10, నవంబర్ 2022, గురువారం

ద్రౌపదీదేవికి

 శ్లోకం:☝️

*ద్రౌపద్యాః పాండుతనయాః*

  *పతి దేవర భావుకః |*

*న దేవరో ధర్మరాజః*

  *సహదేవో న భావుకః ||*


భావం: ద్రౌపదీదేవికి పాండవులతో భర్త, మరది, బావగారు, అనే మూడు రకాల బాంధవ్యాలున్నాయి. ధర్మరాజు మరది కాడు, సహదేవుడు బావ కాడు అని భావం.

    ఒకసారి కాళిదాసు కాశీలోని వ్యాసుని విగ్రహం చూసి " ఓహో  ! వీరా 'చ'కారకుక్షి ! " అంటూ విగ్రహం బొడ్డులో తన వేలు పెట్టాడుట. అంతే ఆ వేలు యిరుక్కుపోయింది. కాళిదాసు ఆశ్చర్యపడుచుండగా ఆ విగ్రహంనుండి " మనవడా! నన్నాక్షేపిస్తున్నావు! ఏదీ 'చ'కారం లేకుండా ద్రౌపది పాండవుల యొక్క బంధుత్వాల గురించి ఒక్క శ్లోకం చెప్పు చూదాం?" అన్నాడట. అప్పుడు కాళిదాసు వినయంగా పై శ్లోకం చెప్పాడని ఐతిహ్యం.

    సర్వజ్ఞ సింగభూపాలుడు ఈ శ్లోకాన్ని మనసులో ఉంచుకొని తన వద్దకు వచ్చిన ఒక కవిని ఇలా ప్రశ్నించాడు. "ద్రౌపదికి పాండవు లైదుగురు భర్తలు కదా! వారిలో ఒకరు ఆమెకు భర్త అయినప్పుడు తక్కినవారు ఆమెకు ఏమవుతారో ఆశువుగా కందపద్యంలో చెప్పగలవా?" అని. అప్పుడా కవి చెప్పిన కంద పద్యం ..

*పతి మఱఁదియు సహదేవుఁడు*

*పతి బావయు ధర్మజుండు, బావలు మఱఁదుల్*

*పతులు నర నకుల భీములు*

*పతు లేవురు సింగభూప! పాంచాలి కిలన్*

సింగభూపాలుడు ఆనందించి ఆ కవిని ఉచితంగా సత్కరించాడట! (శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)

కామెంట్‌లు లేవు: