*రాజస్థాన్ లో రమేష్ చంద్ర అనే దయగల ఒక శ్రీకృష్ణుని భక్తుడు ఉండేవాడు. అతనికి ఒక మందుల దుకాణం ఉండేది. షాపులో ఒక మూలన శ్రీకృష్ణుడి చిన్న చిత్రం ఉంది. ప్రతిరోజూ దుకాణం తెరిచిన తర్వాత, తన చేతులు కడుక్కొని, ఆ దేవుని బొమ్మను శుభ్రం చేసి, దీపం, ధూపం మొదలైన వాటిని చాలా భక్తితో వెలిగించేవాడు.*
*అతనికి రాకేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు, తన చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలో కూర్చునేవాడు. తన తండ్రి రోజూ ఇదంతా చేయడం చూస్తూ ఉంటాడు. నవీన యుగంలో చదువుకున్న యువకుడు అవడంవల్ల తన తండ్రికి , దేవుడు అంటూ ఎవరూ లేరని, ఇదంతా మన మనస్సు యొక్క భ్రమ అని వివరించేవాడు.*
*సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ రుజువు చేసిందని చెప్తూ.. ఇలా ప్రతి రోజూ సైన్స్ నుండి కొత్త ఉదాహరణలను ఇస్తూ, దేవుడు లేడని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.*
*తండ్రి అతనిని ఆప్యాయంగా చూసి నవ్వేవాడు తప్ప ఈ అంశంపై వాదించడానికి లేదా చర్చించడానికి ఇష్టపడేవాడుకాదు.*
*కాలం గడిచేకొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు. ఇప్పుడు తన అంతం ఆసన్నమైందని బహుశా అతను తెలుసుకుని ఉంటాడు... అలా ఒకరోజు తన కొడుకుతో ఇలా అన్నాడు," నాయనా, నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు కష్టపడి పని చేస్తూ, దయతో, నిజాయితీగా ఉంటే చాలు. అయితే నేను చెప్పే ఈ ఒక్క మాట విని, పాటిస్తావా?"*
*కొడుకు,“అలాగే నాన్నా, తప్పకుండా పాటిస్తాను”, అని అన్నాడు. తండ్రి ఇలా చెప్పాడు, "నాయనా, నా మరణానంతరం, ప్రతిరోజు దుకాణంలో ఉన్న దేవుని బొమ్మను శుభ్రం చెయ్యి; రెండవది, నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే, చేతులు జోడించి, శ్రీకృష్ణునికి నీ సమస్యను చెప్పుకో. నేను చెప్పినట్లు ఈ ఒక్క పని చెయ్యి చాలు." కొడుకు ఒప్పుకున్నాడు.*
*కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు, కాలం అలా గడిచిపోతూ ఉంది... ఒక రోజు జోరున వర్షం కురుస్తోంది. రాకేష్ రోజంతా షాపులో కూర్చునే ఉన్నాడు, కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఆపై కరెంటు కూడా ఇబ్బంది పెడుతోంది. అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఓ కుర్రాడు పరుగు పరుగున వచ్చి "అన్నా... ఈ మందు కావాలి... మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది... వెంటనే ఈ మందు నాలుగు చెంచాలు వేస్తేనే ... అమ్మ బతుకుతుందని డాక్టర్ చెప్పారు... నీ దగ్గర ఈ మందు ఉందా?" అని అడిగాడు.*
*రాకేష్ మందుచీటి చూసి వెంటనే “ఆ... నా దగ్గర ఉంది” అని వెంటనే తీసి ఇచ్చాడు. బాలుడు చాలా సంతోషించి, వెంటనే మందుసీసాతో వెళ్ళిపోయాడు.*
*అయితే ఇది ఏమిటి!!*
*అబ్బాయి వెళ్లిన కొద్దిసేపటికే రాకేష్ కౌంటర్ వైపు చూడగానే చెమటలు పట్టాయి... కొద్దిసేపటి క్రితం ఓ కస్టమర్ ఎలుకల మందు సీసా తిరిగి ఇచ్చేసి వెళ్ళాడు. లైట్లు వెలగకపోవడంతో లైట్లు వచ్చింతర్వాత దానిని సరైన స్థలంలో పెడదామని భావించి రాకేష్ కౌంటర్ పై సీసాను అలాగే వదిలేశాడు. అయితే మందు కోసం వచ్చిన ఈ బాలుడు తన మందు సీసాకు బదులు ఎలుకల మందు సీసాను తీసుకెళ్ళాడు... ఆ బాలుడు నిరక్షరాస్యుడు కూడా.*
*" ఓరి భగవంతుడా !!" అని రాకేష్ నోటి నుండి అసంకల్పితంగా ఆ మాటలు వెలువడ్డాయి, "ఏమిటి ఈ విపత్తు!!" అనుకుని, అప్పుడు తన తండ్రి మాటలు గుర్తుకొచ్చి, వెంటనే, ముకుళిత హస్తాలతో, బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని చిత్రపటం ముందు ప్రార్థించడం ప్రారంభించాడు. "ఓ ప్రభూ! మీరు ఉన్నారని తండ్రి ఎప్పుడూ చెబుతుండేవారు. మీరు నిజంగా ఉన్నట్లయితే, దయచేసి ఈ రోజు ఈ అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి. తన కొడుకు చేతిలో నుండి తల్లిని విషం త్రాగనివ్వకండి ... ప్రభూ ఆ విషాన్ని త్రాగనివ్వకండి!!!"*
*"అన్నా!" అని అప్పుడే వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది... "అన్నా, నేను బురదలో జారిపోయాను, మందు సీసా కూడా పగిలిపోయింది! దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా", అని అడిగాడు.*
*ప్రేమపూరితమైన చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రాన్ని చూస్తూండగా రాకేష్ ముఖంపై కన్నీళ్లు కారడం మొదలయ్యాయి!!!*
*ఆ రోజు, ఈ సమస్త విశ్వాన్ని నడిపేవారు ఎవరో ఉన్నారని అతనిలో ఒక విశ్వాసం మేల్కొంది... కొందరు ఆయన్ని భగవంతుడంటే, మరికొందరు సర్వోన్నతుడు అంటారు, కొందరు సర్వవ్యాపి అని, మరికొందరు దైవిక శక్తి అని అంటారు!*
♾️
*ప్రేమ, భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ ఆలకించబడుతుంది*
🚩👏🚩👏🕉️🕉️👏🚩👏🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి