2, సెప్టెంబర్ 2023, శనివారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-34🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-34🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


విష్ణుమూర్తి, శివుడు, కుమారస్వామి, శక్తి వంటి వివిధ దేవతారూపాల్లో ఎవరిది అన్న ప్రశ్నపై వేర్వేరు సంప్రదాయాలకు చెందిన భక్తులు వివిధ అభిప్రాయాలు ఏర్పరుచుకున్నారు.




ఎంతమాత్రమున నెవ్వరు దలచిన అంతమాత్రమే నీవు

అంతరాంతరములెంచిచూడ పిండంతేనిప్పటియన్నట్లు


కొలుతురు మిమువైష్ణవులు కూరిమితో విష్ణుడని

పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు

తలతురు మిము శైవులు తగినభక్తులను శివుడనుచు

అలరిపొగడుదురు కాపాలికులు ఆది భైరవుడవనుచు


సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు

దరిశనములు మిము నానావిధులను తలపుల కొలదుల భజింతురు

సిరులమిమ్మునే యల్పబుద్ధి దలచిన వారికి నల్పంబవుదువు

గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు


నీవలన గొరతేలేదు మరి నీరుకొలది తామెరవు

ఆవల భాగీరథిదరి బావుల ఆజలమే వూరినట్లు

శ్రీవేంకటపతి నీవైతే మము జేకొని వున్నదైవమని

యీవలనే నీశరణని యెదను యిదియే పరతత్త్వమునాకు


 క్రీ.శ.11వ శతాబ్దిలో జరిగిన వాదోపవాదాల్లో వైష్ణవ మతాచార్యుడు రామానుజాచార్యుడు ప్రమాణయుతంగా వాదించి విష్ణువు విగ్రహమేనన్న వాదాన్ని గెలిపించి నేడు అనుసరిస్తున్న వైష్ణవ ఆగమాలను స్థిరపరిచినట్లు సాహిత్యాధారాలు చెబుతున్నాయి.


విగ్రహాన్ని ఏ ప్రాతిపదికలపై వివిధ సంప్రదాయాల వారు వేర్వేరు దేవీమూర్తులదిగా భావించారన్న విషయం ఇలా క్రోడీకరించవచ్చు:

శివుడు: తిరుమలలోని ధృవబేరాన్ని శివునిగా కొందరు భావించడానికి ముఖ్యకారణాలు విగ్రహానికి దీర్ఘకేశాలుండడం, ధనుర్మాసంలో నెలరోజుల పాటుగా బిల్వపత్రపూజ జరగడం వంటివి. విగ్రహం భుజాలపై నాగాభరణాలు ఉండడం కూడా ఈ సందేహానికి బలమిచ్చింది. ఈ పర్వతంపై శివుడు తపస్సు చేసినట్లు పురాణాలు చెప్తూండడమూ ఒక కారణం.


కుమారస్వామి: వామన పురాణంలో కుమారస్వామి రాక్షసవధ అనంతరం బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకునేందుకు తిరుమలలో తపస్సు చేసినట్టుగా ప్రస్తావన ఉంది. పవిత్రమైన కొలనులో స్నానమాచరించి పునీతం చేసినట్టుగా ఉంది. తిరుమలలోని మూలవిరాట్టుగా ఆ కుమారస్వామే నిలిచారనే వాదన బలంగా వినిపించారు. తిరుమలలోని వేంకటేశ్వర ఆలయం పక్కనే ఉన్న స్వామి పుష్కరిణి అనే పుణ్య తీర్థంలోని స్వామి అన్న పదం ఏర్పడేందుకు స్వామి పదంతో ప్రసిద్దుడైన సుబ్రహ్మణ్యస్వామి పేరుతోనే ఏర్పడిందని భావించారు. విగ్రహానికి ఉన్న జటాజూటాలు, నాగాభరణాలు కుమారస్వామికి కూడా ఉంటాయని ప్రసిద్ధి.



పార్వతీదేవి: తిరుమల మూలవిరాట్టును శక్తిరూపంగా కూడా భావించారు. దీర్ఘమైన కేశాలు ఉండడం, శుక్రవారం పసుపుతో అర్చించడం ఈ ప్రతిపాదనలకు మూలకారణం. ధృవబేరానికి ఆరడుగుల పొడవైన చీరవంటి వస్త్రాన్ని కట్టడం కూడా శాక్తేయులు సమార్థనగా చూపించారు. ఆలయప్రాకారంపై సింహాలున్నాయి. సింహాలు శక్తిపీఠంపైనే ఉంటాయని వాదించారు.


ఇతర దైవాలు: విష్ణుమూర్తి నాభిలో కమలం ఉండి ఆ కమలం నుంచి బ్రహ్మ జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. కాగా తిరుమల ఆలయంలోని విగ్రహానికి నాభికమలం లేకపోగా కమలపీఠంపై విగ్రహం ఉండడంతో బ్రహ్మ కూడా కావచ్చని కొందరు, కాలభైరవుని విగ్రహమేమోనని మరికొందరు వాదించారు.



క్రీ.శ.పదకొండవ శతాబ్ది వరకూ విగ్రహానికి శంఖచక్రాలు ఉండేవి కాదు. శంఖమూ, చక్రమూ ధరించినట్టుగా చేతులు ఎత్తి వేళ్లను పైకి చూపిస్తూన్న భంగిమలో ఉండేది తప్ప శంఖచక్రం ఉండేదికాదు. విష్ణుమూర్తి విగ్రహమే అయ్యిఉంటే శంఖచక్రాలు ఉండేవి కదా అన్న వాదన జరిగింది. ధృవబేరానికి వందల సంవత్సరాలుగా వైఖానస ఆగమ పద్ధతులలోనే విష్ణుమూర్తి రూపమనే భావనతో ఆరాధనలు జరుగుతూన్నా శైవులు, శాక్తేయులలో వైష్ణవమూర్తి కాదనే నమ్మకం బలపడి క్రీ.శ.పదో శతాబ్ది నాటికి గందరగోళం నెలకొంది.



రామానుజాచార్యులు ధృవబేరం శివుడు, కార్తికేయుడు, శక్తి వంటి దేవతారూపాలు కాదని నిర్ధారణగా శ్రీమహావిష్ణువేనని నిరూపించారు. వేద పురాణ ప్రమాణాలను చూపి శైవుల వాదనలు ఖండించి అప్పటివరకూ కొనసాగుతున్న వైఖానస ఆగమంలో వైష్ణవ పూజా విధానాలు స్థిరపరిచారు.



అంతకుమునుపు శైవులు తమ వాదనలను క్రీ.శ.పదకొండవ శతాబ్ది నాటి స్థానిక యాదవరాజు వద్దకు తీసుకువెళ్ళారు. యాదవరాజుకు తమ ప్రతిపాదనలు, వాదనలు వివరించి శైవారాధనలు ప్రారంభించేందుకు అనుమతించమని కోరారు. అప్పటికే శైవులు, శాక్తేయులు విగ్రహాన్ని ఇతర దేవతావిగ్రహంగా ఆపాదించడమే కాక, ఎవరి సంప్రదాయాలను అనుసరించి వారు రకరకాల పూజలు ఆలయప్రాంగణంలో నిర్వహించుకోవడం, బలులు ఇవ్వడం వంటివి యాదవరాజుల కాలానికి తారాస్థాయికి చేరుకొన్నాయి 



ఆ స్థితిగతుల మధ్య విశిష్టాద్వైత భాష్యకారుడు రామాజాచార్యులు తిరుమల ప్రాంతానికి చేరుకుని యాదవరాజు ముందు శ్రుతి (వేదం), పురాణాల నుంచి సాక్ష్యాధారాలను చూపించి వాదించారు. శివుడు, కార్తికేయుడు, శక్తి కాదని, విష్ణుమూర్తి విగ్రహమేనని నిర్ధారణ చేసేలా ప్రమాణయుతంగా నిరూపించారు.


దివ్య సుదేహ గోవిందా, శ్రీ రమా లోల గోవిందా, శ్రీ స్మిత వదన గోవిందా, శ్రీ నిర్మలా కార గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||34||


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: