ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
17, డిసెంబర్ 2023, ఆదివారం
నవ్వుల వెన్నెల.
---౦ ఈ రోజు 15వ తేది. మనం గతంలో అనుకొన్నట్లు నేడు "" నవ్వుల వెన్నెల."" ఆ మిఠాయిల పొట్లాన్ని పంచుకొని తిందాం. 1* రాజకీయ నాయకులంతా కలసి ప్రయాణించే ఒక లగ్జరీ బస్సు ఒక పల్లెటూరి వద్ద రోడ్డు ప్రక్కన వున్న చెట్టుకు గుద్దుకొంది. " ఊరికి ఉపకారి అయిన రైతు తన పొలం ప్రక్కనే మరణించిన వారందరినీ పాతిపెట్టాడు." మరునాడు పోలీసులు "" పంచనామా"" చెయ్యటానికి వచ్చి ,రైతును ప్రశ్నించారు. "" ఏమయ్యా! అందరికందరూ ఏక్సిడెంట్ లో మరణించారంటావా? కనీసం ఒకరిద్దరైనా బ్రతికలేదా?"" అని. దానికా రైతు ఇట్లా జవాబిచ్చాడు. "" ఒకరిద్దరేం ఖర్మ సార్! నలుగురైదుగురు మేం బ్రతికే ఉన్నామని ఏడ్చుకొంటూ చెప్పారు. కానీ చనిపోయిన మా నాన్న చెప్పిన నాలుగు మంచి మాటలు గుర్తుకొచ్చి వాళ్ళను కూడా పాతిపెట్టా! నాయనా! నీవు ఈ లోకంలో దొంగలను నమ్ము, జూదరులను నమ్ము. చివరకు త్రాగుబోతులనైనా నమ్ము. కానీ "రాజకీయనాయకులు చెప్పే మాటలను మాత్రం నమ్మవద్దు"" అని. -------౦౦౦౦౦౦౦-------- హాస్పిటల్ ముందు క్యూలైన్ మెలికలు తిరిగి ఉంది. మధ్యలో నుండి ఒక పెద్ద మనిషి ముందుకు నడుస్తూపోతున్నాడు. వెనక నిలబడిన జనం కేకలు వేసుకొంటూ అతడ్ని లాక్కొచ్చి చివర నిలబెట్టారు. మూడు, నాలుగు పర్యాయాలు ఇదే సంఘటన జరిగేసరికి ఆ పెద్దమనిషికి ఒళ్ళు మండిపోయి "" మీరంతా ఇట్లాగే చావండి. నేను ఇవ్వాళ హాస్పిటల్ తలుపులే తెరవనంటూ"" ఇంటి దారి పట్టాడు. -------************ ------ అదేమిటండీ టానికి బాటిల్ పట్టుకొని అట్లా ఊగిపోతున్నారు-- అడిగింది అర్థాంగి. ఈ బాటిల్ మీద "" Shake well before use."" అని వ్రాసి ఉన్నదే, జవాబిచ్చాడు అమాయక రావ్. --------౦౦౦౦౦౦౦ --------- రిటైరయిన ఆర్టీసీ కండక్టరు ఇస్త్రీ బట్టల లెఖ్ఖ వ్యాయడానికి కుర్చీలో కూర్చున్నాడు. కాసేపు అయింతర్వాత భార్యను కేక వేసి పిలిచాడు. "" ఇదిగో ఒక్క అక్షరం కూడా కుదురుగా రాయలేకపోతున్నా. ఈ కుర్చీని ముందుకు, వెనుకకు ఊపుతువుండు. అప్పుడేమైనా రాయొచ్చేమో ప్రయత్నిస్తా."" *******౦౦౦౦౦******* " కొత్తగా స్కూలుకు వచ్చిన సోషల్ స్టడీస్ టీచర్ " బోధన" గురించి తల్లి తన చిన్నారి కూతుర్ని అడిగింది, తల్లి. "ఆ ,మిస్ కు ఏమీ రాదమ్మా! క్లాస్ రూమ్ లోకి రాగానే, నన్నే ప్రపంచంలో ఖండాలెన్ని?" అని అడిగింది. ---------౦౦౦౦౦ --------- "" ఏమయ్యా! నీకు ప్లీడర్ ఎవరూ లేరా? బయట చెట్టు క్రింద ఎవరో ఒకరు దొరుకుతారు. తెచ్చుకోవయ్యా!" జడ్జీగారు క్లయింట్ తో అన్నాడు. పదిహేను నిముషాల తరువాత ఒక్కడే తిరిగి వచ్చిన క్లయింట్ జడ్జిగారితో చెప్పుకొన్నాడు "" అయ్యా! బయట చెట్టుక్రింద ఉండే ప్లీడర్లంతా జడ్జీలై వేరే ఊళ్ళకు వెళ్ళిపోయినారని."" ******౦౦౦౦౦******* వన్స్ మోర్లతో ఇరవైఒక్క సారి పద్యం పాడి అలసటతో చతికలపడ్డాడు, రంగస్థల కళాకారుడు. " ఏమండీ! పద్యం ఎంత బాగున్నా 21 సార్లు వన్స్ మోర్ కొట్టడం బాగాలేదండీ!"" "" నువ్వు పద్యం బాగా పాడేంతవరకు మేం వన్స్ మోర్ అనకుండా ఆగం!"" ఇది కళాభిమానుల జవాబు. ---- ఇక కొన్ని కార్టూన్స్, జోక్స్, కామిక్స్ చూద్దాం.
అన్నమాచార్యకీర్తనకు ద్విపదానుసరణ *
*అన్నమాచార్యకీర్తనకు ద్విపదానుసరణ *
నిఖిల జీవులలోన నే నెంత వాడ
కడగి యా యీశుండె కాపాడు చుండె
చెప్పినా రెవ్వ రా చిట్టి చీమలకు
పుట్టలో దాన్యమున్ బెట్టుకొండనుచు,
అంతరంగంబులో నాది నుండియునె
సంసార భ్రాంతి నా సర్వేశ్వరుండె
కల్గించి బ్రతుకును కల్గించు చుండె
చెప్పి రెవ్వరు బుద్ధి చెట్టుల కిలను
అదనులో మొలకెత్తి యభివృద్ధి నొంది
కొమ్మలన్ పూవులన్ గూర్చు కొమ్మనుచు,
కూడి చైతన్యమై గుట్టుగా నుండి
అనుగుణ గుణముల న్నందించు నతడె
పుట్టిన మెకముకు బుద్ధెట్లు గలిగె
చనుబాలు వెంటనే చప్పరించుటకు
మృదువైన పచ్చికన్ మెసవుచుండుటకు,
అంతరంగంబులో ననునిత్య ముండి
ప్రాణుల కనువైన పనులను నేర్పి
శ్రీవేంకటేశుండె చేయు సర్వంబు
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
రాశిఫలాలు
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
*17-12-2023 / ఆదివారం / రాశిఫలాలు*
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
మేషం
వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
---------------------------------------
వృషభం
విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. వివాదాలకు సంభందించి విలువైన సమాచారం అందుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
---------------------------------------
మిధునం
ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అకారణ మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు తప్పవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబసభ్యుల నుంచి ధనపరమైన ఒత్తిడి తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
---------------------------------------
కర్కాటకం
వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేదాటుతాయి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఇంటాబయట బాధ్యతలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
---------------------------------------
సింహం
పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో కీలక వ్యవహారాలలో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
---------------------------------------
కన్య
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు సానుకూలమౌతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది.
---------------------------------------
తుల
వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు.
---------------------------------------
వృశ్చికం
చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు అధికమౌతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
---------------------------------------
ధనస్సు
కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనయోగం ఉన్నది. పాతబాకీలు వసూలవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
---------------------------------------
మకరం
కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. సంతాన విద్యా, ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
---------------------------------------
కుంభం
ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో సమస్యలు అదిగమిస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు పంచుకుంటారు. బంధు వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
---------------------------------------
మీనం
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమున భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. కొన్ని పనులలో శ్రమ పడినా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
🍁 *శుభం భూయాత్* 🍀
శ్రీ సత్యన్నారాయణ స్వామి
🌹శ్రీ సత్యన్నారాయణ స్వామి వ్రత కథల అంతరార్థం 🌹
🌿సత్యనిష్ఠులైన వారిలో అరిషడ్వర్గాలకు, ఈర్ష్యాసూయ లకు, అహంకార మమకారాలకు తావుండదు.... ఇలా సత్యనారాయణ స్వామి వ్రత కథలలో మొదటి కథను సాక్షాత్తు నారాయణుడే నారదునికి చెప్పడం విశేషం....
🌸ఇది ప్రతి ఒక్కరికి ప్రేరణ కలిగిస్తుంది, సత్యనిష్ఠకు పునాది వేస్తుంది.... నారాయణుడు ఉదాహరణ పూర్వకంగా మరో నాలుగు కథలు వినిపించాడు....
🌿వాటిలో తాను గీతలో పేర్కొన్న నాలుగు వర్ణాలను ప్రస్తావించాడు....సదానందుడనే బ్రాహ్మణుడు, కట్టెలమ్ముకునే శ్రామికుడు, రాజు వల్ల స్ఫూర్తి పొందిన వైశ్యుని భార్య, లీలావతి, కూతురు కళావతి, చంద్ర కేతువు, తుంగధ్వజుడనే రాజు, గొల్లపిల్లల పాత్రలు ఆ కథల్లో కనిపిస్తారు....సత్యనిష్ఠ వారిలో ఏ విధంగా కలిగింది సూచించబడింది....
🌸సత్య ప్రకృతి ఉన్న వారు లౌకిక, పారలౌకిక జీవితాలలో సుఖ సంతోషాలు పొందగలరని ఆశ్వాసన ఇవ్వడం జరిగింది.....
🌿బ్రాహ్మణుడు తాను జ్ఞానార్జన చేయడమే కాక సమాజాన్ని నడిపించడానికి తన కర్తవ్యాన్ని ఎలా నిర్వహించాలో ఉపదేశించడం జరిగింది....
🌸ఒక రాజు సత్యవ్రత నిష్ఠుడై లీలావతికి ప్రేరణ కలిగిస్తాడు.... భార్య వల్ల స్ఫూర్తిని పొందిన వైశ్యుడు సత్యనారాయణ అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని, సంతానాన్ని పొంది అహంకారంతో భగవంతుణ్ణి మోసం చేయాలనుకుంటాడు...వివేకం నశించి, సత్యనిష్ఠ సడలింది, పర్యవసానం పశ్చాత్తాపం....
🌿పశ్చాత్తప్తులకు భగవంతుడు జ్ఞానబోధ చేసి సక్రమ మార్గంలోకి తెస్తాడు..... క్షత్రియుడు లేదా రాజు సమాజానికి రక్షకుడే కాక అన్ని వర్గాలను సమభావంతో చూడాలి...వర్ణ వివక్షను చూపకూడదు....
🌸సత్య ధర్మాల విషయంలో ఉపేక్ష పనికిరాదు.... ఉపేక్ష పతనానికి దారితీస్తుంది.... తుంగధ్వజుని జీవితం చెప్పే నీతి ఇదే.....
🌿కట్టెలమ్మే వాని వద్ద శ్రమ శక్తి ఉంది. గొల్లపిల్లలు సత్యధర్మాలు తెలిసినవారు.... వీరంతా సమాజ సేవకులే.... వీరందరి అవసరం మిగతా వారికుందని వేరే చెప్పనక్క ర్లేదు.... శరీరంలోని వివిధ అంగాల మాదిరే సమాజంలో ప్రతి ఒక్క వర్గానికి ప్రాముఖ్యం ఉంది....
🌸శరీరం ఒక యంత్రం వంటిది..... అందులో ఏ ఒక్కచక్రం పనిచేయకపోయినా మొత్తం యంత్రం నిష్ఫలమై పోతుంది.... అదే విధంగా శరీరంలో ప్రతి అంగం పనిచేస్తేనే శరీరం నిలబడేది... సమాజమూ అంతే....
🌿ప్రతి వర్ణం తమ బాధ్యత తెలుసుకుని కర్తవ్యాన్ని నిర్వహిస్తే సమాజం ముందుకు సాగుతుంది.... సత్యనారాయణ వ్రత కథలోని ఈ అంతరార్థాన్ని గ్రహించి తదనుగుణంగా ప్రవర్తిస్తే ప్రత్యేకంగా భగవంతుని అర్చించవలసిన అవసరం లేదు....
🌸అతడు సర్వాంతర్యామి అందరి హృదయాలలో సాక్షీభూతంగా ఉన్నాడు.... ఎవరికేది, ఎప్పుడు, ఎంతెంత కావాలో, ఎప్పుడీయాలో అతనికి తెలుసు.... వాటన్నిటినీ ప్రసాదించే భారం తన మీదే ఉంచుకుని శుభం శాంతి ఆనందం అనుగ్రహిస్తాడు..
🌿సందేహించవలసిన అవసరం అంతకన్నా లేదు... అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వ్యష్టిగానో, సమిష్టిగానో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శ్రద్ధతో ఆచరిస్తే నారాయణుడు నారదునికి చెప్పిన విధంగా
🌷ఏవం య: కురుతే సత్యవ్రతం పరమ దుర్లభం
దరిద్రో లభతే విత్తం బద్ధో ముచ్యేత బంధనాత్
🌸భగవంతుని కృపకు పాత్రులై ఇహ పర లోకాలలో సమస్త ఇష్ట కామ్యాలను అనుభవించి ముక్తులవుతారు....
🌸ఓం శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః...స్వస్తి...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
*🚩శ్రీ వివేకానందస్వామి
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *భాగం 117*
"ఏకాంతవాసానికి పోతున్నాను''
భగవదన్వేషణలోనే జీవితం గడపడం అసిధారా వ్రతం లాంటిదని కఠోపనిషత్తు వచిస్తున్నది.
ప్రతి క్షణమూ అప్రమత్తంగా వ్యవహరించకపోతే మార్గం నుండి వైదొలగే ప్రమాదాలుఈ జీవితంలో కొల్లలు. సొంతాలు, బంధాలు అన్ని పారమార్థిక మార్గంలో ఆటంకాలని ఎంచి వాటిని త్యజించి సన్న్యాసం స్వీకరిస్తాడు మనిషి ,కాని అతడి ఎరుక లేకుండానే మిత్రులు, శిష్యులు, సోదర సన్యాసులు, మఠం అంటూ కొత్త బంధాలు తగిలించుకొంటాడు.
ఎంతో అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఈ బంధాలు సైతం ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలుగా పరిణమిస్తాయి. అలాంటి బంధనాల్లో ప్రస్తుతం తాను చిక్కువడుతున్నట్లుగా స్వామీజీకి తోచింది. సోదర సన్న్యాసులతో జపధ్యానాలూ, ఆధ్యాత్మిక సాధనల తోనే రోజులు గడిచాయి. అయినప్పటికీ వారితో కలసి ఉండడం ఆయనకు ఒక అడ్డంకిగానే అనిపించింది.
హృషీకేశ్ లోనూ, హిమాలయాల్లోనూ తనకు తారస వద్ద సన్న్యాసులు ఆయన మనస్సులో తళుక్కున మెదిలారు. ఎలాంటి బంధాలూ లేకుండా సర్వస్వతంత్రంగా వారు గడుపుతున్న జీవితాలు స్వామీజీని గాఢమైన చింతనకు లోను చేశాయి. ఒక గట్టి నిర్ణయానికి ఆయన వచ్చారు.
ఒక రోజు అఖండానందను పిలిచి తాను ఏకాంతంలోకి వెళ్ళగోరు తున్నట్లుగా తెలియజేశారు స్వామీజీ. అందుకు అఖండానంద, "మధ్య ప్రాచ్య ప్రాంతాలకు వెళ్ళాలనే నా ఆకాంక్షను ప్రక్కకు పెట్టి నేను ఈ యాత్రలో పాల్గొనడం మీ కోసమే. ఇప్పుడు నన్ను వదలిపెట్టి వెళ్ళిపోతామంటున్నారే! అన్నాడు ఆవేదనతో. ఆ మాటలు విన్న స్వామీజీ ఇలా అన్నారు:
"సోదర సన్న్యాసులే అయినప్పటికీ బంధం బంధమే; ఆధ్యాత్మిక జీవితానికి వారు కూడా అడ్డంకులే. నువ్వే చూడు, టెహ్రీలో నీకు జబ్బు చేసింది. అప్పుడు నేను కూడా సాధన లేవీ అనుష్ఠించలేకపోయాను కదా! సోదర సన్న్యాసి అనే మాయను సైతం అధిగ మించకుంటే తపోమయ జీవితంలో పూర్తిగా మునగలేం.
తపోమయ జీవితంలో పూర్తిగా మునిగిపోవాలని నేను తలచినప్పుడల్లా గురుదేవులు ఏదో ఆటంకాలను కల్పిస్తున్నట్లుగా తోస్తున్నది. ఇప్పుడు నేను ఏకాంతంలోకి పోతున్నాను. ఎక్కడికి వెళ్ళేదీ, ఎక్కడ బస చేసేదీ ఎవరికీ చెప్పను." అందుకు అఖండానంద, "మీరు పాతాళానికి వెళ్ళినప్పటికీ నేను వెదకి తెలుసుకొంటాను" అన్నాడు.
అందుకు జవాబుగా స్వామీజీ మౌనంగా నవ్వి ఊరకున్నారు.చెప్పినట్లుగానే ఎవరికీ చెప్పాపెట్టకుండా ఒక రోజు మీరట్ నుండి స్వామీజీ బయలుదేరి వెళ్లారు. అది జనవరి 1891.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
సుభాషితం
*జైశ్రీరామ్*
22-6-2020
అభ్యాసం-32
*సుభాషితం*
"హిమాలయం సమారభ్య
యావదిందు సరోవరమ్ |
తం దేవనిర్మితం దేశం
హిందూ స్ధానం ప్రచక్చతే"||
(బృహస్పతి ఆగమం)
*భావం*
హిమాలయాలు మొదలుకొని దక్షిణ (ఇందు) సముద్రమువరకు వ్యాప్తమగుచూ దేవతలచే నిర్మించబడిన భూమి హిందుస్ధానమని చెప్పబడుచున్నది.
బృహస్పతి ఆగమశాస్త్రం ప్రకారం *హిందూ* అన్న పదం హిమాలయములలోని 'హి'వర్ణము,ఇందుసరోవరము (దక్షిణ సముద్రం) లోని 'ఇందు' పదములతో కూడి ఏర్పడి మన సంపూర్ణ మాతృభూమిని సూచిస్తున్నది.
*అమృతవచనం*
మహాయోగి అయిన *శ్రీకృష్ణుడు* *కర్ణునితో*( కురుక్షేత్ర యుద్ధరంగంలో ఉండగా బురదలో దిగబడిన రధచక్రాలను పైకి లేవనెత్తడానికి కర్ణుడు రధంనుంచి క్రిందకు దిగినప్పుడు,అతనిపై బాణ ప్రయోగం చెయ్యమని శ్రీకృష్ణుడు అర్జునుని ఆజ్ఞాపించినప్పుడు, విరధుడై నిరాయుధుడైన ప్రత్యర్ధిపై బాణప్రయోగం అధర్మమని చెపుతూ తనను కొట్టవద్దని ' *ధర్మంపేరున* ' అర్జునుణ్ణి అర్ధించినపుడు) ఇలాఅన్నాడు:
*కర్ణా*! ఈనాటివరకు నువ్వు అనుష్ఠించిన ధర్మశాస్త్ర నియమాలు ఏమున్నాయని ఈనాడు మాకు ధర్మాన్ని బోధిస్తున్నావు ?
మాయా జూదంలో పాండవులను ఓడించినపుడు ఏమైంది నీ ధర్మం ?
నిరాయుధుడు, పశివాడైన *అభిమన్యుని* యోధానయోధులైన మీరందరూ చుట్టుముట్టి సిగ్గువిడిచి నిర్ధాక్షిణ్యంగా సంహరించినపుడు నీవు చెప్పే ఈ ధర్మం ఏమైంది ?
నిస్సహాయురాలు,అబల ఐన *ద్రౌపదిని* నిండుసభలో బహిరంగంగా *దుశ్శాసనుడు* అవమానిస్తోంటే అడ్డుకోకుండా ఇంకా రెచ్చగొట్టేటట్లు మాట్లాడావు అప్పుడు ఈ నీ ధర్మం ఎటు మాయమయింది ?
నేను రక్చించవలసింది ఒక ధర్మమే అదే *ధర్మరాజు* అతని సోదరులు.ఎందుకంటే ధర్మం వారివైపుంది కాబట్టి.నాకు పక్ఛపాతాలు ఏమీ ఉండవు.నేను ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాను.
*శ్రీకృష్ణుడు* ఇట్టి సరియైన దృష్టికోణాన్ని నిరూపించి తద్వారా *అర్జునుని* (పాండవుల) సంకల్పశక్తిని వజ్రసదృశం చేసాడు కాబట్టే అర్జునుడు యుద్ధం చేయగలిగాడు, తద్వారా ధార్మికశక్తుల విజయపతాకాన్ని ఎగురవేశాడు.
శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి
.
ఆలోచనాలోచనాలు
### ఆలోచనాలోచనాలు ### సంస్కృత సూక్తి సుధ ### ( ప్రజ్ఞారసః తృప్తి కరో రసేభ్యః! -జ్ఞానరసమే అన్ని రసాలకన్నా తృప్తి కలిగించే రసం) 1* విద్వానేవ విజానాతి, విద్వజ్జన పరిశ్రమమ్! నహి వంధ్యా విజానాతి, గుర్వీం ప్రసవ వేదనం!! ( పండితుడు చేసిన కృషిని మరియొక పండితుడు మాత్రమే గుర్తించగలడు. గొడ్రాలు అయిన స్త్రీ ప్రసవ వేదన లోని శ్రమను గుర్తించలేదు కదా!) 2* చందనం శీతలం లోకే, చందనాదపి చంద్రమా! చంద్ర చందన యోర్మధ్యే, శీతలా సాధుసంగతి!! ( శీతల గుణం కలది చందనం. చందనం కంటే శీతలమైంది చంద్రుని వెన్నెల. ఈ రెండింటి కన్నా మిక్కిలి శీతలమైంది సజ్జన సాంగత్యం.) 3* దధి మధురం, మధు మధురం, ద్రాక్షా మధురా, సుధాపి మధురైవ! తస్య దేవహి మధురం, యస్య మనో యత్ర సంలగ్నమ్!! (పెరుగు తియ్యగా ఉంటుంది. తేనె, ద్రాక్ష, అమృతాలు తియ్యనివి. కానీ మనస్సు దేనిపై లగ్నమై ఉంటుందో అదే అతడికి/ ఆమెకు మధురాతిమధురం.) 4* నకశ్చిత్ కస్య చిన్మిత్రం, నకశ్చిత్ కస్య చిద్రిపుం! వ్యవహారేణ మిత్రాణి, జాయన్తే రిపువస్తదా!! ( ఎవ్వరికి పుట్టుకతోనే మిత్రులు కానీ శత్రువులు కానీ ఏర్పడరు. మన వ్యవహారశైలిని బట్టి మిత్రులు కాని, శత్రువులు కాని ఏర్పడతారు సుమా! అది అచ్చంగా మన నడవడిపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది.) 5* నతేన వృద్ధో భవతి యేవాస్య ఫలితం శిరః! యోవా యువా స్వధీయానస్తం దేవాస్థ విరం విదుః!! -- మనీస్మృతి. ( తలవెంట్రుకలు నెరసినంత మాత్రాన వృద్ధుడనిపించుకోడు. పిన్న వయస్సు వాడైనప్పటికీ, విద్యగలవాడే వృద్ధుడనిపించుకొంటాడని దేవతలు అంటారు. ) 6* న స్నానమాచరేత్ భుక్త్వా, నాతురాన మహా నిశిః! నవాభిసోభిస్వహోజస్రం, నా విజ్ఞతే జలాశయం!! -- సుభాషిత రత్న భాండాగారం. ( భోజనం చేసిన తరువాత స్నానం చెయ్యకూడదు. రోగి అయిన వ్యక్తి స్నానం చెయ్యకూడదు. అర్థరాత్రి వేళ అస్సలు స్నానం చెయ్యకూడదు. తెలియని మడుగులోకానీ, సరస్సులో కానీ స్నానం చెయ్యడం పనికిరాదు.) 7* క్రోధో వైవస్వతో రాజా, చాశా వైతరణీ నదీ! విద్యా కామదుఘా ధేనుః, సంతుష్టి నందనవనం!!-- నీతి శాస్త్రం. ( కోపమున్నదే అది యమునితో సమానం. ఆశ ఆకాశంలోని వైతరిణీ నది వంటిది.విద్య కామధేనువు వంటిది. సంతృప్తి నందనవనం వంటిది.) 8* నాస్తి కామ సమో వ్యాధిః,నాస్తి మోహ సమో రిపుః! నాస్తి క్రోధ సమో వహ్నిః, నాస్తి జ్ఞానాత్ పరం సుఖమ్!! -- నీతి శాస్త్రం. ( కామం అన్నది వ్యాధి వంటిది. మోహం శత్రువు వంటిది. కోపంతో సమానమైన అగ్ని లేదు.జ్ఞానం కంటే సుఖాన్నిచ్చే మరొక వస్తువు లేదు. కనుక ( మనుష్యులు) జ్ఞానాన్ని పెంచుకోవాలి.) 9* యస్యనాస్తి స్వయం ప్రజ్ఞా, శాస్త్రం తస్య కరోతి కిమ్! లోచనాభ్యం విహీనస్య, దర్పణం కిం కరిష్యతి!! --- సుభాషిత రత్న భాండాగారం. ( కొంత అయినా స్వయం ప్రతిభ లేని వానికి, శాస్త్రముల వలన ప్రయోజనం ఉండదు. కళ్ళులేని కబోదికి అద్దం వలన ఏం ప్రయోజనం ఉంటుంది? 10* చితా, చింతా ద్వయోర్మధ్యే , చింతానామ గరీయసి! చితా దహతి నిర్జీవం, చింతా ప్రాణయుతం వపుః!! -- నీతి శాస్త్రం. ( చిత ( శవాన్ని కాల్చే కట్టెల రాశి), చింత ( దిగులు లేదా విచారము) ఈ రెండింటి మధ్య రెండవదే మిక్కిలి బాధాకరము. మొదటిది చనిపోయిన శవాన్ని తగులబెడితే, రెండవది బ్రతికి ఉండగా మనిషిని కాల్చివేస్తూ ఇబ్బందిని కలుగజేస్తుంది. 11* లోభేన బుద్ధిశ్చలతి, లోభో జనయితే త్వషామ్! త్వషార్తో దుఃఖమాప్నోతి, పరత్రేహచ మానవః!! -- సుభాషిత రత్న భాండాగారం. ( ధనంపై అత్యాశ ఉన్నట్లయితే, మనస్సు చలిస్తుంది. ధనాశ కోరికలను పెంచుతుంది. ధనాశ గల వ్యక్తి ఇహ, పర లోకాల్లోను దుఃఖిస్తాడు. కాబట్టి లోభం ( ధనంపై అత్యాశ ) కూడదు. 12* వరం దరిద్రః, శ్రుతి శాస్త్ర పారంగతః! నచాపి మూర్ఖః, బహురత్న సంచయః!! --- సుభాషిత రత్న భాండాగారం. వేద శాస్త్ర పారంగతుడైన వ్యక్తి దరిద్రుడైనప్పటికీ ఉత్తముడే, శ్రేష్ఠుడే! అనేక రత్న భాండాగారాలు ఉన్నప్పటికీ మూర్ఖుడు ఎన్నటికీ శ్రేష్ఠుడు కాలేడు. చివరగా ఒక చమత్కార శ్లోకం. శిరసా ధార్య మాణోపి, సోమః సౌమ్యేన శంభునా! తథాపి కృశతాం యాతి, కష్టం ఖలు పరాశ్రయః!! పరమశాంతుడైన శివుడు చంద్రుణ్ణి తన తలమీదనే అలంకారంగా పెట్టుకొన్నాడు. అయినా ఏం లాభం? ఆ చంద్రుడు రోజు, రోజుకు క్షీణిస్తూనే ఉన్నాడు. పరులను ఆశ్రయించి బ్రతకడం కష్టమే కదా? తేది 17--12--2023, అదివారం, శుభోదయం.
ధనుర్మాస ధ్యానం
*ధనుర్మాస ధ్యానం భజనం 2023-24 ప్రత్యేక శీర్షిక .*💐
*అన్నమయ్య అజరామర సంకీర్తనలు - 01*
🌺🍃 *----------------* 🍃🌺
*అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 359*
*( అదివో అల్లదివో హరివాసము ... )*
🌺🍃 *----------------* 🍃🌺
ఓం నమో వేంకటేశాయ. 🙏
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 359 కి శుభ స్వాగతం ..🙏
*ప్రార్థన ః--*🌹🙏
*అదిగో వేంకటనగ మది-*
*గదిగో వైకుంఠమనగ నదియే యిలలో !*
*పదముల కలసట లేలా ?*
*పదపదరే వేంకటాద్రి వరదుని కడకున్ !*
🌹🙏🌹
✍️ *స్వీయపద్యము ( కందము )*
🌹🌹
( అలసట మరచి ఇలవౖకుంఠమైన తిరుమల కొండనెక్కి
ఆ వేంకటాద్రి విభుని వద్దకు చేరుదాము ! 🙏
అదిగో మన చేరువనే ఉన్నది ,ఆలస్యము వలదు , అలపులు అసలే వలదు !!🙏 )
🌹🙏🌹
🌺🍃 *----------------* 🍃🌺
అన్నమాచార్యుల వారి సుప్రసిద్ధ సంకీర్తనలలో ఆది కీర్తనగా దీనిని పరిగణించుకోవచ్చు .
ప్రతీ తెలుగింటిలోనూ మారుమ్రోగే కీర్తన ఇది . 🙏
ఈ పాట పాడుకుంటూ ఆ తిరుమల కొండ మెట్లు ఎక్కుతుంటే అలసట అన్నది ఉంటుందా అసలు ?🙏
అంతటి ఉత్సాహాన్ని మనలో నింపారు అన్నమయ్య ఆ తిరుమల కొండను అండగా చూపించి .
అందరికీ తెలిసిన కీర్తనయే ఐనా నా తృప్తికోసము భావార్థమును అందిస్తున్నాను అంతే ! 🙏
🌺🍃 *----------------* 🍃🌺
🌹🌹
అదిగో ! అదిగదిగో ! అదేనయ్యా ఆ శ్రీ హరి మనకోసమే కొలువైన కొండ , ఆయన స్థిరనివాసమును ఏర్పరుచుకున్న కొండ .🙏
ఆ కొండ ఎంత గొప్పగా ఉన్నదో చూడండి ఆ ఆది శేషుని వేయిపడగలతో ముందే స్వామికొరకు వచ్చి అమరినట్లుగా ఉన్నది .🙏
శేషశాయి అయిన ఆ *శ్రీమన్నారయణుని* శేషతల్పమే ఈ కొండ .🙏
🌹🌹
అదే వేంకటాద్రి కొండ .
అన్నిటికీ మించినదియై పొడవుగా అలరారుచున్నది .🙏
అదియే ఆ బ్రహ్మ మొదలగు వారికి మిక్కిలి విలువైన , అసాధారణమైన కొండ .🙏
అదియే శ్రేష్టులైన మౌని తపస్వులకందరికీ నిజమైన ఇరవు .🙏
అదిగో చూడండి ! అదిగో ఆ కొండకు నమస్కరించుకోండి !🙏
అంతకు మించిన ఆనందము మరెక్కడా ఉండదు . అక్కడికి చేరుటయే అన్నిటికీ మించిన ఆనందమగును .🙏
🌹🌹
అదిగో ప్రక్కనే శేషాద్రి కొండ కూడా శోభలతో కూడి యున్నది .
ఆ ఆకాశాన ఉన్న దేవతలకందరికీ ఇదియే సత్యమగు నిధానము .🙏
మన ముందరే అదిగో గర్భగుడిలో వెలసి నిలుచున్నాడు సంపదలకంతటికీ గొప్ప సంపదయైన వాడు .🙏
బంగారు కాంతులీనుచూ గోపుర శిఖరములతో ఆ పరబ్రహ్మ స్వరూపమే అయి ముక్తిని ప్రసాదించే దివ్య ధామము .🙏
🌹🌹
ఇక్కడికి చేరుతున్నామంటే ఆ వైకుంఠమునకు చేరువలో ఉన్నాము అనియే భావించండి .అంత గొప్పనైనది ఈ వేంకటాద్రి .🙏
ఈ కొండయే ఆ *శ్రీ వేంకటేశ్వరునికి* సిరియై యున్నది .🙏
అసలు చిత్త శుద్ధిగా భావన చేసితే ,
సంపదలన్నిటిలోకి మేలైన సంపద ఇదియే .🙏
పవిత్రములైన వాటన్నిటిలోకి అమిత పవిత్రమైనది కూడా ఇదియే .🙏
రండి ఆ వేంకటాద్రి కొండ ఎక్కెదము . *శ్రీ వేంకటేశ్వరుని* దర్శించుకుని ధన్యులమౌదాము .🙏
🌹🙏🌹
*ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !*🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
*( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 359)*
✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 🙏
🌹🌹 *సంకీర్తన* 🌹🌹
*॥పల్లవి॥*
అదివో అల్లదివో హరివాసము
పదివేలుశేషుల పడగల మయము
*॥చ1॥*
అదె వేంకటాచల మఖిలవున్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు-
నదె చూడుఁడదె మొక్కుఁడానంద మయము
*॥చ2॥*
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము
*॥చ3॥*
కైవల్యపదము వేంకటనగ మదివో
శ్రీవేంకటపతికి సిరులైనది
భావింప సకలసంపద రూపమదివో
పావనములకెల్లఁ బావన మయము
🌹🙏🌹🙏🌹
వామనావతారం
*ॐ భద్రాచల రామయ్య - వామనావతారం*
*ముక్కోటి ఉత్సవాలలో 5వ రోజైన ఈరోజు భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి "వామన" అవతారుడుగా దర్శనం అనుగ్రహిస్తారు.*
*దాశరథీ శతకం - వామనావతారం*
*పదయుగళంబు భూ గగన భాగములన్*
*వెసనూని విక్రమా*
*స్పదమగు నబ్బలీంద్రు నొకపాదమునం*
*దలక్రిందనొత్తి మే*
*లొదవ జగత్త్రయంబు*
*బురుహూతునకియ్య వటుండవైన చి*
*త్సదమలమూర్తి వీవెకద!*
*దాశరథీ కరుణాపయోనిధీ!*
*అనువాద శ్లోకం (సంస్కృతం)*
*ధారిణ్యాం ప్రథమం తతశ్చగగనే*
*దత్వాద్వితీయం పదం*
*తార్తీయేన బలాద్బలె రవనతం*
*భక్త్యాశిరోనామయన్ I*
*దేవేన్ద్రాయజగత్ప్రభుత్వమదదా*
*భూత్వావటుర్వామనః*
*శ్రీమన్ దాశరథే దయాజలనిధే!*
*భద్రాద్రి భాగ్యావధే! ॥*
*O! Rama the mighty son of King Dasaratha, and the Lord, residing on the crest of the mountain Bhadra, You, the ocean of compassion:*
*Have You not in Your incarnation as Vamana(the little Brahmachari) covered the entire universe with one of Your feet and thr sky with the other and pressed down into the nether world the mighty Rakshasa sovereign Bali, to the entire satisfaction and joy of the peopleof all the worlds and restored sovereignityto Indra?*
*అంతరార్థం*
*బలి - జన్మాంతరమైన వాసనా బీజ బలమే బలి*
*వామన - త్రివిక్రమ*
*—అణురూపమైన భగవానుడు విశ్వవ్యాపకుడు.*
*(అణోరణీయాన్ మహతో మహీయాన్)*
*వా మనః = మనస్సా?*
*Is it the mind?*
*మూడడుగులు*
*విశ్వ, తేజస, ప్రాజ్ఞ స్థితులు*
*జాగృత్, స్వప్న, సుషిప్తి అవస్థలు*
*స్థూల,సూక్ష్మ, కారణ దేహాలు*
*1. లోకవాసన(కీర్తి ప్రతిష్ఠలకై చేయు పనులు),*
*2.శాస్త్రవాసన(తన శాస్త్ర జ్ఞానమే గొప్పదను వాదన),*
*3.దేహవాసన(వయస్సువల్ల వచ్చే మార్పునంగీకరించక చేసే ప్రయత్నాలు) అనే మలినవాసనలు*
*కారణ దేహం వాసనాబీజం. అదికూడా నశిస్తే తప్ప మోక్షజ్ఞానానందానికి వెళ్ళే అవకాశంలేదు.*
*బలిని "సుతల" లోకానికి పంపడం అంటే,*
*(సు = మంచి, తల = స్థానం)*
*మోక్ష స్థానమే అయిన మంచిలోకానికి అనుగ్రహించడం.*
*వామనావతారం జరిగి ఇప్పటికి 4,40,45,064 సంవత్సరాలయింది.*
*— రామాయణంశర్మ*
*భద్రాచలం*
శ్రీ మదగ్ని మహాపురాణము
*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*
. *భాగం - 10*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 4*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
*వరాహావతార వర్ణనము - 2*
వక్ష్యే పరశురామస్య చావతారం శృణు ద్విజ | ఉద్ధతాన్ క్షత్రియాన్ మత్వా భూభార హరణాయ సః. 12
అవతీర్ణో హరిః శాన్త్యై దేవవిప్రాదిపాలకః | జమదగ్నే రేణుకాయాం భార్గవః శస్త్రపారగః. 13
ఓ బ్రాహ్మణా! పరశురాముని అవతారమును గూర్చి చెప్పెదను వినుము. ఆ శ్రీమహావిష్ణువు, క్షత్రియులు ఉద్దతులుగా ఉన్నా రని తలచి, భూబారమును హరించుటకై, దేవతలను, విప్రాదులను పాలింపనున్నవాడై, శాంతిని నెలకొల్పుటకై, జమదగ్నినుండి రేణుకయందు సర్వశాస్త్రవిద్యాపారంగతు డైన భార్గవుడుగా (పరశురాముడుగా) ఆవతరించినాడు.
దత్తాత్రేయప్రసాదేన కార్తవీర్యో నృపస్త్వభూత్ | సహస్రబాహుః సర్వోర్యీపతిః స మృగయాం గతః. 14
కార్తవీర్యుడను రాజు దత్తత్రేయుని అనుగ్రహముచే వేయిబాహువులు కలవాడుగను, సకల భూమండలమునకును రాజుగను ఆయెను. అతడు వేటకు వెళ్లెను.
శ్రాన్తో నిన్త్రితో7రణ్య మునినా జమదగ్నినా | కామధేనుప్రభావేణ భోజితః సబలో నృపః. 15
అరణ్యములో అలసిన సేనానమేతు డైన ఆ రాజును జమదగ్ని మహర్షి నిమంత్రించి కామధేనవు ప్రభావముచేత భోజనము పెట్టెను.
అప్రార్థయత్కామధేను యదా స న దదౌ తదా | హృతవానథ రామేణ శిరశ్ఛిత్వా నిపాతితః. 16
యుద్ధే పరశునా రాజా సధేనుః స్వాశ్రమం య¸° |
కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువును తన కిమ్మని కోరెను. జమదగ్ని ఈయ నిరాకరించెను. ఆపుడాతడు దానిని అపహరించెను. పిదప పరశురాముడు యుద్దములో పరశువుచే అతని శిరస్సు ఛేదించి సంహరించి ధేనువుతో ఆశ్రమమునకు తిరిగి వెళ్లెను.
కార్తవీర్యస్య పుత్త్రెస్తు జమదగ్నిర్ని పాతితః.
రామే వనం గతే వైరాదథ రామః సమాగతః | 17
పితరం నిహతం దృష్ట్వా పితృనాశాభిమర్షితః. 18
త్రిఃసప్తకృత్వః పృథివీం నిఃక్షత్రామకరోద్విభుః |
కురుక్షేత్రే పఞ్చకుణ్డాన్ కృత్వా సన్తర్ప్య వై పితౄన్.
కశ్యపాయ మహీం దత్వా మహేన్ద్రే పర్వతే స్థితః | 19
పరశురాముడు వనమునకు వెళ్ళి యుండగా కార్తవీర్యుని పుత్రులు పూర్వవైరమువలన జమదగ్నిని చంపిరి. అంత తిరిగి వచ్చిన ప్రభావశాలి యగు పరశురాముడు చంపబడిన తండ్రిని చూచి, తండ్రిని ఆ విధముగ చంపుటచే కోపించి, ఇరువదియొక్క పర్యాయములు పృథివిని క్షత్రియులు లేనిదానినిగాచేసి, కురుక్షేత్రమునందు ఐదు కుండములను చేసి, వాటితో పితృదేవతలను తృప్తిపరచి, భూమి నంతను కశ్యపునకు దానము చేసి, మహేంద్రపర్వతముపై నివసించెను.
కూర్మస్య చ వరాహస్య నృసింహస్య చ వామనమ్ |
అవతారం చ రామస్య శ్రుత్వా యాతి దివం నరః. 20
ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే వరాహనృసింహాద్యవతారో నామ చతుర్థోధ్యాయః.
కూర్మ, వరాహ, నరసింహ, పరశురామావతారగథలు విన్న మానవుడు స్వర్గమునకు వెళ్లును.
అగ్ని మహా పురాణములో వరాహనృసింహాద్యవతార మనెడు చతుర్థాధ్యాయము సమాప్తము.
సశేషం......
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*
. *భాగం - 11*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 5*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
*రామావతార వర్ణనము*
*అథ పంచమోధ్యాయః.*
*అథ శ్రీ రామావతారవర్ణనమ్.*
*అగ్ని రువాచ :-*
రామాయణమహం వక్ష్యే నారదేవనోదితం పురా| వాల్మీకయమే యథా తద్వత్పఠితం భుక్తిముక్తిదమ్. 1
అగ్ని పలికెను : దేనిని పఠించినచో భుక్తియు ముక్తియు లభించునో అట్టి రామాయణమును, నాదరుడు వాల్మీకి చెప్పన విధమున చెప్పెదను.
నారద ఉవాచ :-
విష్ణునాభ్యబ్జజో బ్రహ్మా మరీచిర్ర్బహ్మణః సుతః | మరీచేః కశ్యపన్తస్మాత్సూర్యో వైవస్వతో మనుః. 2
తత స్తస్మాత్తథేక్ష్వాకుస్తస్య వంశే కకుత్థ్సకః | కకుత్థ్సస్య రఘస్తస్మాదజో దశరథస్తతః. 3
విష్ణువు నాభియందలి పద్మమునుండి బ్రహ్మ పుట్టెను. మరీచి బ్రహ్మ కుమారుడు. మరీచికి కశ్యపుడును, ఆతనికి సూర్యుడును, సూర్యునకు వై వస్వతమనువును అతనికి ఇక్ష్వాకువును పుట్టిరి. ఆతని వంశమునందు కకుత్థ్సడు పుట్టెను. కకుత్థ్సునకు రఘువు, రఘువునకు అజుడు, అజునకు దశరథుడును పుట్టెను.
రావణాదేర్వధార్థాయ చతుర్ధాభూత్స్వయం హరిః | రాజ్ఞో దశరథాద్రామః కౌసల్యాయాం బభూవ హ.
కై కేయ్యాం భరతః పుత్రః సుమిత్రాయాం చ లక్ష్మణః | 4
శత్రుఘ్నః ఋష్యశృఙ్గేణ తాసు నంద త్తపాయసాత్.
ప్రాశితాద్యజ్ఞసంసిద్ధాద్రామాద్యాశ్చ సమాః పితుః | 5
శ్రీమహావిష్ణువు రావణాదులను వధించుటకై తాను నాలుగు విధములుగా అయి దశరథమహారాజు వలన కౌసల్య యందు రాముడుగను, కై కేయియందు బరతుడుగను, సుమిత్రయందు లక్ష్మణశత్రుఘ్నలుగను జనించెను. బుష్యశృంగుని సాహాయ్యముచే యజ్ఞమునందు లభిలంచిన పాయసమును కౌసల్యాదుల కీయగా, వారు దానిని భూజింపగా, తండ్రితో సమానులైన రామాదులు జనించిరి.
యజ్ఞవిఘ్నవినాశాయ విశ్వామిత్రార్థితో నృపః.
రామం సంప్రేషయామాస లక్ష్మణం మునినా సహ | 6
విశ్వామిత్రుడు కోరగా దశరథుడు యజ్ఞవిఘ్నములను తొలగించుటకై లక్ష్మణసమేతుడైన రాముని విశ్వామిత్రునితో పంపెను.
రామో గతో7స్త్రశస్త్రాణి శిక్షితస్తాడకాన్తకృత్.
మారీచం మానవాస్త్రేణ మోహితం దూరతోనయత్ | 7
సుబాహుం యజ్ఞహన్తారం సబలం చావధీద్బలీ. 8
తాటకను సంహరించిన రాముడు (విశ్వామిత్రునినుండి) అస్త్ర శస్త్రములను పొందను. మానవాస్త్రముచే మారీచుని మూర్ఛితుని చేసి దూరముగా పడవేసెను. బలవంతుడైన ఆ రాముడు యజ్ఞమును పాడుచేయుచున్న సుబాహుని సేనా సహితముగా సంహరించెను.
సిద్ధాశ్రమనివాసీ చ విశ్వామిత్రాదిభిః సహ | గతః క్రతుం మైథిలస్య ద్రష్టుం చాపం సహానుజః. 9
సిద్ధాశ్రమమునందు నివసించినవాడై, విశ్వామిత్రాదులతో కలిసి, లక్ష్మణ సమేతుడై, జనకుని యజ్ఞమును, ధనస్సును చూచుటకై వెళ్ళెను.
శతానన్దనిమిత్తేన విశ్వామిత్రప్రభావతః | రామాయ కథితే రాజ్ఞా స మునిః పూజితః క్రతౌ. 10
శతానందుడు విశ్వామిత్రుని ప్రభావమును గూర్చి రామునకు చెప్పెను. ఆ యజ్ఞమునందు జనకుడు ముని సమేతుడైన రాముని పూజించెను.
ధనురాపూరయామాస లీలయా స బభజ్ఞ తత్ | వీర్యశుల్కాం చ జనకః సీతాం కన్యాం త్వయోనిజామ్. 11
దదౌ రామాయ రామో7పి పిత్రాదౌ హి సమాగతే | ఉపయేమే జానకీం తామూర్మిలాం లక్ష్మణ స్తథా. 12
శ్రుతకీర్తిం మాణ్డవీం చ కుశధ్వజసుతే తథా | జనకస్యానుజస్త్యెతే శత్రుఘ్నభరతావుభౌ.
కన్యే ద్వే ఉపయేమాతే - 13
రాముడు ధనస్సును ఎక్కు పెట్టి దానిని అనాయాసముగా విరచెను. జనకుడు వీర్యమే శుల్కముగా కలదియు, ఆమోనిజయు అగు తన కన్య యైన సీతను రామున కిచ్చెను. తండ్రి మొదలైన వారు వచ్చిన పిమ్మట రాముడు సీతను, లక్ష్మణనుడు ఊర్మిళను, జనకుని తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన మాండవీ శ్రుతకీర్తులను భరత శత్రఘ్నులును వివాహమాడిరి.
జనకేన సుపూజితః |
రామోగాత్స వసిష్ఠాద్యైర్జామదగ్న్యం విజిత్య చ |
అయోధ్యాం భరతోప్యాగాత్సశత్రుఘ్నో యుధాజితః.
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రామాయణ బాలకాణ్డ వర్ణనం నామ పఞ్చమోధ్యాయః.
ఆ రాముడు జనకునిచే బాగుగా సత్కరింపబడినవాడై, వసిష్ఠాది సమేతుడై పరశురాముని జయించి ఆమోధ్యకు వెళ్ళెను. భరతుడు శత్రుఘ్న సమేతుడై యుధాజిత్తు నగరమునకు వెళ్ళెను.
*అగ్ని మహాపురాణము నందు రామాయణ బాలకాండ వర్ణన మను పంచమాధ్యయము సమాప్తము.*
సశేషం.....
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
నవగ్రహా పురాణం
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *107వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*రాహుగ్రహ చరిత్ర - 3*
దేవదానవులు అందరూ కలసి , వాసుకిని మందర పర్వతం చుట్టూ తాడులాగా చుట్టారు. దేవతలు వాసుకి పడగ వైపు పట్టుకున్నారు.
*"తుచ్ఛమైన పుచ్ఛాన్ని మేమెందుకు పట్టుకోవాలి ? పడగ వైపే పట్టుకుంటాం !'* అంటూ రాక్షసులు మొండికేశారు.
దేవతలు వాళ్ళకు వాసుకి పడగ వైపు వదిలేసి , తాము తోక వైపు పట్టుకున్నారు.
మనం ప్రారంభించగానే , మందరగిరి సముద్రంలో మునిగిపోయింది. వెంటనే శ్రీమహావిష్ణువు లక్షా ఆమడల వెడల్పు వీపుతో , మహాకూర్మంగా అవతరించాడు. సముద్రంలోకి వెళ్ళి క్రింద తన వీపును చేర్చి , అవలీలగా మందర పర్వతాన్ని వాసుకితో సహా పైకి లేపాడు.
సాగర మథనం నిర్విఘ్నంగా ప్రారంభమైంది. దేవతలూ , రాక్షసులూ ఉత్సాహంతో వేగంగా చిలకసాగారు.
ఉన్నట్టుంది , సాగరంలోంచి పొగలు చిమ్ముతూ , నిప్పు రవ్వల్లాగా చిటపటలాడుతూ 'హాలాహలం' అనే ఘోర విషం ఉద్భవించింది. దేవతలూ , దానవులూ హాహాకారాలు చేస్తూ అటూ ఇటూ పరుగెట్టారు.
బ్రహ్మ సూచనను అనుసరించి , దేవతలు పరమశివుణ్ణి ప్రార్థించారు. భయంకర హాలాహలాన్ని నియంత్రించి , లోకాలను రక్షించమంటూ మొరపెట్టుకున్నారు.
పరమశివుడు తక్షణమే సాగరతీరంలో సాక్షాత్కరించాడు. నిప్పులు కక్కుతూ. పొగలు చిమ్ముతూ సర్వత్రా వ్యాపిస్తున్న హాలాహల విషాన్ని చూస్తూ సర్పకంకణంతో అలరారుతున్న తన దక్షిణ హస్తాన్ని చాచి , హుంకారం చేశాడు. ఆయన హుంకార శక్తి హాలాహల వ్యాప్తి మీద తక్షణం మహా ప్రభావాన్ని చూపింది.
దిక్కులలో వ్యాపించుకు పోతున్న ఆ దారుణ విషం వెంటనే నల్లటి మేఘంలా ఘనీభవించింది. ఆ వెంటనే నల్లటి ఏనుగులా మారింది. అనంతరం కుంచించుకుపోతూ పంది ఆకారం ధరించింది. క్షణంలో కోకిలలాగా చిన్నదైంది. మరుక్షణం - నేరేడు పండులాగా చిన్న ఉండగా మారి , పరమశివుడి హస్తంలో నిలిచింది.
వైద్యనాధుడూ , ఔషధగుళికా గుటుక్కున మ్రింగాడు ! మ్రింగిన విషాన్ని కంఠ భాగంలో బంధించాడు. అప్పుడు ఆ విషగుళిక ఆయన కంఠానికి అలంకరించుకున్న నీలిరంగు రత్నంలా కనిపించింది !
దేవదానవులూ , బ్రహ్మాదులూ అందరూ పరమశివుడు చేసిన అద్భుతాన్ని ఆశ్చర్యంతో చూశారు. *"నీలకంఠా ! నీలకంఠ ! శరణు ! శరణు !"* అంటూ నినదించారు.
దోషమైన హాలాహల విషాన్ని స్వీకరించి , గుణమైన అమృతాన్ని దేవదానవులకు వదిలిపెట్టి - బిడ్డ అనారోగ్యాన్ని తీసుకుని , ఆరోగ్యాన్ని ఇచ్చే తల్లిలాగా ప్రవర్తించిన పరమశివుడు సాగరమథన కార్యాన్ని మళ్ళీ ప్రారంభించమన్నాడు.
సాగరమథనం పునః ప్రారంభమైంది. దేవదానవుల చేత వాసుకి త్రాడుగా గిరగిరా తిరిగింది తరిగొండ.
బ్రహ్మాండమైన శబ్దంతో , వేగంతో చిలకబడుతున్న పాలకడలిలో నుంచి ప్రప్రథమంగా ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆమె శరీరం నల్లగా ఉంది. భయంకరమైన ముఖకవళిక , గాజు గోళాల్లా పైకి పొడుచుకు వచ్చిన నేత్రాలు , రోత పుట్టించే నవ్వు ! ఆమెను చూడగానే దేవతలూ , రాక్షసులూ తలలు తిప్పుకున్నారు.
భయనాక ఆకారంతో ఉన్న ఆ వనిత సాగరమథన కార్యానికి నాయకత్వం వహిస్తున్నట్టు తీరాన నిలుచున్న త్రిమూర్తులను సమీపించింది. జుగుప్సాకరమైన ఆమె రూపాన్ని చూడలేక ఆ ముగ్గురూ తలలు తిప్పుకున్నారు. ఎటు తిరిగినా - తన నాలుగు ముఖాలలో ఏదో ఒక ముఖం ఎదురుగా ఆమె ఉండడంతో చతుర్ముఖుడు కలవరపడి పోయాడు.
*“నేనెవరు ? ఏం చేయాలి ?"* అందామె త్రిమూర్తులను ఉద్దేశించి. పరమేష్ఠీ. పరమేశ్వరుల చూపులను అర్ధం చేసుకున్న శ్రీమహావిష్ణువు ఆమెతో అన్నాడు. *"సాగర మథనంలో ప్రప్రథమంగా నువ్వు ఆవిర్భవించావు. నువ్వే జ్యేష్ఠురాలివి. నీ పేరు జ్యేష్టాదేవి ! సకల అవ లక్షణాలూ నీలో ఉన్న కారణంగా నువ్వు 'అలక్ష్మీ' అనీ , 'మూదేవీ' అని వ్యవహరించబడతావు !".*
*"జ్యేష్టాదేవి , అలక్ష్మి , మూదేవి ! అన్నీ చక్కని నామధేయాలే !"* అందామె ఉత్సాహంగా , *"నా నివాసం ఎక్కడో చెప్పండి !"*
*"లోకాలలోని అపవిత్రమైన , నిందనీయమైన , నీచమైన స్థానాలే నీ స్థావరాలు ! వెళ్ళు !"* అన్నాడు శ్రీమహావిష్ణువు. జ్యేష్టాదేవి కులుకుతూ వెళ్ళిపోయింది. అందరూ తేలికగా ఊపిరులు పీల్చుకున్నారు.
తదనంతరం సాగరం నుండి అష్టదళ పద్మంలో కూర్చుని ఆదిలక్ష్మి అవతరించింది. భువనమోహనమైన ఆమె సౌందర్యాన్ని చూస్తూ , శ్రీమహావిష్ణువు మైమరిచి పోయాడు. దేవదానవులందరూ అసంకల్పితంగా ఆమెకు నమస్కరించారు. ఆమె విశాల నేత్రాలు. శ్రీమహావిష్ణువునే చూస్తున్నాయి. విష్ణువు లక్ష్మిని స్వీకరించాడు.
అనంతరం చంద్రుడు నెలవంక ఆకారంలో ఆవిర్భవించాడు. కంఠంలో ధరించిన హాలాహలం ఉష్ణప్రకోపాన్ని నియంత్రించడానికి శివుడు చంద్రవంకను స్వీకరించి , జటాజూటంలో అలంకరించుకున్నాడు.
ఆ పిమ్మట ఆవిర్భవించిన 'కౌస్తుభం' అనే దివ్య మణిని శ్రీమహావిష్ణువు తన వక్షం. మీద ధరించాడు.
వెంట వెంటనే సాగర గర్భంలోంచి శ్వేతాశ్వమైన 'ఉచ్ఛైశ్రవం', నాలుగు దంతాల 'ఐరావతం', 'కామధేనువు', 'కల్పవృక్షం' , 'పారిజాతం' మొదలైన స్వర్గలోక వైభవ చిహ్నాలు ఉద్భవించాయి. వాటిని ఇంద్రుడు స్వీకరించాడు. తదనంతరం ఉద్భవించిన అప్సరసలు కూడా ఇంద్రుడి వద్దకు చేరుకున్నారు. దుర్వాస మహర్షి శాపంతో నీటి పాలైపోయిన స్వర్గ సంపదలన్నీ మహేంద్రుడికి మళ్ళీ లభించాయి.
దేవదానవులు నూతనోత్సాహంతో మథనం చేయసాగారు. వాళ్ళ శ్రమ ఫలవంతమైందని తెలియజేస్తూన్నట్టు ఒక దివ్య పురుషుడు జన్మించాడు. సాగర గర్భంలోంచి. ఆజానుబాహుడైన ఆ దివ్య పురుషుడి శరీరం నీలమేఘ వర్ణంలో ఉంది. ఆయన నేత్రాలు ఎర్రగా ఉన్నాయి. శిరోజాలు నల్లగా నిగనిగలాడుతున్నాయి. శరీరం నిండా , రకరకాల ఆభరణాలున్నాయి. ఆయన చేతిలో తెల్లటి కలశం ఉంది. ఆయన పేరు ధన్వంతరి. ఆయన చేతిలోని శ్వేత కలశంలో అమృతం !
అమృతకలశాన్ని చేతులలో పట్టుకుని , ధన్వంతరి సముద్రంలో నుంచి తీరానికి వస్తున్నాడు. ఆయనను చూస్తూ దేవతలు హర్షధ్వానాలు చేస్తూ ఉండిపోయారు.
రాక్షసులు పరుగెట్టికెళ్ళి , ధన్వంతరి చేతుల్లోంచి అమృతకలశాన్ని లాక్కున్నారు. కలశంతో పారిపోతున్న ఒక రాక్షసుడిని మరొకడు అడ్డగించి కలశాన్ని లాక్కున్నాడు. ఇలా రాక్షసులు ఒకరి చేతిలోంచి మరొకరు లాక్కుంటూ , గొడవపడసాగారు. కాస్సేపట్లో అసురల మధ్యనే అమృతం కోసం సంకుల సమరం ప్రారంభమైంది. ఆందోళన చెందుతున్న ఇంద్రాది దేవతలకు శ్రీమహావిష్ణువు ధైర్యం చెప్పాడు.
శ్రీమహావిష్ణువు 'మోహిని' అనే సౌందర్యరాశిగా మారిపోయాడు. ఆమె అమిత సౌందర్యం దేవతలకే మతులు పోగొట్టింది ! ఆయన తమ విష్ణువే అనీ , అమృతాన్ని తమకు దక్కించడం కోసం చక్కని చుక్కగా , శృంగార దేవతగా మారాడనీ వాళ్ళు. తాత్కాలికంగా మరిచిపోయారు.
ఇక రాక్షస వీరులైతే మంత్ర ముగ్ధులైపోయారు. అమృత కలశాన్ని మరిచిపోయి ఆ అందాల భరిణ అయిన మోహిని సౌందర్యాన్ని తమ నేత్రచషకాలతో జుర్రుకోవడం ప్రారంభించారు.
విశ్వంలోని అందమైన , సుకుమారమైనవన్నీ మోహిని శరీరావయవాలుగా కనిపిస్తున్నాయి అసురులకు విష్ణుమాయ మోహిని రూపంలో వాళ్ళను పూర్తిగా , దట్టమైన మంచు ప్రకృతి కప్పినట్టు , కప్పివేసింది. అమృతకలశాన్ని పట్టుకున్న ఓ రాక్షస వీరుడు మోహినిని సమీపించాడు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
తిరుప్పావై
*ॐ తిరుప్పావై*
*పాశురము : 1/30*
*భావము*
*సుసంపన్నమైన గోకులంలో పుట్టి, సుశోభితులైన గోపికలారా!*
*మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి.*
*శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రుడును,*
*యశోదకు బాల సింహము వంటి వాడును,*
*నల్లని మేఘము వంటి శరీరమును కలిగి,*
*చంద్రునివలె ఆహ్లాదకరుడును,*
*సూర్యునివలె తేజోమయుడునుయైన నారాయణునే తప్ప,*
*ఇతరులెవ్వరినీ కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు.*
*కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి,*
*లోకము ప్రకాశించునట్లుగ,*
*దానికి అంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును,*
*ఆలసింపక శీఘ్రముగ రండని*
*శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.*
*పాశురం*
*మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్*
*నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్*
*శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్*
*కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్*
*ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్*
*కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్*
*నారాయణనే నమక్కే పఱై దరువాన్*
*పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !*
https://youtu.be/tDrBYrBjghw
ఆఖరి ప్రయత్నం
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
*ఆఖరి ప్రయత్నం.. బోధ..పర్యవసానం..*
*(అరవై వ రోజు)*
తాను కబురు పెట్టేదాకా ఆశ్రమానికి రావొద్దని శ్రీధరరావు దంపతుల తో శ్రీ స్వామివారు చెప్పిన తరువాత..శ్రీ స్వామివారు కఠోర తపస్సు చేయనారంభించారు..ఆహారం దాదాపుగా విసర్జించారు..ఏ రెండు మూడు రోజులకో ఒకసారి కొద్దిగా ఆహారాన్ని స్వీకరిస్తూ తిరిగి తపస్సు లోకి వెళ్లిపోయేవారు..ఏప్రిల్ నెల 1976 వ సంవత్సరం..చివరి వారం లో ఒకసారి శ్రీధరరావు గారిని రమ్మని కబురు పంపించారు..
అంతకుముందు శ్రీ స్వామివారు తనకు దోసకాయలు కావాలని అడిగిన విషయం గుర్తుకువచ్చి ప్రభావతి గారు దోసకాయల కోసం మొగలిచెర్ల అంతా వాకబు చేశారు..చిత్రంగా ఆ ఊర్లో ఒక్క దోసకాయా దొరకలేదు..సరే..ప్రాప్తంలేదు..ఆమాటే చెపుదాము అని శ్రీధరరావు గారు అనుకోని..గూడు బండి ఎక్కబోతున్నారు..ఇంతలో నెత్తిన గంప పెట్టుకొని ఒక ఆడమనిషి నేరుగా వచ్చింది..తాను లింగసముద్రం నుంచి వస్తున్నాననీ..దోసకాయలు అమ్మడానికి తెచ్చాననీ..చెప్పి..కొన్ని మంచి కాయలను తానే ఏరి..చేతికిచ్చింది..శ్రీధరరావు గారు ఆశ్చర్యపోతూ..వాటిని తీసుకొని బండి తోలే బాలయ్య చేతికిచ్చి..బండిలో పెట్టించారు..
ఆరోజు శ్రీధరరావు గారు ప్రభావతి గార్లు ఆశ్రమానికి చేరేసరికి..శ్రీ స్వామివారు అత్యంత ఉత్సాహంగా వున్నారు..వీళ్ళను చూడగానే.."రండి!..రండి!!..మీ కోసమే ఎదురు చూస్తున్నాను.." అన్నారు..
"అమ్మా..శ్రద్ధగా వినండి..కేవలం కొద్దీ రోజులు మాత్రమే మిగిలివుంది..మీకు మళ్లీ మళ్లీ బోధ చేసేవారు ఇంకొకరు లభ్యం కావడం దుర్లభం..నేను చెప్పే మాటలు ఆకళింపు చేసుకోండి..నా తపస్సుకు మీరు ఎంతగానో సహకరించారు..నేను చేసిన ఈ సాధన ఫలించే రోజు దగ్గరలోనే ఉంది..ఈ ఆశ్రమానికి ఉత్తరాధికారం మీ చేతుల్లోనే ఉండబోతోంది..క్షేత్రంగా మారుతుంది.."
"అపార జ్ఞానానికి ప్రతీకలు అవధూతలు..వారి సహచర్యమూ సేవా అత్యంత పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయి..నిరంతరం తనను తాను శోధించుకుంటూ..దైవదత్తమైన జ్ఞానాన్ని నలుగురికీ పంచుతూ..తనను తాను ఉద్ధరించుకుంటూ..తన చుట్టూ వున్న సంఘాన్ని కూడా ఉద్ధరించేవాడే అవధూత..శ్రీధరరావు గారూ మీరు ఒకటి రెండుసార్లు..నాగురించి ప్రస్తావిస్తూ.."బాలోన్మత్త పిశాచ వేషాయ.." అన్నారు..పైకి పిచ్చి వాడిలా..పసిపిల్లల చేష్టలతో..శుచీ శుభ్రత లేని వారిలా ప్రవర్తించినా..వారి ప్రతి చర్యలోనూ ఒక పరమార్ధం దాగివుంటుంది..అవధూత అనగానే..పిచ్చివాడు..మద్యం మాంసం స్వీకరిస్తూ వుండేవాడు అనుకోవడం ఒక అపోహ మాత్రమే..అలా ఉన్న వాళ్ళందరూ అవధూతలు కారు..అవధూత మూర్తీభవించిన జ్ఞాన స్వరూపం అని గుర్తించండి..పొట్టకూటికోసం గారడీలు చేసేవాడినో..మాటలతో కోటలు కట్టేవారినో ఆశ్రయించి..విలువైన సమయాన్ని..ధనాన్ని కోల్పోతారు కొందరు..వాళ్ళ అజ్ఞానం వల్ల..అవతలివాడు సుఖాలు పొందుతారే కానీ..వీళ్లకు ఒరిగేదేమీ లేదు.."
"గృహస్థులు మీరు..ఎన్నో బాధ్యతలుంటాయి..కొన్ని కష్టాలుంటాయి..కొన్ని సుఖాలూ వెంటనే ఉంటాయి..సమదృష్టి తో చూడండి..బండి చక్రం లోని ఆకుల వలె.. ఒకటి పైకి వచ్చిన తరువాత..మరొకటి క్రింద ఉంటుంది..మళ్లీ కొద్దిసేపటికే పరిస్థితి తారుమారు అవుతుంది..సంసారపు ప్రయాణం సాగుతూ ఉంటుంది..ఎటువంటి పరిస్థితులలోనూ సంయమనం పాటించండి!..మీరు చేసిన ఈ సేవ ఫలితం ఊరికే మాత్రం పోదు!..మీరు ఎందరో పండితులను నా వద్దకు తీసుకువచ్చారు..కొందరు నా పాండిత్యాన్ని పరీక్షించారు..మరికొందరు నాలోని వేదాంత సారాన్ని వెలికితీయాలని భావించారు..నాకున్న ఈ పాండిత్యం కానీ..మరోటి కానీ..అన్నీ ఆ దత్తుడి అనుగ్రహం తోనే వచ్చాయి..మరో విధంగా రాలేదు.."
"నేనే కాదు..ఏ సాధకుడైనా ఎక్కువ మౌనాన్ని ఆశ్రయిస్తాము..మౌనమే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది..క్లుప్తంగా మాట్లాడటం సాధన లోని మొదటి మెట్టు అయితే..సంపూర్ణ మౌనం చివరి మెట్టు..అవసరం ఉన్నంతవరకే వాక్కును ఉపయోగించాలి..నిర్మోహత్వం నుంచి నిశ్చలస్థితి..అక్కడినుంచి జీవన్ముక్తి పొందుతామని ఆది శంకరులు చెప్పింది తెలుసుకదా..అక్షర సత్యమది.."
అద్భుతమైన కంఠస్వరంతో శ్రీ స్వామివారు చేస్తున్న బోధను.. పరిసరాలు మర్చిపోయి విన్నారా దంపతులు..తమకు ఈ బోధ చేయడానికి పిలిపించారని అర్ధమయింది వాళ్లకు..ఇక ఈ యోగిపుంగవుడు ఎక్కువ కాలం తమతో కలిసివుండడు అని రూఢీ అయిపోయింది..మనసు స్థిర పరచడానికే ఈరోజు శ్రీ స్వామివారు ఇలా బోధ చేశారు..
శ్రీధరరావు ప్రభావతి గార్లు.."నాయనా!..మీ నిర్ణయం లో మార్పు లేదా?.." అని చివరిగా అడిగారు..
"లేదమ్మా!..లేదు!..నాకు సమయం ముంచుకొస్తున్నది..మీరు వ్యాకులపడొద్దు..శ్రీధరరావు గారూ మరో నాలుగు రోజుల తరువాత ఇక్కడికి రండి..మీతో కొన్ని విషయాలు చెప్పాలి.." అన్నారు..
ఆ దంపతుల అంతరంగంలో ఇంతకుముందు ఉన్నంత భారం ఇప్పుడు లేదు..మనసంతా తేలిక గా ఉంది..ఆ మార్పు ఆ దంపతులకు తెలిసివచ్చింది..శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేసారు..
అంతుపట్టని అంతరంగం..రేపటి భాగంలో..
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).
అందుకోవటానికి సిద్ధంగా
శ్లోకం:☝️
*క్వచిదవసరః ప్రాప్తస్తథా*
*భాగ్యోదయః క్వచిత్ |*
*స్వీకర్తుమీప్సితం భవ్యం*
*కర్తవ్యా పూర్వసజ్జతా ||*
భావం: అవకాశం అప్పుడప్పుడు వస్తుంది, అదృష్టం అనుకోకుండా వస్తుంది! అయితే ఆ విజయపు జల్లును జీర్ణించుకోవాలంటే భూమిని దున్ని సిద్ధంగా ఉంచాలి! అవకాశం వచ్చినప్పుడు అందుకోవటానికి సిద్ధంగా ఉండాలని భావం.
Opportunity or Luck stricks only once. We need to be ready for it!😃
పంచాంగం 17.12.2023 Sunday,
ఈ రోజు పంచాంగం 17.12.2023 Sunday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతు మార్గశిర మాస శుక్ల పక్ష: పంచమి తిధి భాను వాసర: ధనిష్ఠ నక్షత్రం హర్షణ యోగ: బవ తదుపరి బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.
పంచమి సాయంత్రం 05:34 వరకు .
ధనిష్ఠ రాత్రి 02:54 వరకు.
సూర్యోదయం : 06:43
సూర్యాస్తమయం : 05:41
వర్జ్యం : పగలు 08:19 నుండి 09:48 వరకు.
దుర్ముహూర్తం : సాయంత్రం 04:13 నుండి 04:57 వరకు.
రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.
యమగండం : మద్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
పంచాంగం. తేదీ.17.12.2023
**********
*శుభోదయం*
***********
సంధ్యా వందన
మరియు ఇతర
పూజాకార్యక్రమాల సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేదీ.17.12.2023
ఆది వారం (భాను వాసరే)
**********
గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.
__________________
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
హేమంతృతౌ
మార్గశీర్ష మాసే శుక్ల పక్షే పంచమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)
భాను వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్_______గోత్రః_____నామధేయః
శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.
ఇతర పూజలకు
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
హేమంతృతౌ మార్గశీర్ష మాసే శుక్ల పక్షే
పంచమ్యాం
భాను వాసరే అని చెప్పుకోవాలి.
ఇతర ఉపయుక్త విషయాలు
సూ.ఉ.6.27
సూ.అ.5.25
శాలివాహనశకం 1945 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం.
కల్యబ్దాః 5124 వ సంవత్సరం.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు
మార్గశిర మాసం
శుక్ల పక్షం పంచమి రా.8.49 వరకు.
ఆది వారం.
నక్షత్రం శ్రవణం ఉ. 8.04 వరకు.
అమృతం రా. 8.51 ల 10.21 వరకు.
దుర్ముహూర్తం సా. 3.57 ల 4.41 వరకు.
వర్జ్యం ప.11.53 ల 1.23 వరకు.
యోగం వ్యాఘాత ఉ.7.39 వరకు.
కరణం బవ మ.9.55 వరకు.
కరణం బాలవ రా.8.49 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.
రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు.
గుళిక కాలం సా. 3.00 ల 4.30 వరకు.
యమగండ కాలం మ.12.00 ల 1.30 వరకు.
************
పుణ్యతిధి మార్గశిర శుద్ధ పంచమి.
********
పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,
(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)
S2,/C92, 6 -3 -1599/92,C
Vanasthalipuram, Hyderabad
500 070.
.**********
*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*
వారి
*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*
*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును*
*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*
*సంప్రదించండి*
ఫోన్(చరవాణి) నెం లను
*9030293127/9959599505
*.**************
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
**************
మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
🙏🙏🙏