ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
12, ఏప్రిల్ 2021, సోమవారం
కరోనా మహమ్మారి* దాక్కొని ఉంది
ప్రమాదం *మరోసారి* కాపు కాసుకుని ఉంది.
*ఈ నాలుగు మాటలు చదవండి... ఆచరించండి... జాగ్రత్తగా ఉండండి...*
అందరికీ నమస్కారం...
మనం ఇప్పుడు చాలా విషమ పరిస్థితిలో ఉన్నాం. మన చుట్టు ప్రక్కల *కరోనా మహమ్మారి* దాక్కొని ఉంది.
ఒక సర్వే ప్రకారం...
మనం టీవీలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వింటున్నాం. టెస్టులు చేయించుకోకుండా వైరస్ సోకి ఉన్న వారు *లక్షల్లో మనమధ్యే ఉన్నారు.*
*అందుచేత...*
● దయచేసి ఎవ్వరూ ఎవరి ఇంటికి వెళ్ళకండి.
● తెలిసిన వారే కదా అని వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టకండి.
● చెప్పకుండా చొరవగా వెళ్లి, వాళ్ల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి.
● ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోకండి.
● ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే, ఫోన్ కాల్ చేసి మాట్లాడండి.
● చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి.
● ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి, ఇంటి ముందుకు వెళ్లి, బయటకు పిలిచి, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడిరండి.
● వారు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచినా, మీరు గౌరవంగా పర్వాలేదు, మరోసారి వస్తానని చెప్పి వెళ్ళండి. అప్పుడే మీరు మర్యాద తెలిసిన వ్యక్తులుగా పరిగణించబడతారు.
● మీరు వారికి ఎంత ప్రాణస్నేహితులైనా కావచ్చు... లేక ఎంత దగ్గరి బంధువులైనా కావచ్చు... వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకండి.
● ఇక ఇరుగుపొరుగు వారు ఇచ్చే వంటకాలను ససేమిరా తీసుకోకండి.
● అలాగే వారికి మీ వంటకాలను ఇతర తినుబండారాలను ఏమీ ఇవ్వకండి.
● ఇచ్చి పుచ్చుకోవడాలు మరికొంతకాలం ఆపేయండి.
● ఈ విషయమై వారితో ఒకసారి సౌమ్యంగా చెప్పండి.
● స్నేహితులతో కలిసి అన్నిరకాల పార్టీలు కొన్ని రోజులు ఆపేయండి.
● ఈ పార్టీల వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
● అవసరం లేకపోయినా రోడ్డుమీదకు వెళ్ళకండి.
● వాకింగ్ కూడా మానేయండి.
● ఇంట్లోనే యోగ, మెడిటేషన్, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్ వంటివి చేయండి.
● నువ్వు నీ శ్రేయోభిలాషులకు ఇచ్చే గౌరవం వారిని కలవకపోవడమే. *అదే ఇరువురికీ క్షేమదాయకం.*
*ఇవి యదార్ధములుగా భావించి ఆచరించి, ఆరోగ్యంగా ఉండండి.*
*సమస్త లోకా: సుఖినో భవంతు*
చిట్టికథ
✍️... చిట్టికథ
ఒకసారి తమ పితరుల శ్రాద్ధము / తిథి భోజనానికి భోక్తగా రమ్మని వశిష్ఠులు విశ్వామిత్రులను పిలిచినారు .
దానికి విశ్వామిత్రులు, ’ దానికేమి, వస్తాను.... కాని నాదొక నిబంధన .. మీరు ఒకవెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసి నాకు వడ్డించవలెను .. " అన్నారు.
.
"’ ఈ లోకములో శ్రాద్ధ దినమునాడు వాడతగిన కూరలు వెయ్యిన్ని ఎనిమిది రకాలు ఉన్నాయా ? అసలు మామూలు దినమైనా తినడానికి అన్ని రకాలు దొరుకుతాయా ? ఒక వేళ ఉన్నా, ఎవరైనా అన్ని కూరలు శ్రాద్ధపు వంటలో వాడుతారా ? వడ్డిస్తారా? ఒక వేళ వడ్డించినా, అన్ని ఎవరు తినగలరు ? .....విశ్వామిత్రులు కావాలని తనను ఇరికించి అవమానించడానికే ఈ కోరిక కోరినారు..." అని వశిష్ఠులకు తెలియకపోలేదు..
.
అయినా కూడా, ’ మీరు అడిగిన వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఉపయోగించి వంట చేయమని అరుంధతికి చెబుతాను ’ అన్నారు.
శ్రాద్ధ దినము రానే వచ్చింది, విశ్వామిత్రులు రానే వచ్చినారు.
వారికి అరటి ఆకు పరచి, కాకర కాయ కూర, పనస పండు, మరియు నల్లేరు తీగతో పచ్చడి చేసి, ఇంకా కొన్ని కూరలు మాత్రము వాడి చేసిన వంటను అరుంధతి వడ్డించింది.
.
వెయ్యిన్ని ఎనిమిది కూరలు అయితే లేవు.
దానికి విశ్వామిత్రులు కోపించి, " ఇదేమిది ? ఈ ఆకులో వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఎక్కడున్నాయి ? " అన్నారు.
దానికి వశిష్ఠులు, " నేను తమ కోరికను అరుంధతి వద్ద ముందే చెప్పి ఉంచినాను. మీ కోరిక ప్రకారమే చేస్తాను అని చెప్పింది కూడా... అడుగుతాను, ఉండండి, .." అన్నారు.
వీరి మాటలు వింటున్న అరుంధతి తానే ముందుకు వచ్చి, ఈ శ్లోకాన్ని విశ్వామిత్రులకు చెపుతుంది..
కారవల్లీ శతం చైవ, వజ్రవల్లీ శత త్రయం
పనసమ్ షట్ శతశ్చైవ శ్రాద్ధకాలే విధీయతే
దాని అర్థము, శ్రాద్ధ సమయములో వడ్డించిన ఒక కాకర కాయ [ కారవల్లీ ] నూరు కూరగాయలకు సమానము. మరియు, వజ్రవళ్ళి [ నల్లేరు ] పచ్చడి మూడు వందల కూరలకు సమానము.. పనసపండు ఆరు వందల కూరలకు సమానము.
ఇవి మూడూ కలిపితే మొత్తం వెయ్యి కూరలు. ఇవికాక ఇంకొక ఎనిమిది రకాల కూరలు వండి వడ్డించినాను .." అంది నమస్కరించి వినయముతో.
అది విని విశ్వామిత్రులు తబ్బిబ్బై, నోటమాట రాక, భోజనము చేసి వెళ్లారుట.
🌻🌻🌻🌻🌻🌻
తప్పక చదువ వలసిన కొన్ని
🌹🌹🌹🌷🌷🌹🌹🌹
తెలుగులో తప్పక చదువ వలసిన కొన్ని పుస్తకాల కోసం వ్రాద్దామని కూర్చున్నాను. *“లోకో భిన్న రుచిః”* అన్నారు కదా మన పెద్దలు. కనుక, ఏవో కొన్ని పుస్తకాలను ఉదహరిస్తూ, ఇంతకు మించిన ఉత్తమ సాహిత్యం లేదు అని చెప్పడం వివేకమనిపించుకోదు. కానీ, మనం చదివిన పుస్తకాలలో గొప్పగా అనిపించిన వాటికోసం మాత్రం, బలంగా బల్లగుద్ది గట్టిగానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే పుస్తకాలు అటువంటి వాటిలో కొన్ని.
“మంచినీళ్ళు త్రాగుతారా అనకూడదు, పుచ్చుకుంటారా అనాలి” వంటి మన తెలుగువారి భాష, అలవాట్ల గురించి తెలుసుకోవాలన్నా, వడ్లగింజలు, కలుపు మెక్కలు, మార్గదర్శి వంటి అద్భుతమైన కథలను మనకు అందించిన ఓ అసలు సిసలు తెలుగు రచయిత జీవితాన్ని చూడాలన్నా, అచ్చ తెలుగు అందాలను చదివి ఆనందించాలన్నా, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఆత్మకథ… *“అనుభవాలూ - జ్ఞాపకాలూనూ”* చదవాలి.
తెలుగుభాషకు చెప్పలేనంత సేవ చేసి కూడా, ఏమాత్రం ప్రచారం ఆశించని మహానుభావుడొకాయన ఉన్నారు. అసాధారణ పాండిత్యం, అబ్బురపరిచే రచనా సామర్ధ్యం ఉన్నా అత్యంత వినయసంపన్నుడుగా మెలగిన సాహితీమూర్తి ఆయన. ఏ పుస్తకానికైనా ముందుమాట రాయాల్సి వస్తే, వినయం ఉట్టి పడేలా *“మనవి మాటలు”* అని శీర్షిక పెట్టేవారు. ఆ పరిచయ వాక్యాల చివరిలో *“భాషా సేవకుడు”* అని మాత్రమే తనని తాను సంబోధించుకునేవారు. ఉత్తమ స్థాయి పాత్రికేయునిగా వాసికెక్కిన ఆ తిరుమల రామచంద్రగారి ఆత్మకథే “హంపీ నుంచి హరప్పా దాకా”. గత శతాబ్దంలో వచ్చిన ఆత్మకథలలో అత్యున్నతమైనదిగా పరిగణింపబడే ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి.
ఈ శతాబ్దంలో జీవించిన వారిలో “మహాత్మా గాంధీయే అత్యున్నతుడు” అని యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 1999 లో ఒక మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో గాంధీగారిపై తన ఆరాధనా భావాన్ని చాటుకున్నాడు. విఖ్యాత రచయిత “జార్జ్ బెర్నార్డ్ షా” గాంధీతో పోల్చడానికి హిమాలయా పర్వతం ఒకటే సరిపోతుందన్నాడు. “దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య సాధనలో గాంధీజీ ఆదర్శాలకీ భాగముందని" నెల్సన్ మండేలా ఆ మహాత్మునకు నమస్కరించాడు. దలైలామా, అంగ్ సాన్ సూకీ, మార్టిన్ టూథర్ కింగ్‌లకు ఆయనే స్ఫూర్తి. వకీలు అయ్యుండి కోర్టు హాలులో మాట్లాడలేక నాలుక పిడచకట్టుకుపోతుంటే, చుట్టూ ఉన్నవారు నవ్వుతుంటే తల దించుకున్న ఒక సాధారణ మనిషాయన. ఆ తరువాత కాలంలో ఆయన నోటి వెంట మాట రావడమే ఆలస్యం 30 కోట్లమంది మారుమాట్లాడక ఆ మాటను అనుసరించే స్థాయికి చేరుకున్నాడు. ఆ గాంధీ మహాత్ముని జీవితంలో మూడొంతులు భాగం తెలుసుకోవాలంటే ఆయన ఆత్మకథ “సత్యశోధన” చదవాలి.
“తాంబూలాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి”, “ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చింది”, “డామిట్ కథ అడ్డం తిరిగింది” ఇలా తెలుగువారి నోళ్ళలో నానే ఎన్నో నానుడులకు వెనకనున్న కథాకమామిషులను, గిరీశం లెక్చర్లు, మధురవాణి నవ్వు, రామప్ప పంతులు కోతలు, ఆడవేషంలో చుట్టకాల్చే శిష్యుడు, చీపిరికట్ట తిరగేసి కొట్టే పూటకూళ్ళమ్మ, సజ్జనుడైన సౌజన్యారావు పంతులు గారు, “అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష” అనే అగ్నిహోత్రావధాన్లు ఇలా అందరినీ, అన్నిటినీ ఒక చుట్టు చుట్టి రావాలంటే *“కన్యాశుల్కం”* నాటకాన్ని చదవాలి.
ఒక చిన్న తండా నాయకుని కొడుకు జగజ్జేతగా మారిన వైనాన్నీ, ఆ జగజ్జేత జీవితాన్నీ, మనస్సుని తెలుసుకోవాలంటే తెన్నేటి సూరి గారి “చెంఘీజ్ ఖాన్” నవల చదవాలి.
తెలుగువారి మహాభారతంగా కీర్తించబడేది, కవిసమ్రాట్ విశ్వనాథ వారి మహోన్నత సృష్టి, అరుంధతీ ధర్మారావుల జీవితం చుట్టూ అల్లిన మనిషి చరిత్ర, ముళ్ళపూడి వెంకటరమణ గారు “నా తల్లీ, తండ్రీ గురువు దైవం ఈ పుస్తకమే” అని చెప్పుకున్న *“వేయిపడగలు”* ను తెలుగు వచ్చినవారంతా చదవాలి. ఆ మాటకొస్తే విశ్వనాథ వారి ప్రతీ పుస్తకాన్నీ తెలుగువాడన్న ప్రతీవాడూ వదలకుండా చదవాలి.
ఎక్కడికో మండుటెండలో వెళ్ళాల్సిన పనిబడితే, బస్సు ప్రయాణానికి డబ్బుల్లేక, ఆ ఎండ బాధ తెలియకుండా ఉండటానికి పుస్తకం చదువుకుంటూ నడిచిన ఘట్టాన్ని” నాకు అలవాటైన 11వ నెంబరు బస్సెక్కాను”, “ఎర్రని ఎండలో 58 పేజీలు నడిచాను” అంటూ సరదా మాటలతో నడిపించిన వారు ముళ్ళపూడి వారు. విషాదకరమైన విషయం చెబుతున్నా, చదివేవారిని బాధపడనివ్వకుండా దానికి హాస్యపు ముసుగు కప్పేస్తాడాయన. కొన్ని వందల సరదా విసుర్లు, సినిమా కబుర్లు కలగలసిన రచనే, ఆయన బాపూ గారితో కలిసి ఆడిన *“కోతికొమ్మచ్చి”.*
ఈ పుస్తకం మూడు భాగాలనూ చదవాలి.
రెండు జెడల సీత, ఒక జడ ముందుకి, ఇంకొక జడ వెనక్కీ వేసుకుని నడుస్తుంటే, తను వెళుతుందో, వస్తుందో తెలియడం లేదంటాడు బుడుగు. ఇక జాటర్ ఢమాల్, పక్కింటి లావుపాటి పిన్నిగారు, సీగాన పెసూనాంబా, రాచ్చసుడూ పదమూడో ఎక్కం ఇలా ఒకటని చెప్పడానికి లేదు, పుస్తకం నిండా నవ్వులే. ముళ్ళపూడి వారి మాటలు, బాపూ గారి గీతలు కలిపి తెలుగు హాస్య సాహిత్యంలో త్రివిక్రముడంతగా ఎదిగిన రచన "బుడుగు".
రాజు మరణించె నొక తార రాలిపోయె
కవియు మరణించె నొక తార గగన మెక్కె
రాజు జీవించె రాతివిగ్రహము లందు
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు
అంటూ ఈ భూమి మీద ఉన్న సుకవులందరికీ తన ఒక్క పద్యంతో వెలకట్టలేని గౌరవాన్ని, శాశ్వతమైన కీర్తిని కట్టబెట్టిన “నవయుగ కవిచక్రవర్తి” శ్రీ గుఱ్ఱం జాషువా గారు.
నివసించుటకు చిన్న నిలయమొక్కటి దక్క
గడన సేయుట కాశపడను నేను
ఆలు బిడ్డలకునై యాస్తి పాస్తులు గూర్ప
పెడత్రోవలో పాదమిడను నేను
నేనాచరింపని నీతులు బోధించి
రానిరాగము తీయలేను నేను
సంసార యాత్రకు చాలినంతకు మించి
గ్రుడ్డి గవ్వయు కోరుకొనను నేను
“కుల మతాలు గీచుకున్న గీతలు జొచ్చి
పంజరాన గట్టు వడను నేను
నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు
తరుగు లేదు విశ్వనరుడ నేను” అంటూ తానొక విశ్వనరుడనని ఎలుగెత్తి చాటారు జాషువా గారు. ఈ కవికోకిల కవితా విశ్వరూపం చూడాలంటే వారి సర్వలభ్యరచనలు ఒక్క పుస్తకంలో దొరికే సంకలనాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కోవాలి.
“అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల…” అంటూ ఉమర్ ఖయ్యాం రుబాయితులను తేనెతో కలిపి తెలుగువారితో త్రాగించిన మరో కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారు. వారి “పానశాల”లో పద్యాలను మనం కూడా తాగి మత్తెక్కిపోవాలి.
ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
ప్రపంచ మొక పద్మవ్యూహం!
కవిత్వ మొక తీరని దాహం!
నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే...
నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వవృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను!
నేనొక దుర్గం!
నాదొక స్వర్గం!
అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం!
ఇలా ఒకటా రెండా ఆ పుస్తకం నిండా మహోత్కృష్టమైన కవితలే. ఎందరో కవులను పుట్టించిన ఆ మహాకవి శ్రీశ్రీ గారి పుస్తకం… మహాప్రస్థానాన్ని చదివి తీరాలి.
హిందూమతాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఏ సందేహాలున్నా అవన్నీ పటాపంచలు అయిపోవడానికీ, ఇక ఇంతకుమించిన ప్రామాణికమైన బోధలు లేవని పూర్తి విశ్వాసం కలిగించగల కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా స్వాముల వారి “జగద్గురు బోధలు” పది పుస్తకాల సెట్టును పట్టుకునే ఇంటికి వెళ్ళాలి. అసలు వేదములలో ఏముంది. వేదాంగములంటే ఏమిటి? ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి. ఇవన్నీ సంక్షిప్తంగా సాధికారికంగా తెలుసుకోవాలంటే పరమాచార్య గారి ఉపన్యాసాల సంకలనం *వేదములు* చదవాలి.
ఒక ఆంగ్లేయుడు సత్యాన్వేషణ కోసం చేసిన పయనాన్ని, చివరికి తన గమ్యమైన అరుణాచలాన్ని చేరుకున్న వైనాన్నీ తెలుసుకోవాలంటే పాల్ బ్రంటన్ రచనకు తెలుగుసేత అయిన “రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ”ను తప్పక చదవాలి.
సంఘజీవన విధానం మీద, మన అలవాట్ల మీద సెటైర్ ఎలా వెయ్యాలో తెలుసుకోవాలన్నా, సరదా కథనంతో వెళుతూనే చెంపలు ఛెళ్ళుమనిపించే చమక్కులు కురిపించాలన్నా, ఆ జంఘాలశాస్త్రిని పుట్టించిన పానుగంటి లక్ష్మీనరసింహరావు గారి “సాక్షి” వ్యాసాలను మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి.
రెండేళ్ళుగా వర్షాలు లేక తిరుమలలో నీటికి కటకట ఏర్పడితే… వరుణ యాగం చేసి కుండపోత వర్షం కురిపించిన పద్మభూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి గురించీ, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థను ఓ IAS అధికారి పట్టాలెక్కించిన విధానం గురించీ, అపర చాణక్యుడిగా పేరుగాంచిన పి.వి. నరసింహారావు మనస్తత్వం గురించీ, తెలుగు వారి ఆరాధ్య కథా, ప్రజా నాయకుడు ఎన్టీయార్ పరిపాలనా విధానాల గురించీ, ఇలా ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే ఇంకెన్నో విషయాలున్న పి.వి.ఆర్.కె ప్రసాద్ గారి ) "దాహం కర్తా, హరిః కర్తా", "అసలేం జరిగిందంటే” పుస్తకాలు కనబడగానే కొనేసుకోవాలి.
ఇంకా…
ఆది శంకరుల నుండి జిడ్డు కృష్ణమూర్తి వరకూ ఉన్న భారతీయ తత్వవేత్తల గురించి, కార్ల్‌మార్క్, ఫ్రెడరిక్ నీషే, ఆర్ధర్ షోపనార్ వంటి పాశ్చాత్య తత్వవేత్తల గురించి, వాళ్ళ తత్వసారాల గురించి సులభంగా తెలుసుకోవాలంటే త్రిపురనేని గోపీచంద్ “తత్వవేత్తలు” పుస్తకాన్ని చదవాలి.
భగవద్గీత చదవాలి అనుకునే వారికి అమృత తుల్యమయినది, ప్రతిపదార్థ, తాత్పర్య, వ్యాఖ్యలతో కూడినది అయిన శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానంద స్వాములవారి “గీతామకరంద” గ్రంథాన్ని పారాయణ చేయాలి.
కృష్ణలో మునకలేస్తూ, కాస్త ఆశ్చర్యం, ఇంకాస్త ఆనందంతో అమరావతి పట్నంలో తిరుగుతున్న అనుభూతి కావాలంటే, సత్యం శంకరమంచి గారి “అమరావతి కథలు”ను తోడు తీసుకెళ్ళాలి,
ఆధ్యాత్మిక భావనలు ఉన్నవారెవరికైనా సరే, ఉన్నత స్థాయి ఆనందాన్ని కలిగించే ఉత్తమ స్థాయి పుస్తకం... పరమహంస యోగానంద గారి “ఒక యోగి ఆత్మకథ”. మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, యుక్తేశ్వర్ గిరి వంటి యోగి పుంగవుల గురించి, మరెందరో మహిమాన్వితుల యోగ సాధనల గురించి మనకు తెలియజేసే ఆధ్యాత్మిక ఆత్మకథ ఈ *“ఒక యోగి ఆత్మకథ”.*
కథలు రాయాలి అనే కోరిక ఉన్నవాళ్ళు, కథ రాయడానికి ఏమేం సరంజామా కావాలో తెలుసుకోవాలనుకునేవాళ్ళు, భారతీయ పాశ్చాత్య కథకుల కథన రీతుల వివరాలు గ్రహించాలనుకునేవాళ్ళు కచ్చితంగా చదవవలసిన పుస్తకం వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి “కథాశిల్పం”.
“రచన అన్నది అరటిపండులా ఒలిచి చదువరి చేతుల్లో పెడితే అతని మెదడుకు పనే ఉండదు. అందులో కవిత్వమూ ఉండదు. అతడు కాసేపు ఆలోచించి అర్థం చేసుకోవడమే మంచిది” అని సముద్రాల గారితో మల్లాది వారన్నారట, ఒకానొక సందర్భంలో. మల్లాది వారి రచనలన్నింటిలోనూ ఇదే అంతస్సూత్రంగా ఉన్నట్టు ఉంటుంది. 80 యేళ్ళ క్రితమే పేరొందిన అన్ని పత్రికలలో వారి రచనలు, వ్యాసాలు అచ్చయ్యేవి. స్వయానా సరస్వతీదేవే కొన్ని విషయాల మీద మాట్లాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ వ్యాసాలు చదువుతుంటే. నా కవి మిత్రులు, మన కథకులు, చలవ మిరియాలు మొదలైన శీర్షికలతో వారు వ్రాసిన వ్యాస పరంపరకు పుస్తక రూపమే... *“చలవ మిరియాలు”.*
మాయాబజార్, మిస్సమ్మ, పాతాళభైరవి ఇలా తెలుగులో ఎన్నటికీ నిలచిపోయే చిత్రాలకు మాటలు పాటలూ రాసినవారు, గుండమ్మకథ, అప్పు చేసి పప్పుకూడు వంటి సినిమాలకు గీతకర్త పింగళి నాగేంద్రరావు గారు. వారు సినిమాలలోకి రాక పూర్వం నాటక రచన కూడా చేశారు. అందులో తొమ్మిది నాటకాలు రెండు సంపుటాలుగా వచ్చాయి.
“తెలుగు వారల మాట
భళియనగ చెల్లాలి
తెలుగుజెండా గగన
గగనాల యెగరాలి
తెలుగుతల్లీ నీకు జోహార్
తెలుగువారల కీర్తి
తళతళల మెరవాలి
తెలుగువారే దేశదేశల నేలాలి
తెలుగుతల్లీ నీకు జోహార్”
అని పింగళివారు తను రాసిన నారాజు అనే నాటకంలో ఒక పాత్రచేత చెప్పిస్తారు. తన మాతృ భాషమీద మమకారాన్ని చాటుకుంటారు.
తెలుగు సినీ కవిసార్వభౌముడైన వేటూరి సుందరరామమూర్తి గారు సినిమారంగంలోకి రాకపూర్వం చేసిన రచన సిరికాకొలను చిన్నది, అనే సంగీత రూపకం. సుమారు యాభై ఏళ్ళ క్రితం ఆకాశవాణిలో ప్రసారమయ్యి శ్రోతలను విపరీతంగా ఆనందపరచిన ఈ వేటూరి రచన తరువాత కాలంలో పుస్తకంగా అచ్చయ్యింది. అలానే ఎందరో సినీ ప్రముఖుల గురించి వేటూరిగారు హాసంపత్రికలో వ్రాసిన వ్యాస పరంపరకు పుస్తకరూపం కొమ్మకొమ్మకో సన్నాయి. ఈ రెండూ చదివితే కవిత్వంతో ఈ వేటూరి ఎంత ఎత్తుకు వెళ్ళాడో వచనంలోనూ అంతెత్తుకు వెళ్ళాడన్న విషయం అర్థమవుతుంది.
కవి అంటే కృష్ణశాస్త్రేనేమో అన్నంతగా తెలుగువారిని సమ్మోహ పరచిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.
“సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికల నేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?”
“నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు - నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?” వంటి ఆయన కవిత్వ పంక్తులు నోటికి రాని నిరక్షరాస్యులు కూడా ఆరోజులలో ఉండేవారు కారట. ఆయన కవితా సంపుటులన్నీ కొనుక్కొని చదువుకొవాలి. కుదరని పక్షంలో కనీసం కృష్ణపక్షం అయినా చదువుకోవాలి,
తెలుగులో హాస్యం అంటే గుర్తుకువచ్చే మొదటి పేరు భమిడిపాటి కామేశ్వరరావు గారిది. మన వేష భాషల మీద, అలవాట్ల మీద, మనస్తత్వం మీద వారు వేసినన్ని హాస్యోక్తులు మరే హాస్య రచయితకూ సాధ్య పడలేదు. ‘‘మన లిపిలోనే మన అనైక్యత తెలుస్తుంది. క-చ-ట-త-ప ఈ అక్షరాలు చూడండి. విడివిడిగా దేని తలకట్టు దానిదే. హిందీలో అయితే ఈ అక్షరాలకు పైన ఓ గీత పెట్టి కలుపుతారు. మనం? అబ్బే! కచట తపల గాళ్లం. మన అక్షరాల్లాగా ఎవడి పిలక వాడిదే. ఇంకోడితో కలిసే ప్రసక్తే లేదు.’’ ఇలా సాగుతుంది వారి వరస. అన్నీ తగాదాలే, మన తెలుగు, లోకో భిన్న రుచిః మొదలైన పుస్తకాలు చదువుతున్నంత సేపూ పెదాలు విచ్చుకునే ఉంటాయి.
చందమామ పత్రికకు సంపాదకునిగా దశాబ్దాల పాటూ పనిచేసి ఈనాటి ఎందరో సాహితీకారులకు పరోక్షంగా ప్రేరణగా నిలచినవారు... కొడవటిగంటి కుటుంబరావు గారు. సమాజం గురించి తెలుసుకోవాలంటే కుటుంబరావు గారి కథలు, నవలలు చదవాలి. సాహిత్యం కోసం తెలుసుకోవాలంటే వారి సాహిత్య వ్యాసాలు చదవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కొడవటిగంటి కుటుంబరావు గారి పుస్తకాలన్నీ చదవాలి.
కవిగా ఆరుద్రని అందరికీ చేరువ చేసిన రచన *“త్వమేవా౽హమ్”.* 1948లో రజాకార్లచే చెరచబడ్డ స్త్రీకథనం కృష్ణాపత్రికలో చదివి “త్వమేవాహం” మొదలుపెట్టారు ఆరుద్ర. ఈ కావ్యం చదివిన శ్రీశ్రీ, “ఇక నే పద్యాలురాయనవసరంలేదు” అని ప్రశంసించారు ఆరుద్రని.
“నువ్వు ఎక్కదలచుకొన్న రైలు
ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు” అనే ప్రసిద్ధ కవితా వాక్యం ఈ పుస్తకంలోనిదే.
చలంగారి హృదయం తెలుసున్నవాళ్ళకి, ఆయన ఆరాటం దేనిగురించో ఎరిగున్నవాళ్ళకే చలం రచనలు అర్థమవుతాయి. స్త్రీ స్వేచ్ఛ కోసం పరితపించినవాడు చలం. తన మైదానం నవలతో తెలుగునేలపై ఒక పెద్ద అలజడి సృష్టించిన రచయిత ఇతను. ఈయన పుస్తకాలన్నీ చదువవలసినవే అయినా, ప్రేమలేఖలు మాత్రం ముందుగా చదవవలసిన పుస్తకం.
నేను పుట్టకముందే
నెత్తిమీద నీలితెర
కాళ్ళకింద ధూళిపొర
ఇవి తెలుగువారిని రెండో మారు జ్ఞానపీఠం ఎక్కించిన విశ్వంభర కావ్యానికి ఆరంభాక్షరాలు.
మానవుడే నాయకునిగా, విశాల విశ్వంభరే రంగస్థలంగా, ప్రకృతి నేపథ్యంగా, తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యంలేని మనిషి కథకు వచన కవితారూపమే ఈ విశ్వంభర అని కృతికర్త నారాయణ రెడ్డి గారు కవితా వస్తువేమిటో చెప్పుకొచ్చారు.
మూడోమారు తెలుగువారికి జ్ఞానపీఠం తీసుకువచ్చిన వారు రావూరి భరద్వాజ గారు. మంగమ్మ అనే నాటకాల కంపెనీలో పనిచేసే స్త్రీ తన తెలివి తేటలతో, అందచందాలతో తెలుగు సినిమా పరిశ్రమలో మంజరి అనే ప్రఖ్యాత
కథానాయకురాలిగా ఎదిగి, తిరిగి అథః పాతాళానికి పడిపోయిన కథే,
*పాకుడు రాళ్ళు.*
పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి
కలికి వెన్నెల లూరు చలువ దోసిళ్ళతో
లతలకు మారాకు లతికి యతికి
పూల కంచాలలో రోలంబములకు రే
పటి భోజనము సిద్ధ పరచి పరచి
తెలవారకుండ మొగ్గలలోన జొరబడి
వింత వింతల రంగు వేసి వేసి
తీరికే లేని విశ్వ సంసారమందు
అలసి పోయితివేమొ దేవాధిదేవ!
ఒక నిమేషమ్ము కన్నుమూయుదువు గాని
రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు!!
అంటూ సృష్టికార్యంలో అలసిపోయావా స్వామీ అంటూ భగవంతుడి మీదే కరుణ చూపించిన కవి కరుణశ్రీ గారు.
“ఊలుదారాలతో గొంతు కురి బిగించి
గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చటముడుల మమ్ము
అకట! దయలేనివారు మీ యాడువారు.” అంటూ విలపించే పువ్వుల బాధని మన మనస్సులకు గుచ్చుకునేలా చేసిన కవితా ఖండిక పుష్పవిలాపం. తెలుగు పద్యం సొగసు తెలియాలంటే కరుణశ్రీ గారి *ఉదయశ్రీ* చదవాల్సిందే.
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు 14 భాషలలో ప్రవీణులు. ఎంత ప్రావీణ్యం అంటే..ఆ 14 భాషలలో ఆశు కవిత్వం చెప్పగలిగినంత. వారు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ భాషలలోని కావ్యాలను తెలుగులోకి అనువదించారు. విశ్వనాథ వారి ఏకవీరను మళయాళంలోకి అనువాదం చేసారు. పుట్టపర్తి వారి జీవితంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఆయన రాసిన పుస్తకాన్ని ఆయనే పాఠ్యాంశంగా చదువుకోవాల్సి రావడం!
శివతాండవం చదువుతుంటే మనకు తెలియకుండానే అక్షరాలన్నీ సంగీతంతో కలిసి పరిగెడుతుంటాయి. అందుకేనేమో ఆ శివతాండవం కవిసమ్రాట్ విశ్వనాథుని ఆనంద పరవశుని చేసింది. కవికోకిల జాషువా చేత పుట్టపర్తి నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవ్వడు? అనిపించింది.
“ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మా కెన్నడేని;
తీగెలను తెంపి, అగ్నిలో దింపినావు
నా తెలంగాణ, కోటి రత్నాలవీణ”
అని నినదించిన మహాకవి దాశరథి. “దాశరథి వ్రాసిన పద్యాలు బోలెడు - అందులో నోటు చేయదగినవి కోకొల్లలు” అని ‘ఆరుద్ర’చే కొనియాడబడిన కవితావన పారిజాతం మన దాశరథి. నిజాం చెరనుండి తెలంగాణా విముక్తికై పోరాడిన కవనయోధుడతడు. “మహాంధ్రోదయం” కోసం తన కవిత్వంతో “అగ్నిధార”లు కురిపించి “రుద్రవీణ”లు మ్రోగించినవాడు. లక్ష్యం నెరవేరాక, చల్లబడ్డ మనస్సుతో సినిమా పాటలలో వేయి వేణువులు మ్రోగించి, ముత్యాల జల్లులు కురిపించినవాడు. ఆ కవితాగ్ని కాంతిలో దాశరథి విశ్వరూపాన్ని చూడాలంటే ఆయన సాహిత్యాన్ని చదవాల్సిందే.
"నేనింతా ఓ పిడికెడు మట్టే కావచ్చు - కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది!" అంటూ నినదించిన మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ.
"శేషేన్
నీ పోయెమ్సు చూసేన్
పసందు చేసేన్
నీది పద్యమా లేక ఫ్రెంచి మద్యమా"
అంటూ ఆయనను కవితాత్మకంగా పొగిడి మురిసిపోయారు "శ్రీశ్రీ".
ఈ షోడశి పుస్తకంలో... సుందరకాండ కుండలినీ యోగమని, లంకానగరం మూలాధారమని, సీతాదేవియే కుండలినీశక్తి అని, స్వామి హనుమే కుండలినీ యోగము అనుష్ఠించు యోగి అని వేదోపనిషత్తులనుండి మంత్రశ్లోకాలను ఉదహరిస్తూ నిరూపిస్తారు రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ గారు.
అనువాద హనుమంతుడంటూ బాపూరమణలు పిలుచుకునే నండూరి రామ్మోహనరావు గారి రచనా శైలి చాలా సరళంగా ఉంటుంది. మార్క్‌ట్వైన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెరీఫిన్ మొదలైన వాటికి నండూరి వారి అనువాదాలు అనువాదపు వాసన తగలకుండా గుబాళిస్తుంటాయి. ఇవి కాక ఇంకొన్ని అనువాదాలయిన రాజూ-పేద, విచిత్ర వ్యక్తి, కాంచనద్వీపం వంటి పుస్తకాలు పిల్లలతో చదివిస్తే వాళ్ళ ఊహాశక్తి, భాషా పటిమ రెంటినీ పెంచినవాళ్ళమవుతాం.
ఆరు సారా కథలు, రత్తాలు రాంబాబు, రాజు-మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త వంటి రచనలతో తెలుగు సాహిత్యంలో స్థిర నివాసం ఏర్పరచుకొన్న రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. రావి శాస్త్రిగా సుప్రసిద్ధులు. ఈనాటి రచయితలు ఎందరికో స్ఫూర్తి. ఆయన రచనాశైలి కూడా వేరెవ్వరీ అందనంత విశిష్టమైనది. కేవలం మళ్ళా మళ్ళా చదువుతూ ఆనందించ వలసినది.
ఇంకొక సుప్రసిద్ధ కథా రచయిత చాసోగా పిలవబడే చాగంటి సోమయాజులు గారు. ఎందుకు పారేస్తాను నాన్నా, ఎంపు, జంక్షన్‌లో బడ్డీ వంటి ఆయన కథలు… కథను ఎలా నడిపించాలి అన్న విషయంలో ఔత్సాహిక కథకులకు మార్గదర్శనం చేస్తాయి.
అందరికీ అర్థం కాని కథలు, అర్థం అయినా తిరిగి ఇదీ ఆ కథ అని చెప్పలేని కథలు, మనసు పొరల్లోకి తవ్వుకుంటూ వెళ్ళే కథలు... త్రిపుర కథలు. పాము, భగవంతం కోసం వంటి కథలు చదివిన తరువాత మరలా ఈ వాస్తవిక ప్రపంచంలోకి రావడానికి చాలా సమయం పడుతుంది. త్రిపుర పేరుతో రచనలు చేసిన రచయిత అసలు పేరు రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు గారు.
ఇంకా తెలుగు అందాన్ని అక్షరాలలో పెట్టి పరుగులు పెట్టించిన వేలూరి శివరామశాస్త్రి గారి కథలు,
తన "గాలివాన" కథతో తెలుగు కథకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన పాలగుమ్మి పద్మరాజు గారి కథలు,
*"చివరకు మిగిలేది"* అనే నవలతో తెలుగు సాహిత్యం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉండిపోయే స్థాయిని సంపాదించుకున్న బుచ్చిబాబు గారు రాసిన కథలు,
ఆనందాన్ని, హాయిని కలిగించే భానుమతి గారి “అత్తగారి కథలు”,
ఇలా వీరందరి కథలూ చదివి తీరాల్సిందే.
ఇప్పటివరకూ చెప్పుకున్న పుస్తకాల రచయితలెవ్వరూ ఇప్పుడు భూమి మీద లేరు. ఇప్పుడు ఉన్న రచయితల్లో కూడా తారాపథాన్ని అందుకున్నవాళ్ళు ఇద్దరు ఉన్నారు. అప్పట్లో లక్షలాది తెలుగు పాఠకులకు వాళ్ళిద్దరి పుస్తకాలే తెలుగు సాహిత్యానికి ప్రవేశద్వారాలుగా ఉండేవి. వారిలో ఒకరు,
*యండమూరి వీరేంద్రనాథ్ గారు.* ఒక తరం నవలా సామ్రాజ్యానికి ఆయనే చక్రవర్తి. వెన్నెల్లో ఆడపిల్ల, అంతర్ముఖం వంటి నవలలు ఎప్పటికీ క్లాసిక్సే. ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, అభిలాష, ఒక రాధ ఇద్దరు కృష్ణులు మొదలైన తెలుగు సినిమాలన్నీ యండమూరి నవలలకు వెండితెర రూపాలే. “విజయానికి అయిదు మెట్లు” తెలుగులో వచ్చిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలలోకెల్లా అత్యంత విజయవంతమైన పుస్తకం.
ఇంకొక ప్రసిద్ధ రచయిత, షాడో సృష్టికర్త అయిన *మధుబాబు గారు.* డిటెక్టివ్ సాహిత్యంలో ఎందరో రచయితలు ప్రఖ్యాతులైనా అగ్రస్థానం మాత్రం మధుబాబు గారిదే. షాడో గంగారాంతో కలసి దేశవిదేశాల్లో చేసిన విన్యాసాలు చదివి ఆనందించవలసిందే కానీ ఇలా చెప్పుకుంటే తనివితీరేది కాదు. డిటెక్టివ్ నవలలే కాదు కాళికాలయం, వీరభద్రారెడ్డి వంటి ఎన్నో జానపద నవలలు కూడా మధుబాబు గారి మార్క్‌తో తెలుగు సాహిత్యంలో నిలబడిపోయాయి.
ఇంకా…
ప్రజాకవి కాళోజీ గారి “నా గొడవ”, డైరక్టర్ వంశీ గారి “పసలపూడి కథలు”, యద్దనపూడి సులోచనారాణి గారి “జీవన తరంగాలు”, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి “నత్తలొస్తున్నాయి జగ్రత్త”, మాదిరెడ్డి సులోచన గారి “పూల మనసులు”, రంగనాయకమ్మ గారి “బలిపీఠం”, పొత్తూరి విజయలక్ష్మి గారి “హాస్య కథలు”, కె.ఎన్.వై. పతంజలి గారి “కథలు- పతంజలి భాష్యం”, శ్రీరమణ గారి “మిథునం”, “బంగారుమురుగు” కథలు, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి “అమృతం కురిసిన రాత్రి” రాసిన ఇలా చదవ వలసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి.
రామాయణం 24 వేల శ్లోకాలూ టీకా తాత్పర్యాలతో సహా కావాలనుకునేవాళ్ళకు పుల్లెల శ్రీరామచంద్రుడు గారి రామాయణం, టి.టి.డి వాళ్ళు ప్రచురించిన ఆంధ్రమహాభారతం పదిహేను పుస్తకాల సెట్టు, వారి ప్రచురణే అయిన పోతన భాగవతం, రామకృష్ణమఠం వారు సులభశైలిలో అర్థమయ్యేలా ప్రచురించిన ఉపనిషత్తుల పుస్తకాలు, శృంగేరీ పీఠాధిపతుల సూచన మేరకు కాకతీయ సిమెంట్స్ వారు ప్రచురించిన పురాణ అనువాదాలు ఇలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.
ఇప్పటికి కొందరు రచయితలను, కవులను తలుచుకుంటూ కొన్ని పుస్తకాలను మాత్రమే ప్రస్తావించాను. ఇలాంటి ఇంకొక పది వ్యాసాలు వ్రాసినా ఇంకా గుర్తుచేసుకోవలసిన, చదవ వలసిన మంచి పుస్తకాలు మిగిలే ఉంటాయి. అంత గొప్ప సాహిత్యం ఉంది మన భాషలో.
ఇప్పటికి మాత్రం ఈ పుస్తకాలతో సరిపెడుతూ, నా ఉత్సాహానికి అడ్డుకట్ట వేసుకుంటున్నాను.
*స్వస్తి! - రాజన్ పి.టి.ఎస్.కె*
(#RajanPTSK Rajan PTSK)
🌹🌹🌹🌷🌷🌹🌹🌹
మాస్క్ ఇవ్వండి
సాహిత్య అభిమాని ఒకరు తన దుకాణం వద్ద ఇలా బోర్డు పెట్టారు.
కొంచం కూడా ఆంగ్లం వాడకుండా వస్తువులు కొంటే 30శాతం రాయితీ ఇస్తాను.
వ్యక్తి... సూక్ష్మాతి సూక్ష్మ విషాణు రాక పోక నియంత్రణ ముఖోష్ట నాసికాది రక్షణార్ధం కర్ణ ధ్వయ సమర్థిత ద్వివస్త్రం ఇవ్వండి అన్నాడు.
యజమాని... బాబు 50 శాతం రాయితీ ఇస్తాను, ఆంగ్లంలోనే చెప్పండి.
మాస్క్ ఇవ్వండి అన్నాడు.😷😷😀😀
యుగాది
యుగాది🌹*
యుగాది కాలానికి ప్రమాణము. అది అనగా మొదలు.ఉగాది కాల ప్రమాణానికి తొలిరోజు. కాలానికి మనమంతా వశులమే. జీవులంతా ఈ కాల ప్రవాహం లో పుట్టి పెరిగి నశించినవారే.కానీ కాలతీతమైన మరొక తత్వం వుందని సాయి నాధుడు, దత్తాత్రేయ, రామకృష్ణ , రామణులు వంటి మహాత్ముల ద్వారా తెలుస్తోంది. ఆ తత్వం మే జడ,చైతన్య ప్రాణుల రూపంలో ప్రకటన అయిందని అన్ని మతాలు చెపుతున్నారు. "జీవో భ్రహైవ నా పరః",ఆని "స్సర్వం ఖలీవిధం భ్రహ్"అని వేదాలు, "నువ్వు చూసేదంతా కలిపి నేను" అని సాయి నాధుడు తెలిపారు. ఆనంద స్థితి ని అందుకోవడం జీవుల లక్ష్యం. అట్టి సాధనకు పునఃఅంకితం ఆయ్యెరోజు ఉగాది. ఉగాది పచ్చడి లోని ఆరు రుచులు కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు అన్ని సాయి ప్రసాదంగా తలుద్దాం.
-శ్రీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు.🌹🙏🏻💐
పరశురాముడు
*🚩పరశురాముడు-శ్రీ మహాభారతంలో కథలు!🚩*
పరశురాముడు -శ్రీ మహాభారతంలో కథలు పరశురాముడి చరిత్ర చాలా చిత్రమైనది.
పరశురాముడి తాత బుచీకుడనే ఋషి. ఆయన గాధిరాజు దగ్గరకు వెళ్ళి రాకుమారి సత్యవతిని తనకిచ్చి పెళ్ళి చేయమని కోరాడు. తాపసికి పిల్లనివ్వటం ఇష్టం లేక, నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను వేయింటిని తెచ్చి కానుకగా ఇస్తే తన కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తానని షరతు పెట్టాడు గాధిరాజు. బుచీకుడు ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని అశ్వసహస్రాన్ని సాధించి తెచ్చి సత్యవతిని పెళ్ళిచేసుకున్నాడు.
తరువాత ఒకసారి గాధిరాజదంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు చేయాలో చెప్పమని బుచీకుడ్ని అర్ధించాడు. అప్పుడాయన రెండు రకాల హోమద్రవ్యాలు తయారు చేసాడు.
" ఇదిగో చూడు! ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు, అజేయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు. ఇది మీ అమ్మకు ఇవ్వు. ఇలా చూడు, ఈ హవ్యం నీ కోసం ప్రత్యేకంగా తయారుచేసాను. ఇది తింటే తపస్సు, శమదమాలు గల ఉత్తమ ద్విజుడు పుడతాడు" అని భార్యతో చెప్పి బుచీకుడు స్నానానికి వెళ్ళాడు.
అతను వెళ్ళిన కాసేపటికి అత్తమామలు రానే వచ్చారు. సత్యవతి తల్లికి భర్త చేసిన హవ్యాలు చూపించింది. వాటి ప్రభావం వర్ణించింది. ఆమె సంతోషించి శుచిగా స్నానం చేసి వచ్చి పొరపాటున తాను సేవించవలసిన హవ్యం కూతురికి ఇచ్చి, కూతిరి వంతు హవ్యం తాను తిన్నది.
బుచీకుడు ఆశ్రమానికి వచ్చి దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు.
" ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజం గల పుత్రుడు , నీకు పరమ క్రూరుడయిన కొడుకు పుడతారని" బుచీకుడు భార్యతో చెప్పాడు. సత్యవతి బాధపడింది. బుచీకుడు జాలిపడి ఆ క్రౌర్యం తన మనుమడికి వచ్చేటట్టు అనుగ్రహించాడు. బుచీకుని హోమద్రవ్య ఫలంగా గాధిరాజుకు జన్నించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. జమదగ్ని గొప్ప తపస్వి. ఆ మహర్షి సతీమణి రేణుకాదేవి.
మానవులకు తల్లికంటే తండ్రే శ్రేష్ఠమైన దైవమని (పితాపరం దైవతం మానవానం) పరాశరగీత (297-2) తెలిపిన సూక్ష్మధర్మాన్ని పరశురాముడు రుజువు చేశాడు.ఓరోజు జమదగ్ని, పూజ చేసుకునేందుకు, భార్యను వెళ్ళి గంగాజలం తీసుకురమ్మన్నాడు. ఎంతమాత్రం ఆలస్యం చేయవద్దని, పూజకు సమయం మించిపోకుండా, గంగాజలాన్ని త్వరగా తెమ్మని చెప్పాడు. రేణుకాదేవి, భర్త చెప్పినట్లు, నీళ్ళు తెచ్చేందుకు, గంగానదికి వెళ్ళింది. గంగమ్మకు నమస్కరించి, కళ్ళు తెరిచేసరికి గంధర్వులు కనిపించారు. రేణుక ఆశ్చర్యానికి అంతు లేదు. చిత్రరథుడనే గంధర్వుడు అప్సరసలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. అలాంటి ఆనందకర దృశ్యాన్ని5 ఎన్నడూ చూడని రేణుక పరవశంగా చూసింది.
కొద్దిసేపు అలా గంధర్వులను చూసిన రేణుక, భర్త కోపావేశాలు గుర్తొచ్చి ఉలిక్కిపడి, తాను తెచ్చిన పాత్రను గంగలో ముంచి ఉదకాన్ని తీసుకుంది. భయంతో గుండె కొట్టుకుంటూ ఉండగా, వేగంగా ఆశ్రమం చేరింది. ఒనుకుతున్న చేతులతో గంగాజలాన్ని భర్త ఎదుట ఉన్న పూజా సామగ్రి దగ్గర ఉంచింది.
జమదగ్ని దివ్యదృష్టితో చూడనే చూశాడు. భార్య ఆలస్యంగా రావడానికి కారణం తెలీగానే ఆగ్రహంతో దహించుకుపోయాడు. ఆవేశంతో రగిలిపోతూ "పరశురామా! ఈ చంచల మనస్కురాలిని ఒక్క వేటున నరికేయి" అని ఆజ్ఞాపించాడు. పరశురాముడు మరొకర్ని, ఇంకొకర్ని అయితే అలాగే నరికేసేవాడు. కానీ, ఆమె స్వయంగా తల్లి కావడంతో ఆ పని చేయలేకపోయాడు. తండ్రి మాటా విననట్లు ఊరుకున్నాడు.
కానీ, జమదగ్ని కోపం తగ్గలేదు.
"పరశురామా, చెప్తోంది నీకే.. వెంటనే పరశువు (గొడ్డలి) తీసుకో... మీ అమ్మని, సోదరుల్నీ కూడా నరుకు.. ఇది నా ఆజ్ఞ" అన్నాడు.
పరశురాముడికి తండ్రి తపశ్శక్తి తెలుసు కనుక ఇక లేచాడు. ఇక ఆలోచించకుండా కన్నతల్లిని, సోదరులని తన పరశువుతో నరికేశాడు. జమదగ్ని సంతోషానికి అవధుల్లేవు. కొడుకు తన ఆజ్ఞను శిరసావహించాడు. తల్లి అని కూడా చూడకుండా తాను చెప్పినట్లు చేశాడు.
అందుకే, "పరశురామా, నా మాట మన్నించినందుకు సంతోషం.. ఏదైనా వరం కోరుకో" అన్నాడు.
పరశురాముడు సందేహించకుండా,
"నాన్నా, దయచేసి అమ్మని, సోదరులని మళ్ళీ బతికించు.. అంతకంటే ఇంకేం అక్కర్లేదు" అన్నాడు. జమదగ్ని కోపగించుకోలేదు.
"తథాస్తు" అన్నాడు.
పరశురాముని తల్లి రేణుకాదేవి, సోదరులు పునర్జీవితులయ్యారు.
అయినా పరశురామునికి సంతోషం కలగలేదు. దుఃఖంతో రగిలిపోయాడు.
కార్తవీర్యార్జునుడు (సంస్కృతం: कार्तवीर्य अर्जुन, IAST: Kārtavīrya Arjuna) హైహయ వంశజుడైన కృతవీర్యుడు పుత్రుడు. ఇతడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. దత్తాత్రేయ మహర్షి కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మహిష్మతీపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి.
ఒకసారి అగ్ని తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను. గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని శపించెను.
🙏🏻
ఉగాది
*🍑ఉగాది పండుగను ఎందుకు, ఎలా జరుపుకుంటారు🍑*
తెలుగు సంవత్సరం ఆరంభమయ్యేది ఈ రోజే.. అందుకే సంవత్సరంలో మొదటి రోజు. యుగానికి ఆది యుగాది.. కాలక్రమేణ ఉగాదిగా మారింది. సంస్కృతం లో యుగాది అనే మాటకు కృత, త్రేత, ద్వాపర,కలియుగాల్లో ఏదో ఒకదానికి ఆది లేక ప్రారంభం అని అర్థం.
తెలుగులో ఉగాదిని సంవత్సరాది అంటే కొత్త ఏడాది ప్రారంభంగా వాడుతున్నాం. చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకొంటాం. హేమాద్రి, కమలాకరభట్టు వంటి పండితులు దీన్ని నిర్ధారించారు.
*🥭పురాణ కథ*
తెలుగు వారికి ఉగాది ముఖ్యమైన పండుగ. ఉగాది రోజు బ్రహ్మ సృష్టిని చేశాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఒకప్పుడు సోమకాసుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గరుండే పురాణాలను దొంగిలిస్తాడు. ఆ వేదాలను తీసుకుని రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కుంటాడు. ఈ విషయం విష్ణుమూర్తికి తెలుస్తుంది. దీంతో ఆయన మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుణ్ణి సముద్ర గర్భంలో పాతిపెట్టి ఆ వేదాలు (పురాణాలు)ను తీసుకుని బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు.
దీంతో పురాణాలను పొందిన బ్రహ్మ సృష్టిని తయారు చేయడం ప్రారంభిస్తాడు. అలా బ్రహ్మ సృష్టిని చేయడం ఉగాది రోజే ప్రారంభిస్తాడు. దీంతో ఆ రోజుకి పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యతను కల్పించారు. ఇక మనకు ఒక సంవత్సరం పూర్తయితే బ్రహ్మకు అది ఒక రోజు అవుతుంది. కనుక బ్రహ్మకు రోజూ ఉగాదే అవుతుంది. అంటే అతను రోజూ సృష్టి చేస్తాడన్నమాట.
*🥭ఉగాది పచ్చడి విశిష్టత*
ఈ రోజు అతి ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఈ రోజు చేసే పచ్చడి చాలా ప్రత్యేకత, విశేషత కలిగినది. ఏడాదిలో అన్ని రకాల రుచులను ఆస్వాదించాలనే తత్వ బోధ చేసే ఈ పచ్చడిని తప్పక ప్రతి ఒక్కరు స్వీకరించాలి.
వేపపువ్వు, కొత్త చింతపండు, బెల్లం, మామిడికాయ ముక్కలు, ఉప్పు, శనగపప్పు సాధారణంగా వాడుతారు. మరికొన్ని ప్రాంతాల్లో జీలకర్ర, చెరుకు ముక్కలు, కొంచెం కారం, నేయి వంటివి కూడా వాడుతారు. మొత్తం మీద షడ్రుచుల సమ్మితంగా దీన్ని తయారుచేస్తారు. దీన్ని కొత్త కుండలో/గిన్నెలో తయారు చేసి పంచాంగ పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి తీర్థ ప్రసాదాలను, ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు.
ఉగాది పచ్చడి మహా ఔషధమని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని ఉగాది నుంచి తరువాత వచ్చే శ్రీరామ నవమి వరకు లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతి రోజూ తినాలట. మొత్తం 15 రోజుల పాటు ఉగాది పచ్చడిని తినాలని దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఆయా వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని చెబుతారు.
ఉగాది పచ్చడి ఆరు రుచుల సమ్మేళనమని మనకు తెలుసు. అందులో వేసే వేప పువ్వు, ఆకు కడుపులో ఉండే నులి పురుగులు, క్రిములను చంపేస్తాయి. గాలి సోకడం, ఆటలమ్మ, అమ్మోరు వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే పచ్చి మామిడి కాయ యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో జ్వరాలు రావు. వాత, పిత్త, కఫాలు సమతుల్యంలో ఉంటాయి. దీని వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
*🥭ఇక ఉగాది పండుగకు చెందిన మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.*
* పరగడుపునే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. ప్రకృతి మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని సంసిద్ధం చేసే శక్తి ఈ పచ్చడికి ఉందని పురాణోక్తి.
* ఉగాది పండుగ వసంత రుతువులో వస్తుంది. సాధారణంగా ఈ కాలంలో ఆటలమ్మ, ఇతర విష జ్వరాలు ఎక్కువగా వస్తాయి. దీంతో పాటు పలు ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకు ఉగాది పచ్చడి చాలా మేలు చేస్తుంది.
* ఉగాది రోజున ఇంటి ద్వారాలకు మామిడి ఆకులతో, బంతి పూలతో తోరణాలు కడుతాం. ఈ క్రమంలో బంతిపూలు, మామిడి ఆకులలో ఉండే యాంటీ సెప్టిక్, యాంటీ బయోటిక్ గుణాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. బయటి నుంచి రోగ కారక క్రిములను ఇంటి లోపలికి రాకుండా చూస్తాయి.
* సాయంత్రం వేళ దేవాలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని తప్పక వినాలని చెబుతారు పెద్దలు.
*🥭ఈ రోజు చేయాల్సిన ప్రత్యేక స్నానం*
నీటిలో గంగాదేవి, తైల (నూనె) లో లక్ష్మీదేవి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది రోజున ఉదయాన్నే నువ్వుల తైలాన్ని శరీరానికి పట్టించి నాలుగు పిండితో అభ్యంగన స్నానం చేయాలి. ఇలా చేసిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, వారికి ఆయురారోగ్యాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కనుక ఈ రోజున ఇలా స్నానం చేయడం మాత్రం మరువకండి.
🙏🏻
🍑🏵️🍑🏵️🍑🏵️🍑
🏵️🍑🏵️🍑🏵️🍑🏵️
*_🥭ఉగాది🥭_*
_ఉగాది - భావం_
_హైందవశాస్త్రం ప్రకారం అరవై తెలుగు నామసంవత్సరాలు ఉన్నాయి, అవి ఒక క్రమంగా వస్తాయి._
_బ్రహ్మదేవుడు తన సృష్టిని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభించాడు. ఆ రోజు యుగమునకు ఆది - యుగాది, నేటి ఉగాది. భారతీయ గణితవేత్త శ్రీ భాస్కరాచార్యులవారి గణనం ప్రకారం ఈ రోజున సూర్యోదయ కాలానికి కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజు వస్తాయి. వసంత ఋతువు మొదలవుతుంది. అంత వరకూ బీడు పడి ఉన్న భూమి మొలకలు ఎత్తి, కొత్త జీవితానికి నాందిలా పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పచ్చని పంటపొలాలు, ఏపైన చెట్లు, రంగు రంగుల పూలు సౌభాగ్యానికి చిహ్నంగా కనబడతాయి. ఇది తెలుగు వారి కొత్త సంవత్సరాది._
_*🥭ఉగాది పచ్చడి - ప్రాముఖ్యత:*_
_ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక_
_బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం_
_ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం_
_వేప పువ్వు – చేదు -బాధకలిగించే_ _అనుభవాలు_
_చింతపండు - పులుపు_ _- నేర్పుగా_ _వ్యవహరించవలసిన పరిస్థితులు_
_పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు_
_మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు_ _చేసే పరిస్థితులు_
_ప్రొద్దునే ఇంటి_ _ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు._
_*🥭పండగ తయారి:*_
_ఒక వారం ముందే పండగ పనులు మొదలవుతాయి._ _ఇంటికి వెల్ల వేసి, శుభ్రం చేసుకుంటారు. కొత్త బట్టలు, కొత్త సామాగ్రీ కొనడంలో ఉత్సాహం పండుగ సందడి ఒక వారం ముందే మొదలవుతుంది. పండుగ రోజున తెల్లవారుఝామునే లేచి, తలస్నానం చేసి, ఇంటికి మామిడి తోరణాలు కడతారు._ _పచ్చటి మామిడి తోరనాలకు ఈ రోజుకు సంబంధించి ఒక కధ ఉంది. శివపుత్రులు గణపతి, సుబ్రమణ్యస్వాములకు మామిడి పండ్లంటే ఎంతో ప్రీతి._ _సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట కలుగుతుందని దీవించాడని కధ._
_ప్రతీ ఇంట ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి , రంగు రంగుల రంగవల్లులు తీర్చి దిద్దుతారు._ _శాస్త్రయుక్తంగా తమ ఇష్టదైవానికి పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంత శుభం కలగాలనికోరుకుంటారు. ఆరోగ్య ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తారు . ఈ రోజున కొత్త పనులు వ్యాపారాలు మొదలెడతారు._
_ఇంటింట ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. పులిహోర, బొబ్బట్లు, పాయసం, అలాగే పచ్చి మామిడి కాయతో వంటకాలు విశేషం._
*_పంచాంగ శ్రవణం:_*
_ఈ రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం జరుగుతుంది. సాధారణంగా సాయంత్ర సమయాన ఊరి జనాలు ఒక చోట చేరి, సిద్ధాంతి చెప్పే పంచాంగ వివరాలు, ఆ సంవత్సరరాశి ఫలాలు తెలుసుకుంటారు సిద్ధాంతి దేశ, రాష్ట్ర, వ్యక్తీ స్థితి గతులు ఎలా ఉంటాయో వివరణ చేస్తాడు._ _పంచాంగ శ్రవణం వాళ్ళ రానున్న మంచి చెడులను సమభావంతో స్వీకరించ గలరని, పంచాంగ శ్రవణం వినడం మంచిది అని మన పెద్దలు చెప్పటం జరిగింది._
*_కవి సమ్మేళనం:_*
_ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా "కవి సమ్మేళనం"_ _నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు నవభావన, పాత ఓరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. సామాజిక జీవనం, రాజకీయం, వాణిజ్యం ఇలా అన్నివిషయాలను గూర్చి ప్రస్తావిస్తారు, కవులు తమకవితలలో. ఈ విధంగా నానా రుచి సమ్మేళనంగా జరుగుతుంది ఉగాది కవి సమ్మేళనం._
_ఊరగాయల కాలం:_
_మామిడికాయలు దండిగా రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలెడతారు._ _వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించు కోవడానికి వీలుగా మామిళ్ళను, ఇతర కాయలను ఎండబెట్టి,_ _ఊరవేస్తారు. తెలుగు వారిళ్ళలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది "ఆవకాయ". “ఇలా_ _వివిధ విశేషాలకు నాంది యుగాది - తెలుగువారి ఉగాది”_
🙏
చైత్ర మాసం ప్రారంభం
_*రేపటి నుండి చైత్ర మాసం ప్రారంభం*_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*చైత్ర మాసం విశిష్టత*
*“ఋతూనాం కుసుమాకరాం”* అని భగవానుడు స్వయంగా తానే వసంతఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి ఉగాది , శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు , దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం , యజ్ఞ వరాహమూర్తి జయంతి , సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక , అనేక ఆధ్యాత్మిక , పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.
చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది.
ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది. చెట్లూ , చేమలే కాదు , పశుపక్ష్యాదులు కూడా వసంతాగమనాన్ని స్వాగతిస్తాయి. సంవత్సరమునకు యుగము అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది , ఉగాది అయింది. చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక , సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుండీ సంవత్సరాదిని జరుపుకుంటారు. ఉగాది నాడు కొన్ని పనులను చేయాలని పెద్దలు చెప్పారు. అవి ఏమిటంటే , ఉగాది నాడు తైలాభ్యంగన స్నానం చేసి , నూతన వస్త్రాలు ధరించాలి. ప్రతీ గృహమునందు ధ్వజారోహణం , లేదా జయకేతనం ఎగురవేయాలి. సృష్టి మొదలు అయిన రోజున (యుగాది) సృష్టిని చేసిన బ్రహ్మగారిని పూజించాలి. ఉగాది నాడు షడ్రుచులతో కూడిన పచ్చడిసేవనం(నింబకుసుమ భక్షణం), పంచాంగ శ్రవణం , తెలుగు వారికే ప్రత్యేకమైన అవధానం , వంటివి పండుగకే శోభనిస్తాయి.
ఉగాది పచ్చడి సేవనం వెనుక అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వేపపువ్వు , కొత్త బెల్లం , కొత్త చింతపండు , మామిడి , చెరకు వంటివాటితో చేసిన పచ్చడిని తినటంవల్ల ప్రకృతిలో వచ్చే మార్పులకు మన శరీరం సిద్ధపడుతుంది. వేపపువ్వు , బెల్లం ఈనాటినుండీ పదిహేనురోజుల పాటు రోజూ ఉదయాన్నే స్వీకరించడం వల్ల ఆరోగ్యం చక్కబడుతుంది.
పంచాంగ శ్రవణం – పంచాంగాన్ని పూజించి , తిథి , వార , నక్షత్ర , యోగం , కరణాలతో కూడిన పంచాంగాన్ని చదివి , విని , రాబోయే సంవత్సరంలో గ్రహాల గతుల ఆధారంగా ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయో తెలుసుకుని , తదనుగుణంగా తమ నిర్ణయాలను తీసుకోవడం , శుభ ఫలితాల కోసం భగవంతుని పూజించడం వంటివి చేస్తారు. ఇక కవిసమ్మేళనాలు , అవధానాలు , సాంస్కృతిక కార్యక్రమాలతో కాలాన్ని ఆనందంగా గడుపుతారు.
చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రులు
సంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాము. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు , రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు , మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి , నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి , చూసి తరిస్తారు. రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం వుంది. రామాయణం లోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించినది మొదలు , వనవాసానికి వెళ్ళటం , దశరథుని మరణం , సీతాపహరణం , రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం , శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి.
చైత్ర శుద్ధ విదియ నాడు బాలచంద్రుడిని బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలుపోగు అని విదియ నాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకీ నూలుపోగు సమర్పించి , మనకి జ్ఞానాన్నిమ్మని కోరుతారు.
చైత్ర శుద్ధ తదియ – డోలాగౌరీ వ్రతం(సౌభాగ్య గౌరీ వ్రతం), సౌభాగ్య శయన వ్రతం , ఆ రోజున పార్వతీపరమేశ్వరులను దమనంతో పూజించి , డోలోత్సవం నిర్వహిస్తారు. చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు. పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందటం కోసం తపస్సు చేసినప్పుడు , చైత్ర శుద్ధ తదియ నాడు ఆ తపస్సు ఫలించింది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. సౌభాగ్యాన్ని , పుత్రపౌత్రాదులను , భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ రోజు మత్స్య జయంతి కూడా. – శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి , వేదాలను రక్షించిన రోజు.
చైత్ర శుద్ధ పంచమి – లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు
పూజించాలి. అనంత , వాసుకి , తక్షక , కర్కోటక , శంఖ , కుళిక , పద్మ , మహాపద్మ అనే మహానాగులను పూజించి , పాలు , నెయ్యి నివేదించాలి.
అశ్వములను కూడా ఈ రోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం కూడా ఒకటి. ఈ రోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు. శ్రీరామ పట్టాభిషేకము చేయించిన మంచిది. ఒకవేళ చేయలేకపోయినా , శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేయడం మంచిది.
చైత్ర శుద్ధ అష్టమి – భవానిదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఆరోజు భవాని మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి , అశోకవృక్షం చిగురుని సేవిస్తే గర్భ శోకం కలుగదు అని శాస్త్రము చెప్పింది.
చైత్ర శుద్ధ నవమి – శ్రీరామనవమి . శ్రీమహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు. ఈ రోజు ఊరూరా , వాడవాడలా శ్రీసీతారాముల కళ్యాణం చేస్తారు. నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం.
చైత్ర శుద్ధ ఏకాదశి – వరూధిన్యేకాదశి , కామద ఏకాదశి అని అంటారు.
చైత్ర శుద్ధ పౌర్ణమి – స్త్రీలు చిత్రవర్ణాలు గల (రక రకాల రంగులు) వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజు చిత్రగుప్తుని వ్రతం చేసిన మంచిది. ఉత్తర భారతదేశంలోని వారు హనుమజ్జయంతిని జరుపుకుంటారు.
చైత్ర బహుళ త్రయోదశి – యజ్ఞవరాహ జయంతి. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు.
ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు , ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకుని , రామాయణ సారాన్ని గ్రహించి , సీతారాముల కళ్యాణం చూసి తరించి , సనాతన ధర్మాచరణకై పాటుపడదాం.
వసంత నవరాత్రులు
_*రేపటి నుండి వసంత నవరాత్రులు ప్రారంభం*_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి...అంటే ‘ఉగాది’ నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు మొదలవుతుంది. ఈ వసంతఋతువుకు ఎంతో ప్రముఖ్యత ఉంది. శిశిరంలో .... ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతికాంత...నవ పల్లవాలతో చిగిర్చి , పూల సోయగాలతో కనువిందులు చేస్తూ , సుగంథాల సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే.. ఈ వసంతఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే. అందుకే... *‘ఋతూనా కుసుమాతరః’* అని ‘గీత’లో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు. అనంతమైన కాలంలో , కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు ఉండే *ఈ వసంతఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత ?*
ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు. అదే శ్రీరామావతారం. అంతవరకూ రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి. పుడుతునే సకల జీవకోటికీ ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు. అందుకే.. సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ *‘వసంత నవరాత్రులు’* సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది. అయితే... తొమ్మిది రాత్రులే ఎందుకు జరుపుకోవాలి ? పదిరాత్రులు జరుపుకోకూడదా ? ఏమిటీ లెక్క ? అనే సందేహం చాలామందికి కలుగుతుంది. ‘నవ’ అంటే ‘తొమ్మిది’ అని ‘కొత్త’ అని రెండు అర్థాలు ఉన్నాయి. ‘కొత్త’ అంటే...
అంతవరకూ రాక్షస బాధలతో శోకమయంగా గడిపిన రాత్రులు పోయి ఆనందమయ నవరాత్రులు వచ్చాయి అని అర్థం. ఇక తొమ్మి రాత్రులు ఎందుకుచేయాలంటే....
*భగవంతుని ఆరాధనలో ‘భక్తి’ తొమ్మిది రకాలు*
*శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం*
*అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం*
శ్రవణం - కీర్తనం - స్మరణం - పాదసేవనం - అర్చనం - వందనం - దాస్యం - సఖ్యం - ఆత్మనివేదనం. ఇవి నవవిధ భక్తిమార్గాలు. భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తి మార్గలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచకుని పరమాత్మని సన్నిధి చేరుకున్నవారే.
నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు , ఒక్కొక్క భక్తి మర్గాన్ని ఎంచుకుని , అలా తొమ్మిది రోజులు తొమ్మిది భక్తి మార్గాలతో భగవంతుని సేవించి తరించడానికే... ఈ నవరాత్రులను ఏర్పాటు చేసారు మన ఋషులు.
*వసంత నవరాత్రి మహిమ*
*ద్వాఋతూ యమదంష్ట్రాఖ్యౌ నృణాం రోగకరావుభౌ|*
*శరద్వసంత నామానౌ తస్మాత్ దేవీం ప్రపూజయేత్||*
సంవత్సర చక్రంలో వసంత శరదృతువులు రెండూ ప్రాణులకు రోగకారకమైనవి. కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకొని వికటాట్టాహాసం చేస్తూ , ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా మృత్యుముఖంలో పడకుండా తప్పించుకోదలచిన వారు పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. అపమృత్యు వినాశినియై , సర్వాపద్లినివారిణియై విరాజిల్లే ఆ జగన్మాతను ప్రార్థించిన వారు ఆ యా ఋతువుల్లో రోగభాధలను , మృత్యుభయాన్ని జయించగలుగుతారని , ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి పూజా విధానాన్ని వివరించాడు.
సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ వసంత నవరాత్రాలు అని , అర్థ సంవత్సరం గడచిన తర్వాత శరదృతువు ఆరంభంలో ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ శరన్నవరాత్రులు అని వ్యవహరింప బడతాయి. వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం. రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలిలతాదేవి అని సాధకుల విశ్వాసం. *"శ్రీరామో లలితాంబికా"* అని పురాణాలు వివరిస్తున్నాయి. నేటికీ ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనే పేరుతో వసంత నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించే సంప్రదాయం ఆచరణలో ఉన్నది. శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం అనూచారంగా వస్తున్న ఆచారం.
మానవునికి మళ్ళీ మళ్ళీ మాతృగర్భంలో నరకయాతనలు రాకుండా ఉండడానికి , తొమ్మిది నెలలు జీవుడు పడవలసిన బాధలు పునరావృతం కాకుండా ఉండడానికి , ప్రశాంత స్థితిని అనుభవించడానికి , నవరాత్రులలో ఆదిశక్తిని ఆరాధించాలని వ్యాసమహర్షి లోకానికి వెల్లడించాడు. నవరాత్ర పూజా విధానాన్ని సవివరంగా సాధకులకు అనుగ్రహించాడు. వ్యాస మహర్షి.
నవరాత్రులకు ముందు రోజే కుంకుమ , పూలు , పండ్లు , సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకొని , మరునాడు (పాడ్యమినాడు) ప్రభాత సమయంలోనే పరమేశ్వరిని ప్రార్థిస్తూ *"సంకల్పం"* చెప్పాలి తాను భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులూ దేవిని పూజింపదలచినట్లు ఆమెకు విన్నవించు కోవడమే *"సంకల్పం".*
తొలినాడు ముందుగా గణపతి పూజ , తరువాత పుణ్యాబవాచనం , అనంతరం అష్టదిక్పాలక ఆవాహనం చేసి , పూజా వేదికను సిద్ధం చేసుకోవాలి. విఘ్ననివారణ కోసం గణపతి ప్రార్థించడం గణపతి పూజ. పూజ జరుగు చున్న ప్రదేశము , సమయము , పూజకు సిద్ధమైన భక్తుని మనస్సు , పూజను తిలకించడానికి వచ్చిన బంధుమిత్రులందరికి మనస్సు , పవిత్రంగా ఉండాలని భావించడమే పుణ్యాహవాచనం. పూజా వేదికపై నలుదిక్కులా సూర్యుణ్ణి , గణపతిని , శివుణ్ణి , విష్ణువుని , నిలిపి , కేంద్రంలో పరాశక్తిని ప్రతిష్ఠించి ప్రశాంతమైన మనస్సుతో , నిర్మలమైన భావంతో పూజ సాగించాలి.
*"భావేషు విద్యతే దేవో న పాషాణ న మృణ్మయే|*
*న ఫలం భావహీనానాం తస్మాత్ భావో హి కారణమ్"||*
అని శాస్రం వివరిస్తోంది. శిలావిగ్రహాలలో , మట్టిబొమ్మలలో దేవుడున్నాడా ? అని అంటే అది *'భావనా'* బలాన్ని బట్టి - అని శాస్త్రవేత్తలు అంటున్నారు. కనుక ఆ విగ్రహాలనో లేకమట్టిబొమ్మలనో ప్రతిమలుగా కాక , దివ్య శక్తికి ప్రతీకలుగా భావనం చేయడమే సాధనలో తొలిమెట్టు.
శ్రద్ధాళువులైన వారు నవరాత్రులలో యాథాశక్తిగా దేవీ మంత్రాన్ని జపించాలి. గౌరీ పంచాక్షరీ , బాలా షడక్షరీ , నవార్ణ చండికా , పంచదశీ , షోడశీ మంత్రాలు అన్నీ దేవికి సంబంధించినవే. గురుముఖతః ఉపదేశం పొంది , విధానం తెలుసుకొని , నియమనిష్ఠలతో మంత్రానుష్ఠానం సాగించాలి.
మంత్రము , యంత్రము , తంత్రము అనేవి మూడూ దేవీ పూజా విధానంలో ముఖ్యమైనవి. మంత్రానుష్ఠానం అయిన తరువాత పీఠపూజతో ప్రారంభించి షోడశోపచారాలతో దేవిని ఆరాధించి , సహస్రనామావళితో , అష్టోత్తర శతనామాలతో పూజించి , ధూప దీప నైవేద్యాలను , తాంబూల నీరాజనాలను సమర్పించి , యథాశక్తిగా గీత , వాద్య , నృత్య శేషాలతో అర్చించి , ఛత్ర చామరాలతో దేవికి సపర్యలు చేయాలి.
ఈ తొమ్మిది రోజులూ దేవీ సంబంధమైన స్త్రోత్రాలతో , కథలతో దేవీ మహీమా విశేషాలతో కాలాన్ని దేవీ మయంగా భక్తి భావనతో దీక్షగా గడపాలి. కావ్యాలాప వినోదిని అయిన జగన్మాత సన్నిధిలో ఈ నవరాత్రులలో సౌందర్య లహరి , సప్తశతి , దేవీ బాగవతం మొదలైన దేవీ సంబంధమైన వాఙ్మయాన్ని పఠనం లేదా శ్రవణం చేయాలి. ఇలా తొమ్మిది రోజులూ పూజించి , పదవనాడు విజయ సూడకంగా విజయోత్సవం నిర్వహించాలి.
ఈ నవరాత్రులలో కుమారీ పూజ , సువాసినీ పూజ బ్రాహ్మణ పూజ జరపడం దేవికి ప్రీతి పాత్రమైన విషయాలు. కుమారీ పూజలో పాడ్యమి నుండి నవమి వరకు వరుసగా రెండు సంవత్సరాల వయస్సు గల కన్య మొదలుకొని పది సంవత్సరాల కన్య వరకు ఆ యా దేవతా నామాలతో అర్చన చేసి సుగంధ ద్రవ్యాలు , మంగళ ద్రవ్యాలు సమర్పించాలి. *"ఉపవాసేన నక్తేన ఏకభుక్తేన వా పునః"* అనే శాస్త్ర సంప్రదాయాన్ని అనుసరించి , ఉపవాసంతో కాని , ఏక భుక్తంతో కాని , రాత్రి భోజనంతో గాని ఆహార నియమాన్ని విధించుకొని నవరాత్రి వ్రతం పాటించాలి.
*పాడ్యమి నాడు రెండు సంవత్సరాల కన్య "కుమారిక !"*
*విదియనాడు మూడు సంవత్సరాల కన్య "త్రిమూర్తి ,"*
*తదియ నాడు నాలుగు సంవత్సరాల కన్య "కల్యాణి ,"*
*చవితినాడు ఐదు సంవత్సరాల కన్య "రోహిణి ,"*
*పంచమినాడు ఆఱు సంవత్సరాల కన్య"కాళిక ,"*
*షష్ఠినాడు ఏడు సంవత్సరాల కన్య "చండిక ,"*
*సప్తమినాడు ఎనిమిది సంవత్సరాల కన్య "శాంభవి ,"*
*అష్టమినాడు తొమ్మిది సంవత్సరాల కన్య "దుర్గ ,"*
*నవమినాడు పది సంవత్సరాల కన్య "సుభద్ర"*
ఈ క్రమంలో ఆయా సంవత్సరాల వయః పరిమితి గల కన్యలను ఆరాధించడం వల్ల దారిద్ర్యనాశము , శత్రు వినాశము , దుఃఖ నివృత్తి , ఆయురారోగ్య బలాభివృద్ధి కలుగుతాయి.
నవరాత్రి పూజా విధానంలో సప్తమినాడు సరస్వతిని , అష్టమినాడు దుర్గను , నవమినాడు లక్ష్మిని పూజించాలి. ఈ ముగ్గురికీ మహాసరస్వతి , మహాకాళి , మహాలక్ష్మి అని పేర్లు . వీరే ముగ్గురమ్మలు.
నవరాత్రి పూజలలో ఎఱ్ఱని పుష్పాలు , ఎఱ్ఱని గంధం , ఎఱ్ఱని అక్షతలు ఎఱ్ఱని వస్త్రాలు దేవికి సమర్పించి , ఆమెను కుంకుంతో పూజించాలి. ఈ విధమైన పూజ ఆమెకు ప్రీతిపాత్రము. *"రక్త గంధా, రక్త వస్త్రా, రక్తమాల్యాసులేపనా"* అని అమ్మవారిని వర్ణించడంలోని అంతర్యం ఇదే. ఆ తల్లి సర్వారుణ. ఆమెకు సమర్పించే పూజా ద్రవ్యాలన్నీ ఎఱ్ఱగా ఉండడమే. ఆమెకు అభీష్టమని ఇందలి అంతరార్థం. ఎఱ్ఱని రంగు అగ్నివర్ణం. *తామగ్ని వర్ణాం తపసా జ్వలన్తీం "* అని వేద వాఙ్మయం వర్ణించింది. పవిత్రతకు సంకేతం అగ్ని. ఆమె ఆ రంగులో ఉన్నది - అంటే - పవిత్రతయే దైవము. అని అర్థం. ఆ రంగులో ఉన్న పూజా ద్రవ్యాలతోనే ఆమెను అరాధించాలి. అంటే సాధకుడు పవిత్ర హృదయం కలవాడై ఉండాలి - అని అంతరార్థం.
వసంత నవరాత్రులలో , శరన్నవరాత్రులలో పరాశక్తిని అరాధించి అబీష్టసిద్ధిని పొందినవారు ఎందరో ఉన్నారు.
రామచంద్రమూర్తి సీతాన్వేషణ ప్రయత్నంలో ఉండగా ఋష్యమూక పర్వతంపై సుగ్రీవునితో స్నేహం కలిసిన తర్వాత దేవిని ఆరాధించి సత్ఫలితం పొందాడు. దుర్భరమైన దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక వైశ్యుడు దారిద్ర్య నివారాణోపాయం చెప్పవలసిందిగా ఒక విప్రుని ప్రార్థించి , దేవీ నవరాత్రి పూజలను గురించి తెలుసుకొని , దేవిని ఆరాధించి , సకల సంపదలనూ పొంది, దారిద్ర్యం నుండి విముక్తుడయ్యాడు. అజ్ఞాతవాసం ఆరంభించబోతూ , పాండవులు విరాట నగరంలో ప్రవేశించే ముందు జగన్మాతను సేవించి నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం నిర్వహించి కృతార్థులయ్యారు.
కనుక వసంత నవరాత్రులలో , శరన్నవరాత్రులలో మానవుడు ఆ పరాశక్తిని ఆరాధించి , ఐహిక , ఆముష్మిక సుఖ సంపదలను పొందవచ్చునని వ్యాసమహర్షి వివరించాడు.
ఉగాది
*ఉగాది విశిష్టత*
🥭🍃🥭🍃🥭🍃🥭🍃🥭🍃🥭
యుగానికి ఆది ఉగాది.
ప్రకృతిలో మార్పు కారణంగా వచ్చే తొట్టి తొలి పండుగ.
తెలుగు వారంతా గొప్పగా జరుపుకునే పండుగ.
మనస్సు అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు ఆ మనసుకు అదిపతి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి దాని ఆధారంగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితి.
తెల్లవారక ముందే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి.
ఉగాది రోజున తెల్లవారు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు పూజ చేయడం మంచిది.
ఉగాది మనకు సంవత్సరాది.
ఈ రోజున బ్రాహ్మ ముహూర్తాన మేల్కొని, అభ్యంగన స్నానం చేసి. కొత్త బట్టలు కట్టుకుని దేవాలయానకి వెళ్లి దర్శనం చేసుకోవాలి.
ఉగాది గొప్పతనం అంతా ఉగాది పచ్చడిలోనే ఉంటుంది.
షడ్రుచుల సమ్మేళనం ఉగాది అన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనంతో తయారుచేసే శ్రేష్టమైన పదార్ధమే ఉగాది పచ్చడి. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత ఉందో… ఆహార, ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది.
ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్యనిపుణులు కూడా చెపుతున్న మాట.
*నింబకుసుమ భక్షణం* ( వేపపూవు పచ్చడి తినడం ) ఈ పండుగ విశిష్టత. ఋతు సంబంధ పండుగ ఉగాది కావడం వల్ల తప్పనిసరిగా వేపపూవు పచ్చడి తినాలి.
ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ తెల్లవారి మామిడి పువ్వును తినాలని, ఉగాది నాడు వేపపూవు తినాలని చెప్పడం వల్ల ఆరోజున ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేసి తినడం ఆనవాయితీ.
కొత్తసహస్రాబ్ధికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనందవిషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం. తీపి సుఖసంతోషాలను, తీపి బాధలను, ఒగరు బంధాలను ఇలా ప్రతి ఒక్క పదార్థం శరీరానికి ప్రకృతికి మధ్య బంధాన్ని తెలియజేస్తుంది.
పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఏడాదంతా శుభాలు కలుగుతాయి.
ఈ ఉగాదికి తప్పని సరిగా ఆలయాల్లో పంచాంగ శ్రవణం వినాలి. దీని ద్వారా మంచి చెడులను తెలుసుకునే వీలుంటుంది. ఉగాది పండుగ రోజున ఆలయాల్లో వసంతనవరాత్రి ఉత్సవాలు జరిపించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయంట. తాహతను బట్టి ఉత్సవాలు జరిపించడం పూజలు చేయించుకోవడం శుభాలను కల్గిస్తుంది.
ఈ రోజున పూజ చేసేటప్పుడు పంచహారతి ఇవ్వాలని శాస్త్రం చెపుతోంది.
ఈ ఉగాది పండుగ నాడు శ్రీరాముడిని స్మరిస్తే శుభఫలితాలుంటాయి.
https://youtu.be/WnMH6J5TleM
ఉదయం పూజ సమయంలో శ్రీరామ నామం పఠిచడం మంచి ఫలితాలనిస్తుంది.
వీలైతే శ్రీరామ నామాన్ని 108 సార్లు జపిస్తే సత్పలితాలు చేకూరుతాయి.
ఈ ఉగాదికి తప్పక ఇవన్నీ పాఠించండి.🙏🙏🙏
🥭🍃🥭🍃🥭🍃🥭🍃🥭🍃🥭🍃
అందమైనవేషం
🎊🌹💦🦚💖🌈💥
*ఎవరు ఎంత అందమైనవేషం వేసిన కాలం వారి వారి నిజస్వరూపాలను గుణాలను ఎప్పడో ఒక్కప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది .*
*మన జీవితాలు గతుకులు లేని ప్రయాణం కాదు ! మనతో ఎవ్వరిది పడి లేచే బ్రతుకులే అందరిది . మనం కన్న కలలు వేరేమో అయిన చేసే కష్టం ఒక్కటే . సాగే దారులు వేరేమో చేరే తీరం మాత్రం ఒక్కటే .*
*మాట అనేసి కోపంలో అన్నాను , ఆవేశంలో అన్నాను అంటారు ! కానీ కోపంలో , ఆవేశంలోనే మనసులోని నిజమైన మాటలు బయటికి వస్తాయి .*
*మాట జారితే క్షమించోచ్చు డబ్బు పోతే సంపాదించవచ్చు కానీ బంధం దూరమైతే మళ్ళీ తిరిగి దగ్గరవ్వడం కష్టం ఈ ప్రపంచంలో మాట , డబ్బు కన్నా బంధమే చాలా విలువ్నది నేస్తమా ! ...* 🙏🙏🙏
🎊🌹💥🌈🌟💜🦜
అసలైనతోడు
💯💯💯💯💯💯💯💯💯
*నీ ఈజీవితంలో అసలైనతోడు ఎవరు?*
అమ్మనా?
నాన్ననా?
భార్యనా?
భర్తనా?
కొడుకా?
కూతురా?
స్నేహితులా?
బంధువులా ?
లేదు.ఎవరూ కాదు.!
నీ నిజమైన తోడు
*నీ శరీరమే!*
ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!!
నువ్వు అవునన్నా,కాదన్నా,ఇది కఠిన నిజం.!!!
*నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.* నీవు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు.
ఏదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.
*నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో,నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది.*
నీవేమి తినాలి?
నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.
గుర్తించుకో !
నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా!
నీ శరీరమే నీ ఆస్థి,సంపద.
వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.
నీ శరీరం నీ బాధ్యత...
డబ్బు వస్తుంది.వెళ్తుంది.
బందువులు.,స్నేహితులు శాశ్వతం కాదు.
గుర్తుంచుకో.!
నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.
ఒక్క నీవు తప్ప...!
ఊపిరితిత్తులకు- *ప్రాణాయామం.*
మనసుకు- *ధ్యానము*
శరీరానికి- *యోగా.*
గుండెకు- *నడక.*
ప్రేగులకు- *మంచి ఆహారం.*
ఆత్మకు- *మంచి ఆలోచనలు.*
ప్రపంచానికి- *మంచి పనులు.*
👆ఒకటికి రెండు పర్యాయాలు చదవండి.🙏
బ్రహ్మాస్త్రం
బ్రహ్మాస్త్రం వక పరిశీలన.
ఎందుకు వీటి శక్తిని గురించి తెలిసుకొనే ప్రయత్నం లేదు. ఙ్ఞానం మరుగున పడటమేనా? అనంతమైన శక్తి కేంద్రగా గల భారతీయ మేధాశక్తి వెలుగులోకి తీసుకొనే ప్రయత్నం చేయాలి. విశిష్టమైన జీవుల సృష్టి కర్తయైన పరమేశ్వర తత్వం తిరిగి పునరుత్పతి చేయుటయే ఙ్ఞానమని అది జీవమనుగడుకు మాత్రమే అనగా ధర్మ స్థాపనకేయని అనగా సృష్టి వక సూత్ర పరంగా పకృతి ప్రకారం నడచుటకే భారతీయ శాస్త్రీయ విఙ్ఞానము తప్ప జీవ వి నాశనమునకు కాదని తెలియవలెను. దీని మూల సూత్రము గాయత్రీ మంత్ర శక్తి. అనగా సృష్టికి మూల శక్తి గాయత్రీ శక్తియని అదియే బ్రహ్మాస్త్రం. దీని ప్రయెూగము మనం వివిధ సందర్భలలో ప్రయెూగ పరిశీలనచేసిన రావణుడు వక అల్ప కారణము నకు ఆంజనేయస్వామివారి పై, అశ్వథ్థామ పరిీక్షత్తు పై యిలా ప్రయెూగార్హతలేని సందర్భాలే. అహంకార పూరిత ప్రవర్తనతో గూడిన ప్రయెూగమని తెలియవలెను. దీనిని సృష్టి లయ పునరుత్పత్తికే ప్రయెూగించవలె గాని,
అదియును ధర్మగ్లాని సమయమున మాత్రమే. అదియును జీవ వినాశనం లేక కొన్ని జీవ కణములను ధాతు పరంగా రక్షణ చేసి యీ శక్తి ప్రయెూగం నకు అతీతమైన లక్షణములు గల జీవులుగా అనగా విశిష్టమైన వ్యక్తులద్వారా జీవ రక్షణ సందర్భంగా మాత్రమే.లయ కార సమయములో మాత్రమే. దీని ప్రయెూగం పరీక్షత్పై అశ్వథ్థామ బ్రహ్మాస్త్ర ప్రయెూగమునుండి రక్షణ చేయుటకు శ్రీకృష్ణుడే సూక్మ రూపంలో గర్భ ప్రవేశం చేసి శిశువును ఆవరించిన శక్తిని గదా ప్రహరణయనే శక్తితో రక్షించి కాపాడుట.యిచ్చట గదా ప్రహరణ అనే సూత్రమును పరిశీలన చేసిన (ప్రలంబ ముష్ఠింకచైవ) యనే సూత్రమే. దీని విశ్లేషణలో ప్ర లంబ ముష్ఠికంచ ఏవ యని గాయత్రీ ఛందస్సులో గల శక్తి సృష్టికి మూల సూత్ర వివరణకు దగ్గరగా యున్నదని తెలియుచున్నది. ప్రయెగించినవాడు అశ్వథ్థామ ప్ర
యెూగించుటకు కారణము సృష్టి ధర్మమును నాశనం చేయుటకు. పరీక్షిత్తు లేనియెడల విఙ్ఞానము తెలియక ధర్మసూక్మములు తెలియక యితిహాస వేద లక్షణములు తెలియక అధర్మం బాగా ప్రబలి సృష్టి వినాశనము నకు దారితీయును. రావణ ప్రయెూగం కూడా హనుమంతుని శక్తిని నిర్వీర్యం చేయుటకే. విశ్వామిత్ర పాత్ర కూడా అహంకారంతో త్రిశంకుని రూపముగా ప్రకృతి 🌿🍃విరుద్దంగా ప్రయెూగమే. బ్రహ్మాస్త్రం సృష్టిని వక క్రమ పథ్దతిలో రక్షణ చేయుటకే గాని వినాశనమునకు కాదని తెలియవలెను. పై వుదాహరణలద్వారా శక్తి ప్రయెూగము జీవ మనుగడకే గాని వినాశనమునకు కాదని తెలియనగును. గాయత్రీ మంత్రమే బ్రహ్మాస్త్రం మని పైవిషయములద్వారీద్వారా తెలియును. దీనిని శక్తి వృత్తాకారమువలె భూమిని భూమిపై నున్న జీవులను రక్షణ చేయును. యిది హవిస్సు రూపంలో వ్యాప్తి చెంది యుండును. ప్రయోగం వలననే శక్తి లక్షణం తెలియును.అనంతమైన ఙ్ఞానము సాధన ద్వారానే తెలియును. దీనికి ఎన్నో దృష్ఠాంతములు.తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.
కథ
🌹🌹🌹🌷🌷🌹🌹🌹
*అమ్మ చిట్కా(నాకు నచ్చిన కథ)*
~~~💐💐~~~
స్వరాజ్యం రెండో కొడుకు ప్రభాకర్ పెళ్ళి వల్లితో కరోనా వలన వైభవంగా జరగక పోయినా బాగానే జరిగింది. ఇక్కడ ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతం కూడ జరిగింది. పెళ్ళి కూతురు వల్లికి కాస్త ఒళ్ళు వెచ్చబడటంతో మంచిరోజు చూసి కబురు చేస్తామని చెప్పి మూడు నిద్రలు వాయిదా వేసుకొని అమ్మాయితో వియ్యాల వారు వెళ్ళి పోయారు. పెద్దకొడుకు అమెరికాలో ఉండటంతో ఫ్లైట్స్ లేక వాళ్ళ కుటుంబం రాలేదు. ప్రభాకర్ చెన్నైలో కెమికల్ ఇంజనీర్. అతనికి ఫారిన్ వెళ్ళే ఉద్దేశం లేదు.
కొడుకు పెళ్ళి తరవాత తమ ఊరి ఇలవేల్పు కలుగోళమ్మకు చీరపెట్టడానికి స్వరాజ్యం కొడుకుతో పాటు వెళ్ళింది.
గుళ్ళోంచి వస్తూ అక్కడే కాసేపు అరుగు మీద కూచున్నారిద్దరూ. కాసేపు పెళ్ళి సంగతులు మాట్లాడుకున్నాక కొడుకు చెయ్యి చేతిలోకి తీసుకొని ”ప్రభూ! ఆడపిల్లని అత్తగారింటికి పంపుతూ ఎలా మసులుకోవాలో జాగ్రత్తలు చెప్పేవాళ్ళు మునుపు. కాలం మారి పోయింది. ఇబ్బందులేవయినా వస్తే ఇప్పుడు మావల్ల రావు. మీలో మీకే అపార్థాల వలన వస్తాయి. అమ్మాయి లిప్పుడు భర్త ఏదైనా అంటే ’పరవాలేదులే మా ఆయనేగా’
అనుకోటం లేదు. ఇప్పటి ఆడపిల్లలకు ఆత్మాభిమానం ఎక్కువ. నేను అనుభవంతో చెబుతున్నా. నీ కాపురం చల్లగా సాగాలంటే నా మాటలు కాస్త చెవికెక్కించుకో” అంది. ప్రభాకర్ ఆశ్చర్యంగా, అనుమానంగా తల్లివైపు చూసాడు. ‘మా అమ్మకూడ అందరు అత్తగార్ల వంటిదేనా?’ అన్నట్లుంది ఆ చూపు!
“వల్లి గారాబంగా పెరిగి ఉండవచ్చు. తనకు వంట వచ్చోరాదో, నాలుగు నెలలు పోతే తనకే వస్తుంది. ఈ లోపల అది బాగాలేదు. ఇదిఉడకలేదు. అది మాడపెట్టావని వంకలు పెట్టకు. చేసినవి బావున్నాయనడం నేర్చకో, అమ్మాయిలు భర్త తన వంట మెచ్చుకుంటే తెగ సంబరపడతారు. అలాగే ’మా అమ్మ బాగా చేస్తుందని అనకు’ ఇది కొత్త పెళ్ళికూతురికి మరీ ఇష్టం ఉండని మాట. వాళ్ళ అమ్మా నాన్నలు ఫోను చేస్తే నువ్వుకూడ మాట్లాడు. వాళ్ళ యోగక్షేమాలు కనుక్కో. ఏ ఆడపిల్లైనా తన తల్లిదండ్రులను అభిమానించే భర్తను నెత్తిన పెట్టుకుంటుంది. అలాగే మీ అమ్మా మీ నాన్న అనకుండా అత్తయ్య, మావయ్య అని వరసపెట్టి పిలవడం అలవాటు చేసుకో.”
“సర్లేమ్మా ఇదేవిటిలా క్లాసు పీకుతున్నావు నాకు, నేను కాపరానికి వెళుతున్నట్లుంది.” అన్నాడు తల్లిని చేయి పట్టి లేపుతూ.
“ఇప్పుడు ఎవరూ ఎవరింటికీ కాపరానికి వెళ్ళడం లేదు. మీ ఇద్దరూ కలిసి ఆ చల్లని పొదరిల్లు కట్టుకోవాలి. ఆడపిల్లను పడెయ్యాల్సింది పెళ్ళికి ముందు కాదురా, పెళ్ళి తరవాతే ! వాళ్ళ వాళ్ళను నువ్వు గౌరవిస్తే ఆ అమ్మాయి నన్ను గౌరవిస్తుంది. చిన్న కానుకలు కొనివ్వడం, వాళ్ళ వాళ్ళకూ నాకు కొన్నట్లే ఏదైనా వస్తువో, చీరో కొనడం వంటివి భార్యమనసులో భర్తకు సుస్థిర స్థానం కల్పించే టిప్స్. ఇలాటి వన్నీ మాకు చెప్పేవాళ్ళు లేక మేం చాలా తిప్పలు పడ్డాం. కొద్ది పాటి లౌక్యంతో చాలా సమస్యలని రాకుండా చేసుకో వచ్చు. మా అత్తగారి దగ్గర నేను చూపలేకపోయిన లౌక్యం, నా కోడలి దగ్గర చూపి తన ప్రేమ పొందగలను. లౌక్యమంటే ఏదో రాజకీయపు ఎత్తుగడలు కావు. ఒకరినొకరు అర్థం చేసుకునేదాకా, అలవాటు పడేదాక మనసులోని ప్రతి మాటనూ పెదవులమీదకు తేకుండా నొప్పింపక తానొవ్వక గడపడం, సరేనా!” అంది స్వరాజ్యం గుడి గడప దాటుతూ.
ప్రభాకర్ అమ్మలోని కొత్తకోణం చూస్తూ ఇంత లౌక్యం తెలిసిన అమ్మ ఉండగా వల్లీ తనూ సుఖంగా ఉండగలమనే నమ్మకంతో తేలికగా ఊపిరి పీల్చుకొని కారు డోర్ తీసాడు.
అతని మనస్సు వల్లితో గడపబోయే రేపటి జీవితాన్ని తలుచుకుంటూ’ మదిలో మోహనగీతం..మెదిలే తొలిసంగీతం’అని పాడుకుంది.
~~~~~~~~~~~~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల
మొగలిచెర్ల
*శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం..*
"అయ్యా..ఇక్కడ నరసింహస్వామి గుడి కట్టించాలని నా కోరిక..ప్రతి సంవత్సరం మాలకొండ లో వెలిసిన మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దీక్ష తీసుకున్న భక్తులు..సుమారు వందమంది మన మొగలిచెర్ల దత్తాత్రేయస్వామి మందిరం వద్దనుంచే ఊరేగింపుగా మాలకొండ వెళుతున్నారు కదా..ఆ దీక్ష తీసుకున్న స్వాములు ఆ నలభైరోజులూ ఇక్కడే వుంటున్నారు కదా..వాళ్ళు రోజూ పూజలు చేసుకోవడానికి..అంతేకాకుండా...మాలకొండ లో ఆ స్వామిని దర్శించాలంటే ఒక్క శనివారమే వీలవుతుంది..ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి గుడి కూడా ఉంటే..ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యం గా వుంటుంది..మీరు అందుకు సమ్మతిస్తే..నా వంతుగా నేనూ ప్రయత్నం చేస్తాను..ఆ నరసింహస్వామి దయ చూస్తాడు..నాకు నమ్మకం ఉన్నది.." అని నెల్లూరుజిల్లా కలిగిరి వాస్తవ్యుడు కొండలరావు నా వద్దకు వచ్చి అడిగాడు..
శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి ఒక చిన్న గుడి కట్టించాలనే ఆలోచన మా దంపతుల మదిలో ఎప్పటినుంచో ఉన్నది..శ్రీ దత్తాత్రేయస్వామి వారి సమాధి వద్ద పలుమార్లు ఈ కోరికను విన్నవించుకోవడం జరిగింది..ఈ విషయం లో చాలా తర్జన భర్జనలు పడుతున్నాము..ఎందుకనో ఆలస్యం జరుగుతున్నది..కారణం అంతుబట్టలేదు..శ్రీ స్వామివారి మందిరం లోనే ఒక ప్రక్కగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పటం పెట్టి..నిత్య నైవేద్యం తో పాటు మూడు పూటలా హారతులు ఇచ్చే ఏర్పాటు చేసాను..ఇన్నాళ్లకు కొండలరావు ముందుకు వచ్చి..మళ్లీ ఈ ప్రస్తావన తీసుకొని రావడం తో స్వామివారు ఇప్పటికి అనుమతి ఇచ్చారేమో అని అనిపించింది..
మా సిబ్బందిని..మా అర్చకస్వాములను అందరినీ పిలిచాను..ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాము..గుడి నిర్మించడం తో బాధ్యత తీరిపోదు..దానిని ఎల్లకాలమూ నిర్వహించాలి..నిత్య ధూప దీప నైవేద్యాలు ఏర్పాటు చేయాలి..మా వద్ద ఉన్న పరిమిత వనరులతో మళ్లీ ఈ బాధ్యత మోయగలమా అని తర్కించుకున్నాము..శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం నిర్మించడానికి అందరూ సమ్మతించారు..ఈలోపల మళ్లీ కొండలరావు కలుగచేసుకొని.."అయ్యా..నరసింహస్వామి గుడి నిర్మించడానికి అయ్యే ఖర్చు ఏదో ఒక విధంగా నేను భరిస్తాను..నా తరఫున అందరినీ అడిగి..విరాళాలు సేకరించి..ఆ స్వామి గుడి ఇక్కడ కట్టించే ఏర్పాటు చేస్తాను..నన్ను నమ్మండి.." అన్నాడు.. శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి మందిర నిర్మాణానికి మామీద ఎటువంటి భారం పడకుండా ఉండటానికి స్వామివారు ఈ ఏర్పాటు చేసారని మాకు అతి త్వరలోనే తెలిసి వచ్చింది..
ఇక స్థల నిర్ణయం చేయాలి..శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి ఉత్తరం వైపు మాలకొండ వుంటుంది కనుక..ఇక్కడ నిర్మించబోయే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గుడి కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి ఉత్తర దిశ లోనే ఉంటే బాగుంటుందని అందరూ అన్నారు..అలాగే అనుకోని..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయస్వామి వారి మందిరానికి ఉత్తరం గా ఒక స్థలాన్ని ఎంపిక చేసాము..ఒక మంచి రోజు చూసి శంఖుస్థాపన చేసాము..గుడి నిర్మాణం మొదలు అయింది..మెల్లిగా నిర్మాణం సాగుతున్నది..ఈలోపల శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి మందిర నిర్మాణము కూడా మొదలైంది..(శ్రీపాద శ్రీ వల్లభస్వామి వారి మందిరం గురించి ఇదివరకే పాఠకులు సి మాధ్యమం ద్వారా చదివే వున్నారు..) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి విగ్రహం కూడా తెప్పించాము..రెండు ఆలయాలలో ఒకే రోజు ప్రతిష్ట జరిగే విధంగా అర్చకస్వాములు ముహూర్తం నిర్ణయం చేసారు..
రేపటి నుంచి (ఫిబ్రవరి 11వతేదీ) నాడు మొదలు పెట్టి..ఫిబ్రవరి 13 వతేదీ నాడు..శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది..అదే సమయం లో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కూడా జరుగుతుంది..ఆరోజు నుంచి..మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చిన భక్తులు..శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని..శ్రీపాద శ్రీవల్లభుల వారిని కూడా దర్శించుకోవచ్చు..
మొగలిచెర్ల గ్రామ సరిహద్దులో ఉన్న ఫకీరుమాన్యం లో అవధూతగా మాలకొండలో తపస్సు చేసుకుంటున్న శ్రీ దత్తాత్రేయస్వామివారు మొదటి సారి అడుగుపెట్టినప్పుడు..వారికి ఆ స్థలాన్ని చూపించిన శ్రీ పవని శ్రీధరరావు నిర్మల ప్రభావతి గార్లతో.."ఇది ఒకప్పుడు దత్తక్షేత్రం..భవిష్యత్తులో ఒక ప్రసిద్ధ దత్తక్షేత్రం గా మారుతుంది..నాకు ఈ స్థలమే కావాలి.." అని చెప్పారు..ఆ స్థలం లొనే దత్తపాదములు ఉన్నాయని చెప్పి..ఆ దత్తపాదములు తెప్పించుకుని తన ఆశ్రమం వద్ద ఉంచుకున్నారు..శ్రీ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన తరువాత..శ్రీ స్వామివారు చెప్పినట్లు గానే..క్రమ క్రమంగా ఈ స్థలం ఒక దత్తక్షేత్రంగా రూపుదిద్దుకొంటున్నది..భవిష్యత్తులో ఇక్క నవనాథుల మందిరం నిర్మించాలనే సంకల్పం కూడా మదిలో ఉన్నది..తగిన సమయం చూసి స్వామివారే మాకు మార్గదర్శనం చేస్తారని ఒక నమ్మకం..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)