8, నవంబర్ 2024, శుక్రవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*విరాట పర్వము చతుర్థాశ్వాసము*


* 189వ రోజు*

*కర్ణుడు కృపాచార్యుని తూలనాడుట*


కర్ణుడు కోపంగా " కృపాచార్యా! శత్రువుల మిత్రుడవని తెలిసీ నిన్ను తీసుకురావడం సుయోధనుని అమాయకత్వం. బాలురు, బంధువులు రాజు సంపదను ఆరగిస్తారు కాని సమయానికి తప్పుకుంటారు. ఇంటికి వెళ్ళి హాయిగా మృష్టాన్నాలు ఆరగించు. అనవసరంగా రాజు నిన్ను యుద్ధంలో ప్రవేశపెట్టాడు. మారు మాటాడక వెళ్ళు. నేను ఒక్కడినే పదునాలుగు భువనాలను గెలుస్తాను. ఒక్క రధికుడు అర్జును డెంత " అన్నాడు. భీష్ముడు కృపాచార్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ సముచితంగా మాట్లాడాడు. కర్ణుడు వీరోచితంగా మాట్లాడాడు. కాని ఒకరిని ఒకరు నిందించు కోవడం న్యాయం కాదు. అంత శక్తి ఉన్న వాడు యుద్ధం చేయాలి కాని ఇలా ఇతరులను నిందించడం ఎందుకు? శత్రువులు ముట్టడించక ముందే ఉపాయం ఆలోచించాలి. శత్రువు పరాక్రమ వంతుడైతే పొగడటం సజ్జనులకు ఉచితం. పెద్దలను గౌరవించాలి కాని నిందించడం తగదు. ప్రస్తుత కర్తవ్యం ఆలోచిద్దాం. ఆచార్యా అర్జునుడు మన మీద యుద్ధానికి వస్తున్నాడు. మనం అందరం కలసి ఎదిరిస్తాం. విభేదాలకు ఇది సమయం కాదు. ఎవరో ఏదో అన్నారని మీరు కోపగించ డానికిది సమయం కాదు. నన్ను క్షమించి ముందుకు పదండి ఆచార్యా " అన్నాడు. కృపాచార్యుడు " అయ్యో మీరు క్షమించంచ మని అడుగ తగునా. నేనంతటి వాడనా. ద్రోణుడు శాంతిస్తే చాలు " అన్నాడు. కృపాచార్యుడు, భీష్ముడు, కర్ణునితో పోయి ద్రోణాచార్యుని అశ్వత్థామను క్షమించమని కోరారు.


*ద్రోణుడి వ్యూహ రచన*


ద్రోణుడు " భీష్ముని మాటలతో నా కోపం పోయింది. ముందుకు పదండి ముందు మనం రారాజును కాపాడు కుంటాము. అర్జునుడు చాలా కసితో ఉంటాడు కనుక అందరం అర్జునిని ఎదుర్కొందాము. అజ్ఞాత వాసం గురించి సుయోధనుడు అడిగిన దానికి భీష్ముడు వివరణ ఇస్తాడు " అన్నాడు. ద్రోణుని ఆంతర్యం గ్రహించిన భీష్ముడు కాల నిర్ణయం చేయవలసిన సమయం ఆసన్న మయినదని గ్రహించాడు. అతడు " సుయోధనా! మన ప్రస్తుత కాలమానం ప్రకారం రెండు సంవత్సరాలకు ఒక అధిక మాసం వస్తుంది. ఈ పదమూడేళ్ళ కాలంలో వచ్చిన అధికమాసాలను గణనలోకి తీసుకుంటే నిన్నటితో పాండవుల అజ్ఞాత వాసం పూర్తి అయింది. ఈ విషయం తెలిసే అర్జునుడు నిజ రూపంతో మనముందుకు వచ్చాడు. అతడు ధర్మం తప్పడు. అలా తప్పే వాడైతే జూదంలో ఓడి పోయిన నాడే మూర్ఖత్వంతో మనతో యుద్ధానికి దిగే వాడు. ధర్మంకోసం కట్టుబడ్డారు కనుకనే ఇంత కాలం వేచి ఉన్నారు. మనతో యుద్ధానికి వచ్చింది అర్జునుడని తెలిసి పోరాటానికి దిగితే మనం గెలువ వచ్చు ఓడి పోవచ్చు. జయాపజయాలు దైవాధీనం కనుక మనం సంధి చేసు కోవడం ఉత్తమం " అన్నాడు భీష్ముడు. సుయోధనుడు " మనకు పాండవులతో సంధి ఎలా పొసగుతుంది. పాండవులకు నేను రాజ్యభాగం ఇవ్వను. యుద్ధం నిశ్చయం ఇందులో తిరుగు లేదు " అన్నాడు. ఇది చూసిన ద్రోణుడు " యుద్ధ సమయంలో నిర్ణయాధికారం రాజుకు మాత్రమే ఉంటుంది. కనుక ఎవరూ రాజు మాట నిరాకరించ లేరు కనుక మనం యుద్ధ వ్యూహాన్ని చేయాలి. సైన్యంలో నాల్గవ భాగాన్ని తీసుకుని సుయోధనుడు ముందు నడుస్తాడు. మరొక నాల్గవభాగం గోవులతో నడుస్తుంది. మిగిలిన సగం సైన్యంతో మనం వెనుక కదులుదాము. నేను మధ్యలో ఉంటాను. నా కుడి వైపు కృపాచార్యుడు, ఎడమ వపు అశ్వత్థామ ఉంటారు. ముందు భాగంలో కర్ణుడు ఉంటాడు. దుశ్శాసనుడు, వికర్ణుడు, శకుని, జయద్రధుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు, సోమదత్తుడూ అక్కడక్కడా మొహరిస్తారు. అర్జునుడు ఎవరితో యుద్ధం చేస్తే వారిని మనంమంతా రక్షిస్తాము. ఇం, దుకు భీష్ముడు ఆమోదాన్ని తెలిపాడు. తాను వెనుక ఉండి సైన్యాలను నడిపించాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

గుడీలో గంట

 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

*గుడీలో గంట ఏందుకు కోడతారు?*

🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

*గుడికి వెళ్ళిన వారు తప్పనిసరిగా గంట కొడుతారు. ఇంట్లో లేక గుడిలో పూజ చేస్తున్నప్పుడు, హారతి ఇచ్చే సమయం లో గంట కొడుతారు. ఆలయం లో ఉన్న గంటలలో అర్దాలు చాలానే ఉన్నాయి. దేవాలయం వెళ్ళినప్పుడు గంట కొడితే మనసుకి ఆధ్యాత్మిక, ఆనందం కలగడమేకాక, సకల శుభాలు కలుగుతాయి. ప్రత్యేకత ఉంది, అదేంటంటే…*


*గంట నాలుక లో సరస్వతీ మాత కొలువై ఉంటుందట. గంట ఉదర భాగంలో మహారుద్రుడు, బ్రహ్మదేవుడు ముఖ భాగంలోను, కొన భాగంలో వాసుకి మరియు పైన వుండే పిడి భాగం లో ప్రాణశక్తి వుంటుంది, అని పురాణాలు మనకు తెలియజేస్తాయి . అందుకే గంటను పవిత్రంగా భావించి దైవంగా పూజించాలి.*


*మనకు భాదలు, మనశ్శాంతి కలిగినపుడు, మన మనస్సును ఆధ్యాత్మిక భావనతో నింపాలంటే భగవంతుని ముందు కంచు తో చేసిన గంటను మ్రోగిస్తే, ఆ గంట నుండి వచ్చే “ఓంకార” శబ్దం వలన దుష్ట శక్తులు దూరంగా పోయి, మన బాధలు తొలగుతాయని “కర్మ సిద్దాంతం” మనకు తెలుపుతుంది.*


*“హారతి” సమయంలో గంటకొడితే, మన ఇంటిలో లేదా దేవాలయం లో దేవతామూర్తుల విగ్రహాల్లోకి దేవతలను ఆహ్వానం పలుకుతున్నామని అర్ధం. హారతి సమయంలో గంట కొట్టే సమయంలో కళ్ళు మూయరాదు. ఆ సమయం లో హారతి ఇస్తూ, గంట కొడుతూ దైవాన్ని ఆహ్వానిస్తూ పూజారి మనకు చూపిస్తున్నారని అర్ధం.*


*ఓం నమో భగవతే దామోదరాయ ౹*

🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

కార్తీకపురాణం 7 వ

 కార్తీకపురాణం 7 వ అధ్యాయము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


♦️శివ కేశ వార్చనా విధులు:


వశిష్టులు వారు జనకున కింకను యిటుల బోధించిరి 'రాజా!కార్తీక మాసము గురించి, దాని మహత్యము గురించి యెంత వినిననూ తనివి తీరదు. ఈమాసము లో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజి౦చిన వారి  ఇంట లక్ష్మిదేవి స్థిరముగా నుండును తులసీ దళములతో గాని సహస్ర నామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామ ముంచి భక్తి తో పూజి౦చిన  యెడల వారికీ కలుగు మోక్ష మింతింత గాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద బోజనము పెట్టి తను తినిన, సర్వ పాపములు పోవును. 


ఈ విదముగా కార్తీక స్నానములు దీపా రాదనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైనను వెళ్లి భక్తితో సాష్టా౦గ నమస్కారము లైననూ చేసిన యెడల వారి పాపములు నశించును. సంపత్తి  గల వారు శివ కేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన,  హొమాదులు,  దానధర్మములు చేసిననచో అశ్వ మేధము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృ దేవతలకు కూడా వైకు౦ట ప్రాప్తి కలుగును. 


శివాలయమున గాని, విష్ణ్యలయమున గాని జండా ప్రతిష్టించినచొ యమ కింకరులకు దగ్గరకు రాలేరు సరి కదా, పెను గాలికి ధూళిరాసు లెగిరి పోయినట్లే కోటి పాపములైనను పటా ప౦చలై పోవును. ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి  వరి పిండితో శంఖు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించ వలెను.ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నంద దీపమందురు. 


ఈ విదముగా జేసి, నైవేద్యమిడి కార్తీక పురాణము చదువు చుండిన  యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగి యూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో అ మానవుడు  మరుజన్మలో శునకమై  తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. 


కావున కార్తీక మాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క  సోమవార మైనను చేసి శివ కేశవులను పూజించిన మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా! నీవు కూడా యీ వ్రతమాచరించి తరింపుముయని చెప్పెను. 


'నమ శివాభ్యం నవ యౌ వనాభ్యాం పరస్ప రాశ్లి ష్ట వపుర్ధ రాభ్యాం

నాగేంద్ర కన్యా వృష కేత నాభ్యం నమో నమ శంకర పార్వతీ భ్యాం''


ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి

సప్తమధ్యాము - సప్తమదిన పారాయణము సమాప్తం.


ఓం నమః శివాయ..🙏🙏

లక్ష్మి తలకెక్కింది

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

        *లక్ష్మి తలకెక్కింది*

☸️☸️☸️🕉️☸️🕉️🕉️🕉️☸️

*పెద్దలు చెప్పే ప్రతి మాటకు ఏదో ఒక అర్ధం దాగేవుంటుంది,ఆ అర్ధం ఏంటో మనకి తెలిస్తే బాగుంటుంది,లక్ష్మీదేవి తలపై ఉండకూడదని మన పెద్దలు అంటారు.*


*లక్ష్మీదేవి అంటే ఒక్క ధనమే కాదు, తనకున్న నైపుణ్యం కూడా. అంటే ఆ రెండుటి వల్ల వచ్చే అహంకారం  నెత్తికి ఎక్కితే ప్రమాదం అని పెద్దలు ఈ మాట చెప్తారు. దీనికి ఒక పురాణ కథను కూడా చెప్తారు.*


*పూర్వం జంభాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు.   అతని తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు. ఇంకేముంది.  జంభాసురుడు దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్ర పదవి చేజిక్కించుకుని ఇంద్రుణ్ణి తరిమి కొట్టాడు.  పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మ దేవుడూ, దేవతల గురువైన బృహస్పతి దగ్గరకెళ్ళి  సమాలోచన చేశాడు.  వారు దగ్గరలో సహ్యాది పర్వతంపైన వున్న దత్తాత్రేయుని శరణువేడమని, ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవరెవరూ లేరని సలహా ఇస్తారు.*


*ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుని శరణువేడుతాడు.  దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు.  అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టనట్లు వుంటాడు.  ఇంద్రుడు అతణ్ణి పరి పరివిధాల ప్రార్ధించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే, చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు.  ఇంద్రుని ప్రార్ధనలాలకించి, ఉపాయం చెబుతాడు.  నువ్వు  దేవతలతో సహా వెళ్ళి జంభాసురుడిని నా ఆశ్రమం దగ్గరకు తీసుకు రమ్మంటాడు.*


*దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి జంభాసురునితో యుధ్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరకు తీసుకొస్తారు.*


*యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంభాసురుడు  దత్తాత్రేయుని ప్రక్కన వున్న ఆయన భార్య అనఘా దేవిని చూస్తాడు.  ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు.  ఆమెను తనతో తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు.  అనఘా దేవి భర్త వంక చూస్తుంది.  దత్తాత్రేయుడు వెళ్ళమని సైగ చేస్తాడు.  అప్పుడు అనఘాదేవి జంభాసురుడికి ఒక షరతు విధిస్తుంది.  నాకు నీ శిరస్సుపై నాట్యం చెయ్యాలని వుంది, అలా నాట్యం చెయ్యనిస్తే వస్తాను అని చెబుతుంది.*


*జంభాసురుడు అంత అద్భుత సౌందర్యరాశి తన శిరస్సుపై నాట్యం చెయ్యటానికి సంతోషంగా అంగీకరిస్తాడు.  అనఘాదేవి జంభాసురుని శిరస్సుపై నాట్యం చేస్తుండగా ఆ తన్మయత్వంలో, ఆ మత్తులో జంభాసురుడి సైన్యాన్ని సురసేనలు దునుమాడుతాయి.  నాట్యమయిపోయినా ఆ పరాకులోనే వున్న జంభాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు.*


*ఇది ఎలా సాధ్యమయింది.  అనఘాదేవి సాక్షాత్తూ మహాలక్ష్మి స్వరూపం.  మహలక్ష్మి తమదగ్గరవుందని ఎవరికైతే గర్వం వస్తుందో, లక్ష్మి వాళ్ళ నెత్తికెక్కుతుందంటారు.*  


*మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోనైనా వుండచ్చు, అందం, ఐశ్వర్యం, విద్య, ఏదైనా కళలో నైపుణ్యం, ఇలా.  లక్ష్మి తమ దగ్గర వున్నదని సంతోషించి, దానిని సద్వినియోగపరచినంత మటుకూ పర్వాలేదు.  కానీ, ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకుని  గర్వం బాగా తలకెక్కినప్పుడు, కన్నూ మిన్నూ గానక ప్రవర్తించినప్పుడు, మనిషి పతనానికి అది మొదలు.*


*తమంత వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో, వారి తలమీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవుతుంది. విపరీతమైన అహంకారం వున్నవారికి లక్ష్మి తలమీద నాట్యంచేసి అణచి వేస్తుందని ఈ కధ తెలియజేస్తుంది.*


*ఓం శ్రీ మహాలక్ష్మీ గణపతియే నమః॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

మార్కండేయుడు

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

       *మార్కండేయుడు*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*దీర్ఘాయువు విషయంలో మార్కండేయుడిని తలచుకొంటుంటారు చాలా మంది. దీనికి కారణమేమిటో, మార్కండేయ మహర్షి మహత్వమేమిటో తెలియచెప్పే కథా సందర్భం ఇది.*


*మృకండ మహర్షి కుమారుడు మార్కండేయుడు. మృకండుడు హరిహరులిద్దరి గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు హరిహరులిద్దరూ ఆనందించి, ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు మృకండుడు తనకు పుత్ర సంతానం కావాలని వరం కోరుకున్నాడు. పుత్ర సంతానం కలుగుతుందని, అయితే ఆ పుట్టబోయే పిల్లవాడు అల్పాయుష్కుడిగా జన్మిస్తాడని చెప్పి హరిహరులు అంతర్థానమయ్యారు.*


*మృకండుడు ఇంటికి తిరిగివచ్చి తన భార్యతో ఈ విషయాన్ని చెప్పాడు. దైవవరం ప్రకారం కొద్ది కాలానికి ఆ దంపతులిద్దరికీ ఓ బాలుడు జన్మించాడు. అతడే మార్కండేయుడు. ఆ పిల్లవాడు చిన్నతనం నుంచే తపోనిష్ఠలో ఉండేవాడు. ఓ రోజు మృకండుడు మార్కండేయుడిని పిలిచి విషయమంతా వివరించాడు. మార్కండేయుడు తనకు అల్పాయుష్షు ఉందని విన్నా ఏ మాత్రం కలత చెందలేదు. తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకుని పరమశివుడిని మెప్పించి చిరంజీవి కావాలని తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు.*


*మార్కండేయుడికి పదహారు సంవత్సరాలు వచ్చాయి. యముడు అతడిని తీసుకెళ్ళడానికి వచ్చాడు. అయితే ఆ బాలుడు తన ఆరాధ్య దైవమైన శివలింగాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. మృత్యువు నుంచి తనను కాపాడమని శివుడిని స్తుతించాడు. ఆ స్తుతులకు మెచ్చాడు శివుడు. చేతిలో త్రిశూలంతో ప్రత్యక్షమయ్యాడు. కాలుడు ఇక చేసేది లేక శివుడిని శరణువేడాడు. మార్కండేయుడిని విడిచిపెట్టి వెళ్లమని శివుడు గద్దించటంతో యముడు అతడిని విడిచిపెట్టి తన పరివారంతో వెళ్లిపోయాడు.*


*శివుడు ఆ తర్వాత మార్కండేయుడిని చిరంజీవిగా ఉండిపొమ్మని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు.*


*ఆ తర్వాత మార్కండేయుడు శ్రీహరి గురించి మరికొంత కాలం తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దగ్గర కూడా తనకు మృత్యువనేది లేకుండా వరం పొంది మృత్యుంజయుడయ్యాడు.*


*ఆ తర్వాత కొంత కాలంపాటు మార్కండేయుడు కేవలం శివపూజ చేస్తూ కాలం గడుపుతూ ఉండిపోయాడు. ఇంతలో ప్రళయం వచ్చి భూమంతా మునిగిపోయింది. చుట్టూ అంతా అంధకారం అలముకుంది. అప్పుడు అంత చీకట్లోనూ మార్కండేయుడికి ఓ అద్భుత దృశ్యం కనిపించింది. ఆ నీళ్లలో ఓ వటపత్రం మీద పసిబాలుడు పడుకొని ఉండటాన్ని మార్కండేయుడు చూశాడు. ఇంతలోనే ఏదో మాయ జరిగినట్టు మార్కండేయుడు ఆ బాలుడి కడుపులోకి వెళ్లిపోయాడు. అక్కడ అంతా ఎన్నెన్నో లోకాలు ఉన్నట్లు కనిపించింది. అవన్నీ చూసేంతలోనే మళ్లీ మాయ జరిగి ఆ బాలుడి పొట్టలో నుంచి బయటపడ్డాడు మార్కండేయుడు. ఈసారి బయట నీరేమీ కనిపించలేదు. మామూలుగానే భూమి ఉంది. ఏమిటీ విచిత్రమని అనుకొంటున్నంతలోనే శివపార్వతులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అతడికి విషయాన్నంతా వివరించి ఆ వటపత్రం మీద శయనించి ఉన్నది ఎవరో కాదని, సర్వలోకాలనూ తన ఉదరంలో దాచుకున్న శ్రీమహావిష్ణువేనని వివరించి చెప్పారు. ఆ మాటలు విన్న రుషికి ఎంతో ఆనందం కలిగింది. గతంలో తాను సరైన అవగాహన లేక కేశవుడిని విస్మరించానని, ఇకపై తనవైపు నుంచి అలా జరగకుండా ఉండేలా తన మనస్సు శ్రీమహావిష్ణువు సేవ మీద లగ్నమై ఉండేలా వరం ఇవ్వమని పార్వతీ పరమేశ్వరులను మార్కండేయుడు వేడుకొన్నాడు. వారు ఆ వరాన్ని అనుగ్రహించి అంతర్థానమయ్యారు.*


*ఆనాటి నుంచి శివానుగ్రహంతో నిరంతరం నారాయణ పద సేవలో నిమగ్నమై శివకేశవ భేదం పాటించకుండా మార్కండేయుడు జీవితం సాగించాడు. తన జీవన యాత్రలో మానవాళికి మంచిని ప్రబోధిస్తూ ఆ చిరంజీవి ఎంతో మందిని ఉత్తములుగా తీర్చిదిద్దాడు.*


*ఇలాంటి రోజుల్లోనే ఓ రోజు మార్కండేయుడి గొప్పతనాన్ని గమనించి ధర్మరాజు ఆ రుషిని పిలిపించి సత్కరించి మానవ కర్మ గతిని గురించి అడిగి తెలుసుకున్నాడు.*


*ఆ సందర్భంలోనే ఆ రుషి ధర్మరాజుకు అనేకానేక ధర్మాలతో పాటు కలియుగ ధర్మాలను వివరించి చెప్పాడు. పితృదేవతలు, వారుండే స్థానాలు అన్నీ చక్కగా వివరించి ధర్మరాజు సందేహాలను తీర్చాడు ఆ రుషి.*


*ఓసారి వ్యాసుడి శిష్యుడైన జైమిని మార్కండేయుడి దగ్గరకు వచ్చి మహాభారతాన్ని గురించి తనకు కొన్ని సందేహాలున్నాయని, వాటిని తీర్చమని కోరాడు. అప్పుడు మార్కండేయుడు దూర్వాసుడి శాపంతో వపువు అనే అప్సరస పక్షిగా పుట్టిందని, మందపాలుడనే మహర్షి అనుగ్రహంతో దానికి నాలుగు పిల్లలు పుట్టాయని చెప్పాడు. శమీక మహర్షి ఆశ్రయంలో ఆ పక్షులు సకల వేద శాస్త్రాలను నేర్చుకున్నాయని, కేవలం ఆ పక్షులు మాత్రమే జైమిని సందేహాలను తీర్చగలవని చెప్పాడు మార్కండేయుడు. జైమిని ఆ పక్షుల దగ్గరకు వెళ్లి అడిగి తన సందేహాలను తీర్చుకున్నాడు.*


*ఇలా మార్కండేయ మహర్షి శివకేశవుల అనుగ్రహం పొందిన మహాత్ముడిగా, చిరంజీవిగా లోకంలోని సర్వ విషయాలు, రహస్యాలు తెలిసిన ఉత్తమోత్తమ జ్ఞానిగా కనిపిస్తున్నాడు.*


(*ఈ కార్తీక మాసంలో ఈ మార్కండేయుని గాధను ఎవరైతే పఠిస్తారో, వింటారో వారికి శివ కేశవులిద్దరు నుండి రక్షణ లభిస్తుంది)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ।*

*ఓం నమః శివాయ॥*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

ఇంట్లో దీపం పెట్టెటప్పుడు

 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*ఇంట్లో దీపం పెట్టెటప్పుడు పాటించవలసిన నియమాలు*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*దీపం తేజస్ తత్వానికి ప్రతీక.*


*రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు.*


*ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.*


*అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ కాళ్ళూ చేతులు నోరు కడుక్కుని దీపారాధన చేయాలి.*


*మాంసాహారం తిన్నేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది.*


*ఇక దీపం వెలిగించి ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టీ ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి.*


*అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమా చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి.*


*ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పర్వటి రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.)*


*దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు. దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె.*


*దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి.సర్వ దేవతా స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి.ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీదేవీఎప్పటికి నిలిచే ఉంటుంది.*


*దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*అసతోమా సద్గమయ*

*తమసోమా జ్యోతిర్గమయా।*

*మృత్యోర్మా అమృతంగమయ॥*

*ఓం శాంతిః శాంతిః శాంతిః॥*


​*ప్రతి పదార్ధము :-*


​*అసతోమా సద్గమయ = అశాశ్వత తత్వము - నుండి శాశ్వతత త్వమునకు నన్ను నడిపింపుము.*


*తమసోమా జ్యోతిర్గమయా = అంధకారము నుండి వెలుగులోనికి నన్ను నడిపింపుము.*


*మృత్యోర్మా అమృతంగమయ = మృత్యువు నుండి అమృతత్వములోనికి నన్ను నడిపింపుము.*


*ఓం శాంతిః శాంతిః శాంతిః = ఆది భౌతిక,ఆది దైవిక,ఆధ్యాత్మిక శాంతిని మనము పొందెదము.*


​*భావము :-*


*ఓ దేవా ! అసత్యము నుంచి సత్యానికి నన్ను నడిపించు. చీకటినుంచి వెలుగు లోకి నడిపించు. మృత్యువు నుంచి అమృత తత్వానికి (శాశ్వతత్వం వైపుకి) నన్ను నడిపించు దేవా!*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

మారేడు చెట్టు

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

          *మారేడు చెట్టు*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము’ అని పిలుస్తారు.* 


*సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది.*


*ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది.అందుకే*


*త్రిదళం త్రిగుణాకారం*

*త్రినేత్రం చ త్రియాయుధం!*


*త్రిజన్మ పాప సంహారం*

*ఏకబిల్వం శివార్పణం!!*


*అని తలుస్తాము.దళములు దళములుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు.*


*ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి.*


*పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి.*


*మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.*


*అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు.*


*శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట.*


*‘బాల్యం, యౌవనం, కౌమారం - ఈ మూడింటిని నీవు చూస్తావు’ అని ఆశీర్వదిస్తాడుట.కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది.*


*శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే జ్ఞానం సిద్ధిస్తుంది.ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి "శ్రీసూక్తం"లో ‘అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’  (అమ్మా అలక్ష్మిని= దరిద్రమును పోగొట్టెదవుగాక) అని చెప్తాము.*


*మనిషికి మూడు గుణములు, మూడు అవస్థలు ఉంటాయి. నాల్గవదానిలోకి వెళ్ళడు. నాల్గవది తురీయము.తురీయమే జ్ఞానావస్థ. అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.*


*మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటె ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది.*


*యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.*


*మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది. అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.*


*‘మా-రేడు’ తెలుగులో - రాజు ప్రకృతి, రేడు వికృతి.*

*మారేడు అంటే మా రాజు.*


*ఆ చెట్టు పరిపాలకురాలు. అన్నిటినీ ఇవ్వగలదు.ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా  మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.*


*అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.*


*అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా - మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి.*


*అందులో మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం.*


*రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట.*


*మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట.*


*ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.*


*ఓం నమో భగవత రుద్రాయ॥*

*ఓం నమః శివాయ॥*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

శివానుగ్రహ సిద్ధి

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శివానుగ్రహ సిద్ధికోసం రుద్రనమక మంత్రాలను వినియోగించడం సంప్రదాయం. అభిషేకానికీ, జపానికీ, అర్చనకీ ఈ దివ్యమంత్రాలు ఉపయోగించి ఇష్టిసిద్ధి, అనిష్ట పరిహారం పొందుతారని శాస్త్రోక్తి. ఎందరికో అనుభవం కూడా. అంతేకాక – ఆత్మవిద్యకి సంబంధించిన ఉపనిషత్ భాగంగా ’రుద్రోపనిషత్’ పేరున దీనిని వ్యవహరిస్తారు. ఇది కైవల్య ప్రాప్తి హేతువని యజ్ఞవల్క్యాది మహర్షులు వేదభాగాలలో వివరించారు.*

*ఆగమాలు, పురాణేతిహాసాలు, ప్రత్యేకించి దీని ప్రశస్తిని పేర్కొన్నాయి. అయితే వేదభాగమై అపౌరుషేయమైన ఈ రుద్ర పఠనానికి, పారాయణకీ, నియమాలు, నిబంధనలు ఉన్నాయి. స్వరం రానివారు, నియమపాలన కుదరని వారు తదితరులు దీనిని పారాయణ చేయడం కూడదని శాస్త్రనియమం.కానీ ఈ రుద్రమంత్రాల వల్ల లభించే సిద్ధి, కైవల్యం వంటి అద్భుత ఫలాలను అందరికీ అందజేయాలని సంకల్పించుకున్న ఋషులు ఆ రుద్రనమకాన్ని శ్లోక రూపంగా మలచి పురాేతిహాసాల ద్వారా, తంత్రశాస్త్ర గ్రంథాలద్వారా అందజేశారు. మంత్రాలను శ్లోకంగా మలచాలంటే ఋష్యత్వం కలిగిన వారికే సాధ్యం. అందుకే వేదాలను వ్యాసం చేసి ప్రసాదించిన భగవాన్ వేదవ్యాసులవారు మహాభారతం, సూతసంహిత, శివరహస్యం – వంటి గ్రంథాలద్వారా వివిధ వివిధాలుగా ’శతరుద్రీయ’ శ్లోకాలను అందజేశారు.*

*విష్ణుసహస్ర, శివసహస్ర, లలితా సహస్ర నామ స్తోత్రాలవలె ఈ నమక స్తోత్రాన్ని – స్నానాది శుచి నియమాలు పాటిస్తూ పారాయణ చేస్తే చాలు పరిపూర్ణ ఫలం లభిస్తుమ్ది. అందులో సందేహం లేదు. దీనిని పారాయణ స్తోత్రంగా పఠించవచ్చు. అభిషేకానికి వినియోగించుకోవచ్చు, స్వరనియమం లేదు. ఉచ్ఛారణలో జాగ్రత్త వహించాలి.శ్రద్ధావిశ్వాసాలున్న ఆస్తికులందూ దీని పఠనానికి అర్హులే.*

*76శ్లోకములతో కూడిన ఈ శ్రీ రుద్ర నమక స్తోత్రమును సాక్షాత్తు డుంఠి వినాయకుడు కాశీ విశ్వనాథుని దర్శించి చేసిన స్తోత్రంగా శివరహస్యం పేర్కొన్నది.*


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శివరహస్యాంతర్గత శ్రీ రుద్ర నమక స్తోత్రం*


*ధ్యానమ్:*

*ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర*

*జ్జ్యోతిఃస్ఫాటిక లింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః|*

*అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్*

*ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్ఛివమ్ ॥*

*బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజన్గైః*

*కంఠే కాలాః కపర్దా కలిత శశికలాశ్చండ కోదండ హస్తాః*

*త్ర్యక్షా రుద్రాక్షమాలా స్సులలితవపుష శ్శాంభవామూర్తి భేదా*

*రుద్రాశ్శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్ ॥*

*ఇత్యుక్త్వా సత్వరం సాంబం స్మృత్వా శంకరపాదుకే*

*ధ్యాత్వా యయౌ గణాధీశః శివసన్నిధి మాదరాత్|*

*తతః ప్రణమ్య బహుధా కృతాంజలి పుటః ప్రభుః*

*శంభుం స్తోతుం మతిం చక్రే సర్వాభీష్ట ప్రదాయకమ్ ॥*


🌸 *గణేశ ఉవాచ:*


*నమస్తే దేవ దేవాయ నమస్తే రుద్ర మన్యవే|*

*నమస్తే చంద్రచూడాయా ప్యుతోత ఇషవే నమః ॥1 ॥*


*నమస్తే పార్వతీ కాంతా యైక రూపాయ ధన్వనే|*

*నమస్తే భగవన్ శంభో బాహుభ్యాముత తే నమః ॥ 2 ॥*


*ఇషుః శివతమా యా తే తయా మృడయ రుద్రమామ్|*

*శివం ధనుర్యద్బభూవ తేనాపి మృడయాధునా ॥3॥*


*శరవ్యా యా శివతమా తయాపి మృడయ ప్రభో|*

*యా తే రుద్రశివా నిత్యం సర్వంగలసాధనమ్॥4॥*


*తయాభిచాకశీహి త్వం తనువా మా ముమాపతే|*

*ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశినీ॥5॥*


*యా తయా మృడయ స్వామిన్ సదా శంతమయా ప్రభో|*

*గిరిశంత మహారుద్ర హస్తే యా మిషు మస్తవే॥6॥*


*బిభర్షి తాం గిరిత్రాద్య శివాం కురు శివాపతే|*

*శివేన వచసా రుద్ర నిత్యం వాచా వదామసి॥7॥*


*త్వద్భక్తి పరిపూతాంగం మహింసీః పురుషం జగత్|*

*యచ్చ శర్వ జగత్సర్వ మయక్ష్మం సుమనా అసత్॥8॥*


*యథాతథావమాం రుద్ర తదన్యధాపి మే ప్రభో|*

*రుద్ర త్వమ్ ప్రథమో దైవ్యో భిషక్ పాపవినాశకః॥9॥*


*అధివక్తా ధ్యవోచ న్మాం భావలింగార్చకం ముదా|*

*అహీన్ సర్వాన్ యాతు ధాన్యః సర్వా అప్యద్య జంభయన్॥10॥*


*అసౌ తామ్రోరుణో బభ్రుః నీలగ్రీవ స్సుమంగళః|*

*విలోహితో స్త్వయం శంభో త్వదధిష్ఠాన ఏవహి॥11॥*


*నమో నమస్తే భగవన్ నీలగ్రీవ మీఢుషే|*

*సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానంద మూర్తయే॥12॥*


*ఉభయోగార్త్ని యోర్జ్యా యా ధన్వన స్తాం ప్రముంచతామ్|*

*సంప్రాప్య ధనురన్యేషాం భయాయ ప్రభవిష్యతి॥13॥*


*అస్మద్భయ వినాశార్థ మధునాభయద ప్రభో|*

*యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వాప॥14॥*


*అవతత్య ధనుశ్చత్వం సహస్రాక్ష శతేషుధే|*

*ముఖానిశీర్య శల్యానాం శివోనః సుమనా భవ॥15॥*


*విజ్యం ధనురిదం భూయాత్ విశల్యో బాణవానపి|*

*అనేశన్నిషవశ్చాపి హ్యాభురస్తు నిషంగధిః॥16॥*


*కపర్దినో మహేశస్య యది నాభుర్నిషంగధిః|*

*ఇషవో పి సమర్థాశ్చేత్ సామర్థ్యాతు భయం భవేత్॥17॥*


*యాతే హేతిర్ధనుర్హస్తే మీఢుష్టమ బభూవ యా|*

*తయాస్మాన్ విశ్వతస్తేన పాలయ త్వ మయక్ష్మయా॥18॥*


*అనాతతాయాయుధాయనమస్తే ధృష్ణవే నమః|*

*బాహుభ్యాం ధన్వనే శంభో నమో భూయో నమో నమః॥19॥*


*పరితే ధన్వనో హేతిః విశ్వతోస్మాన్ వృణక్తు నః|*

*ఇషుధిస్తవ యా తావదస్మదారే నిధేహి తమ్॥20॥*


*హిరణ్య బాహవే తుభ్యం సేనాన్యే తే నమోనమః|*

*దిశాంచ పతయే తుభ్యం పశూనాం పతయే నమః॥21॥*


*త్విషీమతే నమస్తుభ్యం నమస్సస్పింజరాయతే|*

*నమః పథీనాం పతయే బభ్లుశాయ నమోనమః॥22॥*


*నమో వివ్యాధినేన్నానాం పతయే ప్రభవే నమః|*

*నమస్తే హరికేశాయ రుద్రాయ స్తూపవీతినే॥23॥*


*పుష్టానాం పతయే తుభ్యం జగతాం పతయే నమః|*

*సంసార హేతి రూపాయ రుద్రాయాప్యాతతాయినే॥24॥*


*క్షేత్రాణాం పతయే తుభ్యం సూతాయ సుకృతాత్మనే|*

*అహన్త్యాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః॥25॥*


*రోహితాయ స్థపతయే మంత్రిణే వానిజాయచ|*

*కక్షాణాం పతయే తుభ్యం నమస్తుభ్యం భువంతయే॥26॥*


*తద్వారి వస్కృతాయాస్తు మహాదేవాయ తే నమః|*

*ఓషధీనాం చ పతయే నమస్తుభ్యం మహాత్మనే॥27॥*


*ఉచ్చైర్ఘోషాయ ధీరాయ ధీరాన్ క్రందయతే నమః|28॥*


*పత్తీనాం పతయే తుభ్యం కృత్స్నవీతాయ తే నమః|*

*ధావతే ధవలాయాపి సత్త్వనాం పతయే నమః॥29॥*


*అవ్యాధినీనాం పతయే కకుభాయ నిషంగిణే|*

*స్తేనానాం పతయే తుభ్యం దివ్యేషు ధిమతే నమః॥30॥*


*స్తేనానాం పతయే తుభ్యం దివ్యేషు ధిమతే నమః॥30॥*


*తస్కరాణాం చ పతయే వంచతే పరివంచతే|*

*స్తాయూనాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే॥31॥*


*నమః పరిచరాయాపి మహారుద్రాయతే నమః|*

*అరణ్యానాం చ పతయే ముష్ణతాం పతయే నమః॥32॥*


*ఉష్ణీషిణే నమస్తుభ్యం నమో గిరిచరాయతే|*

*కులుంచానాం చ పతయే నమస్తుభ్యం భవాయ చ॥33॥*


*నమో రుద్రాయ శర్వాయ తుభ్యం పశుపతయే నమః|*

*నమ ఉగ్రాయ భీమాయ నమశ్చాగ్రేవధాయచ॥34॥*


*నమో దూరేవధాయాపి నమో హంత్రే నమోనమః|*

*హనీయసే నమస్తుభ్యం నీలగ్రీవాయ తే నమః॥35॥*


*నమస్తే శితికంఠాయ నమస్తేస్తు కపర్దినే|*

*నమస్తే వ్యుప్తకేశాయ సహస్రాక్షాయ మీఢుషే॥36॥*


*గిరిశాయ నమస్తేస్తు శిపివిష్టాయ తే నమః|*

*నమస్తే శంభవే తుభ్యం మయోభవ నమోస్తుతే॥37॥*


*మయస్కర నమస్తుభ్యం శంకరాయ నమోనమః|*

*నమశ్శివాయ శర్వాయ నమశ్శివతరాయ చ॥38॥*


*నమస్తీర్థ్యాయ కూల్యాయ నమః పార్యాయతే నమః|*

*ఆవార్యాయ నమస్తేస్తు నమః ప్రతరణాయచ॥39॥*


*నమ ఉత్తరణాయాపి హరాతార్యాయ తే నమః|*

*ఆలాద్యాయ నమస్తేస్తు భక్తానాం వరదాయ చ॥40॥*


*నమశ్శష్ప్యాయ ఫేన్యాయ సికత్యాయ నమోనమః|*

*ప్రవాహ్యాయ నమస్తేస్తు హ్రస్వాయాస్తు నమోనమః॥41॥*


*వామనాయ నమస్తేస్తు బృహతేచ నమోనమః|*

*వర్షీయసే నమస్తేస్తు నమో వృద్ధాయతే నమః॥42॥*


*సంవృధ్వనే నమస్తుభ్య మగ్రియాయ నమోనమః|*

*ప్రథమాయ నమస్తుభ్య మాశవే చాజిరాయ చ॥43॥*


*శీఘ్రిమాయ నమస్తేస్తు శీభ్యాయ చ నమోనమః|*

*నమ ఊర్మ్యాయ శర్వాయాప్యవస్వన్యాయతే నమః॥44॥*


*స్రోతస్యాయ నమస్తుభ్యం ద్వీప్యాయచ నమోనమః|*

*జ్యేష్ఠాయ చ నమస్తుభ్యం కనిష్ఠాయ నమోనమః॥45॥*


*పూర్వజాయ నమస్తుభ్యం నమోస్త్వవరజాయచ|*

*మధ్యమాయ నమస్తుభ్యమపగల్భాయ తే నమః॥46॥*


*జఘన్యాయ నమస్తుభ్యం బుధ్నియాయ నమోనమః|*

*సోభ్యాయ ప్రతిసర్యాయ యామ్యాయచ నమోనమః॥47॥*


*క్షేమ్యాయ చ నమస్తుభ్యం యామ్యాయ చ నమోనమః|*

*ఉర్వర్యాయ నమస్తుభ్యం ఖల్యాయ చ నమోనమః॥48॥*


*శ్లోక్యాయ చావసాన్యాయావస్వన్యాయ చ తే నమః|*

*నమో వన్యాయ కక్ష్యాయ మౌన్జ్యాయ చ నమోనమః॥49॥*


*శ్రవాయ చ నమస్తుభ్యం ప్రతిశ్రవ నమోనమః|*

*ఆశుషేణాయ శూరాయ నమోస్త్వాశు రథాయ చ॥50॥*


*వరూథినే పర్మిణే చ బిల్మినే చ నమోనమః|*

*శ్రుతాయ శ్రుత సేనాయ నమః కవచినే నమః॥51॥*


*దుందుభ్యాయ నమస్తుభ్య మాహనన్యాయతే నమః|*

*ప్రహితాయ నమస్తుభ్యం ధృష్ణవే ప్రమృశాయ చ॥52॥*


*పారాయ పారవిందాయ నమస్తీక్ణేషవే నమః|*

*సుధన్వనే నమస్తుభ్యం స్వాయుధాయ నమోనమః॥53॥*


*నమః స్రుత్యాయ పథ్యాయ నమః కాట్యాయ తే నమః|*

*నమో నీప్యాయ సోద్యాయ సరస్యాయ చ తే నమః॥54॥*


*నమో నాద్యాయ భవ్యాయ వైశంతాయ నమోనమః|*

*అవట్యాయ నమస్తుభ్యం నమః కూప్యాయ తే నమః॥55॥*


*అవర్ష్యాయ చ వర్ష్యాయ మేఘ్యాయ చ నమోనమః|*

*విద్యుత్యాయ నమస్తుభ్యమీథ్రియాయ నమోనమః॥56॥*


*ఆతప్యాయ నమస్తుభ్యం వాత్యాయచ నమోనమః|*

*రేష్మియాయ నమస్తుభ్యం వాస్తవ్యాయ చ తే నమః॥57॥*


*వాస్తుపాయ నమస్తుభ్యం నమస్సోమాయతే నమః|*

*నమో రుద్రాయ తామ్రాయాప్యరుణాయ చ తే నమః॥58॥*


*నమ ఉగ్రాయ భీమాయ నమశ్శంగాయ తే నమః|*

*నమస్తీర్థ్యాయ కూల్యాయ సికత్యాయ నమోనమః॥59॥*


*ప్రవాహ్యాయ నమస్తుభ్యమిరిణ్యాయ నమోనమః|*

*నమస్తే చంద్రచూడాయ ప్రపధ్యాయ నమోనమః॥6౦॥*


*కింశిలాయ నమస్తేస్తు క్షయణాయ చ తే నమః|*

*కపర్దినే నమస్తేస్తు నమస్తేస్తు పులస్తయే॥61॥*


*నమో గోష్ఠ్యాయ గృహ్యాయ గ్రహాణాం పతయే నమః|*

*సమస్తల్ప్యాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః॥62॥*


*కాట్యాయ గహ్వరేష్ఠాయ హ్రదయ్యాయ చ తే నమః|*

*నివేష్ప్యాయ నమస్తుభ్యం పాగ్oసవ్యాయ తే నమః॥63॥*


*రజస్యాయ నమస్తుభ్యం పరాత్పర తరాయ చ|*

*నమస్తే హరికేశాయ శుష్క్యాయ చ నమోనమః॥64॥*


*హరిత్యాయ నమస్తుభ్యం హరిద్వర్ణాయ తే నమః|*

*నమ ఉర్మ్యాయ సూర్మ్యాయ పర్ణ్యాయ చ నమోనమః॥65॥*


*నమోపగుర మాణాయ పర్ణశద్యాయ తే నమః|*

*అభిఘ్నతే చాఖ్ఖిదతే నమః ప్రఖ్ఖిదతే నమః॥66॥*


*విశ్వరూపాయ విశ్వాయ విశ్వాధారాయతే నమః|*

*త్ర్యంబకాయ చ రుద్రాయ గిరిజాపతయే నమః॥67॥*


*మణికోటీర కోటిస్థ కాన్తిదీప్తాయ తే నమః|*

*వేదవేదాంత వేద్యాయ వృషారూఢాయ తే నమః॥68॥*


*అవిజ్ఞేయ స్వరూపాయ సుందరాయ నమోనమః|*

*ఉమాకాంత నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే॥69॥*


*హిరణ్య బాహవే తుభ్యం హిరణ్యాభరణాయ చ|*

*నమో హిరణ్య రూపాయ రూపాతీతాయ తే నమః॥70॥*


*హిరణ్యపతయే తుభ్యమంబికాపతయే నమః|*

*ఉమాయాః పతయే తుభ్యం నమః పాప ప్రణాశక॥71॥*


*మీఢుష్టమాయ దుర్గాయ కద్రుద్రాయ ప్రచేతసే|*

*తవ్యసే బిల్వపూజ్యాయ నమః కళ్యాణ రూపిణే॥72॥*


*అపార కళ్యాణ గుణార్ణవాయ శ్రీ నీలకంఠాయ నిరంజనాయ|*

*కాలంతకాయాపి నమో నమస్తే దిక్కాల రూపాయ నమో నమస్తే॥|73॥*


*వేదాంత బృంద స్తుత సద్గుణాయ గుణ ప్రవీణాయ గుణాశ్రయాయ|*

*శ్రీ విశ్వనాథాయ నమో నమస్తే కాశీ నివాసాయ నమో నమస్తే॥74॥*


*అమేయ సౌందర్య సుధానిధాన సమృద్ధి రూపాయ నమోనమస్తే|*

*ధరాధరాకార నమోనమస్తే ధారా స్వరూపాయ నమో నమస్తే॥75॥*


*నీహార శైలాత్మజ హృద్విహార ప్రకాశ హార ప్రవిభాసి వీర|*

*వీరేశ్వరాపార దయానిధాన పాహి ప్రభో పాహి నమోనమస్తే॥76॥*


🌸 *వ్యాస ఉవాచ:*


*ఏవం స్తుత్వా మహాదేవం ప్రణిపత్య పునఃపునః|*

*కృతాంజలి పుటస్తస్థౌ పార్శ్వే డుంఠివినాయకః ॥*

*త మాలోక్య సుతం ప్రాప్తం వేదం వేదాంగపారగం*

*స్నేహాశ్రుధారా సంవీతం ప్రాహ డుంఠిం సదాశివః ॥*

*ఇతి శ్రీ శివ రహస్యే హరాఖ్యే తృతీయాంశే పూర్వార్ధే*

*గణేశ కృత రుద్రాధ్యాయ స్తుతిః నామ దశమోధ్యాయః*

*అనేనా శ్రీ గణేశ కృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణేన*

*శ్రీ విశ్వేశ్వర స్సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు ॥*


*ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః* 🙏🙏🙏


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Kartika Puranam - 7

 Kartika Puranam - 7


వశిష్ఠుడిట్లనెను. ఓ జనకమహారాజా! కార్తీక మహాత్మ్యమును యింకా చెప్పదను సావధాన మనస్కుడవై వినుము. ఈమాసమందు ఎవడు పద్మములచేత పద్మములవంటి నేత్రములు గల హరిని పూజించునో వాని యింటిలో పద్మములందుండు లక్ష్మీదేవి నిత్యనివాసము చేయును. భక్తితో తులసీదళముతోను, జాజిపువ్వులతోను హరిని పూజించువాడు తిరిగి భూమియందు జన్మించడు. మారేడు దళములతో సర్వ వ్యాపకుడయిన హరిని పూజించినవాడు తిరిగి భూమియందు జన్మించడు. భక్తిో ఫలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయముకాగానే చీకట్లు ఎట్లునశించునో అట్లు నశించును. ఉసిరికాయలతో ఉసిరి చెట్టుక్రింద హరిని పూజించువానిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు. కార్తీకమాసమందు తులసీదళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు బ్రాహ్మణులతో గూడా వనభోజనము ఆచరించువానియొక్క కోటానుకోట్ల పాపాలు నశించును. బ్రాహ్మణులతో గూడా ఉసిరి చెట్టు దగ్గర సాలగ్ామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును. భక్తిచే హరియొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణమును గట్టువాడు పరమపదము పొందును. హరికి అరటి స్తంభములతోగాని, పుష్పములతోగాని, మంటపమును నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందుండును. ఒక్కమారయినను హరిముందు దండప్రణామమాచరించువారు పాపవిముక్తులై అశ్వమేధయాగఫలము పొందుదురు. హరిముందు జపము, హోమము, దేవతార్చనము చేయువారు తమ పితరుతో కూడా వైకుంఠమునకు బోవుదురు. స్నానముచేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో వణుకువానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలమును పొందును. విష్ణువుయొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు నశించును. నల్లనివిగాని, తెల్లనివిగాని అవిశపువ్వులతో హరిని పూజించిన యెడల పదివేల యజ్ఞములు చేసిన ఫలము గలుగును. బృందావనమునందు ఆవుపేడతో అలికి ఐదు రంగులతోను, శంఖపద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలగును. విష్ణుసన్ిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యముయొక్క గొప్పతనము జెప్పుట బ్రహ్మకు కూడ శక్యముగాదు. పర్వతిధులలో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈనందాదీపము నశించిన యెడల వ్రతభ్రష్టుడగును. తిలలతోను, ధాన్యముతోను, అవిశపువ్వులతోను, కలిపిన నందాదీపమును కార్తీకాసమందు హరికి క్సమర్పించవలయును. నందా అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వతిథులందు జేయునది. శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదకు మోక్షము పొందుదురు. విష్ణ్వాలయమంటపమును భక్తితో అలంకరించువారు హరి మందిరమునకు వెళ్ళుదురు. హరిని మల్లెపువ్వులతో పూజించువాని పాపములు సూర్యోదయానంతరము చీకటి నశించునట్లు నశించును. కార్తీకమాసమందు తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాపవిముక్తుడై విష్ణులోకమును బొందును. హరిసన్నిధిలో స్త్రీగాని పురుషుడుగాని నాట్యముజేసినయెడల పూర్వజన్మ సంచితమైన పాతకములు గూడ నశించును. ఇతరులకు హరిపూజకొరకు మనోవాక్కాయములచేత సహాయముచేయువాడు స్వర్గమునుబొందును. భక్తితో గంధపుష్ప ధూపదీపాదులచేత హరిని పూజించువాడు వైకుంఠమునుబొందును. ఈమాసమున హరిసన్నిధిలో జపమాచరించనివాడు భూమియందు ఏడు జన్మములందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహము లేదు. సాయంకాలమందు హరిసన్నిధిని పురాణ కాలక్షేపమునుజేయువారు వైకుంఠమును జేరుదురు. సాయంకాలమున ఆలయములందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలముండి తరువాత ధ్రువలోకము చేరి సుఖించును.


ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే సప్తమోధ్యాయస్సమాప్తః

"నీవు లేక నేను లేను..."

 "నీవు లేక నేను లేను..."

💐💐💐💐💐💐💐


"ఏవండీ, నేనో మాట అడుగుతాను, ఏమీ అనుకోకుండా, సమాధానం చెప్పాలి..."


"మళ్ళీ ఏదో భేతాళ ప్రశ్న వేసేట్టున్నావే...

 సరే, నాకు కొత్త కాదుగా...రానీ..."


"ఏమీ లేదు, మన పిల్లలా...సప్తసముద్రాల అవతల,

ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు, మనిద్దరమే ఇక్కడ

వృద్ధ దంపతులం ఉంటున్నాం. దేవుడి దయవల్ల తిండికి, బట్టకి, లోటు లేకుండా సొంతింట్లో పడి, కాలక్షేపం చేసేస్తున్నాం..."


"అయితే...?"


"మనకా, రాను రాను ఓపికలు తగ్గుతున్నాయి, పూర్వకాలంలో వాళ్ళలాగ, పిల్లల దగ్గిర ఉండలేము, వాళ్ళూ ఇక్కడికి రాలేరు, ఎప్పుడైనా మనం అక్కడికి వెళ్ళినా, ఆరు నెల్లవగానే ఇక్కడికొచ్చేయాలి... 


ఇలా అంటున్నానని, బాధపడొద్దు...ఒకవేళ నాకు

ఏమైనా అయితే, మీరు ఒంటరిగా ఎలా బతగ్గలరా 

అని నాకు బెంగ ! రోజూ పడుకున్నా, ఇలాంటి

ఆలోచనలతో సరిగ్గా నిద్రపట్టి చావట్లేదు ! 

వెధవ కలలు కూడా, అలాంటివే వస్తున్నాయ్...

ఈమధ్య !"


"అలాగా ? నాక్కూడా అలాంటి బెంగలే పట్టుకుంటున్నాయ్...


నువ్వు పైకి తేలావు - నేను తేలట్లేదు...అంతే తేడా !

ఇలాంటి వాస్తవాలు మాట్లాడితే, మీ ఆడవాళ్ళందరికీ సెంటిమెంట్లు అడ్డొచ్చేస్తాయి ! ఎలాగూ ఆ టాపిక్ 

నువ్వే తెచ్చావు కాబట్టి, ఓసారి నా మనసులోమాట చెప్పేస్తాను, నేను చెప్పేదానికి అడ్డు రాకుండా, 

శ్రద్ధగా విను...


నీకంటే నేను ఐదేళ్ళు పెద్ద, పైగా,  సాధారణంగా 

మగాళ్ళకంటే ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, నాకేమైనా అయితే, నీ పరిస్థితి ఏంటి ?"


"అలాంటి అశుభం మాటలు మాట్లాడకండి, 

శుక్రవారం పూటా..."


"అదిగో మళ్ళీ...సెంటిమెంట్లు తేవద్దన్నానా? 

పూర్తిగా విను ! నువ్వు వెళ్ళిపోయినా, 

నేను వెళ్ళిపోయినా, లోకం ఏమీ ఆగిపోదు !

కాకపోతే, ఇన్నాళ్ళూ ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా,

కలిసి బతికి, మన ఇద్దరు పిల్లల్నీ పెంచి పెద్దచేసి,

బాగా చదివించి, ఒకింటివాళ్ళని చేసి, సంతోషంగా విదేశాలకు పంపించాం. వాళ్ళు, వాళ్ళ పిల్లలు - సంసారాలతో చాలా ఆనందంగా వృద్ధిలోకొస్తున్నారు...


నా పెన్షన్ డబ్బుల తోటి, ప్రభుత్వం వారిచ్చిన 

ఆరోగ్య బీమాతోటి, ఇంతకాలం బాగానే బతికేస్తున్నాం..."


 "దేవుడు ఎప్పటికీ మన్నిలాగే రక్షిస్తాడు..."


"రక్షిస్తున్నాడు కనుకనే, ఇలా 75 ఏళ్ళు నిండినా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతున్నాం ! 

అసలు సంగతి చెబుతాను, విను...


నీకు ఎన్నిసార్లు నేర్పినా, మన సందు చివరున్న

ఏటీఎం కి వెళ్ళి, డబ్బులు తేగలవా ?

అత్యవసరమైతే, చేతిలో ఉన్న సెల్ ఫోన్ నుంచి 

క్యాబ్ బుక్ చెయ్యగలవా ?

ఎన్నిసార్లు చెప్పినా, నీ బుర్రలోకి వెళ్ళిందా ?

ప్రాణాపాయ స్థితిలో, అంబులెన్స్ బుక్ చెయ్యగలవా ? 

నన్ను హాస్పిటల్ దాకా తీసికెళ్ళగలవా ?

ఇన్సూరెన్స్ కార్డు ఎక్కడుందో, ఎప్పుడైనా పట్టించుకున్నావా ? దాన్ని ఎలా వాడాలో తెలుసా ?


నీ మనవలతో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడినా, 

'మీరు అన్నీ నేర్చేసుకోండి, వంట, ఈత, కారు డ్రైవింగు, కరాటే, డాన్సు, సంగీతం, అన్నీ వచ్చెయ్యాలి' అని వాళ్ళకి క్లాసులు తీసుకుంటావు కానీ, నువ్వు, ఇక్కడ, నీకు అవసరమైన కనీస విషయాలు నేర్చుకుంటున్నావా? 


భగవద్గీత రోజూ చదువుతుంటావే...

అందులో దేవుడు ఏం చెప్పాడో, అవన్నీ వంటబట్టించుకుంటున్నావా ?


అసలు నాకెంత పెన్షన్ వస్తుందో చెప్పు చూద్దాం...

ప్రతి నెలా మనకెంత ఖర్చవుతుందో తెలుసా, నీకు ?

మన ఇంటికి ఎంత టాక్స్ కడుతున్నాం ? ఎంతసేపూ

నీ చీరలు, నగలు, ఇంట్లో వున్న గిన్నెలు, తప్పేళాలూ జాగ్రత్తగా చూసుకుంటావుగానీ...

ఇంట్లో గ్యాస్ అయిపోతే, బుక్ చేయగలవా ? 

కరెంట్ బిల్లు ఎక్కడ కట్టాలో, ఎలా కట్టాలో తెలుసా ?

నీ ఫోన్ నువ్వు రీఛార్జ్ చేసుకోగలవా?

మనకి, ఏ బ్యాంకులో, ఎన్ని డిపాజిట్లు ఉన్నాయో, 

ఆ రసీదులు ఎక్కడున్నాయో పట్టించుకున్నావా ?

నీ పేరున వున్న బ్యాంకు అకౌంటు తాలూకు 

నెట్ బ్యాంకింగ్ ని, ఎలా ఆపరేట్ చెయ్యాలో,

కనీసం, దాని పాస్ వర్డ్ ఏమిటో గుర్తుంచుకుంటావా ?

నేను రాసిన వీలునామా ఎక్కడుందో గుర్తుందా ?

అన్నీ నేనే చూడాలా ? నేను నీకు గుమాస్తానా ?"


"మీరు చాలాసార్లు చెప్పారు కానీ...

నాకు బుర్రలోకి వెళ్ళవు ! హాయిగా, అండగా, 

మా ఆయనుండగా, ఆ గొడవలన్నీ నాకెందుకు, దండగ !"


"అక్కడే వచ్చింది, నీలాంటి వాళ్ళతో చిక్కు !

నువ్వు ఆ రోజుల్లో ఇంటర్ పాసయ్యావు కానీ,

లోకజ్ఞానం మాత్రం నీకఖ్ఖర్లేదు ! పోనీ, నేను చెబుతుంటే...నన్ను, నా మాటల్ని పట్టించుకోకుండా,

ఏదో ఒకటి చెప్పి, అక్కణ్ణించి జారుకుంటావ్...

ఈసారి నుంచీ, రాత్తిళ్ళు పడుకోబోయే ముందు,

నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా బతుకుతాను అని కాకుండా, నేను వెళ్ళిపోతే నువ్వు ఎలా బతకాలో ఆలోచించు !"


"బాబోయ్, ఇలాంటివన్నీ నాతో అనకండి, 

తల్చుకుంటేనే భయం వేస్తోంది ! 

దేవుడా, నన్నే ముందర తీసికెళ్ళిపో..."


"ఆయన మనం చెప్పినట్టు వినడు, ఆయన చేసేవన్నీ మనమే వినమ్రంగా స్వీకరించి, మనోధైర్యంతో,

ఆయన ఇచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూ, 

మన శేషజీవితాల్ని ప్రశాంతంగా లాగించెయ్యాలి...

అర్థమైందా, తెలిసిందా, బోధపడిందా ?"


"బాబోయ్, ఎరక్కపోయి మీతో ఏదో మనసులో 

మాట చెబితే, మీదంతా రివర్స్ హేమరింగు !

మనసంతా పాడైపోయింది...కాసేపు దేవుడి పుస్తకాలు చదువుకుంటూ, దేవుడు గూడు దగ్గర కూర్చుని వస్తాను..."


"ఆ దేవుడు చెప్పేది కూడా అదే... 

'కర్తవ్యము నీ వంతు -  కాపాడుట నా వంతు' అని !"


                     వారణాసి సుధాకర్.

                    💐💐💐💐💐💐

*ఓ మనిషీ

 *ఓ మనిషీ....?*

ఎక్కడ_నీ_బంధుగణం!?

ఎక్కడ_నీ_రక్తసంబంధం!?

ఎక్కడ_నీ_ఆత్మీయబృందం!?

ఎక్కడ_నీ_కులం!?

ఎక్కడ -నీ-మతం.!?

పట్టు వస్త్రాలు పరుల పాలు

పట్టు పరుపులు చాకలి పాలు

ఆస్తి,పాస్తులు బిడ్డల పాలు

విర్రవీగిన దేహం మట్టిపాలు

మరి నీవేంటి..!?

గుక్కెడు తులసి జలం

నోట్లో గుప్పెడు బియ్యం

తలపై రూపాయి నాణెం

ఒంటిపై తెల్లని వస్త్రం

ఇవి కూడా బూడిద పాలే

వీటి కోసమా..!?

పగలు_ప్రతీకరాలు

మోసపు జీవితాలు

నాటకపు బ్రతుకులు

కుళ్ళు_కుతంత్రాలు

నయవంచనలు

నమ్మకద్రోహాలు

నీతోవచ్చేది_ఎవరు_వచ్చేదేంటి..!?

భార్య ఇంటి గుమ్మం వరకు

బిడ్డలు కట్టె కాలే వరకు

బంధువులు స్మశానం వరకు

కానీ నీ మంచితనం నీవు అస్తమించినా

ఉదయించే సూర్యునిలా రోజు ప్రకాశిస్తుంది.

నీ_బ్రతుకు_ఎలా_ఉండాలంటే

నీ పేరు చెప్తే జనం చెయ్యెత్తి మొక్కాలి..

నీ మరణం ఎలా ఉండాలంటే

దేహం_కాలిబూడిదైనా_

నలుగురు_గొప్పగా_చెప్పుకునేలా_

ఉండాలిజీవితం..//

నీ చివరి మజిలీలో స్మశానం కూడా కన్నీరు పెట్టాలి...!

అలా బ్రతకాలి ఓ మనిషీ