2, అక్టోబర్ 2020, శుక్రవారం

****"మహనీయుడు మహాత్ముడు"****



మహాత్మగాంధీ: సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమరదారి చూపిన క్రాంతి


  

సత్యము, అహింసలు ఆయన కొలిచిన దేవతలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన పూజాసామాగ్రి. ఈ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికంగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు. ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింసా పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన వేలాది నాయకులలో అగ్రగణ్యుడు. ఆయనే మోహన్‌ దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీ... నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి


20 ఏళ్లపాటు దక్షిణాఫ్రికాలో గడిపిన గాంధీ

గాంధీ! ఈ పేరు స్ఫురణకు రాగానే చంటి పిల్లలనుంచి చరమాంకానికి చేరువవుతున్న వృద్ధుల వరకు ఒకే భావన ఉప్పొంగుతుంది. మన "బాపు" అంటూ ప్రతి ఇంటా ఆ పేరు జేగంటై మ్రోగుతుంది. ఆయన గురించి అందరి అభిప్రాయం ఒక్కటే. ఆయన మహాత్ముడు. అక్టోబర్ 2, 1869లో గుజరాత్‌లోని పోర్బందర్‌లో జన్మించిన గాంధి మెట్రిక్యులేషన్ పాసయ్యాక ఉన్నత చదువుల నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడే లా విద్యను అభ్యసించారు. తరువాత దేశానికి తిరిగొచ్చి న్యాయవాద వృత్తిని చేపట్టి మూడేళ్ళపాటు బొంబాయి, రాజ్కోట్‌లలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1893లో దక్షిణాఫ్రికా వెళ్ళి 20 సంవత్సరాలకు పైగా అక్కడే నివాసమున్నారు. అక్కడ ఇతర భారతీయుల్లా అనేక అవమానాలకు గురయ్యారు.

"నాజీవితమే నాసందేశం" అని చాటిన బాపు

అవమానకరమైన సంఘటనలే గాంధీని ఓ గొప్ప నాయకుడుగా తీర్చిదిద్దాయి. 1915లో ఆయన భారతదేశానికి తిరిగొచ్చాక సబర్మతీ తీరాన ఆశ్రమాన్ని నిర్మించి, భారతదేశం మొత్తం పర్యటించారు. మాతృదేశం గురించి విజ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించిన తరువాత పూర్తిస్థాయిలో స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకుని ఆయన సాగించిన పోరు దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించిపెట్టింది. ప్రపంచాన్ని నివ్వెరపోయేట్లు చేసింది. ఒకే ఒక్కడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి జాతి యావత్తునూ ఒక్కటి చేసి తన ఉద్యమం ద్వారా తన మనసునీ, తన మనసు ద్వారా తన జీవితాన్నీ, తన జీవితం ద్వారా ఓ మహా సందేశాన్ని అందించిన బాపు "నా జీవితమే నా సందేశం" అని చాటారు. ఆ సందేశం వెనక ఆయన ఆరాటం, పోరాటం స్పష్టంగా కనిపిస్తాయి. ఆ సందేశం భారత జాతికే కాదు, విశ్వ జాతికీ అని ప్రపంచమంతా గ్రహించింది. అంతే కాదు ఆ సందేశం విశ్వ శాంతికి అని కూడా స్పష్టమైన సంకేతాన్నిచ్చింది.


గాంధీ రాకతో దిశానిర్దేశం లేని స్వాతంత్ర్య సంగ్రామం రూపు సంతరించుకుంది

ఇంకో కోణంలో 'నా జీవితమే నా సందేశం' మరో సందేశాన్ని ఇస్తుంది. ఐతే ఈ సందేశం బ్రిటిష్ పాలకులలాంటి దురాక్రమణదారులకు హెచ్చరికలాంటిది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య వైభవం ఆయన సృష్టించిన కళ్ళకు కనిపించని ఆయుధమైన సత్యాగ్రహం వల్ల మరో ఉదయానికి అవకాశం లేకుండా అస్తమించింది. బ్రిటిష్ ప్రభుత్వానికి జరిగిన శాస్తి భారతదేశంపై కన్నెత్తి చూస్తే ఏ దేశానికైనా పడుతుందనే హెచ్చరిక ఆ సందేశంలో ఉంది. పోరాడీ, పోరాడీ పోరాటాలకు అలవాటుపడిన గుండెలతో తెగింపును ఆయుధాలుగా చేసుకునే స్థైర్యంతో గాంధి అడుగుజాడలలో నడిచీ, నడిచీ ఆత్మవిశ్వాసమే ఆలంబనగా స్థిరచిత్తాన్ని అలవరచుకున్న భారతీయుల మనో నిగ్రహాన్ని ఆ సందేశం చాటుతుంది. అప్పటివరకు దిశా నిర్దేశం లేని స్వాతంత్ర సంగ్రామం గాంధి రాకతో ఒక రూపును సంతరించుకుంది. ఒక మార్గాన్ని ఏర్పరచుకుంది. ఒక నాదాన్ని అలవరచుకుంది. ఒక క్రమశిక్షణతో అడుగులేసింది. క్రమక్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరి మెట్టు చేరుకునే మార్గంలో అనేక ఉద్యమాలకు ఊపిరి పోసి, ఆ ఉద్యమాలలో విజయం సాధిస్తూ బ్రిటిష్ జెండాను ఎట్టకేలకు తల వంచేట్లు చేసింది.


అహింస ముందు అన్నీ దిగదుడుపే

ఆవిధంగా ప్రపంచంలోనే అత్యంత శక్తిసంపన్నమైన దేశమైన బ్రిటన్ అహింసే ఆయుధంగా మలచుకున్న భారత్ ముందు తన ఆయుధ సంపత్తికి తిలోదకాలివ్వవలసివచ్చింది. అటువంటి ఆయుధ సంపత్తి ఏ దేశానికి ఎంతున్నా అహింస ముందు దిగదుడుపే అని అఖండ భారతావని ఋజువు చేసింది. భారత ప్రజలకు అటువంటి శక్తిని ప్రసాదించిన గాంధి వ్యక్తిత్వం ప్రతి భారతీయుడి మదిలోనూ పదిలంగా నిక్షిప్తమై ఉంది. ప్రపంచ దేశాలకు అహింస యొక్క శక్తిని తెలియజేయడం ద్వారా గాంధి తన సందేశాన్ని పరోక్షంగానే చెప్పినట్లయ్యింది. అందుకే మహాత్మా గాంధి పుట్టిన రోజైన అక్టోబర్ 2ను "అంతర్జాతీయ అహింసా దినోత్సవం"గా యునైటెడ్ నేషన్స్‌లోని సభ్య దేశాలు తీర్మానించాయి. అహింసవైపు అడుగేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పాయి.మహనీయుడుచూపినదారిఅందరికీ అనుసరణీయం.

కామెంట్‌లు లేవు: