🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *భాగం 117*
"ఏకాంతవాసానికి పోతున్నాను''
భగవదన్వేషణలోనే జీవితం గడపడం అసిధారా వ్రతం లాంటిదని కఠోపనిషత్తు వచిస్తున్నది.
ప్రతి క్షణమూ అప్రమత్తంగా వ్యవహరించకపోతే మార్గం నుండి వైదొలగే ప్రమాదాలుఈ జీవితంలో కొల్లలు. సొంతాలు, బంధాలు అన్ని పారమార్థిక మార్గంలో ఆటంకాలని ఎంచి వాటిని త్యజించి సన్న్యాసం స్వీకరిస్తాడు మనిషి ,కాని అతడి ఎరుక లేకుండానే మిత్రులు, శిష్యులు, సోదర సన్యాసులు, మఠం అంటూ కొత్త బంధాలు తగిలించుకొంటాడు.
ఎంతో అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఈ బంధాలు సైతం ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలుగా పరిణమిస్తాయి. అలాంటి బంధనాల్లో ప్రస్తుతం తాను చిక్కువడుతున్నట్లుగా స్వామీజీకి తోచింది. సోదర సన్న్యాసులతో జపధ్యానాలూ, ఆధ్యాత్మిక సాధనల తోనే రోజులు గడిచాయి. అయినప్పటికీ వారితో కలసి ఉండడం ఆయనకు ఒక అడ్డంకిగానే అనిపించింది.
హృషీకేశ్ లోనూ, హిమాలయాల్లోనూ తనకు తారస వద్ద సన్న్యాసులు ఆయన మనస్సులో తళుక్కున మెదిలారు. ఎలాంటి బంధాలూ లేకుండా సర్వస్వతంత్రంగా వారు గడుపుతున్న జీవితాలు స్వామీజీని గాఢమైన చింతనకు లోను చేశాయి. ఒక గట్టి నిర్ణయానికి ఆయన వచ్చారు.
ఒక రోజు అఖండానందను పిలిచి తాను ఏకాంతంలోకి వెళ్ళగోరు తున్నట్లుగా తెలియజేశారు స్వామీజీ. అందుకు అఖండానంద, "మధ్య ప్రాచ్య ప్రాంతాలకు వెళ్ళాలనే నా ఆకాంక్షను ప్రక్కకు పెట్టి నేను ఈ యాత్రలో పాల్గొనడం మీ కోసమే. ఇప్పుడు నన్ను వదలిపెట్టి వెళ్ళిపోతామంటున్నారే! అన్నాడు ఆవేదనతో. ఆ మాటలు విన్న స్వామీజీ ఇలా అన్నారు:
"సోదర సన్న్యాసులే అయినప్పటికీ బంధం బంధమే; ఆధ్యాత్మిక జీవితానికి వారు కూడా అడ్డంకులే. నువ్వే చూడు, టెహ్రీలో నీకు జబ్బు చేసింది. అప్పుడు నేను కూడా సాధన లేవీ అనుష్ఠించలేకపోయాను కదా! సోదర సన్న్యాసి అనే మాయను సైతం అధిగ మించకుంటే తపోమయ జీవితంలో పూర్తిగా మునగలేం.
తపోమయ జీవితంలో పూర్తిగా మునిగిపోవాలని నేను తలచినప్పుడల్లా గురుదేవులు ఏదో ఆటంకాలను కల్పిస్తున్నట్లుగా తోస్తున్నది. ఇప్పుడు నేను ఏకాంతంలోకి పోతున్నాను. ఎక్కడికి వెళ్ళేదీ, ఎక్కడ బస చేసేదీ ఎవరికీ చెప్పను." అందుకు అఖండానంద, "మీరు పాతాళానికి వెళ్ళినప్పటికీ నేను వెదకి తెలుసుకొంటాను" అన్నాడు.
అందుకు జవాబుగా స్వామీజీ మౌనంగా నవ్వి ఊరకున్నారు.చెప్పినట్లుగానే ఎవరికీ చెప్పాపెట్టకుండా ఒక రోజు మీరట్ నుండి స్వామీజీ బయలుదేరి వెళ్లారు. అది జనవరి 1891.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి