23, డిసెంబర్ 2022, శుక్రవారం

సంసార వాసనలు 

సంసార వాసనలు 

మన జ్ఞ్యానులు మనలను సాధకులుగా మార్చే దిశలో అనేక మహాత్ముల  కధలు చెపుతూవుంటారు నిజానికి జిజ్ఞాసువులకు ఇటువంటి కధలు ఎంతో ఊతం ఇచ్చి ముముక్షువులుగా మారుస్తాయి వాటిలోని యదార్ధకత గూర్చి విచారించకుండా అవి మానలను ముకుక్షుకత్వము వైపు మరలుటకు ఎంతవరకు దోహదపడతాయి అనేది గమనించితే మన సాధనా మార్గం సుగమము అవుతుంది.    అటువంటి ఒక కధ ఇక్కడ పేర్కొంటున్నాను. 

సర్వసంగ పరిత్యాగి అయిన ఒక యోగీశ్వరుడు పూర్తిగా దిగంబరుడుగా వుంటూ అడవిలో దొరికే పండ్లు, ఫలాలు మాత్రం స్వేకరిస్తూ సాదారణ జన జీవనానికి దూరంగా అంటే మనుషులకు పూర్తిగా దూరంగా వుంటూ కేవలం మోక్షార్థిగా జీవనం గడుపుతున్నాడు. మనలాంటి సాధారణ మానవులు అతనిని చూస్తే అంతకంటే విరాగి, స్థితప్రజ్ఞుడు, సన్యాసి ఇంకొకరు ఉండలేరు అని తలవక పోము . ఒకరోజు మన యోగపుంగవులు అడవిలో చెట్టుక్రింద ఒక బండమీద పడుకొని ఉండగా గగన మార్గంలో పార్వతీ పరమేశ్వరులు వెళ్ళటం మన యోగపుంగవులు గమనించారు.  అమ్మవారు ఈశ్వరునితో స్వామి మీ భక్తుడు పూర్తిగా విరాగిగా వుంటూ నిత్యం మిమ్ములనే స్మరిస్తూ వున్నాడు అతనికి మోక్షాన్ని ఎప్పుడు ప్రాసాదిస్తున్నారని అడిగింది.  దానికి స్వామి ఇంకా అతనిలో సంసారపు వాసనలు పోలేదు అటువం టప్పుడు యెట్లా మోక్షానికి అర్హుడు అవుతాడు అని సెలవిచ్చారు. అది విన్న మన యోగపుంగవులు పరుగు పరుగున ఈశ్వరుని సన్నిధికి వెళ్లి స్వామీ నేను నా సంసారం పూర్తిగా త్యజించి అడవిలో ఎలాంటి వాసనలు లేకుండా యతిగా జీవనం గడుపుతూ నిత్యం మోక్షార్థినై జీవిస్తున్నాను, జగన్మాత కూడా నా అవస్థ గమనించి మోక్షము ప్రసాదించవలసిందిగా మీకు తెలిపింది,   నాకంటూ  ఏదిలేదు. మరి నేను ఎలా సంసారపు వాసనలు కలిగి వున్నాను అని ప్రశ్నించారు. దానికి పరమేశ్వరులు ప్రసన్న వదనంతో నాయనా నీవన్నది నిజం. నిజానికి నీవు అత్యంత కఠినమైన దీక్షతో మోక్షార్థిగా జీవనం  గడుపుతున్నావు. నిన్ను చేస్తే ఎవరయినా సర్వసంగ పరిత్యాగి అంటే నీవే అని అంటారు అందులకు సందేహంలేదు. నీవు ఎలాంటి సుఖాలను, భోగాలను పొందకుండా అన్నిటిని వీడి పూర్తిగా యతిగా జీవిస్తున్నావు. కానీ ఇంకా నీలో సంసారపు వాసనలు సూక్ష్మంగా వున్నాయి అని అన్నారు. అవి ఏమిటని మన యతీశ్వరులవారు అడుగగా దానికి స్వామి నీవు పడుకునేటప్పుడు తలకింద చేయి ఎందుకు పెట్టుకున్నావు అది సుఖం మీద జాస కాదా అని  వివరించారు. అప్పుడు యతీశ్వరులు చేయి కూడా తలక్రింద పెట్టుకోకుండా పడుకొంటూ అనతికాలంలోనే ఈశ్వర సాన్నిధ్యాన్నిపొందారట. 

సాధక మిత్రమా యెంత కఠినంగా సాధన చేస్తేనో కానీ మోక్షం లభించదు.  మనం నిత్యం సంసారిక జీవనంలో వుంటూ అనేకులతో అనేక విధాలుగా సామాజిక, ఆర్ధిక పరంగా సంబంధాలు పెట్టుకొంటూ రోజులో కొంత సమయాన్ని మాత్రమే సాధనకు కేటాయిస్తూ జీవిస్తున్న మనం పైన పేర్కొనిన యోగపుంగవులుతో పోల్చుకుంటే ఏపాటివారము అని మనము ఆలోచిస్తే మన సాధన ముందుకు వెళుతుంది. మన జీవనంలో సాధనకు ఎక్కువ సమయం లవుకిక జీవితానికి తక్కువ సమయం కేటాయిస్తే కానీ మనం సాధనలో ప్రగతి సాధించలేము. కానీ మనం సమాజంలో వుంటూ గృహస్థ జీవనం గడుపుతూ ఎంతవరకు సాధించగలం అనేది ప్రస్నార్ధకమే.

ఇది చదివిన సాధకులు తమసాధనలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభిలషిస్తూ 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః  

మీ భార్గవ శర్మ

మనిషి ఎలా జీవించాలి ??

 *మనిషి ఎలా జీవించాలి ??*

        

మనిషి ఎలా బతకాలో చెప్పింది వేదం. చక్కగా చూస్తూ, చక్కగా వింటూ, మంచిగా మాట్లాడుతూ ఎవరికీ అధీనుడు కాకుండా ఉంటే మనిషి నూరేళ్లు బతుకుతాడని వేదం చెబుతోంది.


ఎవరి ధనాన్నీ దొంగిలించకూడదు. అంటే, ధనార్జన ధర్మంగా ఉండాలి. అంతేకాదు- ద్వేషం లేని ప్రేమైక సమాజం మంచిదని వేదం బోధించింది.


ఉపనిషత్తులో ఓ మాట ఉంది. నిత్యం ఏదో ఓ మంచి విషయాన్ని వింటూ ఉండాలి. చదువుతూ ఉండాలి. చదివినదాన్ని మననం చేసుకుంటూ ఉండాలి.


ఎన్ని కష్టాలొచ్చినా సత్యాన్ని వదులుకోకూడదు. నైతికంగా పతనం కాకూడదు. నేను, నాది అన్న సంకుచిత భావనను వదిలిపెట్టాలి. చేసేవాడు, చేయించేవాడు ఆ భగవంతుడే అనుకుంటే- ఫలితాలమీద ఆపేక్ష ఉండదు.


‘మా, మేము, నా’ అనే స్వార్థానికి కౌరవులు జీవితంలో మొదటిస్థానం ఇచ్చారు. రెండో స్థానం ప్రపంచానికి, మూడో స్థానం భగవంతుడికిచ్చారు. ఫలితం అందరికీ తెలిసిందే.


పాండవులు తమ జీవితంలో మొదటి స్థానాన్ని భగవంతుడికి ఇచ్చారు. ద్వితీయ స్థానాన్ని నిస్వార్థ బుద్ధితో ప్రపంచానికిచ్చారు. తరవాత తమ గురించి ఆలోచించారు. అందుకే భారత యుద్ధంలో విజేతలయ్యారు.


ఎవరైనా జీవితంలో ప్రథమస్థానం భగవంతుడికి  ఇవ్వాలి. స్వార్థాన్ని మరచి పరోపకారానికి పాటుపడి త్యాగాలు చేయాలి. ఆ పైనే తమ గురించి ఆలోచించాలి. అప్పుడే జీవితం సంతోషభరితం అవుతుంది.

ప్రతి మనిషీ ప్రపంచంలో ఒకడిగా తనదైన ముద్రవేయాలి తప్ప మందలో ఒకరిగా కలిసిపోకూడదు.


విలువలతో కూడిన జీవితం గడపడం, సక్రమమైన మార్గంలో ప్రయాణించడంవల్లే మనిషి లక్ష్యాలను చేరుకోగలుగుతాడు.


ఈ దేశంలో పుట్టిన సద్గురువులు ఎందరెందరో మానవసేవను మాధవసేవగా భావించారు. పరోపకారమే లక్ష్యంగా బతికారు. వినమ్రతతో దానధర్మాలు చేశారు. మనుషులు ఋషుల్లా మారారు. సంఘసేవకు నడుం బిగించారు. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ మహాత్ముడయ్యాడు.

కాలడి నుంచి హిమాచలం వరకూ కాలినడకన వెళ్ళి నిష్ఠగా ధర్మాన్ని ప్రబోధించిన శంకరాచార్యులు జగద్గురువయ్యారు.


వారందరూ సంఘ శ్రేయం కోసం తమ జీవితాలు ధారపోసి చిరస్మరణీయులయ్యారు.


ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు.


సింహం నోరు తెరుచుకుని ఉన్నంత మాత్రాన వన్యమృగం దాని నోటికి అందదు కదా! అసలు మన ఆలోచనలనుబట్టే ప్రపంచం ఉంటుంది. మన దృష్టి మంచిదైనప్పుడు లోకం మంచిగానే కనిపిస్తుంది. చెడుగా చూస్తే ప్రపంచం చెడ్డగానే కనిపిస్తుంది. ఇతరులకు మేలు చేయకపోయినా కీడు తలపెట్టకుండా ఉండటం మంచిది.


ప్రియంగా మాట్లాడితే శత్రువులైనా క్రమంగా మిత్రులవుతారు. సమాజశ్రేయానికి ప్రతి మనిషీ కృషిచేయాలి. నైతిక విలువలు పాటించి న్యాయమార్గంలో నడవాలి. ప్రేమను, జ్ఞానసంపదను అందరికీ పంచాలి. అప్పుడు మనిషి మనీషి అవుతాడు. అతడిలో భగవంతుడు కొలువై ఉంటాడు! అటువంటి ధన్యజీవులే ధరిత్రిని సంతోష ధామంగా, పుణ్యమూర్తులు నడయాడే ఆనందనందనంగా తీర్చిదిద్దడంలో కీలక భూమిక పోషించగలుగుతారు.


సేకరణ

భువనవిజయం తెలుగు వెలుగు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

భువనవిజయం తెలుగు వెలుగు 


కాఫీ విత్ మధు ☕️


విజయవాడ ఆకాశవాణి కేంద్రం

డిసెంబర్ 1న వజ్రోత్రోత్సవ సంవత్సరంలోకి ప్రవేశించింది 


'రేడియో జంక్షన్'లో శబ్దమాంత్రికులు


ఇప్పుడవన్నీ జ్ఞాపకాలు. కానీ అప్పుడవి విద్వత్ జ్వలిత క్షణాలు. ఒక్కసారి ఇ కాదు, చాలాసార్లు గుర్తుకొస్తూ ఉంటాయి. 


నా చిన్నతనంలో విజయవాడ

రేడియోలో బందా కనకలింగేశ్వరరావు, పింగళి లక్ష్మీకాంతం, బాలమురళీ కృష్ణ, తెన్నేటి హేమలత, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, ప్రయాగ నరసింహశాస్త్రి, వింజమూరి శివరామారావు, కందుకూరి రామభద్రరావు, ఆమంచర్ల గోపాలరావు, జి.వి.కృష్ణారావు, కూచిమంచి కుటుంబరావు, అన్నవరపు రామస్వామి, దండమూడి రామ్మోహనరావు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వి.బి. కనకదుర్గ, నండూరి సుబ్బారావు, సి. రామ్మోహనరావు, ఎ.బి. ఆనంద్, లింగరాజు శర్మ మొదలైనవారి పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి. 


వీళ్ళలో చాలామందిని చూడను కూడా చూశాను. ఎక్కువమంది సూర్యారావు పేటలో మా మేనమామగారి ఇంటికి చుట్టుపక్కల ఉండేవారు. బందాగారు గొప్పనటులు. పౌరాణిక నాటకాలలో అనేక పాత్రలు పోషించారు. కృష్ణుడు, కర్ణుడు, బిల్వమంగళుడు ఇంకా ఎన్నెన్నో..! వారి మహత్తర నటనా జీవితం ఒక ఎత్తయితే; కూచిపూడి యక్షగానాలను, నాట్య సంప్రదాయాలను ఉద్ధరించడం మరోఎత్తు. కూచిపూడిలో 'కళాక్షేత్రం' నాట్య పాఠశాలను స్థాపించారు. కూచిపూడి నాట్య బృందాలను దేశ మంతటా తిప్పుతూ ప్రదర్శనలు ఇప్పించి కూచిపూడి నాట్యాన్ని జగద్విదితం చేశారు. 


