**దశిక రాము**
**
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
100 - అరణ్యపర్వం.
సై౦ధవునికి పరాభవం జరిగిన తరువాత, మార్కండేయమహర్షి పాండవులను కలిసి యోగక్షేమాలు తెలుసుకుంటుండగా, ధర్మరాజు మళ్ళీ మళ్ళీ వ్యధ చెందుతూ,' యిట్టి అవమానాలు మాకే యెందుకు జరుగుతున్నాయి 'అని మహర్షిని, అడిగాడు.
దానికి మార్కండేయమహర్షి, ' ధర్మజా మీకే కాదు. ఇంతకుముందు త్రేతాయుగంలో అయోనిజ, జనకమహారాజు పెంపుడుకుమార్తె, శ్రీరామచంద్రుని ఇల్లాలికి, సీతాదేవి వంటి సాద్వీమతల్లికి కూడా, కష్టపరంపర వచ్చిపడింది. ఆమె ఒంటరిగా, పగవాని పంచన సంవత్సరం పాటు వుండవలసి వచ్చింది. కనీసం మీకు చుట్టుప్రక్కల ఆప్తులున్నారు, మీ కష్టాలు వినడానికి, పంచుకోవడానికి. ఆమెకూడా ద్రౌపదివలే అయోనిజయే. ఇప్పుడు ద్రౌపదిని హరించినట్లు, అప్పుడు సితాదేవిని రావణుడు అపహరించుకుని వెళ్ళాడు. ' అని చెబుతూ రామాయణ మహాకథను ఎనిమిదివందల శ్లోకాలలో మధురంగా వినిపించాడు మార్కండేయమహర్షి.
తరువాత, సావిత్రీ సత్యవంతుల కథను కూడా వినిపించి, వారు పడిన కష్టాలను కళ్ళకు గట్టినట్లు వివరించి, ధర్మరాజాదులను వూరడించాడు, మార్కండేయమహర్షి. సావిత్రీ సత్యవంతులకథను యింకా విపులంగా చెప్పమని ధర్మరాజు కోరగా, మార్కండేయ మహర్షి ఆ పవిత్రగాథను యీవిధంగా వివరించాడు :
పూర్వము, మద్రదేశాన్ని,అశ్వపతి అనేరాజు పరిపాలించేవాడు. ఆయన యెంతో సత్యవ్రతుడు. సకలగుణసంపన్నుడు, జనరంజకుడు. వినయసంపన్నుడు. కానీ ఆయనకు సంతానం కలుగలేదు. ఆయన 18 సంవత్సరాలు, యెంతో ఓపికతో, నియమనిష్టలతో అనుదినము గాయత్రిదేవిని ఉపాసిస్తూ, ఆమెను సావిత్రీదేవి రూపం లో ఆరాధించాడు. ఆయన చేసిన పూజలకు మెచ్చి సావిత్రీదేవి, ఒక పుత్రిక జన్మించేటట్లుగా ఆయనను, అనుగ్రహించింది. నిరాశతో, అశ్వపతి, ' అమ్మా ! నేను పుత్రుని కొరకు నిన్ను యిన్నిసంవత్సరాలు ఆరాధించాను, నాకు పుత్రికను ప్రసాదించావా ! ' అనిదీనంగా అడిగాడు. దానికి అమ్మవారు, యీ పుత్రికద్వారా, నీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఈమె కారణజన్మురాలు. స్త్రీ లోకానికే తలమానికంగా వుంటుంది, యీమె నడవడిక. కాబట్టి, పుత్రుడైనా, పుత్రిక అయినా భగవత్ప్రసాదం గా స్వీకరించడం లోనే, మానవజీవితాలు సక్రమమార్గంలో నడిచే సృష్టిపరమార్ధం దాగి వున్నది. ' అనిచెప్పింది.
కొంతకాలానికి అశ్వపతిభార్య మాళవి గర్భం ధరించి, ఒక శుభముహూర్తాన ఆడశిశువును ప్రసవించింది. ఆబిడ్డకు సావిత్రి అని నామకరణం, చేశారు. ఆమె శుక్లపక్ష చంద్రునిలా రోజురోజుకూ అసమాన అందచందాలు పుణికిపుచ్చుకుంటూ, పుత్తడిబొమ్మ లాగా, ఆ ఇంట నడయాడసాగింది. ఆమెను యెంతో అల్లారుముద్దుగా పెంచసాగారు,
ఆమె యుక్తవయస్కురాలు అవగానే, ఆమె అందచందాలకు, గుణసంపదకు తగిన వరుని తీసుకురావడానికి, అశ్వపతి చాలా శ్రమించాడు. కానీ, యెక్కడా ఆయన యెంచ దగిన, వరుడు కానరాలేదు. ఆయన కొన్నిదినాలు రాజపురోహితునితో కూడా అలోచించి, సావిత్రిని పిలిచి, ' అమ్మా ! సావిత్రీ ! చూస్తున్నావు కదా నేను నీకు తగిన భర్త రావాలని యెన్ని ప్రయత్నాలు చేస్తున్నానో ! కానీ ఒక్క వరుని విషయంలో కూడా నా మనసు, నీకు తగినవాడని సంకేతం యివ్వలేకపోతున్నది. తల్లీ ! వివాహవయస్సు వచ్చిన, కుమార్తెకు వివాహం తగినసమయంలో చెయ్యలేని తండ్రి, తండ్రి చనిపోయిన తరువాత తల్లిని కనిబెట్టి చూచుకోలేని తనయుడు, వున్నా వ్యర్ధమని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. '
' కాబట్టి, మన పరివారం అంతా నీ వెంటరాగా, నీవు దేశాటన చేసి, నీ వరుని నీవే నిర్ణయించుకో. ఇందులో ధర్మహాని యేమియులేదు. తండ్రిగా నీకు నేనే ఆ స్వేచ్ఛ యిస్తున్నాను కనుక, నీవు సందేహించవలసిన అవసరం లేదు. ' అని చెప్పాడు. సావిత్రి కూడా తండ్రిమాటలను ఆజ్ఞగా భావించి, వరాన్వేషణలో, ఒక శుభముహూర్తాన బంగారు రథంపై, తనపరివారం వెంటరాగా, యెంతో శోభాయమానంగా బయలుదేరింది.
ఆమె పర్యటన కార్యక్రమాన్ని ఆమెకే వదిలిపెట్టారు,పరివారం. సావిత్రి మొదటగా, మహర్షులు వుండే తపోభూములకు వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకున్నది. ఆ తరువాత, దైవదర్శనం చేసుకుని, రాజ్యాలలో పర్యటించాలని నిర్ణయించుకుంది. ఆహా ! యెంత మంచి నిర్ణయం. తండ్రి యిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగ పరచుకోకుండా, ఒక పధకం ప్రకారం మార్గనిర్దేశం చేసుకొనడంలోనే, ఆమె సౌశీల్యం అవగతమౌతుంది.
తండ్రి ఆజ్ఞప్రకారం బయలు దేరింది కానీ, వరుణ్ణి ఎంపిక చేసుకోవడం అంత సులువైన విషయం కాదని, సావిత్రికి, అర్ధమౌతున్నది, ఆ ప్రయాణంలో. యెంతో సునిశితంగా, వెంటవచ్చిన పెద్దలసలహాలు తీసుకుంటూ, ఆమె అనేకరాజ్యాలు తిరిగి స్వస్థలమైన మద్రదేశం చేరుకున్నది.
అప్పటికి నారదమహర్షి కూడా అక్కడే వేంచేసివున్నారు. ఆమె ప్రయాణబడలిక తీరిన తరువాత, అశ్వపతి, ఆమె అభీష్టాన్ని, నిస్సంకోచంగా చెప్పమని అడిగాడు. సావిత్రి,
' తండ్రీ ! సాళ్వదేశాన్ని ఒకప్పుడు యేలిన ద్యుమత్సేనుడు, ఆయన యేకైక కుమారుడు సత్యవంతుడు అనే పేరుగలవాడు, బాలునిగా వున్న సమయంలో, ద్యుమత్సేనునికి అంధత్వం ప్రాప్టించి, రాజ్యం శత్రురాజుల చేతిలోకిపోగా, భార్యాపుత్రులతో కలిసి అడవులలోజీవిస్తున్నాడు. తల్లిదండ్రుల సేవలో జన్మ చరితార్థం చేసుకుంటున్న ఆ సత్యవంతుని నేను వరించాను ' అని సిగ్గుపడుతూ చెప్పింది.
అశ్వపతి, ప్రస్తుతం రాజ్యం కోల్పోయినా, రాజవంశీకుడైన సత్యవంతునికి తన కుమార్తెను యివ్వడానికి యెట్టిసంకోచమూ చూపించలేదు. నారదమునీంద్రుల వైపు అశ్వపతి సాలోచనగా చూసి, ఆయన అభిప్రాయం కోసం యెదురుచూడసాగాడు. మహర్షి యీ వివాహానికి అంత సుముఖంగా లేనట్లు ఆయన ముఖ కవళికలద్వారా స్పష్టమైంది అశ్వపతి మహారాజుకు.
కారణం లేకుండా మహర్షులు,విముఖత చూపరుకదా ! అందుకే, విశదంగా అభిప్రాయం చెప్పమని నారదమహర్షిని, అశ్వపతి అడిగాడు.
స్వస్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