Srimadhandhra Bhagavatham -- 69 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
రాక్షసుడు చిన్నికృష్ణుని ఎత్తుకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అలా ఎత్తుకు వెళ్ళి పోతున్నప్పుడు పిల్లలకి భయం వేసినట్లయితే వాళ్ళు కంఠమును గట్టిగా పట్టుకుంటారు. రాక్షసుడు పైకి తీసుకు వెళుతుంటే కృష్ణుడు తన చిన్నచిన్న చేతులతో రాక్షసుడి కంఠమును గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. ఎవ్వరు చేయలేని పనిని తాను చేస్తున్నానని రాక్షసుడు సంతోషిస్తున్నాడు. కృష్ణుడు నెమ్మదిగా బరువు పెరిగిపోవడం ప్రారంభించాడు. ఈ బరువుకి వాడు క్రిందపడిపోవడం మొదలు పెట్టాడు. ‘ఇంత బరువుగా ఉన్నావేమిటి వదులు, వదులు!’ అని అరవడం ప్రారంభించారు. పట్టుకుంటే వదలడం పరమాత్మకు ఉండదు! బాణం కొడితే త్రిపురములు ఎలా పడిపోయాయో, గట్టిగా కంఠమును కౌగలించుకుంటే పైనుంచి తృణావర్తుడు అలా క్రింద పడిపోతున్నాడు. పెద్ద రాళ్ళకుప్ప మీద పడిపోయాడు. అలా పడిపోవడం వలన రాక్షసుని శరీరం ముక్కలై పోయింది. కృష్ణుడు అలా పడిపోయిన రాక్షసుని శరీరంమీద పడుకొని మరల ఏమీ తెలియని వాడిలా చక్కగా ఆడుకుంటూ అమ్మకోసం చూస్తున్న వాడిలో దొంగ ఏడుపు ఏడుస్తూ పాకుతున్నాడు. తల్లి చూసింది.
ఏమీ తెలియని వాడు, భక్తుడయిన వాడు పరమాత్మను నమ్ముకున్న వాడికి ప్రమాదం ముంచుకు వచ్చేస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుడిని తాను రక్షించుకుంటాడు. ఇక్కడే ఈ తృణావర్తోపాఖ్యానంలో యశోద రాక్షసుని కళేబరం మీద పడిపోయి వున్న చిన్ని కృష్ణుడిని తీసుకుని భుజం మీద వేసుకుని ఒక విషయమును విజ్ఞాపన చేసింది. ఈ పద్యం గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి తెలుసుకోవలసిన పద్యం.
గత జన్మంబుల నేమి నోచితిమొ? యాగశ్రేణు లే మేమి చే
సితిమో? యెవ్వరి కేమి పెట్టితిమొ? యే చింతారతింబ్రొద్దు పు
చ్చితిమో? సత్యము లేమి పల్కితిమొ? యే సిద్ధప్రదేశంబు ద్రొ
క్కితిమో? యిప్పుడు సూడ గంటి మిచటం గృష్ణార్భకున్ నిర్భయున్.
ఒక్కొక్కసారి పిల్లలను గండం తరుముకు వచ్చేస్తుంది. అది ప్రమాదరూపంలో ప్రాణములను తీసుకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. ప్రమాదరూపంలో మృత్యువు ప్రాణమును తీసుకు వెళ్ళాలా కూడదా అని ఈశ్వరుడు పరీక్ష చేస్తాడు. ఫలితం ఇవ్వాలి. పిల్లలు ప్రమాదమునందు వెళ్లిపోతుంటారు. వారు దీర్ఘాయుష్మంతులు కాకుండానే వారికి అపమృత్యువు వచ్చేస్తుంది. అలా తీసుకెళ్ళే ముందు పరమాత్మ తల్లిదండ్రుల ఖాతాను ఒకసారి చూస్తాడు. ఆ పిల్లవాడి గండం గట్టెక్కించదానికి తల్లిదండ్రులు చేసిన పుణ్యకార్యములు ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు. స్త్రీలు నోచే ఒక్కొక్క నోము చూడడానికి చాలా చిన్నదిగా ఉన్నట్లు ఉంటుంది ఫలితములు ఆ నోము నోచిన వారిని కొన్ని కోట్లజన్మలు కాపాడతాయి. సత్యం చెప్పడం చాలా కష్టం సత్యమును పలకాలి. మహాపురుషుల ఆశ్రమములను దర్శించాలి. వారు ఆత్మజ్ఞానులై ఈశ్వరునితో సమానమైన వారు. అలాగే భగవంతునికి పూజలు చేయాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవారు ప్రయత్నపూర్వకంగా ఇలాంటి పనులు చేసి తీరాలి. ఈమాటలు చెప్పి తల్లి యశోద పిల్లవాడిని తీసుకొని పొంగిపోయి, ముద్దులు పెట్టుకొని ‘ నేను బ్రతికానురా నువ్వు దొరికావు’ అన్నది.
చిత్రం ఏమిటంటే ఎన్నిమాట్లు ఎన్ని లీలలు జరుగుతున్నా యశోదకు తెలియదు. వీటినన్నిటిని చేస్తున్నవాడు కృష్ణపరమాత్మని తెలియనక్కరలేదు.
ఈ లీలలో అంతరార్థం - ‘తృణము’ అంటే గడ్డిపరక. దానికన్నా తేలిక అయినది ప్రపంచంలో ఉండదు. ‘ఆవర్తనము’ అంటే త్రిప్పుట త్రిప్పేది తృష్ణ. తృష్ణకే తృణావర్తుడని పేరు. గృహస్థు పుణ్యం ఖర్చయిపోతుంటే మరల పుణ్యమును సంపాదించుకుంటూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా మరల పుణ్యం చేసుకుంటూ ఉండాలి. వచ్చేజన్మల యందు కూడా ఇది నిలబడుతుంది. ఒక్కొక్కరు చేసుకున్న పుణ్యం వలన అతడు పట్టినదల్లా బంగారం అవుతుంది. ఏది పట్టుకున్నా ఐశ్వర్యం అలా కలిసివస్తుంది.
తృష్ణయందు చిక్కుకోకూడదు. వచ్చిన దానియందు తృప్తిలేక ఇంకా సంపాదించాలని అనుకున్నారంటే ఆ సంపాదనకు హద్దు ఉండదు. గృహస్థాశ్రమంలో ఉన్నవారు కొంతవరకు దాచుకోవడం తప్పు కాదు. అది అర్థంలేని దాపరికం అయితే అది తృష్ణగా మారుతుంది. దీనివలన ఆ శరీరంలోకి ఎందుకు వచ్చాడో మరిచిపోయి అలా తిరగడంలో డబ్బు సంపాదించి ఒకనాడు మరణిస్తారు. ఇలా సంపాదించడంలో వానికి గల పుణ్యం అంతా వ్యయమైపోయి ఉత్తర జన్మలలో దరిద్రము అనుభవించ వలసి వస్తుంది. వందరూపాయలు సంపాదించుకున్నట్లయితే అందులో కనీసం అయిదు రూపాయలు పుణ్యం నిమిత్తం ఖర్చు పెట్టి తీరాలి. మరి ఉత్తరజన్మకు పుణ్యం అవసరం. ఈ అయిదు రూపాయలు మీ పుణ్యం ఖాతాలో జమచేయబడతాయి. దీనివలన ఉత్తరజన్మలో అన్నవస్త్రములకు లోటులేకుండా సంతోషంగా బ్రతకగలుగుతారు. ద్రవ్యమును సంపాదించడం ఎంత అవసరమో అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టడం తెలియాలి. అది తెలియకపోతే మనిషి పాడయిపోతాడు. తృష్ణకు లొంగకుండా డబ్బు సంపాదించాలి. తృప్తి వస్తే తృష్ణ ఆగిపోతుంది. తృప్తి లేకపోతే లోపల తృష్ణ రగులుతూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మీరు వెనక్కు తిరిగిచూసి ఒక వయస్సు వచ్చిన తరువాత కొన్నింటికి చెక్ పెట్టకపోతే తృష్ణ కాలుస్తూనే ఉంటుంది. తృణావర్తుడు సుడిగాలి రూపంలో వచ్చి మొత్తం నందవ్రజ ప్రజలందరి కళ్ళు మూసేశాడు. తృష్ణకు లొంగితే గడ్డిపరకను చేసి తిప్పేస్తుంది. నందవ్రజ ప్రజలందరూ కృష్ణా! కృష్ణా! అని ఏడ్చారు. కృష్ణుడు తృణావర్తుని చంపాడు. చంపి తానే వాళ్లకు దక్కాడు. వాళ్ళు దక్కించుకున్నారా? తాను దక్కాడా? అంటే తానే దక్కాడు. భగవంతుని నామం చెప్పడం మొదలు పెట్టినట్లయితే అదే భగవంతుడిని మీ దగ్గరికి తీసుకువచ్చి, మీ బుద్ధిని మార్చి, మిమ్మల్ని సక్రమమయిన మార్గంలోకి తిప్పేస్తుంది. అలా తిప్పి ఏది గెలవలేక జీవితం పాడైపోతున్నదో దానిని గెలవగలిగిన మార్గమును ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. తృప్తి కలవాడు చక్రవర్తి కంటే అధికుడు. తరించడానికి భగవంతుని నామము, రూపము పట్టుకుంటే చాలని తృణావర్తోపాఖ్యానం ద్వారా తెలుస్తుంది.
శ్రీకృష్ణ బలరాముల బాల్యలీలలు
నెమ్మది నెమ్మదిగా కృష్ణ బలరాములు పెద్దవారవుతున్నారు. లోకమున కంతటికీ నడక నేర్పే పరమాత్మ నందవ్రజంలో తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నాడు. ఏమి ఆశ్చర్యమని ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారు. మహర్షులు అగ్నిహోత్రం వేస్తూ ఆహా ఏమి అదృష్టం? ఏ పరమాత్మకు హవిస్సులు ఇస్తున్నామో అటువంటి పరమాత్మ ఈవేళ బుడిబుడి నడకలు నడుస్తున్నాడు’ అని దివ్యదృష్టితో చూసి సమాధిమగ్నులయిపోయారు. ఆయన బుడిబుడి అడుగులు చూసి రాక్షసులకు మరణకాలం దగ్గరకు వచ్చిందని వాళ్ళ అడుగులు తడబడడం మొదలుపెట్టాయి. అమ్మ చెపుతున్న కథలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు. తల్లి చిన్న వేణువును ఇస్తే ఊదుకుంటూ ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు.
తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెఱిభూతి పూతగాగ
ముందఱ వెలుగొందు ముక్తాలలామంబు తొగలసంగడికాని తునుకగాగ
ఫాలభాగంబుపై బరగు కావిరిబొట్టు కాముని గెల్చిన కన్నుగాగ
గంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయ మగు మెడకప్పుగాగ
హారవల్లు లురగ హారవల్లులుగాగ బాలలీల బ్రౌఢబాలకుండు
శివుని పగిది నొప్పె శివునికి దనకును వేఱులేమిఁ దెలుప వెలయునట్లు.
ఈ సందర్భంలో పోతనగారు ‘మట్టిలో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు మట్టి తీసి మీద పోసుకుంటుంటే నాకు కృష్ణుడు కనపడడం లేదు. ఒంటినిండా భస్మం అలముకున్న బాలశంకరుడు కనపడుతున్నాడు అన్నారు. ఆయన మెడలో వేసుకొన్న నీలపతక హారం కాంతి కంఠం మీద కొడుతుంటే గరళమును కంఠంలో పెట్టుకున్న నీలకంఠుడు కనపడుతున్నాడు. అమ్మ కొప్పుకు కట్టిన ముత్యాల సరాలు చూస్తుంటే కపర్ది అని పెద్ద జటాజూటం ఉండి అందులో గంగమ్మను ధరించి చంద్రరేఖను పెట్టుకున్న శంకరుడు దర్శనం అవుతున్నాడు. మెడనిండా అమ్మ హారములు వేస్తే నాగభూషణుడై పాములను ధరించిన శంకరుడు దర్శనం అవుతున్నాడు. చిన్నికృష్ణుడు నా వంకచూసి పోతనా! కృష్ణుడు, శివుడని ఇద్దరు లేరు’ అని నాకు పాఠం చెప్పినట్లు ‘కృష్ణుడు శివుడని రెండుగా కనపడుతున్నది ఒకటే తత్త్వము సుమా అని నాకు పాఠం చెప్పాడా! అన్నట్లుగా కనపడ్డాడు’ అని పద్యం రాసుకున్నారు. మహానుభావుడు ఎంతో శివకేశవ అభేదమును పాటించి ధన్యుడయిపోయాడు.
పోతనగారు కృష్ణుని బాల్యలీలలు వర్ణిస్తూ ఎన్నో చక్కని పద్యములు వ్రాశారు. పోతనగారిని మరచిపోవడం దౌర్భాగ్యం. ఒక్క గ్రామములో గాని పట్టణంలో కానీ, పోతనగారి విగ్రహం లేకపోవడం చాలా విచారించవలసిన విషయం. పిల్లలకి ఈయన పోతనగారని చెప్పడానికి ఇళ్ళల్లో ఫోటోలేని దరిద్రానికి తెలుగుజాతి దిగజారిపోవడం మన దౌర్భాగ్యం.
కృష్ణుడు అందరి ఇళ్ళల్లోకి వెళ్ళిపోయేవాడు. అన్ని ఇళ్ళల్లో ఉన్న వెన్న, నెయ్యి అన్నీ తినే వాడు. ఎవరయినా తన మీద నేరములు చెపితే అమ్మ నమ్మకుండా ఉండాలని బయటే మూతి అంతా శుభ్రంగా తుడిచేసుకునే వాడు. అలా వెన్నలన్నీ తినేసి వచ్చాడు. కృష్ణ పరమాత్మ వెన్న నెయ్యి తినడంలో ఒక రహస్యం ఉన్నది.
తమంత తాముగా చేసుకోవలసిన ప్రయత్నముతో ఏర్పడేది నిర్మలమయిన మనస్సు ఈ నిర్మలత్వము ఎవ్వరూ తేలేరు. ఈశ్వర కథాశ్రవణం చేసి, భగవంతుడిని మనస్సుకి ఆలంబనముగా ఇచ్చి రాగద్వేషములకు అతీతంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నిర్మలంగా ఉన్న మనస్సును పాలకుండని పిలుస్తారు. మనస్సుకు ఈశ్వరుని తీసుకు వచ్చి ఆలంబనం ఇచ్చినట్లయితే పొంగిపోయి భక్తితోకూడిన కర్మాచరణమును సంతోషంతో కూడిన పూజను చేయడం మొదలు పెడతారు. దాని చేత భక్తి ఏర్పడుతుంది. భక్తి చేత ఏర్పడిన కర్మవలన మనసు శుద్ధి అవుతుంది. శుద్ధివలన వైరాగ్యభావన కలుగుతుంది. ఈ వైరాగ్యమనే అగ్నిహోత్రము మీద నిర్మలమయిన మనస్సనే పాలు కాగాలి. ఈ పాలు ఎర్రటి తొరక కడతాయి. కమ్మటి పాలు నిర్మల కైంకర్యమయిన మనసు వలన, భక్తివలన వైరాగ్యభావననే అగ్నిహోత్రం మీద కాలి, కాగి వున్నాయి. ఈ పాలు పెరుగు అవ్వాలి.
పాలను పెరుగుగా మార్చాలంటే పెరుగు కావాలి. పెరుగే పాలను పెరుగుగా మారుస్తుంది. ఇంతకూ పూర్వం ఈశ్వరుని గుణములను విని లోపల స్తంభించిపోయి ధ్యానమునందు ఎవరు అనుభవించారో వారే వచ్చి మరల ఆమాట చెప్పాలి. గురువు ఉపదేశం వినాలి. పెరుగు పాలలోకి వచ్చి తోడుకుంటుంది. రమించిపోయి బోధిస్తున్న గురు ఉపదేశమును కదలని కుండలా పట్టాలి. ఈ పాలలోకి ఆ పెరుగు పడితే పాలు తోడుకుంటాయి. గురువు ఎలా ఉంటాడో అలా శిష్యుడు తయారవుతాడు. అలా పరంపరగా గురువు వెనుక గురువు తయారవుతాడు.
పెరుగు గట్టిగా తోడుకున్న తరువాత పూర్వం గురువులు చెప్పిన మాటలను చెవితో విని వదలడం కాకుండా వారు చెప్పిన మాటలను లోపల బాగా తిప్పాలి. ఈ తిప్పడమే మననము అనే కవ్వము. ఇది తిరుగుతుంటే పెరుగు చిలకబడుతుంది. గురువు వలన తాను విన్న విషయములను కూర్చుని మనసుపెట్టి చిలికి ధ్యానం చేస్తుంటే ఈ చప్పుడు ఈశ్వరుడికి వినపడుతుంది. ఆయన వెంటనే వచ్చేస్తాడు. పెరుగును చిలికితే లోపలనుండి వెన్న పైకి తేలుతుంది. వెన్నకి రెండు లక్షణములు ఉంటాయి. ఈ వెన్నను అగ్నిహోత్రం మీద పెడితే కరిగి నెయ్యి అవుతుంది. నీటిలోకాని, మజ్జిగలో కానీ వేస్తే తేలుతుంది. భగవత్సంబంధమయిన జ్ఞానమనే అగ్నిహోత్రం తగిలితే ఇప్పటి వరకు పాలలోనే ఉన్నా పైకి కనపడని నెయ్యి చిట్టచివరి దశలోపైకి వస్తుంది. పాలను నెయ్యిగా తీసుకురావాలంటే ఇదంతా జరగాలి. నేతిని తిరిగి పాలుగా మార్చలేము. ఒకసారి బ్రహ్మజ్ఞానమును పొందిన తర్వాత ఇంక వెనక్కి వెళ్ళడము జరగదు. తాను ప్రారబ్ధం అయిపోయే వరకు శరీరంలో ఉండి శరీరం పడిపోతూ ఉండగా అమ్మయ్య శరీరమును వదిలి పెట్టేస్తున్నానని జీవుడు సంతోషిస్తాడు.
ఆత్మజ్ఞాన స్వరూపమయిన వెన్న నెయ్యి కాదు. దీనిని ఆధారం చేసుకుని ఆత్మదర్శనం అవ్వాలి. దానికి నిధిధ్యాసనం లోనికి వెళ్ళాలి. లోపలి వెన్న ఎవ్వరికీ పనికిరాదు ఒక్క ఈశ్వరునికే పనికి వస్తుంది. అత్యంత ప్రశాంతమయిన ప్రదేశమునందు కూర్చుని పరమేశ్వరుని ధ్యానం చేయాలి. ఈ వెన్నను ఒక్క ఈశ్వరుడే తింటాడు అన్యులు దీనిని తినలేరు. ఈశ్వరుడు ఇక్కడకు వచ్చి తినడమే గోపకాంతల ఇళ్ళల్లోకి వెళ్ళి కృష్ణుడు వెన్న తినడం. ఆ భక్తి, ఆ వెన్న కృష్ణ స్పర్శచేత జ్ఞానముగా మారుతుంది అది నేయి. అది యజ్ఞమునందు పడుతుంది. అదే హవిస్సుగా మారుతుంది. ఈ శరీరము పడిపోయి పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యమును పొందుతాడు. ఇదీ కృష్ణుడు వెన్న తినడం అంటే! అంతేకానీ చేతకాక, పనిలేక, అవతారమును స్వీకరించి వాళ్ళింట్లోకి, వీళ్ళింట్లోకి వెళ్ళి వెన్నలు దొంగతనం చేసి తిన్నాడని దాని అర్థం కాదు. ఎందుకు వెన్న తిన్నాడో అంతరమునందు విచారణ చేయాలి. దీనిని నవనీత చోరత్వము అంటారు. వెన్నను ప్రసాదంగా స్వీకరించడం వెనక ఉన్న రహస్యం అది!
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...
instagram.com/pravachana_chakravarthy