ప్రయాగ నరసింహశాస్త్రి వినోదాల వీరయ్యగా, మొద్దబ్బాయిగా రకరకాల పేర్లతో శ్రోతల్లోకి చొచ్చుకు పోయి వినోదాన్ని పంచారు. జానపద గీతాలను చక్కని చతురోక్తులతో శ్రావ్యంగా పాడి రక్తికట్టించేవారు. 


ఇక గానగంధర్వుడు బాలమురళి గురించి ఎంత చెప్పినా తనివితీరదు. సంగీతమే బాలమురళిగా ఈ భూమి మీద అవతరించింది. వాళ్ల వల్ల రేడియోకి పేరు వచ్చిందా, రేడియో వల్ల వాళ్లకు పేరు వచ్చిందా? ఏమో! చెప్పలేను. 


విత్తు ముందా, చెట్టుముందా లాంటి ప్రశ్న అది. ఏది ఏమైనా వాళ్ళందరూ సంగీత సాహిత్య స్రష్టలు, ద్రష్టలు. వారి వారి రంగాలలో వెలుగులు ప్రసరింపచేసినవారు. 


తరువాత కాలంలో మరికొన్ని పేర్లు వినబడుతూ వచ్చాయి. వారు కూడా సంగీత సాహిత్యాది కళలను ఆపోసన పట్టిన అగస్త్యులే!. విద్యలకన్నిటికీ వెన్నెల మెరుగుగా, మెరుగు వెన్నెలగా రజని; 


కర్ణాటక సంగీత విద్వాంసులు ఓలేటి, అమరావతికథల సృష్టికర్త సత్యం శంకరమంచి; తన గంభీర స్వరంతో రేడియోలో రామాయణ, భారత, భాగవతాలు వినిపించి ప్రతీ ఇంటినీ నైమిశారణ్యం చేసిన ఉషశ్రీ, ఒక్క పాటేమిటి, ఒక్క పద్యమేమిటి, నాటకమేమిటి, ఏదైనా అలవోకగా రాయగల సరస్వతీ పుత్రుడు, సంస్కృతాంధ్ర పండితుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ; 


హాస్యానికి రంగూ రుచీ వాసనలు అద్ది, తమలపాకుతో హాస్యం కానీ తలుపు చెక్కతో కాదు అని, రేడియో కోసం ప్రత్యేకంగా రెండు మూడు నిముషాలు నిడివి ఉండే సౌండ్ కార్టూన్స్ చెళుకులను గుప్పించిన పన్నాల సుబ్రహ్మణ్య భట్టు....


ఇలా ఎందరో సంగీత, సాహిత్య ప్రక్రియల ద్వారా ఆనందాన్ని కలిగించారు. 


విజయవాడ ఆకాశవాణి ప్రస్థానం 1948 డిసెంబర్ 1న ప్రారంభమై అద్వితీయంగా 74 ఏళ్లపాటు సాగి వత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఆ మరపురాని మనీషులందరినీ తలుచు కోవడం మహదానందంగా ఉంది.


1972లో అంటే విజయవాడ ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభమైన 28 ఏళ్ల తర్వాత రేడియోలో చేరిన నవతరం మరొకటి ఉంది. మేలిమి బంగారం లాంటి ఆ సృజనకారులలో అగ్రగణ్యుడు 'మా రాముడు'. అదేనండి! రేడియో రామం! ఇల్లలికిన ఈగలాంటివాడు. వాడి ఇంటి పేరు వాడికే గుర్తులేదు. రేడియో రామంగానే ప్రసిద్ధుడు. 


స్వరాన్ని, శబ్దాన్ని ఎంత కావాలో అంతవరకే తూకం వేసి ఒడిసి పట్టుకుంటాడు. గొప్ప శబ్దమాంత్రికుడు. ఆకాశవాణి ప్రతి ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే నాటక, రూపక పోటీల్లో మొదటి బహుమతి వాడిదే. 


రేడియో నాటకాలకు, రూపకాలకు, పిక్చర్ అండ్ సౌండ్ అనే నూతన శబ్ద ప్రక్రియకు తలుపులు, కిటికీలు తెరిచినవాడు రామం. చాలామంది సినిమా యాక్టర్లు మేము

డాక్టర్లు కాబోయీ యాక్టర్లమయ్యామంటుంటారు. 


రాముడు రేడియోలో సౌండ్ ఇంజనీరు కావాలనుకుని వచ్చి మన అదృష్టం కొద్దీ ఎనౌన్సరయ్యాడు. మరో ఘనాపాటి మల్లాది సూరిబాబు. సుస్వర సంగీతలోలుడు. పాటల ఊట. రసికులు మెచ్చే పాటలు రేడియో కోసం ఎన్ని స్వరపరిచాడో లెక్కలేదు. 


కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నాడు. కలగా కృష్ణమోహన్ గురించి, సుధామ గురించి కూడా మాట్లాడుకోవాలి. 


కృష్ణమోహన క్కు పాటంటే ప్రాణం. స్వరాలతో ఆడుకోవడం సరదా. అతనో పాటల పూవుల వంతెన. సుధామ ఒక సాహితీ భాండాగారం, కవి విమర్శక పండితులు. ఇద్దరూ విజయవాడలో పనిచేశారు.


మా తరువాత విజయవాడ రేడియోలో చేరిన బహుముఖ ప్రజ్ఞాశాలి జయప్రకాష్. శబ్ద నాటక శిఖర మతను. రామం తరువాత ఆ వారసత్వాన్ని నిలబెడుతూ ఆకాశవాణి వార్షిక బహుమతులు ఎనిమిది గెల్చుకున్నాడు. విజయవాడ రేడియోను తలుచుకున్నప్పుడు తప్పనిసరిగా గుర్తుచేసుకుని శిరస్సు వంచి సభక్తికంగా, సగౌరవంగా నమస్కరించ వలసిన వాచికాభినయ ప్రతిభామూర్తులు, నట దిగ్గజాలు, స్వరకర్తలు మరి కొందరున్నారు. స్వర

సామ్రాజ్ఞి శారదా శ్రీనివాసన్, నండూరి విఠల్, అద్దంకి మన్నార్, ఎన్.సి.బి జగన్నాథాచార్యులు, ఎం.వీరభద్రరావు (సినిమాల్లోకి వెళ్ళాక సుత్తి వీరభద్రరావు), గొల్లపూడి మారుతీరావు, మల్లిక్... వీళ్ళంతా విజయవాడ ఆకాశవాణి ప్రాంగణంలో నిలిచి ఎదిగిన వెలుగు దీపాలు.


విజయవాడలో 'రజని' డైరెక్టరుగా ఉన్నకాలం స్వర్ణయుగం. అప్పుడు ఆయన చుట్టూరా కవులు, గాయకులు, పండితులు ఉండేవారు. ఏదో ఒక మాట పుచ్చుకుని, పాట అందుకుని పాడుతూ ఉండేవారు. 


అక్కడి చెట్లు కూడా ఆపాటకు తలలూపుతూ ఉండేవి. ఏనాటి ముచ్చట్లివన్నీ! 40 ఏళ్ళ క్రితం మాటలు. ఇటీవల వరకు పనిచేసి విజయవాడ రేడియోకు వన్నెతెచ్చిన వాళ్ళలో సి.ఎస్. రాంబాబు, మల్లేశ్వరరావు కూడా ఉన్నారు. 


చిక్కని కవితలు, కథలు అల్లుతారు. ఏ సమస్యనీ, ఏ సందర్భాన్నీ వదిలిపెట్టరు. దేనినైనా చిత్రిక పట్టగలరు. నేను వార్తల మనిషిని. నాకు సహచరులుగా, సహోద్యోగులుగా, పెద్దలుగా పనిచేసిన వారిలో అతి ముఖ్యులు కొందరున్నారు. ఆర్.వి.వి.కృష్ణారావు, బి.నారాయణరావు, భండారు శ్రీనివాసరావు, కొప్పుల సుబ్బారావు, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, తిరుమలశెట్టి శ్రీరాములు, డి.వెంకట్రామయ్య... వాళ్ళందరూ హృదయులు, సంస్కారవంతులు, మంచితనం మూర్తీభవించిన మూర్తిమత్వం వాళ్ళది. 


ఇంకా ఏవరినైనా స్మరించకుండా వదిలిస్తే మన్నించండి! రేడియోకు అనిర్వచనీయమైన ఆకర్షణ ఉండేది. ఇందులో పనిచేసిన మాకంటే బయటనున్న వారికి సంగతి బాగా తెలుసు. 


విశ్వనాథ సత్య రాయణ, జంధ్యాల పాపయ్యశాస్త్రి, పీసపాటి నరసింహమూర్తి, విన్నకోట రామన్నపంతులు, రామచంద్ర కాశ్యప, పుచ్చా పూర్ణానందం, తుమ్మల కారామమూర్తి, ఆచంట వెంకటరత్నం నాయుడు,

గోపాలకృష్ణ, సి. రాఘవాచారి, నండూరి రామ్మోహనరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ,తు ర్లపాటి కుటుంబరావు, వావిలాల గోపాల కృష్ణయ్య, చలనచిత్ర దర్శకులు జంధ్యాల, సినీనటి అన్నపూర్ణ (ఒకప్పుడు ఉమ), ఎ.వి.ఎస్. పొట్టి ప్రసాద్, గుండు హనుమంతరావు.. ఒకరా ఇద్దరా...! 


విజయవాడ రైల్వేజంక్షన్ ఎలాగో రేడియో జంక్షన్ అలా!. ఇలా అందర్నీ దర్శించే భాగ్యం కలిగింది. దొరకునా ఇటువంటి సేవ!


ప్రయాగ రామకృష్ణ

పునరావృతం చేయరు.

 శ్లోకం:☝️

*నిర్దోషపూర్ణా యది తే బహుత్ర*

*కుర్వంతి దోషాన్సుజనాః కదాచిత్ |*

*విజ్ఞాన దోషాన్ ఝటితి త్యజన్తి*

*పునర్న కుర్వంతి కృతాన్పరంతు ||*


భావం: పెద్దమనుషులు చాలామట్టుకు దోషరహితంగా ఉన్నప్పటికీ, కొన్నిసార్లు వారు కూడా తప్పులు చేస్తారు. *ప్రమాదో ధీమతామపి* . కాకపోతే వారు తప్పులు చేసినప్పటికీ త్వరగా సరిదిద్దుకుంటారు. మరి పునరావృతం చేయరు.

మహోన్నతుడు, శ్రీ పి. వి. నరసింహారావు !

 " విశ్వంలో మహోన్నత ఆర్ధిక సంస్కరణల రూప శిల్పి, తెలుగు తేజం,  శ్రీ పి. వి . నరసింహారావు గారు "                                     తెలుగు నేలపై జన్మించి, బహు భాషలలో పాండిత్యం సాధించిన మహోన్నతుడు, శ్రీ పి. వి. నరసింహారావు !       

నిత్య నూతన దివ్య తేజో ప్రకాశమై, తెలుగు వారి ఖ్యాతిని దిగ్దిగంతాలలో నిలిపిన అత్యత్తమ సుసంస్కారి, శ్రీ పి. వి. !

ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయాన, చక్కని రీతిలో, భారతీయ మేధాశక్తిని చూపిన ధీశాలి ! 

భారత దేశపు సమున్నత సంస్కృతిని,సనాతన ధర్మ సువికాసాన్ని పరిఢవిల్లచేసిన పండితోత్తముడు ! 

న్యాయకోవిదునిగ విశ్వ వ్యాప్త ప్రశాంతతకు ఆయన చేసిన కృషి నిరుపమానం !

విశ్వ సాంకేతిక, వైజ్ఞానిక, విద్యా, సాంస్కృతిక, ఆర్థిక సంస్కరణల రూప శిల్పిగ ఆయన చరిత్రలో మహోన్నత స్థానమలంకరించిన దార్శనికత !

తెలుగు వారి శక్తి సామర్ధ్యాలు, వారిలోని అంతర్గత సాంకేతిక పరిజ్ఞానాలకు విశ్వ వేదిక కల్పించిన మహోన్నతుడు ! 

భారత దేశపు ప్రధానిగ, క్లిష్టమైన పరిస్థితులలో సైతం ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, విశ్వంలో శాశ్వత సువర్ణాక్షరాల దివ్య సుప్రకాశం ! 

నేడు శ్రీ పి. వి. నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నా మనఃపూర్వక నివాళి ! 

🙏🙏🙏🙏🙏

గుళ్లపల్లి ఆంజనేయులు 


సరళమైన భాష, వినసొంపైన భాష, సులువుగా నేర్వగలిగిన బాష, తెలుగు ! ఆత్మీయతానురాగాల పుట్టినిల్లు " తెలుగు భూమిపై " సుమారుగా వేయి సంవత్సరాల క్రితం, రాజరాజనరేంద్రుడి స్ఫూర్తితో, రాజమహేంద్రవరంలో, ఆంధ్ర మహాభారత గ్రంథ రచనకు శ్రీకారం చుట్టిన నన్నయ్య నిత్య స్మరణీయుడు ! మహర్షి వేద వ్యాసుని సంస్కృత భారత గ్రథానికి, చక్కని రీతిలో గొప్ప విలువలతో కూర్చిన దివ్య శోభతో, " ఆది కవి నన్నయ్య ", సుమధుర తెలుగు పద్యాలతో, బహు చక్కటి పదబంధాలతో, తనదైన ప్రత్యేక విశిష్టత చాటుతూ, కడు పసందైన రీతిలో, ఎంతో రమణీయమైన విధంగా, " ఆంధ్ర మహాభారత గ్రంథ " రచనకు రూపుదిద్దిడం, మిక్కిలి ఆదరణీయం ! 18 పర్వాల ఆంధ్ర మహాభారత గ్రంథాన్ని, మహా కవులు, కవిత్రయంగా పేరొందిన, నన్నయ, తిక్కన, ఎఱ్ఱాప్రగడలు చక్కని పసందైన రీతిలో, జనరంజకంగా, అందరికీ అర్ధమయ్యే విధంగా, చక్కటి తెలుగు పద్యాలతో, రమణీయమైన పదబంధాలతో విశ్వానికి అందించడం, తెలుగు వారి అదృష్టం ! తెలుగు భాష, బహు ప్రాచీనమైనదై, విశ్వంలో తనదైన ప్రత్యేకతను చూపడం ఎంతో ప్రశంసనీయం ! తెలుగు వారి తోడ్పాటుతో, వివిధ రంగాలలో అనునిత్యం కానవచ్చెడి విశ్వ వ్యాప్త సువికాస నిత్య దివ్య తేజో దీప్తి ! సృష్ట్యాదిగ, జరుగుతున్న, విశ్వ వ్యాప్త నిత్య అభ్యుదయంలో తెలుగు ప్రాంతాల ప్రాశస్త్యం, వర్ణనాతీతం ! చక్కని నదీనదాలతో, ప్రకృతి ప్రసాదించిన పర్వతాల మధ్య పెరిగెడి వృక్ష సమృద్ధితో తెలుగు భూమి నిత్య శోభాయమానం ! పచ్చని పొలాలు, పశుపక్ష్యాదుల నిత్య సుహృద్భావం తోడుగా తెలుగు నేల, అన్నపూర్ణగా విరాజిల్లడం ఎంతో అదృష్టం ! తెలుగు వారి మేధాశక్తి, వారికి పుట్టుకతో వచ్చే వారసత్వ దివ్య భవ్య సుప్రకాశ తేజో దీప్తి ! తెలుగు ప్రాంత గ్రామీణ వాతావరణం, వారికి ఉగ్గుపాలతో పెక్కు రంగాలలో సులభమైన తీరులో సునిశిత పరిశీలనా శక్తినివ్వడం గొప్ప విశేషం ! వివిధ రంగాలలో నేడు విశ్వ వ్యాప్తంగా తెలుగు వారు, తమ మేధాశక్తిని, విశ్వ సంపూర్ణ నిత్య నూతన అభివృద్ధికై, అనునిత్యం వినియోగించడం ఎంతో ప్రశంసనీయం ! ✍️గుళ్లపల్లి ఆంజనేయులు