*శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం..*
"అయ్యా..ఇక్కడ నరసింహస్వామి గుడి కట్టించాలని నా కోరిక..ప్రతి సంవత్సరం మాలకొండ లో వెలిసిన మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దీక్ష తీసుకున్న భక్తులు..సుమారు వందమంది మన మొగలిచెర్ల దత్తాత్రేయస్వామి మందిరం వద్దనుంచే ఊరేగింపుగా మాలకొండ వెళుతున్నారు కదా..ఆ దీక్ష తీసుకున్న స్వాములు ఆ నలభైరోజులూ ఇక్కడే వుంటున్నారు కదా..వాళ్ళు రోజూ పూజలు చేసుకోవడానికి..అంతేకాకుండా...మాలకొండ లో ఆ స్వామిని దర్శించాలంటే ఒక్క శనివారమే వీలవుతుంది..ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి గుడి కూడా ఉంటే..ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యం గా వుంటుంది..మీరు అందుకు సమ్మతిస్తే..నా వంతుగా నేనూ ప్రయత్నం చేస్తాను..ఆ నరసింహస్వామి దయ చూస్తాడు..నాకు నమ్మకం ఉన్నది.." అని నెల్లూరుజిల్లా కలిగిరి వాస్తవ్యుడు కొండలరావు నా వద్దకు వచ్చి అడిగాడు..
శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి ఒక చిన్న గుడి కట్టించాలనే ఆలోచన మా దంపతుల మదిలో ఎప్పటినుంచో ఉన్నది..శ్రీ దత్తాత్రేయస్వామి వారి సమాధి వద్ద పలుమార్లు ఈ కోరికను విన్నవించుకోవడం జరిగింది..ఈ విషయం లో చాలా తర్జన భర్జనలు పడుతున్నాము..ఎందుకనో ఆలస్యం జరుగుతున్నది..కారణం అంతుబట్టలేదు..శ్రీ స్వామివారి మందిరం లోనే ఒక ప్రక్కగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పటం పెట్టి..నిత్య నైవేద్యం తో పాటు మూడు పూటలా హారతులు ఇచ్చే ఏర్పాటు చేసాను..ఇన్నాళ్లకు కొండలరావు ముందుకు వచ్చి..మళ్లీ ఈ ప్రస్తావన తీసుకొని రావడం తో స్వామివారు ఇప్పటికి అనుమతి ఇచ్చారేమో అని అనిపించింది..
మా సిబ్బందిని..మా అర్చకస్వాములను అందరినీ పిలిచాను..ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాము..గుడి నిర్మించడం తో బాధ్యత తీరిపోదు..దానిని ఎల్లకాలమూ నిర్వహించాలి..నిత్య ధూప దీప నైవేద్యాలు ఏర్పాటు చేయాలి..మా వద్ద ఉన్న పరిమిత వనరులతో మళ్లీ ఈ బాధ్యత మోయగలమా అని తర్కించుకున్నాము..శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం నిర్మించడానికి అందరూ సమ్మతించారు..ఈలోపల మళ్లీ కొండలరావు కలుగచేసుకొని.."అయ్యా..నరసింహస్వామి గుడి నిర్మించడానికి అయ్యే ఖర్చు ఏదో ఒక విధంగా నేను భరిస్తాను..నా తరఫున అందరినీ అడిగి..విరాళాలు సేకరించి..ఆ స్వామి గుడి ఇక్కడ కట్టించే ఏర్పాటు చేస్తాను..నన్ను నమ్మండి.." అన్నాడు.. శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి మందిర నిర్మాణానికి మామీద ఎటువంటి భారం పడకుండా ఉండటానికి స్వామివారు ఈ ఏర్పాటు చేసారని మాకు అతి త్వరలోనే తెలిసి వచ్చింది..
ఇక స్థల నిర్ణయం చేయాలి..శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి ఉత్తరం వైపు మాలకొండ వుంటుంది కనుక..ఇక్కడ నిర్మించబోయే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గుడి కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి ఉత్తర దిశ లోనే ఉంటే బాగుంటుందని అందరూ అన్నారు..అలాగే అనుకోని..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయస్వామి వారి మందిరానికి ఉత్తరం గా ఒక స్థలాన్ని ఎంపిక చేసాము..ఒక మంచి రోజు చూసి శంఖుస్థాపన చేసాము..గుడి నిర్మాణం మొదలు అయింది..మెల్లిగా నిర్మాణం సాగుతున్నది..ఈలోపల శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి మందిర నిర్మాణము కూడా మొదలైంది..(శ్రీపాద శ్రీ వల్లభస్వామి వారి మందిరం గురించి ఇదివరకే పాఠకులు సి మాధ్యమం ద్వారా చదివే వున్నారు..) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి విగ్రహం కూడా తెప్పించాము..రెండు ఆలయాలలో ఒకే రోజు ప్రతిష్ట జరిగే విధంగా అర్చకస్వాములు ముహూర్తం నిర్ణయం చేసారు..
రేపటి నుంచి (ఫిబ్రవరి 11వతేదీ) నాడు మొదలు పెట్టి..ఫిబ్రవరి 13 వతేదీ నాడు..శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది..అదే సమయం లో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కూడా జరుగుతుంది..ఆరోజు నుంచి..మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చిన భక్తులు..శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని..శ్రీపాద శ్రీవల్లభుల వారిని కూడా దర్శించుకోవచ్చు..
మొగలిచెర్ల గ్రామ సరిహద్దులో ఉన్న ఫకీరుమాన్యం లో అవధూతగా మాలకొండలో తపస్సు చేసుకుంటున్న శ్రీ దత్తాత్రేయస్వామివారు మొదటి సారి అడుగుపెట్టినప్పుడు..వారికి ఆ స్థలాన్ని చూపించిన శ్రీ పవని శ్రీధరరావు నిర్మల ప్రభావతి గార్లతో.."ఇది ఒకప్పుడు దత్తక్షేత్రం..భవిష్యత్తులో ఒక ప్రసిద్ధ దత్తక్షేత్రం గా మారుతుంది..నాకు ఈ స్థలమే కావాలి.." అని చెప్పారు..ఆ స్థలం లొనే దత్తపాదములు ఉన్నాయని చెప్పి..ఆ దత్తపాదములు తెప్పించుకుని తన ఆశ్రమం వద్ద ఉంచుకున్నారు..శ్రీ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన తరువాత..శ్రీ స్వామివారు చెప్పినట్లు గానే..క్రమ క్రమంగా ఈ స్థలం ఒక దత్తక్షేత్రంగా రూపుదిద్దుకొంటున్నది..భవిష్యత్తులో ఇక్క నవనాథుల మందిరం నిర్మించాలనే సంకల్పం కూడా మదిలో ఉన్నది..తగిన సమయం చూసి స్వామివారే మాకు మార్గదర్శనం చేస్తారని ఒక నమ్మకం..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి