6, మే 2022, శుక్రవారం

శంకర జయంతి ప్రత్యేకం - 6

 ॐ          శంకర జయంతి ప్రత్యేకం - 6 

          ( ఈ నెల 6వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి )


శంకరుల అవతారం 


5. వివిధ ఆరాధనలు - పంచాయతనం - సమన్వయం 


    ఈ రోజుల్లో, ఒక్కొక్క ప్రత్యేకమైన అర్చన/ప్రార్థన/ఆరాధన విధానాన్ని ఒక్కొక్కరు తీసికొనివస్తున్నారు. అనేక సందర్భాలలో ఇతర దేవతారాధనలని నిరసించడం కూడా చూస్తూన్నాం. 

    మిగతా విధానాలపై కనీస అవగాహనలైనాలేక, తమదే సర్వస్వమనుకునే అనేక వర్గాలు తయారవుతున్నాయి. 

    యాంత్రిక జీవితం గడుపుతున్న ఈ రోజుల్లో, శాస్త్రంపై సరియైన అవగాహనలేకుండానూ, 

    వారివారి పద్ధతులు మాత్రమే సరియైనవి అనినమ్మే ఆధునిక గురువుల విధానాలపై అందరూ ఆధారపడుతున్నారు. 


    పూర్వపురోజుల్లో ఏ యతి వచ్చినా, 

    చాతుర్మాస దీక్షకై, సంచారము ఆపి, ఆయా ప్రదేశాలలో ఆగిపోయినా, 

    ఆ ప్రాంతాలవారు సాంప్రదాయ భేదాలేవీలేకుండా, అందరూ ఆ యతిని దర్శించుకోవడం, వారిచ్చే సందేశం వినడం, పాదపూజలు చేయడం జరిగేవి. 

    దీనికి సరియైన కారణం జగద్గురువుల దృక్పథం. 


వివిధ ఆరాధనలు - పంచాయతనం  


    ఆదిశంకరులు ఆ రోజులలోనే వివిధ ఆరాధనా విధానాలని సమన్వయపరచి,  పంచాయతన పూజావిధానం ద్వారా అన్నిటినీ ఒకే తాటిపైకి తెచ్చారు. 

    దాని ద్వారా తత్త్వాన్ని తెలుపుతూ సమైక్య ఆరాధనా విధానాన్ని పటిష్ఠవంతంగా స్థిరపరిచారు.  


పంచశీర్షాలు 


గణపతి అథర్వశీర్షం, 

సూర్య అథర్వశీర్షం, 

నారాయణ అథర్వశీర్షం, 

శివ అథర్వశీర్షం, 

దేవీ అథర్వశీర్షం 

    - అనే ఐదు ప్రామాణికాలలో, 

    మొదటి నాల్గిటిలో "సృష్టి స్థితిలయా"లకి సంబంధించి ఒకే లక్షణాలు వర్ణించబడ్డాయి. 

    నాల్గవదైన దేవీ అథర్వశీర్షంలో మరింత ప్రత్యేకత కనిపిస్తుంది. 

    ఈ ఐదు దైవాలకి సంబందించి, దేశంలో ప్రధానంగా ఐదు ఆరాధనలు ఉన్నాయి.  

    అవి, గాణాపత్య, సౌర, వైష్ణవ, శైవ, శాక్తేయ అనే ఐదు మతాలకి చెందినవి. 


పంచభూతాలు - ఐదుగురు దేవుళ్ళు 


    పంచభూతాలతోనే ప్రపంచం ఏర్పడుతుంది. ఆ ఐదు శక్తులూ ఐదు దేవతలకి సణబంధించినవిగా ప్రతిపాదింపబడ్డాయి.  

      అవి 

* శక్తి(పృథ్వి - భూ), 

* గణపతి(ఆపః - నీరు), 

* సూర్యుడు(తేజః - అగ్ని), 

* విష్ణువు(వాయుః - గాలి), 

* శివుడు(ఆకాశః)గా పంచభూతాలతో అన్వయించబడ్డాయి. 


    పరమాత్మ ఒక్కొక్క కల్పంలో పంచభూతాలలో ఒక్కొక్కదానిని ఆధారంగా చేసికొని, ఒక్కొక్క రూపాన్ని ధరిస్తాడు. 

    ఒక కల్పంలో వ్యాపకుడుగాయున్న విష్ణువై అవతరించాడు. ఆ కల్పంలో పరబ్రహ్మను నారాయణుగా స్తుతించారు. ఆ రూపంలో ఆయననర్చించిన ఉపాసకులు వైష్ణవులయ్యారు. నారయణ సూక్తం వంటివి ఆయనని స్తుతిస్తాయి. 

    అలాగే మరొక కల్పంలో సూర్యుడు అరుణంవంటివాటితో స్తుతించబడ్డాడు. 

    మరొక కల్పంలో అమ్మవారు శక్తిగా ఆరాధింపబడుతుంటే, మేధాసూక్తం,శ్రీసూక్తం వంటివి అమ్మవారిని కీర్తించాయి. 

    శివుని రుద్రంతో ఒక కల్పంలోనూ, 

    గణపతిని గణపతి సూక్తంవంటివాటితో మరొక కల్పంలోనూ స్తుతించారు. 


    పరమాత్మ వివిధ కాలాలలో వివిధ రూపాలుగా అవతరించినా, అన్నిరూపాలనీ ఎల్లప్పుడూ మనం ఉపాసించడం విశేషం. 

    ఐదు మూర్తులనీ ఒకేచోట చేర్చి, తాను ప్రధానంగా ఉపాసించే దేవతని మధ్యలోనూ, 

    మిగిలిన నలుగురినీ నలుమూలలానూ ఉంచి,  ఆరాధించే పంచాయతనాన్ని శంకరులు ఎంతగొప్పగా సమన్వయపరిచారో కదా! 


    ఈ విధంగా ఐదు రకాల ఆరాధనలలో, ఐదురకాల కేంద్రాలతో (Vishnu centric, Siva centric, Devi centric, Sun centric and Ganesh centric), ఐదుగురు దేవతలనూ కొలవడం అత్యంత ఆవశ్యకం. 


పంచభూతాలు - ప్రపంచము - పాంచభౌతిక దేహము 


    పంచభూతాలూ ఒక్కొక్కదానిలో సగభాగం (1/2),  మిగిలిన నాలుగూ కలిసి (1/8+1/8+1/8+1/8=1/2) సగంగా ఉంటాయి. దానిని పంచీకరణము అంటారు. 

    ఆ ఐదూ కలిస్తేనే ప్రపంచం.  

    పాంచభౌతిక దేహం కూడా ఆ ఐదిటి కలయికే!

    ఐదూ కలిస్తేనే దేహం, ప్ర-పంచమూ కూడా కదా! 


    వేదప్రతిపాదిత ఈ విధానాన్ని వెలికితీసి, ఆనాడే మనకి అందించిన శంకరుల అవతారం ఎంత విశిష్టమైనదో కదా! 


                         కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం