*మనిషి ఎలా జీవించాలి ??*
మనిషి ఎలా బతకాలో చెప్పింది వేదం. చక్కగా చూస్తూ, చక్కగా వింటూ, మంచిగా మాట్లాడుతూ ఎవరికీ అధీనుడు కాకుండా ఉంటే మనిషి నూరేళ్లు బతుకుతాడని వేదం చెబుతోంది.
ఎవరి ధనాన్నీ దొంగిలించకూడదు. అంటే, ధనార్జన ధర్మంగా ఉండాలి. అంతేకాదు- ద్వేషం లేని ప్రేమైక సమాజం మంచిదని వేదం బోధించింది.
ఉపనిషత్తులో ఓ మాట ఉంది. నిత్యం ఏదో ఓ మంచి విషయాన్ని వింటూ ఉండాలి. చదువుతూ ఉండాలి. చదివినదాన్ని మననం చేసుకుంటూ ఉండాలి.
ఎన్ని కష్టాలొచ్చినా సత్యాన్ని వదులుకోకూడదు. నైతికంగా పతనం కాకూడదు. నేను, నాది అన్న సంకుచిత భావనను వదిలిపెట్టాలి. చేసేవాడు, చేయించేవాడు ఆ భగవంతుడే అనుకుంటే- ఫలితాలమీద ఆపేక్ష ఉండదు.
‘మా, మేము, నా’ అనే స్వార్థానికి కౌరవులు జీవితంలో మొదటిస్థానం ఇచ్చారు. రెండో స్థానం ప్రపంచానికి, మూడో స్థానం భగవంతుడికిచ్చారు. ఫలితం అందరికీ తెలిసిందే.
పాండవులు తమ జీవితంలో మొదటి స్థానాన్ని భగవంతుడికి ఇచ్చారు. ద్వితీయ స్థానాన్ని నిస్వార్థ బుద్ధితో ప్రపంచానికిచ్చారు. తరవాత తమ గురించి ఆలోచించారు. అందుకే భారత యుద్ధంలో విజేతలయ్యారు.
ఎవరైనా జీవితంలో ప్రథమస్థానం భగవంతుడికి ఇవ్వాలి. స్వార్థాన్ని మరచి పరోపకారానికి పాటుపడి త్యాగాలు చేయాలి. ఆ పైనే తమ గురించి ఆలోచించాలి. అప్పుడే జీవితం సంతోషభరితం అవుతుంది.
ప్రతి మనిషీ ప్రపంచంలో ఒకడిగా తనదైన ముద్రవేయాలి తప్ప మందలో ఒకరిగా కలిసిపోకూడదు.
విలువలతో కూడిన జీవితం గడపడం, సక్రమమైన మార్గంలో ప్రయాణించడంవల్లే మనిషి లక్ష్యాలను చేరుకోగలుగుతాడు.
ఈ దేశంలో పుట్టిన సద్గురువులు ఎందరెందరో మానవసేవను మాధవసేవగా భావించారు. పరోపకారమే లక్ష్యంగా బతికారు. వినమ్రతతో దానధర్మాలు చేశారు. మనుషులు ఋషుల్లా మారారు. సంఘసేవకు నడుం బిగించారు. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడయ్యాడు.
కాలడి నుంచి హిమాచలం వరకూ కాలినడకన వెళ్ళి నిష్ఠగా ధర్మాన్ని ప్రబోధించిన శంకరాచార్యులు జగద్గురువయ్యారు.
వారందరూ సంఘ శ్రేయం కోసం తమ జీవితాలు ధారపోసి చిరస్మరణీయులయ్యారు.
ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు.
సింహం నోరు తెరుచుకుని ఉన్నంత మాత్రాన వన్యమృగం దాని నోటికి అందదు కదా! అసలు మన ఆలోచనలనుబట్టే ప్రపంచం ఉంటుంది. మన దృష్టి మంచిదైనప్పుడు లోకం మంచిగానే కనిపిస్తుంది. చెడుగా చూస్తే ప్రపంచం చెడ్డగానే కనిపిస్తుంది. ఇతరులకు మేలు చేయకపోయినా కీడు తలపెట్టకుండా ఉండటం మంచిది.
ప్రియంగా మాట్లాడితే శత్రువులైనా క్రమంగా మిత్రులవుతారు. సమాజశ్రేయానికి ప్రతి మనిషీ కృషిచేయాలి. నైతిక విలువలు పాటించి న్యాయమార్గంలో నడవాలి. ప్రేమను, జ్ఞానసంపదను అందరికీ పంచాలి. అప్పుడు మనిషి మనీషి అవుతాడు. అతడిలో భగవంతుడు కొలువై ఉంటాడు! అటువంటి ధన్యజీవులే ధరిత్రిని సంతోష ధామంగా, పుణ్యమూర్తులు నడయాడే ఆనందనందనంగా తీర్చిదిద్దడంలో కీలక భూమిక పోషించగలుగుతారు.
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి