🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నాలుగో పాదం!
➖➖➖✍️
రచన: జయంతి ప్రకాశ శర్మ.
రాజమండ్రిలో ఓ మిత్రుడి అమ్మాయి పెళ్ళికి వెళ్లాలని, ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లో నేను, మా ఆవిడ బయలుదేరాం.
రైలు తుని స్టేషన్లో ఆగినప్పుడు గుర్తుకు వచ్చింది, ఉదయం బయలుదేరే హడావిడిలో కాఫీ తాగనేలేదని! ప్లాట్ ఫారం మీద వెళ్తున్న కాఫీ వాడ్ని పిలిచి, రెండు కాఫీలు తీసుకుని మా ఆవిడకి ఓ కప్పు అందించాను. కాఫీ ఓ గుక్క చప్పరించి 'బావుందోయ్.. ఎంతా?' అంటూ జేబులో పర్స్ తీసి చూస్తే అన్నీ రెండువందల రూపాయల నోట్లే!
'ఇరవై రూపాయలు సార్!' అన్న వాడి సమాధానం వింటూ, వాడి చేతిలో ఓ నోటు పెట్టాను.
'చిల్లర లేదా సార్?' అంటూ ఆ కాఫీవాడు చేతిలో ఉన్న ప్లాస్క్ కింద పెట్టి, జేబులో చెయ్యి పెట్టాడు. అప్పటికే రైలు బయలుదేరింది. వాడు చిల్లర తీసేలోగా, రైలు స్పీడు అందుకుని ప్లాట్‌ఫారమ్ దాటేసింది.
అందులోనూ మాది ఇంజన్ పక్క కంపార్ట్ మెంట్ అవటంతో వాడికి పరిగెత్తే అవకాశం కూడా లేదు. పాపం కాస్త దూరం పరిగెత్తినా, ప్రయోజనం లేకపోయింది.
చిల్లర ఉందో లేదో చూసుకోకుండా కాఫీ తాగడం నా బుద్ది పొరపాటే అనిపించింది.
"అదిగో. ఆ తెలివితేటలే వద్దంటాను! ముందు చిల్లర తీసుకుని, తర్వాతే నోటు ఇవ్వాలి. వయసొచ్చింది, ఏం లాభం?" పక్కనే కూర్చున్న మా ఆవిడ అవకాశం వచ్చిందని పెనాల్టీ కార్నర్ కొట్టేసింది.
ఎందుకో.. నాకా మాటలు రుచించ లేదు.
"సరే, వాడు చిల్లర ఇచ్చిన తర్వాత, మనం నోటు వాడి చేతిలో పెట్టేలోగా రైలు కదిలిపోతే... అప్పుడో?" నా చర్యని సమర్ధించుకుంటూ అన్నాను.
"వాడికేం నష్టం ఉండదు. మీలాంటి వాళ్ళని ఉదయం నుంచి ఓపదిమందిని చూసుకుంటారుగా, చివరికి లాభాల్లోనే ఉంటాడు!" మా ఆవిడ ఖాళీ కాఫీ గ్లాసుని టపీమని కిటికీ లోంచి బయటకు పారేస్తూ అంది.
"అయినా మాత్రం మనిషి మీద నమ్మకం ఉంచాలి.
పాపం.. ట్రైయిన్ బయలుదేరి పోతే వాడేం చేస్తాడు? మన డబ్బులతోనే వాడికి జీవితం అయిపోతుందా!"
అలా వాడిని వెనకేసుకుని రావడం మా ఆవిడకి బొత్తిగా నచ్చలేదు.
"వాళ్ళు ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూంటారు. మీలాంటి మాలోకాలు ఓ నాలుగు తగిలితే చాలు, ఆ రోజు గడిచిపోతుంది!" అంటూ చురచురా చూసింది.
నేనేం మాట్లాడలేదు.
"అయినా వాడు మీలా సుభాషితాలు చదవలేదు లేండి!" అంటూ, ఆవిడ చుట్టూ చూసి ఇంకేం మాట్లాడ లేదు. అప్పటికే అక్కడ అందరి చూపులూ మావేపే ఉన్నాయి.
రైలు బాగా స్పీడ్ అందుకుంది. అన్నవరం స్టేషన్ కూడా దాటేసింది. డబ్బులు తిరిగి వస్తాయనే ఆశ నాలో కూడా సన్నగిల్లింది.
మనుషుల మీద నమ్మకం, జాలి ఉండవలసి వాటి కన్నా ఎక్కువగా నాలో ఉన్నాయనే నిశ్చితమైన అభిప్రాయం మా ఆవిడలో ఉంది. చాలా విషయాలలో, చాలా సార్లు నేను తన ముందు ఓడిపోవడం, చీవాట్లు తినడం అలవాటై పోయింది. కాని, ఆవిడ నమ్మకం అన్ని విషయాలకి ఆపాదించడం కరెక్ట్ కాదు అని నమ్మేవాడిని నేను.
మనుషుల్లో మంచితనం చూడాలి. వారిలో చెడు ఉంటే, అది వారు పెరిగిన వాతావరణం, పరిస్థితులే కారణం అనేది నా నమ్మకం!
మంచి, చెడు పక్క పక్కనే ఉంటాయి, అవకాశాన్ని బట్టి మనిషి వాటిని వాడుకుంటాడని ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అందుకేనేమో, చాలాసార్లు ఓడిపోయినా సరే, నా అభిప్రాయాల మీద నమ్మకం సడలలేదు. ధర్మం కనీసం నాలుగో పాదం మీదైనా ఉందనే ప్రగాఢమైన విశ్వాసం నాలో ఉంది.
"పోనీలెద్దూ, పేదవాళ్ళు! మన డబ్బులతో వాళ్ళు మేడలు మిద్దెలు కట్టెస్తారా?" అని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసాను.
ఆవిడ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి, నాకు మర్యాద ఇచ్చింది. ఇక ఆ సంభాషణ పొడిగించాలని అనిపించలేదు.
నిలబడి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులతో రైలుపెట్టె రద్దీగా ఉంది. బయట పరిగెడుతున్న పొలాల్ని చూస్తూ కూర్చున్నాను.
అప్పటికే తోటి ప్రయాణీకులు వారి వారి ఆలోచన కోణాల్లో నన్ను చూస్తున్నారు. కొందరు నన్నో వెర్రివాడిగా చూస్తుంటే, మరి కొందరు జాలిగా చూస్తున్నారు. 'ఉచిత వినోదం, కాలక్షేపం బావుందిలే!' అని కొందరు ముసిముసి నవ్వులు చిందిస్తుంటే, 'ఏం జరుగుతుందని' ఎదురు చూసే వాళ్లు కూడా లేకపోలేదు.
రైలు పిఠాపురం దరిదాపుల్లో ఉంది. నెమ్మదిగా అందరి చూపుల కోణాల్లోంచి బయట పడ్డాను.
"సార్. రెండు కాఫీలు తాగి, రెండు వందల రూపాయల నోటు మీరే కదా ఇచ్చారు?" ఆ మాట వినేసరికి ఇటు చూసాను. జనాన్ని తప్పించుకుంటూ ఓ పదిహేను సంవత్సరాల కుర్రాడు, మా సీటు ముందుకి వచ్చి అడిగాడు.
ఒక్కసారిగా ఆనందం వేసింది. కాని ఆ కుర్రాడ్ని చూడగానే, మాకు కాఫీ ఇచ్చిన వ్యక్తిలా అనిపించలేదు. అతను మధ్యవయసులో ఉన్నట్టు, లీలగా గుర్తుంది.
"అవును బాబూ. నేనే ఇచ్చాను. చిల్లర తీసుకునే లోపే, రైలు బయలుదేరి పోయింది! కాని నీ దగ్గర మేం కాఫీ తీసుకోలేదే!" నిజాయితీగా అన్నాను.
"అవును సార్, కాని తుని స్టేషన్లో కాఫీలు తాగింది మీరే కదా సార్?" మరొకసారి అదే ప్రశ్న అడిగాడు.
"అబద్దాలు ఆడవలసిన అవసరం నాకు లేదయ్యా! కావలిస్తే, ఇదిగో ఇక్కడున్న వాళ్ళని అడుగు!"
"అబ్బే. అదేం లేద్సర్! నేను పొరపాటు చేయకూడదు కదా, అందుకే మరోసారి అడిగాను!" అంటూ, జేబులో నుంచి డబ్బులు తీసి, నాకు రావలసిన నూట ఎనభై రూపాయలు చేతిలో పెట్టాడు.
"నువ్వూ..."
"వాళ్ళబ్బాయినండీ!'
ఆ కుర్రాడి వైపు ఆశ్చర్యంగా చూసాను. నా మనసులోని సంశయం కూడా అర్ధమయినట్టుంది..
"రోజూ ఒకటో రెండో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి. తునిలో రైలు ఎక్కువ సేపు ఉండదు కదండి! ఆ కంగారులో చాలమంది నోటు ఇచ్చి, చిల్లర తీసుకునే లోపు రైలు కదిలిపోతుంది. అందుకే, నేను రైలు ఎక్కి రడీగా ఉంటానండి. మా నాన్న 'ఫలానా వాళ్ళకి మనం చిల్లర ఇవ్వాలని, వాళ్ళ సీటు నెంబరు, కంపార్టుమెంటు నెంబరు ఫోన్లో చెపుతారండి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నేను సామర్లకోటలో స్టేషన్లో దిగి, ఇంకో బండి ఎక్కి వెనక్కి వెళ్ళిపోతానండి. అందుకోసం కొంత చిల్లర నా దగ్గర ఉంచుతారండి మా అయ్య!"
ఆ మాటలు వింటూనే చాలా ఆనందం వేసింది.
నాకు నోటంట మాటలు రావడానికి చాలాసేపు పట్టింది.
"చదువుకుంటున్నావా?" అడిగాను.
"టెన్త్ క్లాసు చదువుతున్నాను సార్! ఉదయం మా అన్నయ్య, మా అయ్యకి సాయం చేస్తాడండి, మధ్యాహ్నం నేనుంటానండి!"
ఆ మాటలు వింటూంటే, వాడి తండ్రితో మాట్లాడాలనిపించింది.
"ఒక్కసారి మీ నాన్న ఫోన్ నెంబరు ఇవ్వగలవా?" అంటూ అడిగాను.
నా ఫోన్నుంచే, అతనికి ఫోన్ చేసాను.
"తునిలో కాఫీ తాగి, నేనిచ్చిన రెండువందల నోటుకి మిగిలిన చిల్లర మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. నిజానికి మిమ్మల్ని అభినందించాలని ఫోన్ చేసాను. మీ పిల్లలకి చదువుతో పాటు, అంతకంటే ముఖ్యమైన నీతి నిజాయితీలను నేర్పుతున్నారు. చాలా సంతోషం!" అతడ్ని అభినందిస్తూ అన్నాను.
"పెద్దవారు, ఇలా ఫోన్ చేసి మరీ చెప్పటం చాలా సంతోషం బాబూ. నేను ఆ రోజుల్లో ఐదో క్లాసు వరకు చదువుకున్నాను. అప్పట్లో నీతి నిజాయితీల మీద చిన్న చిన్న కథలు చెప్పేవారు, పుస్తకాల్లో కూడా అలాంటివే ఉండేవి. వాటి వలననే మంచి చెడు తెలుసుకున్నాను. అవే బాబూ, ఇప్పటికీ మా జీవితాన్ని ఇబ్బందుల్లేకుండా నడుపుతున్నాయి!"
ఫోన్లో మాటలు వింటూంటే చాల ఆశ్చర్యం వేసింది. అతని మాటలతో ఆలోచనల్లో పడిపోయాను.
"అయితే ఒక్క విషయం బాబూ!" అన్న ఫోన్లో అతని మాటలకి ఒక్కసారి.."చెప్పండి!" అంటూ మళ్ళీ అతని మాటలమీద దృష్టి సారించాను.
"మరి అలాంటి మంచిని నేర్పే చదువులని పక్కన పడేసి, చిన్నప్పట్నుంచి ఆవకాయ అన్నం పెడుతున్నరయ్యా! మా పిల్లలు ఇంట్లో చదువుతుంటే విన్నానయ్యా, నీతి కథల్లేవు, వేమన పద్యాలు లేవు, చిన్నయ్యగారి పాఠాలు అసలలాంటివేవీ లేవు! అందుకే బాబూ, కొంచెం వాళ్ళకి నీతి నిజాయితీలని నేర్పడానికి వాళ్ళకి ఇలాంటి పనులు అప్పగిస్తూ ఉంటాను. పుస్తకాల్లో లేని మంచిని, నాకు తెలిసిన రీతిలో నా పిల్లలకి నేను నేర్పుకుంటున్నాను. అంతే బాబూ!" అతని మాటలకి ఉక్కిరిబిక్కిరి అయిపోయి, మరోసారి అభినందించి, అబ్బాయి భుజం తట్టాను.
ఆ అబ్బాయి ఇచ్చిన నూట ఎనభై రూపాయలు జేబులో పెట్టుకుంటూంటే నా మొహంలో వెలుగుని అలాగే చూస్తుండిపోయింది మా ఆవిడ. నా సంతోషం తిరిగొచ్చిన డబ్బు వల్ల కాదని ఆవిడకీ తెలుసు.
‘నిజమే.. ఇంకా ధర్మం నాలుగో పాదం మీదనైనా ఉన్నట్టే ఉంది!’ ఆ అబ్బాయి వెళుతున్న దిశకేసి చూపు మరలుస్తూ మా ఆవిడ అన్న మాటలు విని ఆ కాఫీ వాడికి మనసులోనే చేతులు జోడించి నమస్కరించాను!✍️
*You are requested to forward this story to your near and dear without editing details and writer's name. It is the respect we have to pay for the writer and collector of good stories.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*