"నీవు లేక నేను లేను..."
💐💐💐💐💐💐💐
"ఏవండీ, నేనో మాట అడుగుతాను, ఏమీ అనుకోకుండా, సమాధానం చెప్పాలి..."
"మళ్ళీ ఏదో భేతాళ ప్రశ్న వేసేట్టున్నావే...
సరే, నాకు కొత్త కాదుగా...రానీ..."
"ఏమీ లేదు, మన పిల్లలా...సప్తసముద్రాల అవతల,
ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు, మనిద్దరమే ఇక్కడ
వృద్ధ దంపతులం ఉంటున్నాం. దేవుడి దయవల్ల తిండికి, బట్టకి, లోటు లేకుండా సొంతింట్లో పడి, కాలక్షేపం చేసేస్తున్నాం..."
"అయితే...?"
"మనకా, రాను రాను ఓపికలు తగ్గుతున్నాయి, పూర్వకాలంలో వాళ్ళలాగ, పిల్లల దగ్గిర ఉండలేము, వాళ్ళూ ఇక్కడికి రాలేరు, ఎప్పుడైనా మనం అక్కడికి వెళ్ళినా, ఆరు నెల్లవగానే ఇక్కడికొచ్చేయాలి...
ఇలా అంటున్నానని, బాధపడొద్దు...ఒకవేళ నాకు
ఏమైనా అయితే, మీరు ఒంటరిగా ఎలా బతగ్గలరా
అని నాకు బెంగ ! రోజూ పడుకున్నా, ఇలాంటి
ఆలోచనలతో సరిగ్గా నిద్రపట్టి చావట్లేదు !
వెధవ కలలు కూడా, అలాంటివే వస్తున్నాయ్...
ఈమధ్య !"
"అలాగా ? నాక్కూడా అలాంటి బెంగలే పట్టుకుంటున్నాయ్...
నువ్వు పైకి తేలావు - నేను తేలట్లేదు...అంతే తేడా !
ఇలాంటి వాస్తవాలు మాట్లాడితే, మీ ఆడవాళ్ళందరికీ సెంటిమెంట్లు అడ్డొచ్చేస్తాయి ! ఎలాగూ ఆ టాపిక్
నువ్వే తెచ్చావు కాబట్టి, ఓసారి నా మనసులోమాట చెప్పేస్తాను, నేను చెప్పేదానికి అడ్డు రాకుండా,
శ్రద్ధగా విను...
నీకంటే నేను ఐదేళ్ళు పెద్ద, పైగా, సాధారణంగా
మగాళ్ళకంటే ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, నాకేమైనా అయితే, నీ పరిస్థితి ఏంటి ?"
"అలాంటి అశుభం మాటలు మాట్లాడకండి,
శుక్రవారం పూటా..."
"అదిగో మళ్ళీ...సెంటిమెంట్లు తేవద్దన్నానా?
పూర్తిగా విను ! నువ్వు వెళ్ళిపోయినా,
నేను వెళ్ళిపోయినా, లోకం ఏమీ ఆగిపోదు !
కాకపోతే, ఇన్నాళ్ళూ ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా,
కలిసి బతికి, మన ఇద్దరు పిల్లల్నీ పెంచి పెద్దచేసి,
బాగా చదివించి, ఒకింటివాళ్ళని చేసి, సంతోషంగా విదేశాలకు పంపించాం. వాళ్ళు, వాళ్ళ పిల్లలు - సంసారాలతో చాలా ఆనందంగా వృద్ధిలోకొస్తున్నారు...
నా పెన్షన్ డబ్బుల తోటి, ప్రభుత్వం వారిచ్చిన
ఆరోగ్య బీమాతోటి, ఇంతకాలం బాగానే బతికేస్తున్నాం..."
"దేవుడు ఎప్పటికీ మన్నిలాగే రక్షిస్తాడు..."
"రక్షిస్తున్నాడు కనుకనే, ఇలా 75 ఏళ్ళు నిండినా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతున్నాం !
అసలు సంగతి చెబుతాను, విను...
నీకు ఎన్నిసార్లు నేర్పినా, మన సందు చివరున్న
ఏటీఎం కి వెళ్ళి, డబ్బులు తేగలవా ?
అత్యవసరమైతే, చేతిలో ఉన్న సెల్ ఫోన్ నుంచి
క్యాబ్ బుక్ చెయ్యగలవా ?
ఎన్నిసార్లు చెప్పినా, నీ బుర్రలోకి వెళ్ళిందా ?
ప్రాణాపాయ స్థితిలో, అంబులెన్స్ బుక్ చెయ్యగలవా ?
నన్ను హాస్పిటల్ దాకా తీసికెళ్ళగలవా ?
ఇన్సూరెన్స్ కార్డు ఎక్కడుందో, ఎప్పుడైనా పట్టించుకున్నావా ? దాన్ని ఎలా వాడాలో తెలుసా ?
నీ మనవలతో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడినా,
'మీరు అన్నీ నేర్చేసుకోండి, వంట, ఈత, కారు డ్రైవింగు, కరాటే, డాన్సు, సంగీతం, అన్నీ వచ్చెయ్యాలి' అని వాళ్ళకి క్లాసులు తీసుకుంటావు కానీ, నువ్వు, ఇక్కడ, నీకు అవసరమైన కనీస విషయాలు నేర్చుకుంటున్నావా?
భగవద్గీత రోజూ చదువుతుంటావే...
అందులో దేవుడు ఏం చెప్పాడో, అవన్నీ వంటబట్టించుకుంటున్నావా ?
అసలు నాకెంత పెన్షన్ వస్తుందో చెప్పు చూద్దాం...
ప్రతి నెలా మనకెంత ఖర్చవుతుందో తెలుసా, నీకు ?
మన ఇంటికి ఎంత టాక్స్ కడుతున్నాం ? ఎంతసేపూ
నీ చీరలు, నగలు, ఇంట్లో వున్న గిన్నెలు, తప్పేళాలూ జాగ్రత్తగా చూసుకుంటావుగానీ...
ఇంట్లో గ్యాస్ అయిపోతే, బుక్ చేయగలవా ?
కరెంట్ బిల్లు ఎక్కడ కట్టాలో, ఎలా కట్టాలో తెలుసా ?
నీ ఫోన్ నువ్వు రీఛార్జ్ చేసుకోగలవా?
మనకి, ఏ బ్యాంకులో, ఎన్ని డిపాజిట్లు ఉన్నాయో,
ఆ రసీదులు ఎక్కడున్నాయో పట్టించుకున్నావా ?
నీ పేరున వున్న బ్యాంకు అకౌంటు తాలూకు
నెట్ బ్యాంకింగ్ ని, ఎలా ఆపరేట్ చెయ్యాలో,
కనీసం, దాని పాస్ వర్డ్ ఏమిటో గుర్తుంచుకుంటావా ?
నేను రాసిన వీలునామా ఎక్కడుందో గుర్తుందా ?
అన్నీ నేనే చూడాలా ? నేను నీకు గుమాస్తానా ?"
"మీరు చాలాసార్లు చెప్పారు కానీ...
నాకు బుర్రలోకి వెళ్ళవు ! హాయిగా, అండగా,
మా ఆయనుండగా, ఆ గొడవలన్నీ నాకెందుకు, దండగ !"
"అక్కడే వచ్చింది, నీలాంటి వాళ్ళతో చిక్కు !
నువ్వు ఆ రోజుల్లో ఇంటర్ పాసయ్యావు కానీ,
లోకజ్ఞానం మాత్రం నీకఖ్ఖర్లేదు ! పోనీ, నేను చెబుతుంటే...నన్ను, నా మాటల్ని పట్టించుకోకుండా,
ఏదో ఒకటి చెప్పి, అక్కణ్ణించి జారుకుంటావ్...
ఈసారి నుంచీ, రాత్తిళ్ళు పడుకోబోయే ముందు,
నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా బతుకుతాను అని కాకుండా, నేను వెళ్ళిపోతే నువ్వు ఎలా బతకాలో ఆలోచించు !"
"బాబోయ్, ఇలాంటివన్నీ నాతో అనకండి,
తల్చుకుంటేనే భయం వేస్తోంది !
దేవుడా, నన్నే ముందర తీసికెళ్ళిపో..."
"ఆయన మనం చెప్పినట్టు వినడు, ఆయన చేసేవన్నీ మనమే వినమ్రంగా స్వీకరించి, మనోధైర్యంతో,
ఆయన ఇచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూ,
మన శేషజీవితాల్ని ప్రశాంతంగా లాగించెయ్యాలి...
అర్థమైందా, తెలిసిందా, బోధపడిందా ?"
"బాబోయ్, ఎరక్కపోయి మీతో ఏదో మనసులో
మాట చెబితే, మీదంతా రివర్స్ హేమరింగు !
మనసంతా పాడైపోయింది...కాసేపు దేవుడి పుస్తకాలు చదువుకుంటూ, దేవుడు గూడు దగ్గర కూర్చుని వస్తాను..."
"ఆ దేవుడు చెప్పేది కూడా అదే...
'కర్తవ్యము నీ వంతు - కాపాడుట నా వంతు' అని !"
వారణాసి సుధాకర్.
💐💐💐💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి