మహాస్వామి మానసిక దర్శనం
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
కాంచి శంకర కామాక్షి శంకర
కాలడి శంకర కామకోటి శంకర
కొద్ది దూరం నుండి జయజయధ్వానాలు వినబడుతున్నాయి. మొదట గందరగోళంగా చిన్నగా వినబడింది. దగ్గరకు వెళ్ళేకొద్దీ స్పష్టంగా వినబడడంతో, దేహం రోమాంఛితమయ్యింది. చీమల దండులో నిదానంగా నడచి వస్తున్నా భక్తుల యొక్క పెద్ద గుంపు. హంగు, ఆర్భాటాలు, అలంకారాలు, అరుపులు లేక అతి సామాన్యంగా ఉంది. వివిధ జాతుల, వివిధ భాషల, పేద ధనిక, అడ మగ, పిల్లలు అందరూ వారికి వచ్చే భాషలో భజనలు పాడుకుంటూ పదే పదే శ్లోకాలను వల్లెవేస్తూ వెళ్తున్న ఊరెరిగింపు.
నాలుగ్గంటల సూర్యుని సన్నని లేలేత వెలుగు. సూర్యుడు దాగుడుమూతలు ఆడుతున్నాడా అన్నట్టుగా, అక్కడక్కడా మబ్బుల్లో దాగుతున్నాడు. గుంపు మధ్యలో ఒక చిన్న సైకిల్ రిక్షా. అది చూడడానికి సర్కస్సులో వాడేదిగా ఉన్నట్టు ఉంది. దానిపై చిరిగిన గోనెసంచులు, ఒక చాప, ఆకులతో అల్లిన గొడుగు, కొన్ని సరుకులు.
ఒకరు ఆ రిక్షాను లాగుతూ ఉంటే, దాని వెనుక రిక్షాను పట్టుకుని నీవు (రచయిత్రి స్వామివారిని ఇలాగే సంబోధిస్తోంది). చూసిన మరుక్షణమే చేతులు కాళ్ళు వణుకుతుండగా, రోడ్డుపై పడి నమస్కారం చేస్తాము. నువ్వు ఆగవు కాని కళ్ళతోనే మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు సాగుతావు. అవి నీ కళ్ళా? కాదు, కాదు! కరుణా సముద్రాలు.
నీ దర్శనం కోసం, నున్ను చూచే భాగ్యం కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురుచూశాను. నీ గురించి చదివినా, విన్నా మనస్సు ఎంతో ఆతృత పడేది. ఏ పత్రిక కొన్నా నీ గురించి ఏమి వ్రాశారో అని వెతికేవి నా కళ్ళు. నిన్ను చూడలేనేమో అన్న దిగులు పట్టుకుంది. అప్పుడు నువ్వు కంచికి దగ్గరలోనే ఉన్నావు. మేము లెక్కలేనన్నిసార్లు మద్రాసుకు వచ్చాము. కంచికి వచ్చి నిన్ను ఒక్కసారైనా చూడాలని ఎన్ని సార్లు అర్థించానో. వేడుకున్నాను. మేము చాలా సామాన్యులం. పనికిరానివాళ్ళం. ఆహారము, నిద్ర, అవసరం లేని ఆడంబరము, పనికిమాలిన విషయాలే గొప్పవి అనుకునేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళాలి అనిపిస్తే అక్కడికి వెళ్తాము, ఎంత ఖర్చు పెట్టాలి అనిపిస్తే అంత ఖర్చు పెడతాము, కాని నిన్ను చూడటానికి రావడానికి మాత్రం మాకు కుదరదు.
రోజూ దీపం వెలిగించి నీ చిత్రపటాన్ని చూడగానే, మనస్సంతా దిగులుగా అయిపోయేది. మానవ ప్రయత్నం వల్ల నిన్ను చూడటం సాధ్యం కాదని, కేవలం నీవు పిలిస్తేనే అది కుదురుతుంది అని. నా కోరికను మాటల్లో ఎప్పుడూ చెప్పలేదు. నీకు అది వినబడిందా? ఏమైతేనేమి, బిడ్డకు ఆకలి వేస్తే ఆకలి అని ఏడ్చాల్సిన అవసరం లేదు. తల్లి ఆ ఆకలిని అర్థం చేసుకోగలుగుతుంది. అలాగే, నా బాధ కూడా నీకు అర్థం అయ్యుంటుంది.
నేను నిన్ను చూడలేకపోతున్నాననే బాధ వల్ల నీవే నన్ను చూడటానికి వస్తున్నావా? నీకు ఏముంది? కారా? రైలా? ఈ తారు రోడ్డుపై కాళ్ళు మంటలు పుట్టగా నడిచి వస్తావు. ఆ కాళ్ళకు వేసుకున్నదేమో విరిగిపోయిన చెక్క పాదుకలు, అదికూడా మంజి నారుతో కట్టినవి.
అదేమైనా ఒక మైలా, రెండు మైళ్ళా? ఎంత దూరం నడిచావు అప్పా! వేలమైళ్ళు కేవలం కాలినడకన వచ్చావు. మేము నివసిస్తున్న ఈ హుబ్లి నగరం ఎంత పుణ్యం చేసుకుందో కదా నీ పాదస్పర్శ పొందడానికి. నీవు వస్తావని మేము కలలో కూడా ఊహించలేదు. కాని నువ్వు రావడం నిజమే. చిరిగినా కాషాయ వస్త్రం, దానిపైన చెట్టు బెరడు నారతో చేసిన ఒక ఆచ్చాదన. మెడలో, తలపై రుద్రాక్ష మాలలు.
నిన్ను చూడగానే ఒక క్షణకాలం సందేహం. మానవుడేనా? కాదు, కాదు. పులి చర్మం ధరించి నడుస్తున్న పరమేశ్వరుడు. భగవంతుని దర్శనం చేసుకున్నామన్న సంతృప్తి. మాకు నువ్వు కాదు శివుడు కనబడుతున్నాడు.
ఆశ్రం ధర్మం కోసం ఆరోజు నువ్వు అన్నిసార్లు స్నానం చేశావు. దానివల్ల విపరీతమైన జలుబు, జ్వరం అని నీతో ఉన్నవారు చెబుతున్నారు. అది కేవలం ఆహారం తీసుకునే మానవ శరీరం అయితే, వైద్యం, రక్షణ, సౌకర్యాలు, విశ్రాంతి కావాలి.
కాని ఏనభైఆరేళ్ళ వయస్సులో, సరైన ఆహారము, సౌకర్యాలు లేకపోయినా జ్వరంలో కూడా నడుస్తున్నావు. అది నీ తపఃశక్తి యొక్క బలం. దైవం మానుష రూపేణా అన్నట్టు తోస్తున్నావు. మానవ శరీరం, దైవ శక్తి. శక్తి నీయందు నివసించి ఉంది. అందుకే నువ్వు దేవునిలా, శివునిలా కనపడుతున్నావు. ఆరోజు నువ్వు అప్పటికే పద్దెనిమిది కిలోమీటర్లు నడిచావు అని చెప్పారు. కనుక ఇంకా నువ్వు ఎక్కువ శ్రమ పడకూడదు. నిన్ను శ్రమపెట్టేవాళ్ళం మేమే. అక్కడికి, ఇక్కడికి, ఎక్కడెక్కడికో రమ్మని మేమే నిన్ను ఆహ్వానిస్తాము.
సూర్యుడు అస్తమిస్తూ ఉండడంతో, దారి పక్కనే ఉన గ్రామం నిన్ను ఆహ్వానించింది. ఒక తోటలో, గోశాల ప్రక్కన, గడ్డి పైకప్పుతో ఉన్న చిన్న గుడిసెలో. కొన్నిసార్లు నువ్వు కూడా చిన్నపిల్లల్లా అందరి అభిప్రాయాలు విని, నీ సమ్మతి తెలుపుతావు.
అంత దూరం నడచినందుకు నీకు అలసట వెయ్యదా? నీకు ఆకలిదప్పులు లేవా? ఈ సాయం సంధ్య వేళ చిన్న గుడిసెలో కూర్చుని, అలసట అనేది లేకుండా వేలమందికి దర్శనం ఇస్తున్నావు. ఇది గొప్ప విషయం కాదా? రాజు తన అంతఃపురంలో ఉన్నప్పుడే ఎంతో ఆందోళనగా ఉంటాడు. కాని ఇక్కడ ఒక సన్యాసి ముందు, నేలపై దుమ్ము ధూళిలో కుటుంబంతో సహా కూర్చున్న ఈ సండూరు మహారాజు ఎంతో ఆనదంగా ఉన్నాడు.
మరుసటిరోజు నీవు పట్టణ ప్రవేశం చెయ్యాలన్నప్పుడు, మేము నీకు సాష్టాంగ నమస్కారం చేసి, సెలవు తీసుకున్నాము. అయిష్టంగానే నిన్ను ఊరి శివార్లలో వదిలి వెళ్ళిపోయాము. తెగిపోయిన నీ స్ఫటిక మాలను బాగుచేయించే భాగ్యం నా భర్తకు దొరికింది. నీ శరీరాన్ని తాకిన ఆ మాలను మా చేతుల్లో తాకడానికి మేము చేసిన పుణ్యం ఏమిటి? ఎన్నో సార్లు దాన్ని తాకి, ఆనందాశ్చర్యాలతో చూసి తరించాము.
నువ్వు ఏమీ తినవు. నీకు ఆకలి, దప్పికలు లేవు. అలసట అసలు రాదు. కాని నీ సేవకులు సామాన్యులు కదా! వారికి ఆకలిదప్పులు ఉంటాయి కదా! ఆరోజు రాత్రి వాళ్ళు వంట చేసుకోవడానికి కూడా ఓపిక లేదని చెప్పారు. అలా వాళ్ళు ఆకలితో ఆకలితో నిద్రపోవడం నువ్వు ఒప్పుకోవు. కొంత ఉప్పుమ (కిచిడి) లేదా రవ్వ గంజి చూపాలని నువ్వు పట్టుబట్టావు. నేను ఆహారం పంపుతానని అన్నాను. కాని వారు కొంత ఉప్పుమ తయారుచేసి నీకు చూపుతామన్నారు. ఏం చెయ్యాలి? నిన్ను సంతృప్తి పరచడానికి కొన్నిసార్లు మోసం చెయ్యాలి.
ఆరోజు శనివారం. మరుసటి రోజు నువ్వు వస్తున్నావని మొత్తం నగరమంతా కోలాహలంగా ఉంది. నువ్వు ఇంట్లోకి రావని అందరికి తెలుసు. కాని ఇళ్ళన్నీ పండుగ వాతావరణం సంతరించుకున్నాయి. నేలపై పిండితో వేసిన ముగ్గులు, పూలతో మొత్తం అలంకరణలు. ఎక్కడ చూసినా పెళ్లి సందడే. అందరూ ఎంతగానో ఉత్తేజితులయ్యారు. అందరి గుండెల్లో సంతోషం, ఉత్సాహం. మా ఇల్లు మొత్తం పవిత్ర వస్తువులతో, సరుకులతో నిండిపోయింది.
నువ్వు వచ్చావని ఎందుకు అందరికి అంత ఆనందం, ఉత్సాహం? నీవేమైనా రాజువా, రాజకీయ నాయకుడివా? ఐశ్వర్యవంతుడివా? లేక సినిమా నటుడివా? చేతిలో ఏమీ లేని ఒక సన్యాసివి నువ్వు. సన్యాసులకే సన్యాసివి. సన్యాసికి కనీసం మఠం అయినా ఉంటుంది. నీకు అది కూడా లేదు. అంతటి భాగ్యమా మాకు?
ఇక్కడకు రావడానికి అంగీకరించినప్పుడు నిన్ను ఎక్కడ ఉంచాలా అని ఆలోచించాము. మా సమస్య ఏమిటంటే, నీకు కావాల్సిన నది ఒడ్డు కాని, సరస్సు కాని, బావి కాని ఇక్కడ లేవు. అదృష్టం కొద్ది మ పెరట్లో బావి త్రవ్వితే అందులో నీళ్ళు పడ్డాయి. త్వరితగతిన మిగిలిన బావి పనులు పూర్తీ చేసి, పూజ కూడా చేశాము. మా ఇంటి కంచెకు తగిలేటట్టు ఒక చిన్న గుడిసె, ఒక షెడ్డు నిర్మించాము. మా ఇంటి అవుట్ హౌస్ ఖాళీ చేసి సిబ్బంది ఉండటానికి, వంటకు ఇచ్చాము.
ఇక్కడి నుండి ‘నువ్వు’ అని వ్యవహరించలేదు. కేవలం ‘పెరియవా’!
మరుసటిరోజు ఆదివారం, 13-5-79, పరమాచార్య స్వామివారి ఎనభైఆరవ జయంతి మహోత్సవం. దాన్ని హుబ్లిలో జరపడం మా అదృష్టం. నా భర్త గురుశంకర్ అధ్యక్షతన ధార్వాడ్ నుండి వచ్చిన వారితో ఒక బృందం ఏర్పడింది. ప్రముఖులు అందరూ చర్చించుకుని, ప్రజల నుండి ధనం సేకరించారు. మహాస్వామి వారిని ఆహ్వానించి, జయంతి ఉత్సవం జరపడానికి అందరికి పనులను అప్పజెప్పారు. ధార్వాడ్ కు చెందిన వేదపండితులు శ్రీ బాలచంద్ర శాస్త్రి పర్యవేక్షణలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మేము ఎప్పుడెప్పుడు ఈ పేరును స్మరించినా, మాకు పరమాచార్య స్వామి వారు చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి, “దాన్ని మీరు ‘ఫాలచంద్ర’ అని పలకాలి, ‘బాలచంద్ర’ అని కాదు. చంద్రుని వంటి నుదురు ఉన్న వాడు అని దాని అర్థం”.
ఆదివారం ఉదయం స్నానాదులు ముగించుకుని, పూర్ణకుంభంతో, మంగళ వాయిద్యాలతో అందరమూ కలిసి మహాస్వామి వారు ఉంటున్న చోటుకు వచ్చాము. స్వామివారిని ఆహ్వానించి, వారి ఆశీస్సులను అందుకున్నాము. భజనలు, నామావళి, నాదస్వరంతో స్వామివారిని గదగ్ రోడ్డు గుండా ఊరెరిగింపుగా తెచ్చి పట్టణ ప్రవేశం చేశాము. కొద్దిమందిమి ఊరెరిగింపు మధ్యలో ఇంటి వద్దకు వచ్చి, హారతితో స్వామివారిని ఆహ్వానించడానికి తిరిగొచ్చాము. మా ఇంటి ప్రహరీ దగ్గర్లోని గోల్ఫ్ కోర్సులో స్వామివారు ఉండడానికి వసతి ఏర్పాటు చేశాము. కనుచూపుమేర పచ్చని నేల. వసతి ఎదురుగా రైల్వే లైను. అవతలివైపు ఉడిపి కృష్ణ దేవాలయం, రాఘవేంద్ర స్వామి బృందావనం. అది చాలా పెద్ద మైదానం కావడంతో ఎంతమంది భక్తులు వచ్చినా పరవాలేదు అనుకున్నాము, కాని వచ్చిన భక్తజన సందోహాన్ని తట్టుకోవడం చాలా కష్టం అయ్యింది.
మా ఇంటికి దగ్గర్లో, అంటే ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన దేవాలయంలో స్వామివారి జయంతి ఏర్పాట్లు చేశాము. ఆయుష్య హోమం, నవగ్రహ హోమం లాంటివి ఎన్నో నూటఇరవైఒక్క మంది బ్రాహ్మణుల మంత్రోచ్చారణలతో జరిగింది. పురప్రముఖుల అభ్యర్ధన మేరకు నేను మా వారు కార్యకర్తలుగా వ్యవహరించాము. మడిగా ఉంటూ వైదిక, ధార్మిక నియమాలను పాటిస్తూ, స్వామివారిని గౌరవించడానికి హనుమాన్ మందిరానికి వెళ్ళాము. అంతటి గొప్ప ఏర్పాట్లను, అంతటి దివ్య సమక్షాన్ని అప్పటిదాకా చూడలేదు. శాస్త్రోక్త పూజ, వైదిక క్రతువులు ప్రారంభం అయ్యాయి. దక్షిణాదిలోని ఎన్నో ప్రాంతాల నుండి వచ్చిన ఎందఱో పండితులు అక్కడ చేరి ఉన్నారు.
ఉదయం మొదలైన హోమాలు దాదాపు మధ్యాహ్నం మూడు వరకు సాగాయి. మహాస్వామివారిని ఊరెరిగింపుగా హనుమాన్ దేవాలయానికి తీసుకునివచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. హోమగుండానికి ఎదురుగా ఉన్న ఒక చిన్న వేదికపై మహాస్వామి వారు కూర్చున్నారు. ఎక్కడ చూసినా జనసంద్రమే.
అక్కడ జరిగిన వసోదర హోమంలో నేను మా ఆయన పూర్ణాహుతికి నెయ్యి సమర్పించాము. స్వామివారు మాకు ఎదురుగానే కూర్చుని ఉన్నారు. హోమం పూర్తైన తరువాత తీర్థ ప్రసాదాలు తీసుకుని, భక్తుల గుంపును దాటుకుని, స్వామివారి వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాము. స్వామివారు ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీవారికి సమర్పించమని ఎవరో బిల్వ మాలను మావారికి ఇచ్చారు. స్వామివారు మావారి చేతుల్లో నుండి ఆ మాలను తీసుకుని శ్రీవారే మేడలో వేసుకున్నారు. తరువాత దాన్నే మాకు ప్రసాదంగా ఇచ్చారు. నాకు కళ్ళ నీరు ఆగడం లేదు. శరీరం వణికిపోతోంది. ఎంతటి భాగ్యం మాకు! ఎవరు చేసుకున్న పుణ్యం ఇది. మామూలుగా జీవితంలో ఎన్నో భాగ్యాలు పొందుతాము. కాని ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకున్న మహాత్ముడిని గౌరవించే భాగ్యాన్ని పొందడం ఏమని చెప్పగలను? కేవలం పూర్వజన్మ పుణ్య విశేష ఫలం చేత మాత్రమే దక్కుతుంది. మాకు అనిపించేది ఒక్కటే, “హే భగవాన్! ఈ జన్మలో మమ్మల్ని ఉత్తములుగా చేసి, ప్రతి జన్మలోనూ ఇదే భాగ్యాన్ని ప్రసాదించు”.
మేము మహాస్వామి వారు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించగానే, అక్కడున్న కొంతమంది ఆడవారు మా పాదాలకు నమస్కరించి, మేము చాలా అదృష్టవంతులము అని చెప్పారు. నేను భావోద్వేగంతో ఏడ్చేశాను. తరువాత ఇరవైఏడు సుమంగళులకు చీరలు, రవికెలు అలాగే కన్య పూజకు కూర్చున్న ఆడపిల్లలకు బట్టలు ఇచ్చాము. అంతా ముగిసేటప్పటికి సాయంత్రం అయిదు గంటలయ్యింది. తరువాత మేము భోజనం చేశాము. అప్పటికే స్వామివారు మట్టిదారి గుండా నడచివెళ్లి కుటీరానికి చేరుకున్నారు.
పరమాచార్య స్వామివారు బళ్ళారి దగ్గరలోని హగరి అనే ప్రాంతంలో ఉంటున్నారని తెలియగానే మా ఆనందానికి అవధులు లేవు. ఇది స్వామివారు హుబ్లి రావడానికి పదిహేను నెలల ముందు జరిగిన విషయం. అప్పుడు మా అత్తగారు, మామగారు, వదినా - మరదళ్ళు అందరూ హుబ్లిలోని మా ఇంటికి వచ్చారు.
మేమందరం హగరి నది ఒడ్డుకి బయలుదేరాము. లోపల గదిలో స్వామివారు జపంలో ఉన్నారు. హఠాత్తుగా గడిముందర ఒక దివ్యకాంతి. సూర్యోదయానికి ముందు ఉండే అరుణ వర్ణ వెలుగుకు, స్వామివారు ధరించిన కాషాయ వస్త్రాలకు తేడా లేదన్నట్టుగా దివ్య వెలుగులతో స్వామివారి దర్శనం. అదే మా మొదటి పరమాచార్య స్వామి దర్శనం. మేము స్వామివారిని చూడగానే, ఇక ఈ జనం నుండి మాకు ముక్తి అన్నట్టుగా స్వామివారిని కళ్ళల్లో నింపుకున్నాము. కాని ఆరోజు స్వామివారు కాష్ట మౌనంలో ఉన్నారని తెలిపారు. మేము సాయంత్రం దాకా అక్కడే ఉండి తిరిగొచ్చాము. పాల రుచి తెలుసుకున్న పిల్లిలా పదే పదే స్వామివారి దర్శనానికి వెళ్ళేవాళ్ళం.
రెండవసారి మేము హగరి వెళ్ళేటప్పటికి సాయంత్రం అయ్యింది. నిర్మాణ దిశలో ఉన్న ఒక నూతన శివాలయంలో మహాస్వామివారు కూర్చుని ఉన్నారు. పూర్తిగా ఇంకా చీకటి పడలేదు. ఒక పెద్ద ఇత్తడి దీపం, లాంతరు వెలుగుతున్నాయి. పిల్లలతో కలిసి మేము నేలపై పడి స్వామివారికి నమస్కారం చేశాము. న భర్త తన పేరు చెప్పగానే స్వామివారు, “నీకు ఈ పేరు ఎవరు పెట్టారు? ఎందుకు ఈ పేరు పెట్టారు?” అని అడిగారు. తన తాతగారు తనకు ఈ పేరు పెట్టారని, ఇదే పేరు పెట్టడానికి గల కారణం తనకు తెలియదని తెలిపారు నా భర్త. స్వామివారు సేవకుడిని పిలిచి ఆ పేరును నేలపై రాసి తనకు చూపమన్నారు. తరువాత స్వామివారు మా స్వస్థలం గురించి, కుటుంబం గురించి అడిగి, వేదిక్ స్కూల్ కృష్ణయ్యర్ మరియు దీవాన్ శేషయ్యర్ పేర్లు ఎప్పుడైనా వినడం జరిగిందా అని అడిగారు. మేము లేదని చెప్పాము. (తరువాత మేము విచారిస్తే వారు మా పూర్వీకులు అని తెలిసింది). తరువాత మా వారితో, “ఇప్పటిదాకా ఎలక్ట్రికల్ ఇంజనీయరును ఈ రైల్వే ఉద్యోగంలో నియమించలేదు. నీకు ఎలా దొరికింది? సాధారణంగా ఆపరేటింగ్ డిపార్టుమెంటు వాళ్ళనే డి.యస్. లు గా నియమిస్తారు” అని తెలిపారు.
“రాయచూరు నుండి పూణే రైలుమార్గానికి సమాంతరంగా ఒక రోడ్డు వెళ్తుంది తెలుసా?” అని మావారిని అడిగారు స్వామివారు. తెలియదన్నారు ఈయన. పోలీ వైద్యనాధ్ గురించి అడిగారు. అప్పుడు మేము మా అబ్బాయి శంకర్ గురించి దిగులుగా ఉన్నాము. అతనికి ఏ కలాశాలోనూ ప్రవేశం దొరకడం లేదు. అతనికి మంచి కళాశాలలో ప్రవేశం దొరికి జీవితంలో ఉన్నతుడు అవ్వాలని అప్పుడే మనస్సులో అనుకున్నాను. ఇది నేను పరమాచార్య స్వామివారికి చెప్పలేదు. కాని స్వామివారి అనుగ్రహం వల్ల మా అబ్బాయికి మంచి కళాశాలలో ప్రవేశం దొరికి బాగా చదువుకున్నాడు. ఎన్నో విషయాల్లో వాడికి మహాస్వామివారి అనుగ్రహం లభించింది.
మా పూర్వీకుల గురించి స్వామివారు అడిగిన విషయం చెప్పడానికే నేనీ సంగతులన్నీ చెప్పాను. ఇది జరిగిన దాదాపు సంవత్సరం తరువాత స్వామివారు హుబ్లికి వచ్చారు. హంపి, హోస్పేటలలో చాలా కాలం విజయం చేశారు.
ఇప్పుడు హుబ్లిలో జరిగిన పరమాచార్య స్వామివారి జయంతి విషయాలకు వద్దాం. దాదాపు రాత్రి పది గంటలకు స్వామివారి జయంతి వైభవం ముగిసింది. మేమందరం పరమాచార్య స్వామి వారి దగ్గరే ఉన్నాము. ఆరోజు దేశం నలుమూలల నుండి భక్తులు వచ్చారు. ప్రత్యెక బస్సులు, కార్లలో హుబ్లి చేరుకున్నారు. అంత పెద్ద ఇంటిలో కూడా వారికి సరిపోయే స్థలం లేకపోవడంతో వారు నిద్రించడానికి వరండా, కారు షెడ్డు లాంటి ఇతర స్థలాలలో కూడా ఏర్పాట్లు చేశాము.
ఇత్తడి దీపస్తంభం వెలుగులో స్వామివారు కూర్చుని ఉన్నారు. మిగతా అంతా చీకటిగానే ఉంది. సామాన్యంగా ఎవరికీ ఏమీ కనపడదు. మమ్మల్ని లోపలకు రమ్మని పిలిచి, “అక్కడ నిలబడిఉన్న వ్యక్తి మీకు బంధువులు కదా?” అని అడిగారు. మాకు తక్షణం ఏమీ అర్థం కాలేదు. వెనుక నుండి ఒక ఆడగొంతు “అవును, అవును” అని వినబడింది. తరువాత మాకు తెలిసింది అక్కడ ఉన్నది పార్వతీ, మైసూర్ చొట్టప్ప పెద్ద అన్నగారి కూతురు. తను మాకు బంధువు అని అప్పుడే మాకు తెలిసింది. మరలా మహాస్వామి వారు, “ఆరోజు మిమ్మల్ని కృష్ణయ్యర్, శేషయ్యర్ గురించి అడిగాను. వారు మీకు తెలియదని చెప్పారు. వారు ఎవరో అని ఎవరినైనా అడిగి ఉంటారు కదా? ఎవరిని అడిగారు? బహుశా ఇంట్లో ఉన్న పెద్దలని అడిగి ఉంటారు” స్వామివారే ప్రశ్న, జవాబు చెప్పేశారు. మా పిల్లల చదువు గురించి అడిగారు స్వామివారు. జయంతి కోసం చేసిన ఏర్పాట్ల గురించి అడిగారు, ఎంతమంది భోజనం చేశారు అని. తరువాత స్వామివారే ఒక విషయం గురించి చెప్పారు. ఆరోజు స్నానానికి ఎవరో గంగాజలం తెచ్చారు. చేతిలో ఉన్న మామిడి పండు జారి గంగలో పడింది. తరువాత నీరు రుచి చూస్తే ఎంతో తియ్యగా ఉన్నాయి.
చిన్నపిల్లాడిలా నవ్వుతూ, మామిడి పండు వల్ల గంగ తియ్యగా అయ్యిందా? లేక గంగ వల్ల మామిడిపండు తియ్యగా అయ్యిందా తనకే అర్థం కాలేదని అన్నారు. ఆ మిమిది పండులో కొంత భాగం తిని మిగిలింది మాకు పంపారు. గంగాజాలం కూడా పంపారు. రెండూ తియ్యగా ఉన్నాయి. ఎదో చెక్కెర కలిపినట్టు గంగ అంత తియ్యగా ఎందుకుందో అర్థం కాలేదు.
రాత్రి పదకొండు గంటలప్పుడు, పరమాచార్య కోసం చేసిన పూజా ప్రసాదాలను తీసుకుని కొంతమంది కారులో కాంచీపురం నుండి వచ్చారు. వారిని లోపలకు పంపి మేము బయటకు వచ్చాము. వచ్చినవారు మహాస్వామివారి మెడలో కామాక్షి ప్రసాదంగా పెద్ద పూలమాలను వేశారు. గులాబీ రంగు పట్టు వస్త్రాన్ని స్వామివారి తలకు పరివాట్టం కట్టారు. మహాస్వామివారు తలను చూపుతూ, “ఇందులో బంగారు జరీ ఉందా?” అని అడిగారు. అవునన్నారు. “అది చుక్కల జరీనా?” అని అడిగారు. అవునన్నారు. స్వామివారు ఆ వస్త్రాన్ని చేతితో తాకి, “ఇది సాధారణ పట్టా లేక ఫైబ్రస్ పట్టా? ముట్టుకుంటే సాధారణ పట్టు లాగానే ఉంది” అన్నారు. “అవును అది సాధారణ పట్టు యే”. “ఓ! వారు పట్టు తెచ్చి నా తలకు చుట్టారు” అన్నారు.
రెండు కొబ్బరి చిప్పల్లో కామాక్షి ప్రసాదం ఉంది; అర్చన కుంకుమ, హోమ భస్మం. స్వామివారు రెండింటినీ తీసుకుని నుదురుపై ధరించారు. తరువాత వచ్చిన వారితో మఠం గురించిన విషయాలు మాట్లాడుతున్నారు. మేము గది నుండి బయటకు వచ్చి నిల్చున్నాము. వెంటనే స్వామివారు, “ఆమె ఎక్కడ? గురుశంకర్ భార్య? ఆమెను పిలవండి” అన్నారు. అంత హఠాత్తుగా స్వామివారు పిలిచేటప్పటికి కొద్దిగా ఆందోళన చెందాము. ఇద్దరమూ లోపలకు వెళ్లి సాష్టాంగం చేశాము. స్వామివారు రెండు కొబ్బరి చిప్పలను ప్రసాదాలతో సహా తీసుకుని నా చేతుల్లోకి విడిచారు. నాకు ఏమి అర్థం కాలేదు. అది ఎంత గొప్ప విషయమో మాకు తరువాత అందరూ, “కామాక్షి ప్రసాదాన్ని పరమాచార్య స్వామివారి చేతుల మీదుగా తీసుకోవడానికి మీరు ఎంతటి పుణ్యం చేశారు” అన్నప్పుడే అర్థం అయ్యింది.
ఇలా నాలుగు రాత్రులు, నాలుగు పగళ్ళు పరమాచార్య స్వామివారి దర్శనంతో పులకించిపోయాము. అపరిమిత సంతోషంతో గడిచిన రోజులు. మాటల్లో చెప్పలేని ఆనందం. మా జీవితాల్లోకెల్లా అత్యంత పుణ్యవంతములైన రోజులు.
ఇంటి నిండుగా స్వామివారి భక్తులు, ఏమి పేరు? ఏ స్థలం? ఏ ఇంటివారు? ఏ స్థితి? ఏమీ తెలియదు. అందరూ మాకు ఆప్తుల్లానే కనబడుతున్నారు. అందరితోనూ ఆత్మార్థంగా మాటలాడవచ్చు. అందరూ ఒకే కుటుంబానికి చెందినవారులా ఉన్నారు. అందరూ పరమాచార్య కుటుంబానికి చెందినవారు, కేవలం ప్రేమ ఆప్యాయత ఉన్నవారు. పలు రకాల వ్యక్తుల్ని కలవగలిగాము; ఒకరి అనుభవాలను మరొకరు పంచుకుంటూ ఆనందపడ్డాము.
నాలుగవ రోజు, హఠాత్తుగా స్వామివారు నివాసం నుండి బయటకు వచ్చి, సైకిల్ రిక్షా టైర్లను నొక్కి గాలి ఉందా అని చూశారు. అంటే ఇక్కడి నుండి ఇక బయలుదేరుతారని సూచిస్తున్నారా? “చాలా రోజుల తరువాత మేము మీ ఇంట్లో సౌకర్యంగా ఉన్నామని స్వామివారికి తెలుసు. కనుక ఇక బయలుదేరుతారు” అని శిష్యులు నిర్ధారించారు. స్వామివారికి నమస్కరించి పరమాచార్య స్వామివారు మా తోటలోనికి వచ్చి కాసేపు కూర్చోవాలని ఆశ పడుతున్నామని తెలిపాము. స్వామివారు సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు అక్కడంతా మౌనం. చుట్టూ ఉన్నవారు, “మహాస్వామివారు ఇంత దూరం వచ్చారు, అది మీ అదృష్టం. ఇంకా మీ తోట లోనికి కూడా రావాలా” అని నవ్వారు.
మరుసటి రోజు ఉదయం మేము స్వామి వారి వద్దకు వెళ్ళాము. మాకు ఒక విషయం తెలిసి కొంత బాధపడ్దాము. రాత్రి రెండు గంటలప్పుడు స్వామివారు మా తోటలోకి వచ్చారని, అప్పుడు మేము గాఢనిద్రలో ఉండడంతో చూడలేదు. మా గుండెల్లో భరింపలేని దుఃఖం, బాధ. కళ్ళల్లో నీరు కారుస్తూ, మౌనంగా నిలబడ్డాము. లోపలకు రమ్మని స్వామివారిని అడగడం సరైనదో కాదో మాకు అర్థం కాలేదు.
పరమాచార్య స్వామివారు జపం చేసుకుంటున్నారు. హఠాత్తుగా లేచి, చుట్టూ చూశారు. వెంటనే మెట్లు ఎక్కి తోటలోకి నడిచి ఇంటి చుట్టూ వెళ్తుండగా, వారి కాళ్ళకు ఉన్న పాదుకలలో ఒకటి విరిగిపోయింది. కేవలం చెక్క పిడి మాత్రం వేళ్ళ మధ్యన ఉండిపోయింది. దాంతో స్వామివారు ఆగిపోలేదు. ఒక కాలుకు పూర్తి పాదుకతో ఒక కాలుకు కేవలం పిడితో అలాగే నడుస్తూ వెళ్ళారు. స్వామివారి శిష్యులు పరుగుపరుగున వెళ్లి మరొక జత పాదుకలు తెచ్చారు. ఎంతటి కారుణ్యం! రాత్రి స్వామివారు తోటలోకి వచ్చారని విని బాధపడుతున్న మమ్మల్ని ఒదార్చడానికి, సంతోషపెట్టడానికా అన్నట్టు, మా ఎదురుగా మరొక సారి తోటలోనికి వచ్చారు. ఆ కరుణను ఏమని చెప్పగలం? దాన్ని దేనితో పోల్చగలం? కేవలం కరుణా సముద్రముతోనే.
స్వామివారు హఠాత్తుగా మరొక చోటుకు వెళ్ళడం మాకు తీరని బాధను కలిగించింది. మా ఇంటి నుండి అందరూ పరమాచార్య స్వామివారిని అనుసరించారు. ఇల్లు మొత్తం ఖాళీ అయిపొయింది. నాటకం ముగిసిన తరువాత ఖాళీ అయిన వేదికలా ఉంది. ఒక్కరోజులో అందరు బంధువులూ మమ్మల్ని వదిలి వెళ్లినట్టు అయ్యింది. కాని అందరి బంధువు అయిన పరమాచార్య స్వామివారు రావడం, మాతో ఉండడం, ఆశీర్వదించడం, అంతులేని అనుగ్రహం ఇవ్వడం - ఈ జన్మ మొత్తానికి పదే పదే గుర్తు చేసుకోవాల్సిన మధుర స్మృతులు.
మహాస్వామి వారిని దర్శించుకున్న తరువాత మాకు కలిగిన అనుభవం, పొందిన అనుభవం మాటల్లో చెప్పలేను. ఒక తాతగారిలా, బంధువులా, తల్లిలా ఎన్నో విషయాలు తెలిపి మమ్మల్ని ఆనందింపచేశారు. చక్కెర తెయ్యగా ఉంటుంది అంటే సరిపోదు, అది రుచి చూస్తేనే దాని తియ్యదనం తెలుస్తుంది. అలాగే, మాకు పరమాచార్య స్వామివారితో కలిగిన అనుభవం, ఆనందం చెప్పినా వ్రాసినా, అది వేరేవాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. దాని గొప్పతనం, మహత్వం తెలియాలంటే దాన్ని ఆత్మార్థంగా అనుభవించిన వారికే తెలుస్తుంది.
--- కమలా గురుశంకర్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం