12, ఏప్రిల్ 2021, సోమవారం

కథ

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

*అమ్మ చిట్కా(నాకు నచ్చిన కథ)* 

        ~~~💐💐~~~


స్వరాజ్యం రెండో కొడుకు ప్రభాకర్ పెళ్ళి వల్లితో కరోనా వలన వైభవంగా జరగక పోయినా బాగానే జరిగింది. ఇక్కడ ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతం కూడ జరిగింది.   పెళ్ళి కూతురు వల్లికి కాస్త ఒళ్ళు వెచ్చబడటంతో మంచిరోజు చూసి కబురు చేస్తామని చెప్పి మూడు నిద్రలు వాయిదా వేసుకొని అమ్మాయితో వియ్యాల వారు వెళ్ళి పోయారు.   పెద్దకొడుకు అమెరికాలో ఉండటంతో ఫ్లైట్స్ లేక వాళ్ళ కుటుంబం రాలేదు.   ప్రభాకర్ చెన్నైలో కెమికల్ ఇంజనీర్.  అతనికి ఫారిన్ వెళ్ళే ఉద్దేశం లేదు. 

కొడుకు పెళ్ళి తరవాత తమ ఊరి ఇలవేల్పు కలుగోళమ్మకు చీరపెట్టడానికి స్వరాజ్యం కొడుకుతో పాటు వెళ్ళింది.

గుళ్ళోంచి వస్తూ అక్కడే కాసేపు అరుగు మీద కూచున్నారిద్దరూ.   కాసేపు పెళ్ళి సంగతులు మాట్లాడుకున్నాక కొడుకు చెయ్యి చేతిలోకి తీసుకొని ”ప్రభూ! ఆడపిల్లని అత్తగారింటికి పంపుతూ ఎలా మసులుకోవాలో జాగ్రత్తలు చెప్పేవాళ్ళు మునుపు.  కాలం మారి పోయింది. ఇబ్బందులేవయినా వస్తే ఇప్పుడు మావల్ల రావు.  మీలో మీకే అపార్థాల వలన వస్తాయి.  అమ్మాయి లిప్పుడు భర్త ఏదైనా అంటే ’పరవాలేదులే మా ఆయనేగా’

అనుకోటం లేదు.  ఇప్పటి ఆడపిల్లలకు ఆత్మాభిమానం ఎక్కువ.  నేను అనుభవంతో చెబుతున్నా.  నీ కాపురం చల్లగా సాగాలంటే నా మాటలు కాస్త చెవికెక్కించుకో” అంది.  ప్రభాకర్ ఆశ్చర్యంగా, అనుమానంగా తల్లివైపు చూసాడు. ‘మా అమ్మకూడ అందరు అత్తగార్ల వంటిదేనా?’ అన్నట్లుంది ఆ చూపు!

“వల్లి గారాబంగా పెరిగి ఉండవచ్చు.  తనకు వంట వచ్చోరాదో, నాలుగు నెలలు పోతే తనకే వస్తుంది.  ఈ లోపల అది బాగాలేదు. ఇదిఉడకలేదు. అది మాడపెట్టావని వంకలు పెట్టకు.  చేసినవి బావున్నాయనడం నేర్చకో, అమ్మాయిలు భర్త తన వంట మెచ్చుకుంటే తెగ సంబరపడతారు.  అలాగే ’మా అమ్మ బాగా చేస్తుందని అనకు’ ఇది కొత్త పెళ్ళికూతురికి మరీ ఇష్టం ఉండని మాట.  వాళ్ళ అమ్మా నాన్నలు ఫోను చేస్తే నువ్వుకూడ మాట్లాడు. వాళ్ళ యోగక్షేమాలు కనుక్కో.  ఏ ఆడపిల్లైనా తన తల్లిదండ్రులను అభిమానించే భర్తను నెత్తిన పెట్టుకుంటుంది. అలాగే మీ అమ్మా మీ నాన్న అనకుండా అత్తయ్య, మావయ్య అని వరసపెట్టి పిలవడం అలవాటు చేసుకో.” 

“సర్లేమ్మా ఇదేవిటిలా క్లాసు పీకుతున్నావు నాకు, నేను కాపరానికి వెళుతున్నట్లుంది.” అన్నాడు తల్లిని చేయి పట్టి లేపుతూ.

“ఇప్పుడు ఎవరూ ఎవరింటికీ కాపరానికి వెళ్ళడం లేదు.  మీ ఇద్దరూ కలిసి ఆ చల్లని పొదరిల్లు కట్టుకోవాలి. ఆడపిల్లను పడెయ్యాల్సింది పెళ్ళికి ముందు కాదురా, పెళ్ళి తరవాతే !  వాళ్ళ వాళ్ళను నువ్వు గౌరవిస్తే ఆ అమ్మాయి నన్ను గౌరవిస్తుంది.  చిన్న కానుకలు కొనివ్వడం, వాళ్ళ వాళ్ళకూ నాకు కొన్నట్లే ఏదైనా వస్తువో, చీరో కొనడం వంటివి భార్యమనసులో భర్తకు సుస్థిర స్థానం కల్పించే టిప్స్. ఇలాటి వన్నీ మాకు చెప్పేవాళ్ళు లేక మేం చాలా తిప్పలు పడ్డాం.  కొద్ది పాటి లౌక్యంతో  చాలా సమస్యలని రాకుండా చేసుకో వచ్చు.  మా అత్తగారి దగ్గర నేను చూపలేకపోయిన లౌక్యం, నా కోడలి దగ్గర చూపి తన ప్రేమ పొందగలను.  లౌక్యమంటే ఏదో రాజకీయపు ఎత్తుగడలు కావు.  ఒకరినొకరు అర్థం చేసుకునేదాకా, అలవాటు పడేదాక మనసులోని ప్రతి మాటనూ పెదవులమీదకు తేకుండా నొప్పింపక తానొవ్వక గడపడం, సరేనా!” అంది స్వరాజ్యం గుడి గడప దాటుతూ. 

ప్రభాకర్ అమ్మలోని కొత్తకోణం చూస్తూ ఇంత లౌక్యం తెలిసిన అమ్మ ఉండగా వల్లీ తనూ సుఖంగా ఉండగలమనే నమ్మకంతో తేలికగా ఊపిరి పీల్చుకొని కారు డోర్ తీసాడు. 

అతని మనస్సు వల్లితో గడపబోయే రేపటి జీవితాన్ని తలుచుకుంటూ’ మదిలో మోహనగీతం..మెదిలే తొలిసంగీతం’అని పాడుకుంది.

~~~~~~~~~~~~~~~~

డా. ఉమాదేవి జంధ్యాల

కామెంట్‌లు లేవు: