**దశిక రాము**
" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"
అవతారిక:”
" వేద శాస్త్ర ధర్మాలను ఉల్లంఘించి , నా ఆజ్ఞను నీవు అతిక్రమించావు.
అందువల్ల నీవు అపరాధివి. నిన్ను రక్షింౘడం ఎలా ?" అని శివుడు
ప్రశ్నిస్తాడేమో అని , తాను దీనుడననీ, ఈశ్వరుడు దీనజన బాంధవుడనీ,
కాబట్టి తనను రక్షింౘడం బంధు మర్యాద అనీ, శంకరులు శివునికి
విన్నవించారు.
శ్లో" ప్రభుస్త్వం దీనానాం _ ఖలు పరమబంధుః పశుపతే
ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వ మనయోః,
త్వయైవ క్షంతవ్యాః శివ ! మదపరాధాశ్చ సకలాః
ప్రయత్నా త్కర్తవ్యం _ మదవన మియం బంధు సరణిః !!
పదవిభాగం:
ప్రభుః _ త్వమ్ _ దీనానాం _ ఖలు _ పరమబంధుః _ పశుపతే _
ప్రముఖ్యః _ అహం _ తేషామ్ _ అపి _ కిముత _ బంధుత్వమ్ _
అనయోః _ త్వయా _ ఏవ _ క్షంతవ్యాః _ శివ _ మదపరాధాః _
చ _ సకలాః _ ప్రయత్నాత్ _ కర్తవ్యం _ మదవనమ్ _ ఇయం _
బంధు సరణిః .
తాత్పర్యం:
పశుపతివైన ఓ ఈశ్వరా ! నీవు దీనులకు దగ్గఱ ౘుట్టమైన ప్రభుడవు.
నేను అటువంటి దీనులలో అగ్రగణ్యుడను. మన ఇద్దరికీ ఇంతకంటే
ౘుట్టరికం ఇంకేమి కావాలి ? నా నేరము లన్నిటినీ , నీవు మన్నించి ,
నన్ను నీవే కరుణించి, రక్షింప వలసి యున్నది. ఇది బంధు మర్యాదా
లక్షణం.
వివరణ:
ఈశ్వరుడు దీనులకు పరమ బంధువు. భక్తుడు, దీనాతి దీనుడుగా
ఉన్నప్పుడు దైవానికి ఆభక్తుని ఆదుకోవలసిన బాధ్యత ఉంటుంది.
అందువల్ల భక్తుడు తెలియక పొరపాటు చేసినా , భక్తులను రక్షింౘడం
లోకసహజం. కాబట్టి బంధు మర్యాదననుసరించి , దీనుడైన తనను
దీనబాంధవుడైన పరమేశ్వరుడు తప్పక ఆదు కోవాలని శంకరులు
నొక్కి చెప్పారు.
🙏🙏🙏
**ధర్మము - సంస్కృతి**
🙏🙏🙏
**ధర్మో రక్షతి రక్షితః**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి