్యాస కాశి 8. దండపాణి మందిరం 9. చింతామణి గణపతి మందిరం 10. బిర్లా టెంపుల్ 11. సంకట విమోచన హానుమాన్ మందిరం 12. శ్రీ త్రిదేవి మందిరం 13. దుర్గా మందిరం 14. తులసి మానస మందిరం 15. గవ్వలమ్మ మందిరం 16. కేదారేశ్వర మందిరం 17. తిలబండేశ్వరాలయం 18. జంగన్ వాడి మఠ్ 19.గంగా హారతి 20. బిందు మాధవుడు 21. వారాహిదేవి 22. దత్తమందిరం ( దత్తపీఠము )23. ద్వాదశ ఆదిత్యుల దేవాలయాలు, 24. పరాన్నేశ్వర, పర భుక్తేశ్వర దేవాలయాలు 25.మణి మందిరం ఇంకా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఇలా కాశీలో ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు.చిన్న ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ దాదాపు 23 వేలకుపైగా దేవాలయాలున్నాయి.

మనికర్ణికా ఘాట్ లో మద్యాహ్నం 12 గంటలకు గంగానది స్నానం తప్పక చేయాలి. 

ఇక ప్రతి సాయంత్రం గంగ ఒడ్డున పవిత్ర ఘాట్‌లలో నిర్వహించే హారతి మరో అద్భుతం. ముఖ్యంగా దశాశ్వమేధఘాట్‌, బాబూ రాజేంద్రప్రసాద్‌ ఘాట్‌లలో గంగా హారతి చూపురులను కట్టిపడేస్తుంది. కాశీ వెళ్ళినవారు తప్పకుండా గంగాహారతి చూడాలి.

కాశిలో అన్ని దేవాలయాలు ఉదయం నుండి రాత్రి వరకు చూడవచ్చు. కాని శ్రీ వారాహిదేవి ఆలయం. దర్శనం సమయం: ఉదయం 6:00 నుండి ఉదయం

 8:00 గంటల  కొన్ని రోజుల్లో కొద్దిగా ఎక్కువ సేపు దర్శనం కు అనుమతి ఉంది,    

*త్రైలింగేశ్వర స్వామి వారి ఆలయం.