రచన
గోపాలుని మధుసూదన రావు
--- భృగుమహర్షి త్రిమూర్తుల దర్శించుట కెళ్ళుట ---
భృగువంతట త్రయమూర్తుల
సుగుణంబుల నెంచనెంచి సురపురములకున్
నగణితమౌ ధైర్యంబున
ఖగపతి జనినంత వడిగ గడచుచు వెడలెన్. 16
భృగు సంయమి యా రీతిన
ముగురయ్యల శక్తి జూడ ముచ్ఛటపడియున్
తెగువతొ కైలాసంబుకు
యగణితమగు భక్తితోడ నరిగెను తొలుతన్ 17
హరుసదనము ముని జేరియు
హరహర మహాదేవ యనుచు నంజలి సేయన్
హరు డించుక మాఱాడక
హరి దలచుచు నూరకుండె యా క్షణమందున్ 18
తనరాకను పరమేశుడు
కనియును మాఱాడకుండ కఠినతనుండన్
కని భృగుముని విస్మితుడై
ననియెను నీ రీతి వ్యధతొ నాతని తోడన్ 19
" మునినైన నన్ను కనుగొని
కనికరమును జూపకుండ కఠినపుమదితో
పనిగొని యవమానించుట
ఘనమా పరమేశ ! నీకు , కరుణను గనుమా ! 20
త్రిగుణాతీతుడవని నిను
నగణితమౌ భక్తితోడ నారాధించన్
భృగువును , నాపై నీ విధి
పగబూనుట నీకు తగునె పన్నగభూషా ! 21
కడుభక్తితొ నీ వద్దకు
వడి వడి గా వంద్యు డంచు వచ్చిన నన్నున్
కడగంట జూడ నైతివి
మృడుడా ! యిదినీకు తగదు , మేలవ దెపుడున్ 22
పలుమరు ప్రార్థన జేసిన
పలుకక నున్నట్టి నీదు ప్రల్లదమునకున్
నిలలో బూడిద బిల్వము
జలధారలె నీకు దక్కు జంగమ దేవా !" 23
ఆగ్రహమొచ్చిన భృగుముని
నిగ్రహమును మఱచి యిట్లు నిటలాక్షునికిన్
యుగ్రపు శాపంబిచ్చియు
వ్యగ్రుండై యచటనునుండి వడి వడి చనియెన్ 24
చతురంబగు నిగమంబుల
చతురత మీరంగ జూచు సరసిజ జన్మున్
చతురానను దర్శించగ
యతులిత మగు భక్తితోడ నరిగెను పిదపన్ 25
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి