11, మార్చి 2021, గురువారం

_శివరాత్రి

 🕉️🙏 *సేకరణ*🙏🕉️


*🚩_శివరాత్రి జాగారం , ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా ?_🚩*


🕉🔱🕉️🔱🕉️🔱🕉️🔱


శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరనతో మారుమోగిపోతున్నాయి. శివారాధనలో లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు , భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి , భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో , చింతనలో గడిపి , రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.


*అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు ? జాగారం ఎందుకు చేస్తారు ? జాగారం ఎవరు , ఎప్పుడు ప్రారంభించారు ?* అంటే దానికి ఒక కథ ఉంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి , గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి , నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు.


అయినా , శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి 

 జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ , జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది.


🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️

మాఘ పురాణం*_🚩 🚩 _*28 వ అధ్యాయము*_🚩

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*28 వ అధ్యాయము*_🚩


     *గురువారం*

*మార్చి 11, 2021*


🕉🌹🕉️🌹🕉️🌹🕉️🌹


*క్రూర (రా) కథ*.


🕉️☘☘☘☘☘☘🕉️


గృత్నృమహమహర్షి జహ్నుమునితో నిట్లనెను. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతము నాచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశమువారి నందరినుద్ధరించుచు పుణ్యలోకమును చేరెను. ఈ విషయమును తెలుపు మరియొక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపర యుగమున విదేహదేశమున క్రూరయను పేరుగల శూద్ర స్త్రీ యుండెను. ఆమె యొక రైతు భార్య మిక్కిలి కోపము కలది. ఆ  దంపతులకు జ్ఞానియగు పుత్రుడుకలడు. అతడు దయావంతుడు ధర్మాచరణమనిన యిష్టము కలవాడు. వాని భార్య పతి భక్తి కలిగినది ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములను చేయుటయందిష్టము కలదు. బంధువులకు దీనులకు అతిథులకు అందరికి యధా శక్తి సేవ చయనది. అత్తమామలకెప్పుడును సేవచేయుచుండెను. క్రూర కోడలిని యే దోషము లేకున్నను నిందించెడిది కిట్టెడిది. అప్పుడప్పుడామె భర్తయు తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు నోర్పుతో వినయ విధేయతలతో వారికి యధాశక్తిగ సేవలు చేయుచుండెడిది.


ఒకనాడు యిట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను జూచి క్రూరా పుత్రుడు తన తల్లిదండ్రులతో నిట్లనెను. నాయనా! అమ్మా! నా మాటను విడును. నా మాట కీర్తిని కలిగించునది ధర్మమును సాధించునది. మీకు కోదలిపై కోపమెందులకు? కలహమునకు కారణమేమి? మీ శరీరములకును బాధను కలిగించు యీ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపజేయు కలహమెందులకు? నేను గాని, నా భార్యగాని మేఎకేమి ఉపకారమును చేసితిమి? మీయీ కోపమునకు కారణమేమియు నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపముచే ఆయువు ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునవి నశించును కదా! సర్వజ్ఞులైన, పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించుడు అని పలికెను.


పుత్రుని మాటలను విని క్రూర భర్తతోబాటు మిక్కిలి కోపముతొ యిట్లనెను. మూర్ఖుడా పో పొమ్ము. నీవెంత? నీ భార్యయెంత? తల్లిదండ్రులకిట్లు నీతి బోధను చేయు నిన్ను నీ భార్యను యేమి చేసినను తప్పులేదు, అని పలికి కొడుకును కోడాలిని మరల మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగ కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందెను. కాని సహజమైన శాంతమును పొందెను. 'అయ్యో తల్లితండ్రులను ద్వేషించుట యెంత తప్పు అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటిలేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా! విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను. భార్యను తగుమాటలతో నూరడించెను. ఓర్పుగా నుండుమని సమాధాన పరచెను.


కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసి వేసెను. ఆమె కుమారుడీ ఆకృత్యమును జూచి తల్లినేమియు అనలేక పితృభక్తి వలన నేమియు చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలెనే తల్లిదండ్రులకు సేవ చేయునుండెను. కోడలు ఆ గదిలో ఏడురోజులు అన్నము, నీరులేక ఆవిధముగా నిర్భంధములోనుండెను. యిరుగుపొరుగువారు, బంధువులు, మిత్రులు యీపని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు, కోడలిని అట్లె నిర్బంధించి పీడించెను. ఏడవదినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృశించి మరణించెను. పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలయునని తల్లికి తెలియకుండ తలుపు తెరచి చూచెను. మరణించిన భార్యను జూచి సంతాపమునండి నిశ్చేష్టుడైయుండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టువలె దుఃఖభారముచే నేలపై బడెను.


క్రూరయూ తలుపు తెరచి యుండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖవివశుడైన పుత్రుని జూచెను. ఆశ్చర్యము ఆమెకును దుఃఖము యెక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె యెడ్పును విని అందరును యేమియనుచు చూడావచ్చిరి. విషయమును తెలిసికొని క్రూరను బహువిధములుగ నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును గొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోక భారమున మరణించెను.


క్రూర పశ్చాత్తాపమునందెను, పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగ శోకించుటను జూచి జనులందరును విచారించిరి. కాని ఈ సమయమున విచారించి లాభమేమి, పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు అసివత్ర నరకము(కత్తుల బోను) చిరకాలమనుభవించిరి. తరువాత చంపా తీరమున సరస్సులై జన్మించిరి. రావి చెట్టు తొఱ్ఱలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు, ఉపధీరుదు అను యిద్దరు సజ్జనులు అచటకి వచ్చిరి, చంపానదిలో మాఘమాస స్నానము నాచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగ చెప్పుకొనిరి.


సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుటవలన, వారి పాపములు పోయినవి. పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్యా! మాఘమాసవ్రత మిట్టిదని యెంతకాలము చెప్పినను పూర్తికాదు. ఇంతమందియే మాఘమాసవ్రత మహిమ వలన తరలచిరని చెప్పుటకును వీలులేదు. ఎన్నో యుగముల నుండి యెంతమందియో, ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్ష్యాదులు వారు వీరననేల సర్వప్రాణులును మాఘమాసవ్రతము నాచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము నాచరించినచో, చేసిన పాపములు పోయి పుణ్య లోకములు కలుగుననుటకెన్ని ఉదాహరణములను చెప్పగలను? ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గృత్నృమదమహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను.


*ఇరవైఎనిమిదవ అధ్యాయము* 

                  *సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

         *న్యాయపతి వేంకట*  

        *లక్ష్మీ నరసింహా రావు*

తులసి మొక్క ప్రాధాన్యత* 🌻

 🌻 *తులసి మొక్క ప్రాధాన్యత* 🌻



🍃🌺భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు

ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం.


🍃🌺అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? తులసి ప్రత్యేకత ఏమిటి?


🍃🌺మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.


🍃🌺మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి.


🍃🌺కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.


🍃🌺తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైనవాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు.


🍃🌺అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.


🍃🌺తులసిలో విద్యుఛ్చక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది.


🍃🌺తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు.


🍃🌺తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.


🍃🌺తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.


🍃🌺ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది.


🍃🌺తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోదక శక్తి పెరిగిందట.


🍃🌺అంటే మన తులసమ్మ మనకు ఆయుషు పోసిందన్నమాట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.


🍃🌺తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు.


🍃🌺అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.


🍃🌺నల్గోండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తోంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాపితిని తగ్గిస్తాయని ఈ మధ్యే దృవీకరించారు.


🍃🌺మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం.


🍃🌺తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు, దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో, దాన్ని తులసి అంటారని అర్దం.


🍃🌺తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతారు .



🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀

మాఘ పురాణం*_🚩 🚩 _*27 వ అధ్యాయము*_🚩

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*27 వ అధ్యాయము*_🚩


     *బుధవారం*

*మార్చి 10, 2021*


🕉️🌹🌷🌹🌷🌹🌷🕉️


*సులక్షణ మహారాజు కథ*


🕉️☘️☘️☘️☘️☘️☘️🕉️


గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జన్మ సంసారము అను సముద్రమును, దాటనక్కరలేని సాధనమే, మాఘమాసవ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరియొక కథను వినుము. పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణుడను రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బలపరాక్రమములు కలవాడు. ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి నూరుగురు భార్యలున్నను, సంతానము మాత్రము లేదు. రాజులందరును, వానికి సామంతములై, కప్పములు చెల్లించుచున్నను, సంతానము లేదను విచారము మాత్రము, రాజునకు తప్పలేదు.


నేనేమి చేసిన కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును, పెద్దలు, పుత్రులు లేనివారికి, దరిద్రునికి, కృతఘ్నునకు, వేదహీనుడగు విప్రునకు, సద్గతి లేదనియందురు. పుత్రులు లేని నేను, మహర్షుల యాశ్రమమునకు పోయి, అచట పెద్దలను ప్రార్థించినచో, పుత్రులు కలుగుటకు, వారేమైన ఉపాయము చెప్పగలరేమో? ప్రయత్నించి చూచెదను, అని నిశ్చయించెను. అనేకమంది మహర్షులు కల నైమిశారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిశారణ్యమునకు వెళ్లెను, అచట మునులకు నమస్కరించి, తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి, యిట్లనిరి. "రాజా! వినుము. నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు, సర్వసంపన్నుడవైనను, మాఘమాసమున, రధసప్తమి నాడు, కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకీ జన్మలో, సంతానము కలుగలేదు. ఇందువలననే, యింతమంది భార్యలున్నను, నీకు సంతానము కలుగలేదు" అని చెప్పిరి. అప్పుదు రాజు, "నాకు సంతానము కలుగునుపాయము" చెప్పుడని వారిని ప్రార్థించెను. అప్పుడా మునులొక ఫలమును మంత్రించి, రాజునకిచ్చిరి. దీనిని నీ భార్యలందరికిని పెట్టుము. ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో, మునులకు నమస్కరించి, కృతజ్ఞతను వెల్లడించి యింటికి వచ్చెను. రాణులు సంతోషముతో వానికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో, స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు, ఆ ఫలమును శయ్యా గృహమునుంచెను. స్నానము మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య, ఆ ఫలము దొంగలించి, తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా, ఆ ఫలము లేదు. సేవకులను, రాణులను తర్కించి అడుగగా, వారు తమకు తెలియదనిరి, తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు యేమియు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య యిట్లు గర్భవతి యగుట మిగిలిన భార్యలకిష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై, వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున, అవి అన్నియు, వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన, గర్బపాతమునకిచ్చిన మందుల వలన, చిన్న భార్య మతిచెడెను. ఎవరికి తెలియకుండ అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు, ఆమె అలసెను. ఒక పుత్రుని కని, యొడలు తెలియక పడియుండెను. గుహలోనున్న పులి, బాలింతను యీడ్చుకొని, పోయి, భక్షించెను.


అప్పుడే పుట్టిన బిడ్డ, రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా, హంసల గుంపు వచ్చి, రెక్కలను చాపి, యెండ మున్నగువాని బాధ, ఆ శిశువునకు లేకుండ చేసినది. తేనె పండ్ల గుజ్జు మున్నగువానిని, బాలునకు పెట్టి, ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును, పక్షుల పెంపకమునకు అలవాటుపడి, అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడాడుకొనుచుండగా, హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్రదినమగుటచే,  సమీప గ్రామముల వారు, సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి, అట్లు వచ్చినవారిలో, ఇద్దరు భార్యలుండి, సంతానను లేని గృహస్థు ఒకడు, వారితో బాటు, స్నానమునకు వచ్చెను. అచట తిరగాడుచున్న బాలుని చూచి, ముచ్చటపడి, యింటికి గొనిపోవలెను అని తలచి, ఈ బాలుడెవరు? యెవరి సంతానము అడవిలో యేల విడువబడెను? అని యెంత ఆలోచించినను, వానికి సమాధానము దొరకలేదు, వనమున, జలమున, గర్భమున, నెచటనున్న వానినైనను రక్షించి, పాలించు వాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా! ఆయనయే, నాకీ బాలుని యిట్లు చూపినాడని తలచెను. బాలుని యింటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు, ఎవరికి వారు, వారే ఆ బాలుని పెంచవలెను అని, పరస్పరము వివాద పడుచుండిరి. ఈ విధముగా రెండు సంవత్సరములు గడచెను. ఒకనాడు ఆ గృహస్థు ఇంట లేని సమయములో, పెద్ద భార్య, ఆ బాలుని అడవిలో విడచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు, బాలుని యెంత వెదకినను, కనిపించలేదుl.


అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు, వింటివలెనున్న తులసి పొదవద్దకు వెళ్ళెను. అచటె పండుకొనెను. తులసీ స్పర్శవలన, బాలునకావనమున, యెట్తి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున, వానికి రాత్రి గడచినది. యెవరును లేని ఆ బాలుడు యేడ్చుట తప్ప, మరేమి చేయగలడు? వాని దైన్యము, నిస్సహాయత, ఆ అడవిలోనుండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో గల ప్రాణులు, మృగములు, పక్షులు, అచటికి వచ్చినవి, బాలుని నిస్సహాయత, ధైర్యము, వానిలోని దివ్యలక్షణములను మేల్కొలిపి, వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులును కన్నీరు కార్చినవి. ఒకరి బాష మరొకరికి తెలియని రాజకుమారుడు, పశుపక్ష్యాదులు యిట్టి సహానుభూతి నందినప్పుడు, మరియొక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా! అట్లే బాలుడును, పక్షియోమృగమైనప్పుడు వాని దుఃఖము యెట్లుండునో కదా, బాలుడు పశుపక్ష్యాదులు , విభిన్నజాతులవారైనను, వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము. ఒక చోటనుండి  వచ్చినదే. అదియే దివ్యత్వము, కాని విచిత్రమేమనగా, బాలునికి తనజాతిదే అయిన స్త్రీ వలన ఆపదవచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య,ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని యనుకొనుట తప్ప, మనకే సమాధానమును తోచదు. ఇదియే భగవంతుని లీల, అట్లు వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు యెండ వానిపై బడకుండ, రెక్కలతో నీడను కల్పించినవి, తమ విచిత్ర రూపములతో, వాని మనస్సును, శోకము నుండి మరల్చినవి. మృగములును. తేనె, ముగ్గినపండ్లు వంటి ఆహారములను, వానికి తెచ్చి యిచ్చినవి. ఈ విధముగా, మృగములు, పక్షులు, వానికి తెచ్చి యిచ్చినవి. ఈ విధముగా మృగములు, పక్షులు, వానికి తాము చేయగలిగిన యుపచారములను చేసి, వాని దుఃఖములను  మాన్పించి, తమ యుపచారములచే, వాని ఆకలిని తీర్చినవి. బాలుడు, తులసి పొదలో నుండుట, తులసిని జూచుట, తాకుట, మున్నగు పనులను, ఆతర్కితముగ చేయుటచే, పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన, దైవానుగ్రహము నాతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని, యుపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన, యిట్టి సానుభూతిని, యితరుల నుండి పొందగల్గెను. అప్రయత్నముగ వాని నోటి నుండి, కృష్ణ, గోవింద,  అచ్యుత మున్నగు భగవన్నామముల యుచ్ఛారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు, తులసి పాదులో నివసించుచు, ఆడుకొనుచు, కాలమును గడుపసాగెను. అడవిలోనున్న తులసియే, దీనుడైన యొక బాలునకట్టి దయను, పశుపక్ష్యాదుల ద్వారా చూపినది. అట్టి తులసి, మన యిండ్లలోనుండి, మనచే పూజింపబడిన, మనపై యెట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన యింట నుండుట వలన, మనము తులసిని పూజించుట వలన, మనకు దైవానుగ్రహము కలిగి, మరెన్నియో యిహపరలోక సుఖములనంద వచ్చును. పాపములను పోగొట్టుకొనవచ్చును. భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును.


_*రాజకుమారుని పూజ - శ్రీహరి యనుగ్రహము*_


సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్యయేమైనదో తెలిసుకొనవలెనని, సేవకులను పంపి, వెదకించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి యూరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు, పూర్వమునందువలెనే, శ్రీహరినామస్మరణ చేయుచు, పశుపక్ష్యాదులతో, మైత్రి చేయుచుండెను. తల్లి, తండ్రి, తాత, సోదరుడు, యిట్టి బంధువుల నెరుగడు. కేవలము, శ్రీహరి నామోచ్ఛారణము, శ్రీహరి పూజ, వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కల్గెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేరు. ఒకనాడు, ఆకాశవాణి, మాఘస్నాన వ్రతము నాచరింపుమని, వానికి చెప్పెను. రాజకుమారుడును, ఆకాశవాణి చెప్పిన మాటల ననుసరించి, మాఘస్నానము, పూజ, మున్నగు వానిని, ప్రారంభించెను.


మాఘశుక్ల చతుర్దశినాడు, రాజకుమారుని పూజాంతమున, శ్రీహరి వానికి దివ్యదర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో, బాలుని కౌగిలించుకొనెను. ఓ బాలకా! "నాభక్తుడవైన నీకు వరమునిత్తును కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీపాద సాన్నిధ్యమును, చిరకాలమను గ్రహింపుమని కోరెను. శ్రీహరి "బాలకా! నీవు రాజువై, యీ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము, పుత్రపౌత్ర సమృద్ధిని, సంపదలను, భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకుపొమ్ము. రాజువై చిరకాలము కీర్తిని, సర్వసంపదలను, సర్వసమృద్దులను, సర్వసుఖములను, అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక, చేయుము. ఆ తరువాత, నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న, సునందుడను, వానిని పిలిచి, రాజకుమారుని, వాని తండ్రి వద్దకు చేర్చుమని, చెప్పెను. సపరివారముగ, అంతర్దానమందెను. సునందుడును, రాజకుమారుని దీసుకొని, సులక్షణ మహారాజు వద్దకు, వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును, శ్రీహరి అనుగ్రహమును, వానికి వివరించెను. పుత్రుని, వానికి అప్పగించెను. తన స్థానమునకు, తాను పోయెను.


సులక్షణ మహారాజు ఆశ్చర్యమును, ఆనందమును పొందెను. కుమారునకు, సుధర్ముడని, పేరిడెను. బాలుడు, విద్యాబుద్ధులను పొంది, పెద్దవాడైన తరువాత, వానిని, తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు, భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి, కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలును, సమాగమనము చేసి, పరలోకమునకు, భర్తననుసరించి తరలిరి. సుధర్ముడు, భక్తితో, తండ్రికి, తల్లులకు, శ్రద్ధతో, శ్రార్ధకర్మల నాచరించెను. సుధర్ముడును, తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగ, ప్రజారంజకముగ, చిరకాలము, రాజ్యమును పాలించెను. పుత్రులను, పౌత్రులను, పెక్కు మందిని పొందెను. అతడెప్పుడును, మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోను, మనుమలతోను, భార్యలతోను కలసి, జీవించియున్నంతవరకు, మాఘమాస వ్రతము నాచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి, శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


జహ్నుమునీ! ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును  విడువక ఆచరింపవలయును. అట్లు చేసిన, శ్రీహరి భక్తులకు, యెట్టి భయమునుండదు. ఈ వృత్తాంతమును వినినవాడును, విష్ణుభక్తుడై మాఘమాసవ్రతము నాచరించి, విష్ణుప్రియుడై, యిహపరలోక సుఖములనంది, శ్రీహరి సాన్నిధ్యమునందును. సందేహము లేదు. అని, జహ్నుమునికి గృత్నృమదమహర్షి చెప్పెను.


*ఇరవైఏడవ అధ్యాయము* 

             *సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

మహాశివరాత్రి

 మహాశివరాత్రి విశిష్టత  - సంపూర్ణ వివరణ . 


    ప్రప్రధమముగా మనం శివుడు గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే శివుడు గురించి తెలుసుకుంటేనే కదా శివరాత్రి గురించి తెలిసేది . 


   "రుద్రము" లో   "అధ్యవోచ దధివక్తా ప్రథమోధైవ్యో భిషక్ " అని చెప్పబడినది. దేవతలకు ప్రధమవైద్యుడు , అందరికన్నా ముందుగా ( విషయాలను ) చెప్పినవాడిగా శివుణ్ణి కీర్తించడం జరిగినది. అందుకనే శివుడిని బై ( వై)ద్యనాధుడు " అని కూడా చెప్పబడినది. 


             శివరాత్రి పర్వదినం నందు ఉపవాసం , జాగరణ , శివునికి అభిషేకం , బిల్వములు , తుమ్మిపువ్వులతో అర్చనలు నిర్వహించబడును. 


    జాగరణ చేయుటకు ప్రధానకారణం శివుడు ఈదినము నందు హాలాహలం మింగినాడని పురాణాలు చెప్తాయి. ప్రపంచాన్ని దహించివేసే హాలాహలం నిరోధించే సమర్ధత శివునికి మాత్రమే ఉన్నది. శివుడు ఆపని అప్పుడు చేయకుండా ఉన్నచో లోకమే ఉండేది కాదు. ఆనాటి శివుని సాహసానికి ఆశ్చర్యచకితులు అయిన లోకులు నాటి తీవ్ర పరిమాణాన్ని స్ఫురిస్తూ నిద్రాహారాలు మాని శివుణ్ణి ధ్యానించడమే జాగరణ , ఉపవాసాలకి సంకేతం . ఆపత్సమయాలలో అవసరం అయితే జాగరణ ( నిద్రమేల్కొనడానికి ) కావలసిన మానసిక  , శారీరక అభ్యాసం ( తర్ఫీదు ) కలిగి ఉండటం సమాజానికి మంచిది కదా ! దేవునికి (ఉప)  సమీపంలో , (వాసం ) ఉండడం అని కూడా ఉపవాసానికి ఉండే అర్ధాలలో ఒకటి. 


          పుట్టినప్పటి నుండి గిట్టేవరకు నిరంతరాయంగా పనిచేసే అవయవాలలో జీర్ణాశయం ( ప్రేవులు) కూడా ఒకటి . అట్టి జీర్ణాశయానికి కొన్ని సందర్భాలలో విశ్రాంతిని ఇవ్వడం ఆరోగ్యసూత్రాలలో ఒకటి . శివుడిని పూజించేందుకు ఉపయోగించే మూలికలలో బిల్వము ( మారేడు) ద్రోణపుష్పి ( తుమ్మి) ముఖ్యమైనవి . వీటిని ఆయుర్వేదంలో విషచికిత్సలలో వాడతారు. 


            శివుడు శ్మశానవాసి . పాములను ఆభరణంగా ధరించి , హాలాహలం మింగినవాడు. కావున విషహార ద్రవ్యాలతో , తాపాన్ని తగ్గించే అభిషేకములతో శివుని పూజించుటకు ప్రాధాన్యత ఏర్పడినది . 


                              సంపూర్ణం  


                     కాళహస్తి వేంకటేశ్వరరావు 


                 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                              9885030034

Pelli









 

Bhakti







 

Kidney