28, ఫిబ్రవరి 2025, శుక్రవారం

కృష్ణ మందిర్

 Hyderabad మిత్రులు అందరూ దయచేసి..ఈ గుడినీ ఓ మారు దర్శించాలని మనవి🙏🙏


ఈ గుడి హైదరాబాద్ లోని కిషన్ బాగ్ లో ఉన్న భైరవ స్వామి గుడి., ఇక్కడి పంతులు గారి పరిస్థితి ఏమిటంటే ఆర్థిక పరిస్థితి బాగా లేక ఆ పంతులుగారు ఆటో నడిపిస్తున్నారు 


కాబట్టి చుట్టూ పక్కల ఉన్నవాళ్లు ఆ గుడికి తరచుగా వెళ్ళండి ఆ ప్లేట్ లో ఓ 20 సమర్పించండి.,


ఈ గుడితో పాటు పక్కనే కాశిబుగ్గ ఆలయం, కృష్ణుని గుడికూడా ఉంది..,


పాపం కృష్ణ మందిర్ ముందే ఓ పెద్ద చెత్త కుప్ప., చుట్టూ ముస్లిం ఏరియా..,


కాశీ బుగ్గ ఆలయం గొప్పతనం ఏంటి అంటే నాచ్యురల్ గా నీళ్లు భూమినుంచి ఊరి శివుణ్ణి అభిషేకం చేస్తూ వెళతాయి., పైగా ఇది 200 సంవత్సర క్రితం కట్టింది..


కాబట్టి ఈ మూడు గుడులకు చుట్టూ పక్కన ఉన్నవారు వెళ్ళండి వెళ్తూ ఉంటే పూజలు జరుగుతూ ఉంటే శక్తి ఉత్తేజం చెందుతుంది..


ఈ గుడులకు వెళ్లిన వాళ్ళు హుండీలో కాకుండా ఆ పళ్ళెంలో మాత్రమే దక్షిణ వేసి అక్కడి పూజారిని ఆదుకోండి... వాళ్ళ పరిస్థితి కష్టంగా ఉంది... 🙏


Sudha Krish  పెట్టిన పై పోస్ట్ చదివి నిన్న సాయంత్రం ఆ ప్రదేశానికి వెళ్ళాను. అది అత్తాపూర్ దాటాక కిషన్ బాగ్ లో ఉంది.

మేముంటున్న మియపూర్ ఏరియా కి సుమారు 25 కి.మీ దూరం.


ముందుగా భైరవస్వామి దేవాలయం చూద్దామని వెళ్లాం. కానీ దానికి ముందే చాలా పెద్ద తలుపులతో పూర్వం రాజులు నిర్మించిన దేవాలయం లాగా ఒకటి కనిపించింది. ఏమిటో ఆ దేవాలయం అని చూస్తే దాని పేరు

 "శ్రీ మురళీమనోహర స్వామి" వారి దేవాలయం. బహుశా దీనినే కృష్ణ దేవాలయం అంటున్నారేమో.


ఈ దేవాలయం కనీసం 250 సం. ల క్రిందట కట్టబడి నట్లు ఉంది. చాలా విశాలమైన ప్రాంగణం ఉంది. దేవాలయం చిన్నదే కానీ ప్రహరీ గోడ ని అనుకుని లోపల అంతా రాతి మంటపం నిర్మించి ఉంది. కొంత శిథిలావస్థకు చేరిన స్థితిలో ఉంది.


అహోబిలం మఠం స్వామి వారు 1750 సం. లో ఈ దేవాలయానికి విచ్చేసినట్లు శిలాఫలకం ఉంది.


ఈ స్వామి వారి మూర్తి చూడటానికి నిజంగా రెండు కళ్ళు చాలవు. పేరుకు తగ్గట్టే  స్వామి వారి మూర్తి మురళీ మనోహరం.


ఈ దేవాలయానికి రెండు కధలు వ్యాప్తిలో ఉన్నాయి. మొదటి దాని ప్రకారం ఢిల్లీలో వుండే రాజా రఘు రాం బహదూర్ కి పిల్లలు లేరు. అయితే ఒకరోజు  రాజా వారికి కలలో హైదరాబాద్ లో ఒక తోట, దానిలో భూమిలో 5 అడుగుల క్రింద ఉన్న కృష విగ్రహం కనిపించాయట. వెంటనే రాజా వారు అనుచరులతో కలిసి గుర్రాలు పై హైదరాబాద్ వచ్చి అన్ని తోటల్లో వెతకగా ఈ తోటలో కృష్ణుని విగ్రహం కనిపించడం, ఈ ఆలయం   నిర్మించి విగ్రహం ప్రతిషించారట.  ఈ దేవాలయం నిర్మించిన వెంటనే వారికి సంతానం కలిగింది అని ఒక కథనం. 


రెండో కథ ఏమిటంటే..  నిజాం దగ్గర వకీల్ లేదా నిజాం కు ఎజెంట్ గా పైన చెప్పిన రాజవారు వుండేవారు అని వారే ఈ దేవాలయం నిర్మించారు అని.


ఈ దేవాలయం పక్కనే సయ్యద్ షా నిజముల్లా హుసైన్ దర్గా ఉంది. 


ఈ దేవాలయం ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. చుట్టూ ఎక్కువ శాతం ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి.. చూడబోతే ఈ విలువైన 

స్థలం కబ్జాకు గురి అయ్యే అవకాశాలు ఉండటంతో దేవాదాయశాఖ పెద్ద నోటీసులు అంటించింది.


అక్కడకు పోయిన తరువాత నాకు అర్ధం అయింది ఏమిటంటే  ఈ దేవాలయాలకు భక్తులు ఉత్సవాలు సమయంలో తప్ప సాధారణ రోజుల్లో రావడం సంఖ్య తగ్గిపోవడానికి ఈ ప్రాంతం ఒక కారణం కావచ్చు. 


ఈ దేవాలయానికి దగ్గరలోనే భైరవస్వామి వారి దేవాలయం ఉంది. చాలా చిన్న దేవాలయం ఈ దేవాలయం కూడా సుమారు 200 సం. ల క్రిందట కట్టినట్లు చెపుతున్నారు. ఈ దేవాలయానికి కూడా లోపల వైపు అంతా శిథిలావస్థకు చేరిన రాతి మంటపం ఉంది.


చూడబోతే పైన చెప్పిన మురళీమనోహర దేవాలయంలో మంటపం, దీనిలో మంటపం  నిర్మాణ శైలి ఒకే లాగా అనిపించాయి.


ఇక్కడ పూజారి గారి పేరు నట్వర్ నాధ్ శర్మ. ఉత్తరాది బ్రాహ్మణులు.

ఇక్కడ భక్తులు ఎక్కువ సంఖ్యలో రాకపోవడంతో పూజారి గారు ఖాళీ సమయాల్లో పొట్ట కూటి కోసం ఆటో నడుపుకుంటున్నారు.

వారి గూగుల్ పే నెంబర్: 8886511504.


పై కారణాలు దృష్ట్యా మనకు దగ్గరలో గల ఇటువంటి దేవాలయాలు గురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే కనీసం శని ఆదివారాలు లేదా శలవు రోజుల్లో అయినా ఈ దేవాలయాలు దర్శించే భక్తుల సంఖ్య పెంచవచ్చు. మన భక్తులు ఎంత ఎక్కువగా దర్శిస్తే దేవాలయాలు అంత ఎక్కువగా ప్రాచుర్యం పొంది ప్రాచీన వైభవం సంతరించుకుంటాయి, కబ్జాకు గురి కాకుండా నిలబడతాయి.


ఈ దేవాలయాలకు దగ్గరగా మరొక ముఖ్య దేవాలయం ఉంది. అదే కాశిబుగ్గ ఆలయం.

కాశీ బుగ్గ ఆలయం గొప్పతనం ఏంటి అంటే నాచ్యురల్ గా నీళ్లు భూమినుంచి ఊరి శివుణ్ణి అభిషేకం చేస్తూ వెళతాయి.  ఇది కూడా 200 సంవత్సర క్రితం కట్టింది..


నిన్న నాకు టైం సరిపోక ఆ దేవాలయం దర్శించలేకపోయాను. మరొక్క సారి వెళ్ళాలి.


అందువల్ల అందరూ ఈ దేవాలయాలు తప్పక దర్శించి ఆలయాల పునర్వైభవానికి తమ సహకారం అందించండి..🙏🙏🙏


....చాడా శాస్త్రి....

పాప భారం*

 *పాప భారం*

🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭


మహా కుంభ మేళాలో త్రివేణీ సంగమ స్నానమాచరిస్తన్న కోట్లాది మందిని చూసిన ఒక ఋషిపుంగవునికి  ఒకసందేహంవచ్చి వెంటనే  గంగాదేవిని 

ప్రార్థించి ఇలా అడిగాడుట!

అమ్మా  గంగాభవాని! ఎందరో ఎన్నెన్నో పాపాలు చేసి నదిలో మునక వేసి వారి వారి పాపాలన్నీ నీలో కలి పేస్తూన్నారు.  మరిఇందరి  ఇంత ఎక్కువ పాప భారాన్ని ఎలా మోస్తూన్నావు తల్లీ? అని. 

అందుకాతల్లి. " నాయనా  నేనెట్లా ఆ పాప భారం మోస్తున్నాను? అవన్నీ  ఎప్పటికప్పుడు తీసుకెళ్లి సముద్రం లో

కల్పేస్తున్నాను" అని బదులిచ్చిందట. 

ఆ మాట విన్న ఋషి అయ్యో! అన్ని పుణ్య నదులు ఇంతే కదా? పాపాలన్నీ  అన్ని నదులూ సముద్రం లోనే కలిపేస్తున్నాయి కదా? పాపం! సముద్రుడు ఈ పాప భారాన్ని ఎలా భరిస్తునాడో అనుకుని  సముద్రుడ్నే అడిగాడట ఎలా మోస్తున్నావు ఈ పాప భారాన్ని? అని 

దానికి ఆ సముద్రుడు!

నేనెక్కడ మోస్తున్నాను ఆ పాపాలనూ!

వెనువెంటనే ఆవిరిగామార్చి పైకి మేఘాలలోకి పంపిస్తాను కదా

అని బదులు ఇచ్చాడట!

అరే!  ఎంతో తేలిక గా కదలిపో యే మేఘమాలికలారా!  మీరు ఎలా భరిస్తున్నారు ఆ పాప భారాన్ని? అని.అడగగా!!!!

అవి పక పకా నవ్వి! మేమెక్కడ భరిస్తున్నాం?  ఆ పాపాలన్నీ ఎప్పటికప్పుడే వర్ష రూపేణా మీ మీదే కురిపించేస్తున్నాం అని బదులిచ్చాయట!

ఓహో!!! ఆ పాపాలన్నీ  మనమీద పడి తరిగి మనమే అనుభవిస్తున్నాము అన్న మాట!

ఎట్టి పరిస్థితుల్లోనూ! ఎవరూ కూడా! కర్మ ఫలితాలను వదిలించుకోలేమని ఆ ఋషి గ్రహించాడు!!!

అప్పుడు ఆ ఋషికి  పరమశివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన శ్లోకం గూర్తుకొచ్చింది!

*" ఇదం తీర్థ మిదం తీర్థం భ్రమన్తి తామసాః జనాః,* 

*ఆత్మ తీర్థం  నజానన్తి కథం మోక్షః శృణు  ప్రియే. "*

            అంటే

ఈ తీర్థం లో స్నానమాచరించిన పాపాలు నశించును, ఆ తీర్థం లో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఇంకో నదిలో స్నానమాచరించిన మోక్షం సిద్ధించును! అని తీర్థస్నానములకై పరుగులెత్తెడు మానవులు " భ్రమకు లోబడినవారు".


*" ఆత్మజ్ఞాన మనే తీర్థం లో స్నానమాచరించని వారికి మోక్షమెట్లు కలుగును?"*

*" కర్మ కర్మణా నశ్యతి కర్మ "*

కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది. 


*పురోహితులు కళాధర శర్మ తెలకపల్లి 🪷💐*

మనుషులతో సఖ్యంబుల

 *2025*

*కం*

మనుషులతో సఖ్యంబుల

ననవరతము కాచుకొనెడి యావశ్యకముల్

కనుగొను వారలె ధన్యులు

మనుషులు సఖ్యంబుతోనె మనునిల సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనుషుల తో స్నేహాన్ని ఎల్లప్పుడూ కాపాడుకొనవలసిన అవసరాన్ని కనిపెట్టగలిగే వారే ధన్యులు(కృతకృత్యులు/ఉత్తీర్ణులు/గెలుపొందువారు). ఎందుకంటే మనుషులు స్నేహం ఉన్నంతవరకే ఈ భూలోకంలో మనగలుగుతారు.(ఉండగలరు/నిలువగలరు/మసలగలరు).

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం

సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ


త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున 

నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ (45)


యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే 

తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః (46)


అర్జునా.. వేదాలు మూడుగుణాలు కలిగిన కర్మకాండలను వివరిస్తాయి. నీవు త్రిగుణాలనూ విడిచిపెట్టి, ద్వంద్వాలు లేనివాడవై యోగక్షేమాలు కోరకుండా శుద్ధ సత్వగుణం అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి. నదినుంచి నీరుతెచ్చుకునేవాళ్ళు నూతికి ఎలా ప్రాముఖ్యమివ్వరో అలాగే బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలాపేక్షతో కూడిన వేదకర్మలకు ప్రాధాన్యం ఇవ్వరు.

శర్కరాదేవి ఆలయం

 🕉 మన గుడి : నెం 1034


⚜ కేరళ  :  చిరాయింకీజు -  త్రివేండ్రం 


⚜ శర్కరాదేవి ఆలయం



💠 శర్కరాదేవి దేవాలయం దక్షిణ భారతదేశంలోని అతి ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి.  

ఇది చిరయిన్‌కీజు తాలూకా (తిరువనంతపురం జిల్లా వాయువ్యంలో) దక్షిణాన ఉంది.  


💠 ఇది వర్కాలలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి మరియు త్రివేండ్రం సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి . చిరయిన్‌కీజులోని సర్కారా దేవి ఆలయం భద్రకాళి దేవికి అంకితం చేయబడింది.


💠  1748లో ట్రావెన్‌కోర్ సార్వభౌముడు అనిజం తిరునాళ్ మార్తాండ వర్మ ప్రసిద్ధ కలియూట్ ఉత్సవాన్ని ప్రవేశపెట్టడంతో శర్కరాదేవి ఆలయం అనేక కారణాల వల్ల ముఖ్యమైన హోదాను సంతరించుకుంది మరియు ప్రధానంగా చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. 


💠 శర్కరా దేవి ఆలయానికి సంబంధించి ఒక పురాణం ఉంది: 

చాలా కాలం క్రితం, ఈ ఆలయం ఉన్న ప్రదేశం తక్కువ జనాభాతో ఉండేది. బెల్లం ఊట వ్యాపారం చేసే వ్యాపారుల బృందం ఈ ప్రదేశం గుండా వెళుతోంది. రోడ్డు పక్కన కొంత సేపు ఆగిపోవాలని నిర్ణయించుకున్నారు. 

వారు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించినప్పుడు, వారి కుండలలో ఒకదానిని కదల్చలేమని వారు కనుగొన్నారు. 

వారు దానిని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు, కుండ విరిగిపోయింది మరియు బెల్లం ఊట  ప్రవహిస్తుంది మరియు అక్కడ ఒక విగ్రహం కనిపించింది. 


💠 తరువాత, ఒక వృద్ధురాలు విగ్రహాన్ని చూసి గ్రామస్తులకు అద్భుతం గురించి తెలియజేసింది. 

గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించారు. 

దేవత శర్కారా (మలయాళ పదం బెల్లం/చెరుకు ఊట) నుండి వచ్చింది కాబట్టి, దేవత శర్కరా దేవిగా ప్రసిద్ధి చెందింది.


💠 గర్భగుడి రెండు అంతస్తుల దీర్ఘచతురస్రాకార నిర్మాణం. 

పైకప్పు కంచుతో చేయబడింది. అమ్మవారి విగ్రహం ఉత్తరం వైపు ఉంటుంది. 

కృష్ణుడు, రాముడు, దుర్గ, గణపతి, విష్ణువు, నరసింహమూర్తి మరియు అనేక ఇతర ముఖ్యమైన దేవతల లెక్కలేనన్ని శిల్పాలు రెండవ అంతస్తును అలంకరించాయి.


💠 అట్టింగల్‌లోని అవనావంచెరిలో ఉన్న నక్రంకోడ్ దేవి ఆలయంతో శర్కరాదేవి ఆలయానికి కొంత ప్రాథమిక అనుబంధం ఉంది. 

ఆలయంలో ఒక చిన్న చెరువు ఉంది, ఇక్కడ భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ముందు చేతులు కడుక్కోవచ్చు. 


💠 మలయాళ నెల కుంభం (మార్చి)లో వచ్చే కలియూట్ పండుగ ఈ ఆలయంలో ప్రధాన పండుగ.  కాళీదేవత రైతుల ఆరాధ్యదైవం.


💠 కలియూట్ కళారూపం యొక్క ఆచారాలలో వ్యవసాయ కళ సంప్రదాయాల యొక్క కల్పిత వివరణలను చేర్చడం ద్వారా ఇది స్పష్టమవుతుంది. 


💠 కలియూట్ అనేది వరుసగా మంచి మరియు చెడుల ప్రతినిధులైన భద్రకాళి మరియు దారికా యొక్క పుట్టుకను నాటకీయంగా ప్రదర్శించడం, వారి ఘర్షణ మరియు తరువాత దారికను భక్తి పరంగా మరియు లయబద్ధమైన అడుగుజాడలతో సంహరించడం.  


💠 కలియూట్ పండుగ యొక్క లక్ష్యం భూమి యొక్క రక్షకులైన కాళికా దేవికి ప్రాథమిక పంటను అందించడం.


💠 కలియూట్ పండుగ సాధారణంగా ఫిబ్రవరి/మార్చి నెలలో జరుపుకుంటారు. 

ఇది ఆలయ ప్రాంగణంలో ఆచారాలు మరియు సాంప్రదాయ వేడుకలతో 9 రోజుల పాటు జరిగే పండుగ.


💠 మొదటి 7 రోజుల వేడుకలు భద్రకాళి మరియు దారికా మధ్య యుద్ధానికి దారితీసే కథల నాటకీయ దృశ్యమానం.  

ఈ వేడుకలు వరుసగా 8వ మరియు 9వ రోజు వేడుకలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి.


💠 వేడుకల 8వ రోజున, భద్రకాళి స్వయంగా దారికను వెతుకుతూ బయటకు వెళుతుంది, కానీ ఆ రోజు చివరిలో రాక్షస రాజును కనుగొనకుండా తిరిగి వస్తుంది. 

ఆ రోజు దేవత అందించే పండుగకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఈ ఫంక్షన్ ఒకటి.  


💠 ప్రసిద్ధ "నిలతిల్ పోరు" (గ్రౌండ్ ఫైట్) వేడుకల 9వ మరియు చివరి రోజులో జరుగుతుంది, ఇది రాక్షస రాజును భద్రకాళి చంపడాన్ని దృశ్యమానం చేస్తుంది మరియు తద్వారా చెడుపై సత్యం వ్యాప్తి చెందుతుంది.


💠 కాళీ నాటకోత్సవంలో 8వ మరియు 9వ రోజు కార్యక్రమాలు మరియు రంగుల వేడుకలు పూర్తి కావడానికి గంటల సమయం పడుతుంది.

 

💠 మీనా భరణి ఉత్సవం శర్కరా దేవి ఆలయంలో రెండవ గొప్ప వార్షిక పండుగ.  

ఈ పండుగ తరచుగా వార్షిక ప్రత్యేక పూజా అట్టవిశేషం సందర్భంగా వస్తుంది. 



💠 "మీనాభరణి పండుగ సాధారణంగా శర్కరాదేవి జన్మ నక్షత్రంగా పరిగణించబడే భరణి నక్షత్రానికి తొమ్మిది రోజుల ముందు కొడియెట్టు (జెండా ఎగురవేయడం)తో ప్రారంభమవుతుంది.  

ఇది పదవ రోజున ఆలయ ట్యాంక్‌లో దేవత యొక్క ఆరాత్ (పవిత్ర నిమజ్జనం)తో ముగుస్తుంది. 


💠 ఈ పండుగకు సంబంధించి చాలా ఆసక్తికరమైన వేడుకలు ఉన్నాయి.  పల్లివెట్ట అని పిలువబడే ఈ ఆలయంలో తొమ్మిదవ రోజున ఒక ముఖ్యమైన కార్యక్రమం నిర్వహిస్తారు.  ఈ కార్యక్రమంలో శర్కరా దేవి ఆలయం నుండి అదృశ్యమైందని మరియు ఆమె వేటకు వెళ్లిందని నమ్ముతారు.  

5 ఏనుగులు మరియు అగ్నిజ్వాలల తోడుగా వేట కోసం దేవిని ఊరేగింపుగా భగవతీ ప్యాలెస్‌కు తీసుకువెళతారు.  


💠 పూర్వ కాలంలో ఈ ప్రదర్శనతో పాటుగా జంతుబలులు నిర్వహించేవారు.  

అయినప్పటికీ, తరువాతి కాలంలో జంతు బలులు నివారించబడ్డాయి.  



💠 వర్కాల రైల్వే స్టేషన్ నుండి 7 కి.మీ దూరం 


రచన

©️ Santosh

తర్వాత ఆలోచిస్తుంది

 


అజ్ఞానం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తుంది. జ్ఞానం ఆలోచించాక మాట్లాడుతుంది. మాట అనేది  మరణించేవాడిని కూడా బతికించేలా ఉండాలి కానీ , బతికి ఉన్నవాడిని మానసింగా చంపేలా ఉండకూడదు.

మాఘ పురాణం - 30

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷శుక్రవారం 28 ఫిబ్రవరి 2025🌷*

_*మాఘ పురాణం - 30 వ*_ 

        _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*మార్కండేయుని వృత్తాంతము*


☘☘☘☘☘☘☘☘☘


వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము , మృకండుని జననము , కాశివిశ్వనాధుని దర్శనము , విశ్వనాధుని వరంవలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి *"మహారాజా ! ఇక మార్కండేయుని గురించి వివరింతును , శ్రద్దగా ఆలకింపుమని యీ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు యెక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటిని పూర్తి చేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములో సకలశాస్త్రములు , వేదాంత పురాణేతిహాసములు , స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందెను. అయిననూ మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండేయునకు "కుమారా ! నీవు పసితనమునందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్దికుశలతచే అందరిమన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయెడ , పెద్దలయెడ , బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన , నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధగును"* అని చెప్పుచుండెడివారు. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన , భయము ఎక్కువగానున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి , మహాఋషులందరుకును ఆహ్వానము పంపినారు , మునీశ్వరులు , గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిధిసత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరుకు నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా , ఆయన మార్కండేయుని వారించినారు , అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావా ! మీరిట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవుకమ్ము అని దీవించితిరి గదా ! అదెటుల అగును. ఇతని ఆయుర్దాయము పదహారెండ్లే గదా ? ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఇతడు ఇంకోక సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పెను.


అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. *'చిరంజీవివై వర్ధిల్లు'* మని దీవించినందున వారి వాక్కులసత్యములగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా ? యని వశిష్టుల వారినే ప్రశ్నించిరి , వశిష్టులు కొంతసేపాలోచించి *"మునిసత్తములారా ! మనమందరమునూ ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదమురండు"* అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి. మునీశ్వరుల యాగమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ *'చిరంజీవిగా జీవించు నాయనా'* అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు  వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరబాటునకు విచారము వెల్లబుచ్చి కొంత తడవడి "భయపడకు"మని మార్కండేయుని దగ్గరకు చేరదీసి *"పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక"* యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల వంక చూచి *"ఓ మునులారా ! మీరు పోయిరండు ఇతనికి యే ప్రమాదమునూ జరుగనేరదు"* అని పలికి వత్సా మర్కండేయా ! నీవు కాశీ క్షేత్రమునకు పోయి , విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీకే ప్రమాదమూ కలుగదని ధైర్యము చెప్పి పంపి వేసెను.


మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి , *'కాశీనాధుని సేవించి వచ్చెదను అనుజ్ఞ'* నిమ్మని కోరగా మృకండుడు నాతని భార్యయు కొడుకు యొక్క యెడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక , కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి. విశ్వేస్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే యుండసాగెను.


క్రమముగా నాతడు పదహారవయేట ప్రవేశించెను. మరణ సమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధిలో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి , ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణములవలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులుపోయి జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడతని ప్రాణములను తీసుకొనిపోవసిద్దముగా నుండగా , నాతడు భయపడి , శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి , మార్కండేయుని రక్షించెను.


యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాదిదేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించిరి , కోపముచల్లార్చుకో మహేశా ! యముడు తన కర్తవ్యమును నెర వేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరిగదా ! అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందుకు మేమెంతయో ఆనందిచుచున్నాము. కాని , ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా గాన , మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట ఈశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తులదగ్గరికి రావలదు సుమా ! అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి , తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి యీ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.


*మాఘపురాణం ముప్పయివ* 

      *🙏మరియు చివరి🙏* 

   *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

ఫాల్గుణ మాసం విశిష్టత*

 *ఫాల్గుణ మాసం  విశిష్టత*


♻️♻️♻️♻️♻️♻️♻️♻️


ఫాల్గుణం... విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు *"పయోవ్రతం"* ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది. అదితి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది. ఫాల్గుణంలో గోదానం , ధనదానం , వస్త్రదానం , గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం. ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు , వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం. సర్వదేవతావ్రత సమాహారంగా , సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది.


*వసంత పంచమి* నుంచి *ఫాల్గుణ పూర్ణిమ* వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది. చిలుకలు వాలిన జామచెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలకలా కనువిందు చేస్తుంది. చలి పూర్తిగా తగ్గదు. నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది. ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు. ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు , లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణబ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు కురుపాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు.


*హరిహరసుతుడు అయ్యప్పస్వామి ,  పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు.* ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు , రామకృష్ణ పరమహంస , స్వామి దయానంద సరస్వతిలు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి *‘ఫల్గుణ’* అనే పేరుంది. ఫాల్గుణ బహుళ అష్టమినాడు ధర్మరాజు , ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున భీముడు , దుర్యోధనుడు , దుశ్శాసనులు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.


*ఫాల్గుణ మాసం శ్రీ మహావిష్ణువు ఆరాధన*


*శ్లో || నరాడోలా గతం దృష్ట్యా గోవిందం         పురుషోత్తమం !* 


*ఫాల్గుణ్యాం ప్రయతో భూత్వా గోవిందస్య పురం వ్రజేత్ !!*


శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో ఫాల్గుణం ఒకటి. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే , ఆ మాసాన్ని *‘ఫాల్గుణి’* గా పరిగణిస్తారు. గోవింద వ్రతాలను విరివిగా చేస్తుంటారు. విష్ణుపూజకు *‘పయోవ్రతం’* విశిష్టమైంది. దీన్ని శుద్ధ పాడ్యమినాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు.


సమీపంలోని నదుల్లో స్నానమాచరించి , సూర్యుడికి అర్ఘ్యమిచ్చి , విష్ణువును షోడశోపచారాలతో పూజించి , పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. పయస్సు అంటే పాలు. అదితి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట. లక్ష్మీనారాయణులు , పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు. 


ఈ మాసంలో రెండు రోజులు వినాయకుణ్ని ఆరాధిస్తారు. కాశీ , ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. శుక్ల పాడ్యమి , చతుర్థినాడు అవిఘ్న , పుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరిరోజు.


ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు. దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశినాడు పూజించి , ఆ చెట్టు వద్దనే *‘అమలక ఏకాదశి’* వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని *‘అమృత ఏకాదశి’* గా పరిగణిస్తారు. మదురైలోని మీనాక్షీ సుందరేశ్వరుల కల్యాణం రోజు ఇది. అందుకే శివపూజ చేస్తారు. ఈ నెలలో విష్ణుపూజకు ప్రాధాన్యత ఉంటుంది. ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైంది వసంతోత్సవం. ఇది కాముని పండుగ , హోలికా పూర్ణిమ , కామ దహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి - కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు , మన్మథుడు , కృష్ణుడు , లక్ష్మీదేవి పూజలందుకుంటారు.


ఫాల్గుణమాసంలో ప్రతి తిథికీ ఒక ప్రత్యేకత ఉంది. చవితినాడు *‘సంకట గణేశ’* వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమినాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి , సీతారాముల్ని కొలుస్తారు. బహుళ అమావాస్యనాడు పితృదేవతలకు పిండప్రదానం చేసి , అన్నదానం చేస్తారు.


*ఫాల్గుణ మాస ప్రాశస్త్యం*


పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రయుక్తుడై ఉదయించే మాసం ఫాల్గుణ మాసం. సంవత్సరంలో చివరి మాసం అయినప్పటికీ అధిక ప్రత్యేకతలు కలిగిన మాసం. సంవత్సరంలో మిగిలిన పదకొండు నెలలలో చేసిన పూజలు , పండుగలూ , ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంక్షిప్తరూపం ఈ మాసం.

ఈ మాసాధిపతి గోవిందుడు కావున , ఈ మాసంలో విశేషించి విష్ణుమూర్తి ఆరాధన చేయడం శ్రేయస్కరం. గోః – వేదాలు , గోవులు విందః – రక్షించేవాడు గోవిందుడు , అంటే ఈ సమస్త జీవకోటికీ పూజనీయమైన వేదాలను , గోవులను రక్షించేవాడు అంతేకాకుండా మనలని రక్షించి ఆత్మతత్త్వాన్ని తెలియచేసేవాడు. ఈ మాసంలో అచ్యుత , అనంత , గోవింద అనే నామస్మరణ ఎంతో శుభఫలితాన్ని ఇస్తుంది. వసంతఋతువు ఆగమనానికి ముందు వచ్చే ఈ మాసంలో ప్రతీ దినమూ ప్రత్యేకమే. ఈ మాసంలో ఆచరించే కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు , పర్వ దినాలూ , విశేషమైన రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


*ఫాల్గుణ శుద్ధ పాడ్యమి* మొదలు ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకూ *పయోవ్రతం* ఆచరిస్తారు. భాగవతం అష్టమ స్కందం ప్రకారం , బలిచక్రవర్తి చేతిలో తన కుమారులు అయిన ఇంద్రాది దేవతలు పరాజయం పాలవడం భరించలేని అదితి , కశ్యపుణ్ణి బలి గర్వం అణచే కుమారుణ్ణి ప్రసాదించమని వేడుకొనగా , కశ్యపుడు ఈ *పయో వ్రతాన్ని* ఆమెకు ఉపదేశించాడు. ఆమె దాన్ని పాటించి వామనుడిని కుమారుడిగా పొందింది. ఈ వ్రతంలో ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు ద్వాదశి వరకూ లక్ష్మీ నారాయణులని షోడశోపచారాలతో పూజించి , కేవలం వారికి నివేదించిన పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. ఆ పన్నెండు రోజుల అనంతరం హోమం చేసి , బ్రాహ్మణులను పూజించి సమారాధన చేస్తారు. ఈ రోజులలో గో , వస్త్ర , ధన , దానాలు శక్తి కొలదీ చేస్తారు.


*ఫాల్గుణ మాసం శుద్ధ విదియ* నుండీ *యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.*


*ఫాల్గుణ శుద్ధ చవితి* రోజు వినాయకుడిని పూజించే అవిఘ్నవ్రతం లేదా పుత్రగణపతి వ్రతం చేస్తారు. ఆ రోజున ఉపవాసం ఉండి , సాయంకాలం స్వామిని షోడశోపచారాలతో పూజించి , ప్రసాదం స్వీకరిస్తారు. ఈ వ్రతం చేయడం ద్వారా వారికి ఉన్న ఆటంకాలు తొలగుతాయి మరియు పుత్ర సంతానం కాంక్షిస్తూ చేసేవారికి స్వామి పుత్ర సంతానం ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి.


ప్రతీ ఏటా తిరుమలలో ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకూ ఐదు రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. మొదటి రెండు రోజులూ స్వామివారికి శ్రీరాముడు , శ్రీకృష్ణుడి అవతారంలో తెప్పోత్సవం నిర్వహిస్తే తరువాత మూడురోజులూ శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామికి నిర్వహిస్తారు.


*ఫాల్గుణ శుద్ధ నవమి* నాడు మధ్వులు ఆరాధించే రాఘవేంద్ర స్వామి వారి జన్మదినం.


*అమలక ఏకాదశి* ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. అమలక లేదా ధాత్రీ ఫలం గా పిలుచుకునే ఉసిరిని విష్ణుస్వరూపంగా భావించి ఈనాడు ఉసిరివృక్షం క్రింద శ్రీమహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని ఋషివాక్యం. ఈరోజు ఏకాదశీ వ్రతం ఆచరించి , విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభపలితాన్నిస్తుంది.

ఫాల్గుణ శుద్ధ ద్వాదశినే గోవింద ద్వాదశి , నృసింహ ద్వాదశి అంటారు. ఈ నాడు గంగాస్నానం పవిత్రం. కుదరని వారు సమీపం లోని ఏదైనా నది వద్దకు వెళ్లి , గంగను స్మరిస్తూ నదీస్నానం చేయాలి. నృసింహకరావలంబ స్తోత్రంతో కానీ లేక మరేదైనా నృసింహస్వామి స్తోత్రంతో కానీ స్వామిని ఆరాధించాలి.


*ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ మహా పూర్ణిమ , హోళికా పూర్ణిమ , డోలా పూర్ణిమ , కామదహనోత్సవంగా* వ్యవహరిస్తారు. ఉత్తర భారత దేశంలో హోళికా పూర్ణిమ ప్రధానంగా జరుపుకుంటారు.


దక్షిణ భారత దేశంలో కామదహనోత్సవాన్ని జరుపుతారు. శివకళ్యాణం అనే మహత్తరకార్యం కోసం తపోదీక్షలో ఉన్న శివుని తపస్సుని భంగం చేసిన మన్మధుణ్ణి , తన మూడో నేత్రంతో భస్మం చేసిందీ ఈనాడే మరియు మన్మధుని భార్య రతీదేవి కోరిక మేరకు ఆమెకొక్కదానికే అతడు కనిపించేలాగా వరము ఇచ్చాడు శివుడు. మనలో ఉన్న కామక్రోధాదులనే అరిషడ్వర్గాలని దహనం చేసి , ప్రశాంతమైన జీవనం సాగించాలని కోరుతూ , శివుని ప్రార్థిస్తూ చేసే ఉత్సవమే ఈ కామదహనోత్సవం. అంతేగాకుండా రాబోయే వసంతాగమనాన్ని పురస్కరించుకుని కూడా ఉత్సవం చేస్తారు.


ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది. శివుని కళ్ళు మూతపడినందు వల్ల జగమంతా అంధకారబంధురమైంది. శివుడు కోపగించు కోవడంతో , అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి , తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది.


ఒకానొక పాల్గుణపూర్ణిమనాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తిచేసింది. అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు. అప్పటినుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఫాల్గుణ మాసములో ఈ విధమైన పూజలను , దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం.


ఉత్తర భారతదేశంలో హిరణ్యకశిపుడి చెల్లెలైన హోళిక , విష్ణుభక్తుడైన ప్రహ్లాదుణ్ణి చంపబోయి తానే దగ్ధమైన సంఘటనకి గుర్తుగా , చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకుంటారు. ఆ రోజు సాయంకాలం మంటల్లో హోళికని దగ్ధం చేసే కార్యక్రమం జరిపి మరునాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ మిఠాయిలు పంచుతూ ఆనందంగా కాలం గడుపుతారు. హోలికా పూర్ణిమ రోజు చందనంతో కూడిన మామిడి పూత (చూత కుసుమ భక్షణం) ను స్వీకరించాలని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి.


ఈ రోజు శ్రీకృష్ణుని ఊయలలో వేసి ఆరాధించే ఉత్సవంగా *డోలా పూర్ణిమ* చేస్తారు. తమిళనాడులోని మధురైలో మీనాక్షీ సుందరేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కనుక కళ్యాణ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు మధురైలో అమ్మవారి అయ్యవార్ల కళ్యాణం జరుపుతారు.


*ఫాల్గుణ బహుళ విదియనాడు* లక్ష్మీదేవి పాలకడలి నుండి ఉద్భవించిందని చెప్పబడింది. ఆరోజు కనకధారా స్తవం చదువుకోవడం సత్ఫలితాలనిస్తుంది.


*ఫాల్గుణ బహుళ అష్టమి*

రోజునే సీతాదేవి జనకునికి నాగేటి చాలులో దొరికిందని కావున ఆనాడు సీతాదేవి జన్మదినంగా కూడా జరుపుకుంటారు. ఫాల్గుణ మాసంలోనే రామరావణ యుద్ధం జరిగింది. మహాభారతంలో కూడా అతిరథ మహారథులైన అనేకమంది వీరులు ఫాల్గుణ మాసంలోనే జన్మించారు.


*ఫాల్గుణ బహుళ అమావాస్య* రోజును కొత్త అమావాస్య అంటారు. ఆ రోజు కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఆ రోజు పితృ దేవతలకి తర్పణాలు ఇస్తారు.

ఇలా ఎన్నో విశిష్టతలను పొందుపరచుకున్న ఫాల్గుణ మాసంలో , భక్తితత్పరతలతో ఆ భగవానుని సేవించి ఆయన కృపకు పాత్రులమవుదాము.

తరువున వెల్గుచుండె నవి తారలు మాలిక లౌచు వింతగన్*

 *తరువున వెల్గుచుండె నవి తారలు మాలిక లౌచు వింతగన్*

ఈ సమస్యకు నా పూరణ. 


"సురవన పారిజాతమును శూరత కృష్ణుడు దొంగిలించునే


తరుణమిదే లభించె పద ద్వారకకున్ భువి నందు స్వర్గమే


కురియు వరాల జల్లు"లని కోరిక చేరెను పుష్పజాతులున్


తరువున వెల్గుచుండె నవి తారలు మాలిక లౌచు వింతగన్.

జటాయువు

సీత నెందుకు దొంగిలింతువు చేటు వచ్చు తొలంగురా


పాతకుండవు రావణా! నిను పట్టి ద్రుంతు నఖంబుతో


రావణుడు

చేతికందిన యందమే యిది చేరవేతును లంకకున్


నీతి నాకదె యడ్డగింతువె? నిన్ను చంపుదు నిప్పుడే. 


అల్వాల లక్ష్మణ మూర్తి.