10, నవంబర్ 2022, గురువారం

వినాయగర్ అగవల్

 “వినాయగర్ అగవల్” చదవండి


దాదాపు నలభై సంవత్సరాల క్రితం, పూజ్యశ్రీ కంచి శంకరాచార్య పరమాచార్య స్వామివారు మైలాడుతురై దగ్గర్లోని వేట్టమంగళం అన్న చిన్న గ్రామంలో మకాం చేస్తున్నారు. ఆ సమయంలో పెరియార్ రామస్వామి వినాయకుని విగ్రహాలను ధ్వంసం చేసే ఉద్యమాన్ని ప్రారంభించాడు. విగ్రహాలను పగులగొట్టే తేదీని ప్రకటించగానే కుంభకోణానికి చెందిన శివనాడియార్లు - శివ భక్తులు కలత చెంది, వేట్టమంగళంలో మహాస్వామివారిని కలిసి, “దీన్ని ఎదుర్కొనేందుకు మేము ఎంటువంటి చర్యలు తీసుకోవాలి?” అని అడిగారు. స్వామివారు ఎంతో అనుగ్రహంతో, “అందరు భక్తులు రేపటి నుండి వినాయకుని దేవాలయాలకు వెళ్ళి, కొబ్బరికాయలను కొట్టి, అభిషేక ఆరాధనలు చేయండి” అని సెలవిచ్చారు.


అందరూ “వినాయగర్ అగవల్” పారాయణ చేయమన్న సందేశాన్ని పత్రికలో ప్రచురించాల్సిందిగా నాకు సైగలతో చెప్పారు పరమాచార్య స్వామివారు. అవ్వయ్యార్ అందించిన “వినాయగర్ అగవల్”ను ముద్రించి అందరికీ ఉచితంగా పంచమన్న ఆదేశాన్ని కూడా అనుగ్రహించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, “వినాయగర్ అగవల్” అన్న ఒక పుస్తకం ఉందన్న విషయం కూడా నాకు తెలియకపోవడం. వారు అవ్వయ్యార్ అన్నదాన్ని సైగలతో చూపడమూ అర్థం చేసుకోలేకపోయాను. “వినాయగర్ అగవల్” అన్న పుస్తకం గురించిన సైగలను కూడా అర్థం చేసుకోలేకపోయాను. తరువాత స్వామివారు ఇసుకలో పేరు వ్రాసి చూపించారు. అది రాత్రి కావడంతో, స్వామివారి దగ్గరున్న కాంతి చాలా తక్కువ ఉండడంతో అది కూడా ఫలించలేదు. చివరికి వారు ఒక పలక, బలపం తెప్పించి పలకపై రాసి చూపారు. నాకు అర్థం అయ్యింది. వారి ఆదేశానుసారం “వినాయగర్ అగవల్” పుస్తకం ప్రచురించి, ఉచితంగా పంచడం జరిగింది. అన్నీ పత్రికలు, అచ్చు మాధ్యామాలలో “వినాయగర్ అగవల్” పారాయణ చెయ్యమన్న పరమాచార్య స్వామివారి సందేశం ప్రచురణ అయ్యింది. అచ్చోత్తిన అక్షరాల వలే ముత్యాలవంటి అక్షరాలతో ఉండే స్వామివారి చేతివ్రాతను చూసే భాగ్యం నాకు కలిగింది.


తంజావూరులో పెరియార్ విగ్రహం క్రిందన రాసివున్న “దేవుడు ఉన్నాడని నమ్మేవాడు మూర్ఖుడు” మాటలను చూసి కొందరు స్వామివారికి తెలిపి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని అడుగగా, “మీరు గాంధీ విగ్రహం పెట్టి దాని క్రింద, రామనామం వ్రాసి, ‘రామనామాన్ని జపించడం ఉన్నతమైన ఆధ్యాత్మిక కార్యం’ అని కూడా వ్రాయండి” అని చెప్పారు. 


1952లో మహాస్వామి వారు నఙ్గంకుడిలో మకాం చేస్తున్నారు. హరిజనుల్లో ఉన్న వళ్ళువర్ తెగ జనంతో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. వళ్ళువర్లు మంచి జ్యోతిష్యులు మరియు హరిజన సమూహానికి కర్మలు క్రతువులు చేయించేవారు.


వచ్చినవారందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని స్వామివారి ఆదేశం. అప్పుడే ఒక సమస్య వచ్చింది. వళ్ళువర్లలో ఉపతెగలకు చెందిన కొంతమంది సహపంక్తి భోజనానికి సుముఖత చూపలేదు. ఇది మహాస్వామివారినే విస్మయపరచిన విషయం. “ఈరోజు దాకా ఈ సమూహంలో అటువంటి ఆచార పద్ధతులు ఉన్నాయన్న విషయం నాకు తెలియదు” అని ఆశ్చర్యపోయారు.


--- కడర్శాప్ ఎ.వి. వేంకటరామన్, శ్రీరంగం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: